Thursday, June 1, 2017

ముక్కల పులుసు

ముక్కల పులుసు(దప్పళం)
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

ఈ రోజు స్పెషల్ ఐటం ' ముక్కల పులుసు '.
రసం , సాంబారు , పప్పు పులుసు , పప్పు చారు ఇలా లిక్విడ్ ఐటమ్స్ లో వివిధ రకాలున్నా ముక్కల పులుసు ది ప్రత్యేక స్ధానం. ప్రధమ స్ధానం.
వెనుకటి కాలం లో ప్రతి శుభ కార్యాల లోనూ ఈ ముక్కల పులుసు తప్పనిసరిగా చేసేవారు.
తెలుగు వారి భోజనాలలో నెయ్యి వేసి వేయించి కందిపప్పు తో వండిన ముద్ద పప్పు , పనస పొట్టు కూర , కొత్తావకాయ , ముక్కల పులుసు ,
కమ్మని గేదె నెయ్యి, మీగడ పెరుగు, కొనసీమ కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు గొప్ప కాంబినేషన్ .

వేయి రూపాయల విందు భోజనమైనా ఈ మెను ముందు దిగదుడుపే .
మరి ఈ ముక్కల పులుసు తయారీ విధానము గురించి తెలుసుకుందాం.
కావలసినవి.
ఆనపకాయ / సొరకాయ --
కాయలో పావు ముక్క .
ములక్కాడలు --- 2
వంకాయలు --- 2
టమోటోలు -- 2
బెండకాయలు - 8 
చిలకడదుంపలు - 4
పచ్చి మిర్చి - 5
కరివేపాకు -- మూడు రెమ్మలు
కొత్తిమీర -- ఒక కట్ట

చింతపండు -- 50 గ్రా
బెల్లం -- 40 గ్రా
పసుపు -- పావు టీ స్పూను
కారం --- అర టీ స్పూను 
ఉప్పు --- తగినంత

పోపుకు
ఎండుమిర్చి -- మూడు
మెంతులు -- కొద్దిగా 
ఆవాలు -- అర స్పూను
జీలకర్ర --- పావు స్పూను 
ఇంగువ -- కొద్దిగా

తయారీ విధానము.
ముందుగా పదిహేను నిముషములు చింతపండు వేడినీళ్ళలో నాన బెట్టుకుని ఒక రెండు గ్లాసుల రసం తీసుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి.
ఆనపకాయ చెక్కు తీసుకుని 
ఫోటోలో చూపిన సైజులో ముక్కలు తరుగు కోవాలి .

చిలకడ దుంపలు చెక్కు తీయనవసరంలేదు.
ఫోటోలో చూపిన విధంగా గుండ్రంగా ముక్కలు తరుగు కోవాలి.
ములక్కాడలు , టమోటాలు , బెండ కాయలు , వంకాయలు అన్నీ ముక్కలు తరుగు కోవాలి .
పచ్చి మిర్చి నిలువుగా చీల్చు కోవాలి .
ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో ఈ తరిగిన అన్ని ముక్కలు వేసుకోవాలి .
ఇందులో చింతపండు రసం నీళ్ళు పోయాలి .
ఇందులో పసుపు , తగినంత ఉప్పు , బెల్లం , కారం , తరిగిన పచ్చిమిర్చి ముక్కలు , కరివేపాకు వేయాలి .
ఇప్పుడు స్టౌ వెలిగించి మీడియం సెగన ఈ పులుసును ఓ ఇరవై నిముషాల పాటు ముక్కలన్నీ మెత్తగా ఉడికేలా మరగ నివ్వాలి .
ఆ తర్వాత మూడు విధములుగా మన అభిరుచిని బట్టి చేసుకోవచ్చు.
మొదటిది ముక్కలు ఉడికాక రెండు గరిటెలు మెత్తగా ఉడికిన పప్పు బాగా యెనిపి పులుసులో వేసి మరో అయిదు నిముషాలు మరగ నిచ్చి దింపు కోవచ్చు.
రెండవది ఒక రెండు స్పూన్లు బియ్యపు పిండి తీసుకొని అరగ్లాసు నీళ్ళలో వేసి ఉండలు లేకుండా కలిపి , మరుగుతున్న పులుసులో వేసి మరో అయిదు నిముషములు కాగనిచ్చి దింపుకోవచ్చు.
ఇక మేము చేసే మూడవ విధానము.
పావు స్పూను మెంతులు , మూడు ఎండుమిరపకాయలు , స్పూను పచ్చిశనగపప్పు , అర స్పూను మినపప్పు , స్పూను ధనియాలు,
కొంచెం ఇంగువ నూనెలో వేయించి అందులో పావు చిప్ప పచ్చి కొబ్బరి ముక్కలుగా తరిగి వేసి కొద్దిగా వేయించాలి.

చల్లారగానే మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పులుసులో ముక్కలన్నీ ఉడికాక వేసి , మరో అయిదు నిముషముల పాటు తెర్ల నివ్వాలి
చివరగా పోపు గరిట స్టౌ మీద పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి ఎండు మిర్చి ముక్కలు, జీలకర్ర , ఆవాలు , మెంతులు , ఇంగువ వేసి పోపు పెట్టు కోవాలి .
పైన కొత్తిమీర తరిగి వేసుకోవాలి .
అంతే అదిరిపోయే రుచితో ఘమ ఘమ లాడే " ముక్కల పులుసు " సర్వింగ్ కు సిద్ధం.
చక్కగా రెండు రోజుల పాటు అన్నం లోకి , ఇడ్లీల లోకి , పూరి , చపాతీ ల లోకి వేసుకుని తినవచ్చు,

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి