Showing posts with label ప్రసాదాలు. Show all posts
Showing posts with label ప్రసాదాలు. Show all posts

Monday, May 29, 2017

పరుప్పు పాయసం

పరుప్పు పాయసం 
ఆలూరి కృష్ణ ప్రసాద్

ప్రియమిత్రులారా !
ఈ రోజు మీ అందరికీ తమిళ నాడులో ప్రతి శుభ సందర్భము లోను తమిళులు చేసే ' పరుప్పుపాయసం ' ఎలా చేయాలో తెలియ చేస్తాను .


పరుప్పు పాయసం.
*****************
కావలసిన పదార్ధములు.

పచ్చి శనగపప్పు లేదా
పెసర పప్పు --- ఒక కప్పు
బెల్లం --- ఒక కప్పు
పచ్చి కొబ్బరి ముక్కలు ---
ఒక కప్పు
నెయ్యి --- అర కప్పు
కొబ్బరి పాలు -- ఒకటిన్నర కప్పు
జీడిపప్పు --- 25 గ్రాములు
యాలకుల పొడి -- అర టీ స్పూను.

కొబ్బరి పాలు తీసుకునే విధానము .
ఒక పెద్ద సైజు కొబ్బరి కాయను కొట్టి పచ్చి కొబ్బరి తురుము తో
తురుముకోవాలి.
మొత్తం రెండు చిప్పలు తురుము కోవాలి .
తరువాత మిక్సీలో వేసి తిప్పి అందులోని పాలు ఒక గిన్నెలో పిండు కోవాలి.
తర్వాత మళ్ళీ మిక్సీలో వేసి
చాలా కొద్దిగా నీరు పోసి తిప్పి మిగిలిన పాలు కూడా పిండు కోవాలి .

ఈ విధంగా ఒకటిన్నర కప్పు పాలు తయారు చేసుకోవాలి .
ఇక ' పరుప్పు పాయసం ' తయారు చేయు విధానము .
ముందుగా పచ్చి శనగపప్పు గాని లేదా పెసర పప్పు గాని మీరు దేనితో చేయ దల్చు కున్నారో దానిని నూనె / నెయ్యి వెయ్యకుండా పచ్చి వాసన పోయేవరకు దోరగా వేయించుకోవాలి .
ఆ తర్వాత కుక్కర్ లో ఒక కప్పు పప్పుకు ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసి రెండు లేక మూడు విజిల్స్ 
వచ్చే వరకు ఉడికించి స్టౌ ఆపి వేయాలి .
ఆ తర్వాత బాండీలో నెయ్యి 
వేసి జీడిపప్పు దోరగా వేయించి ప్లేటులో ప్రక్కన పెట్టుకోవాలి .

ఆ తర్వాత నెయ్యిలో పచ్చి కొబ్బరి ముక్కలు Gold Colour వచ్చే వరకు వేయించు కోవాలి .
ఆ తర్వాత బాండీ పెట్టి కొద్దిగా నీళ్ళు పోసి తరిగి ఉంచుకున్న బెల్లం వేసి పాకం రాకుండా పూర్తిగా కరిగే వరకు కలపాలి .

బెల్లం పూర్తిగా కరగగానే ఉడికిన శనగపప్పు లేదా పెసర పప్పు కొద్దిగా మెదిపి ఆ పాకంలో వేయాలి .
ఆ తర్వాత కొబ్బరి పాలు పోసి 
బాగా ఉడకనివ్వాలి .
ఆ తర్వాత వేయించిన ( పచ్చి )
కొబ్బరి ముక్కలు , యాలకుల పొడి అందులో వేయాలి.
కొద్ది సేపు అయిన తర్వాత చివరగా నెయ్యి మరియు వేయించిన జీడిపప్పు అందులో కలపాలి .

అంతే ఘమ ఘమ లాడే తమిళ
వంటకం " పరుప్పు పాయసం "
సర్వింగ్ కు రెడీ .

ఇందులో బియ్యం వాడరు.
మనం మామూలుగా పాలు పోస్తాము.

బదులుగా వారు కొబ్బరి పాలు పోసి చేస్తారు .
అదీ తేడా !
మరి మీరు కూడా ప్రయత్నించండి .

అప్పాలు

ఆంజనేయ స్వామి వారి ప్రసాదము అప్పాలు తయారు చేయు విధానము .
ఆలూరి కృష్ణ ప్రసాద్

కావలసినవి .
షుమారుగా ఒక కప్పు కొలతగా పెట్టుకోండి .

గోధుమ పిండి --- అరకప్పు
బియ్యపు పిండి --- అర కప్పు
బెల్లం తరిగిన పొడి -- ఒక కప్పు
పచ్చి కొబ్బరి తురుము --- పావు కప్పు
యాలకుల పొడి --- అర స్పూను
నెయ్యి --- రెండు స్పూన్లు
నూనె --- 200 గ్రాములు
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి తరిగిన బెల్లం పొడి వేసి బెల్లం పొడి మునిగే వరకు నీళ్ళు పోసి బెల్లం కరిగాక నీళ్ళు బాగా తెర్లనివ్వాలి .
పాకం రావక్కరలేదు.
గోధుమ పిండి మరియు బియ్యపు పిండి రెండూ జల్లెడ పోసుకుని లేదా రెండూ బాగా కలుపుకొని , తెర్లుతున్న నీళ్ళలో ముందు యాలకుల పొడి వేసి , తర్వాత ఈ పిండి , కొబ్బరి తురుము మరియు రెండు స్పూన్లు నెయ్యి వేసి బాగా గరిటెతో కలిపి స్టౌ వెంటనే ఆపేయాలి.
కొద్ది సేపు తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఎడం అర చేతిలోకి కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని కుడి చేతి వేళ్ళతో పాలకోవా బిళ్ళలు లాగా చిన్న చిన్న అప్పాలు మాదిరిగా పిండి అంతా వత్తుకొని వేరే ప్లేటులో పెట్టుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద వేరే బాండి పెట్టి నూనె అంతా పోసి నూనె బాగా కాగనివ్వాలి .
తర్వాత షుమారు ఎనిమిది పది అప్పాలు వేసి ఎక్కువ సేపు ఉండనివ్వకుండా వెంటనే తీసెయ్యాలి .
ఎక్కువ సేపు ఉంటే అప్పాలు మాడి పోతాయి.
ఇవి కొబ్బరి బూరెల్లా కొంచెం మెత్తగా ఉంటాయి .
అప్పాలు గట్టిగా కావాలనుకునే వాళ్ళు ముప్పావు కప్పు బియ్యపు పిండి , పావు కప్పు గోధుమ పిండి వేసుకుని చేసుకోవాలి .
అంతే స్వామి వారి ప్రసాదానికి అప్పాలు సిద్ధం.
కొంచెం పెద్దవి చేసుకుంటే బూరెల్లా టిఫిన్ గా కూడా బాగుంటాయి .

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి