Showing posts with label స్వీట్స్. Show all posts
Showing posts with label స్వీట్స్. Show all posts

Tuesday, July 24, 2018

సింపుల్ గా స్వీట్ పొంగలి

ఆలూరుకృష్ణప్రసాదు .

సింపుల్  గా  స్వీట్  పొంగలి .

ఒక   గిన్నెలో గ్లాసు  బియ్యం , పావు కప్పు చాయపెసరపప్పు  కడిగి  తగినన్ని   నీళ్ళు  పోసి  స్టౌ  మీద  పెట్టుకోండి .

అన్నం  పూర్తిగా   ఉడకగానే  అర లీటరు  కాచిన  పాలు  అందులో  పోయండి .

షుమారు  ఓ  150  గ్రాముల  బెల్లం  పొడిగా   చేసి  ఉడుకుతున్న  పాలు  బెల్లం లో  వేయండి.

మరో  స్టౌ  మీద  బాండీ  పెట్టి  నాలుగు  స్పూన్లు   నెయ్యి  వేసి 
ముందు  పది  జీడిపప్పు లు  ,  కిస్ మిస్ వేయించి  పక్కన  పెట్టుకోండి .

నాలుగు  యాలకులు  పొడిగా   చేసి  ఉడుకుతున్న  పొంగలి  లో  వేయండి.

పావు  చిప్ప  ఎండు  కొబ్బరి  చిన్న  ముక్కలు  గా  Cut  చేసుకుని   బాండీలో  ఉన్న  నేతిలో  బాగా  వేయించుకుని   నేతితో  సహా  ఉడుకుతున్న  పాయసంలో  వేసి  బాగా  అంతా  కలిసేలా  ఉడకనివ్వండి.

మూడు  స్పూన్లు   నెయ్యి వేసి  దింపుకుని  పైన  వేయించిన  జీడిపప్పు   తో  అలంకరించుకోండి .

అంతే  స్వీట్  పొంగలి  సిద్ధం.

Wednesday, July 4, 2018

కొబ్బరి ఉండలు

ఆలూరుకృష్ణప్రసాదు .

కొబ్బరి  ఉండలు .

ఈ ఉండలు  తయారు చేయడానికి  మేము అనకాపల్లి కుండ బెల్లము వాడాము .

అందువల్లనే  ఉండలు  రంగు  అలా వచ్చింది .

రుచి కూడా  చాలా బాగుంటుంది .

ఆ బెల్లం  దొరకదు కనుక  మామూలు  బెల్లము తో చేసుకోవచ్చు .

కావలసినవి .

ఎండు కొబ్బరి  --  రెండు పెద్ద చిప్పలు .

బెల్లం -- పావు కిలో .

నెయ్యి  -- నాలుగు  స్పూన్లు .

తయారీ  విధానము .

ముందుగా  ఎండు కొబ్బరి  చిన్న చిన్న ముక్కలుగా  కట్ చేసుకోవాలి .

స్టౌ  మీద బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నెయ్యి వేసి , నెయ్యి బాగా కాగగానే  తరిగిన  ఎండు కొబ్బరి  ముక్కలను  వేసి  బంగారు రంగులో  వేయించు కోవాలి .

వేయించిన  ముక్కలను విడిగా  పళ్ళెం లోకి తీసుకోవాలి .

ఇప్పుడు  బెల్లంను  తరుగు కోవాలి  లేదా  మెత్తగా  దంపుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండీ పెట్టి  తరిగిన  బెల్లం  వేసి , అర గ్లాసు నీళ్ళు  పోసి  బెల్లం  ఉండ పాకం  వచ్చాక వేయించిన  కొబ్బరి  ముక్కలను వేసి  అట్లకాడతో  బాగా కలుపుకోవాలి .

తర్వాత  ఒక  ప్లేటులో  స్పూను  నెయ్యి వేసి  ప్లేటంతా  రాసి , పాకం పట్టిన ముక్కలను ప్లేటులో  వేసుకుని , చెయ్యి పట్టే  వేడి  లో ఉన్నప్పుడే  చేతికి నెయ్యి రాసుకుని  చిన్న చిన్న  ఉండలుగా  కట్టుకోవాలి .

అంతే.

ఎంతో  రుచిగా  ఉండే  కొబ్బరి ఉండలు  సిద్ధం.

ఈ కొబ్బరి  ఉండలు వారం రోజులు  నిల్వ  ఉంటాయి .

సంబంధించిన  రెసిపీ  మరియు ఫోటోలు  నా స్వంతం .

Monday, February 5, 2018

బొబ్బట్లు

ఆలూరుకృష్ణప్రసాదు .

సంక్రాంతి స్పెషల్  వంటకం.

బొబ్బట్లు.

కావలసినవి .

మైదాపిండి  --  ఒక కప్పు.
నూనె  --  2  స్పూన్లు
ఉప్పు   --  చిటికెడు .
నెయ్యి  --  ఒక కప్పు
యాలకులపొడి  --  స్పూను

బొబ్బట్లు లోపల  Stuff  చేసుకోవడానికి .

పచ్చి శనగపప్పు  -  ఒక కప్పు
బెల్లం  -- అర కప్పు

తయారీ  విధానము .

ముందుగా  మైదాపిండి లో  చిటికెడు  ఉప్పు వేసి  స్పూను  నూనె వేసి పొడి పిండి  బాగా కలుపుకోవాలి .

తర్వాత  ఆ పిండిలో  కొద్ది కొద్దిగా  నీరు  పోసుకుంటూ  పిండిని  చపాతీ పిండి మాదిరిగా  కలుపుకోవాలి .

తర్వాత ఆ పిండిలో  మరో స్పూను నూనె వేసుకుని  పిండిని  మరింత మృదువుగా  మెదాయించుకోవాలి .

దానిపై  ఒక పలుచని  గుడ్డను  కప్పి  ఒక ముప్పావు గంట సేపు పక్కన  పిండి  మరింత మృదువుగా  అవ్వటానికి విడిగా ఉంచుకోవాలి .

తర్వాత  పచ్చి శనగపప్పు  ఒకసారి కడిగి  ఒక గిన్నెలో  వేసుకుని  తగినన్ని నీళ్ళు  పోసి  కుక్కర్ లో పెట్టుకుని  మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి .

బెల్లం  పొడి చేసుకుని ఉంచుకోవాలి .

మిక్సీ లో ఉడికిన పచ్చి శనగపప్పు , బెల్లం  పొడి , యాలకుల పొడి వేసుకుని  మెత్తగా  వేసుకోవాలి .

ఆ తర్వాత ఒక అరిటాకును  తీసుకుని  దానిపైన నూనె రాసుకుని  ఉంచుకోవాలి .

మైదాపిండిని  నిమ్మకాయంత  తీసుకొని  పూరీ మాదిరిగా  చేతితో వత్తుకుని  అందులో పూర్ణం పిండిని  పెట్టుకుని  చేతితో  మూసి వేసుకోవాలి .

దానిని  నూనె రాసిన అరటి ఆకులో పెట్టి  నూనె చేతితోనే  పూరీల లాగా  వత్తుకుని ,
స్టౌ మీద పెనం పెట్టుకుని  పెనం మీద   నెయ్యి  వేసుకుని వత్తిన  బొబ్బట్లను  ఆకుతో సహా  బోర్లించాలి .
రెండు వైపులా  కొద్ది  కొద్దిగా  నెయ్యి  వేసుకుంటూమాడకుండా  కాల్చుకోవాలి .

ఇదే విధముగా  ప్రతి బొబ్బట్లు చేసుకోవాలి  .

అంతే ఎంతో రుచిగా  ఉండే  సంక్రాంతి  స్పెషల్  బొబ్బట్లు  సర్వింగ్  కు సిద్ధం .

Friday, January 12, 2018

పెసరపప్పు లడ్డూలు

ఆలూరుకృష్ణప్రసాదు .

సంక్రాంతి  స్పెషల్ .

మినప సున్నుండలు  ఏ విధంగా  చేసుకుంటామో  చాయపెసరపప్పు ను  మిగిలిన పప్పులతో  కలిపి  కూడా  లడ్డూలు  చేసుకోవచ్చును .

పెసర పప్పు పల్లీ పప్పుతో లడ్డూలు .

కావలసినవి .

చాయపెసర పప్పు --  ఒక  కప్పు
నెయ్యి --  ఒక  కప్పు.
కాచి  ఉంచుకోవాలి .
పంచదార  -- రెండు  కప్పులు .
వేరు శనగపప్పు  -- ఒక కప్పు.
జీడిపప్పు  మరియు 
బాదం పప్పు  --  అర కప్పు .
కాచి  చల్లారిన పాలు   --  పావు కప్పు.
యాలకుల పొడి  --  ఒకటిన్నర  స్పూను .

తయారీ  విధానము .

ముందుగా  బాండీలో  నాలుగు  స్పూన్లు  నెయ్యి  వేసి  నెయ్యి   బాగా  కాగగానే   చాయపెసరపప్పు  ను వేసి  కమ్మని వాసన వచ్చేదాకా  వేయించుకోవాలి .

చల్లారగానే  పెసర పప్పు ను  మిక్సీ లో  మెత్తగా  పొడి  చేసుకొని  విడిగా  ఉంచుకోవాలి. .

తర్వాత  పంచదార ను  కూడా  మెత్తగా  మిక్సీ  వేసుకుని  విడిగా  ఉంచుకోవాలి .

తర్వాత   బాండీలో  నెయ్యి  వేయకుండా  పల్లీలను  వేయించుకుని , చల్లారగానే  పై పొట్టు  తీసుకుని తర్వాత  మిక్సీ లో  మెత్తగా  పొడి చేసుకుని  విడిగా  ఉంచుకోవాలి .

జీడిపప్పు  మరియు  బాదం  బాండిలో  రెండు స్పూన్లు  నెయ్యి  వేసి  వేయించుకుని   మిక్సీలో  పొడి  చేసుకోవాలి .

ఇప్పుడు  ఒక బేసిన్ లో  పెసరపప్పు పొడి , పల్లీల పొడి , జీడిపప్పు  బాదంపొడి , పంచదార పొడి ,  యాలకుల పొడి  మరియు  కాచిన నెయ్యి వేసుకుని   చేతితో బాగా కలుపు కోవాలి . ఆ తర్వాత  ఉండ  కట్టుకోవటానికి   అవసరమైన  కొద్దిగా  పాలు పోసుకొని   ఉండలు కట్టుకోవాలి .

ఈ ఉండల్లో  పల్లీలు , జీడిపప్పు , బాదం  అన్నీ  కలుస్తాయి  కనుక  మంచి పోషక విలువలు కలిగి  ఎదుగుతున్న పిల్లలకు  మంచి బలవర్ధకమైనవి .

అంతే  సంక్రాంతి  స్పెషల్  పెసరపప్పు మరియు పల్లీ పప్పుతో  లడ్డూలు  సిద్ధం .

Saturday, January 6, 2018

మైసూరు పాక్

ఆలూరుకృష్ణప్రసాదు .

సంక్రాంతి  స్పెషల్  వంటలు .

మైసూర్ పాక్ .

కావలసినవి .

శనగపిండి  -  కప్పు
పంచదార  --  కప్పున్నర.
నెయ్యి  --  రెండు కప్పులు .
నెయ్యి  విడిగా ముందుగా  బాగా కాచుకుని  ఉంచుకోవాలి .

వంట సోడా ఉప్పు  --  చిటికెడు .
నీళ్ళు  --  ఒక  కప్పు .

శనగపిండి  కల్తీ లేనిది  తీసుకుని  శుభ్రంగా జల్లించుకోవాలి .

అందులో చిటికెడు  సోడా ఉప్పువేసి  బాగా  కలుపుకోవాలి .

తయారీ విధానము .

ముందుగా   స్టౌ మీద  దళసరి  గిన్నె  పెట్టుకుని , ఒకటిన్నర  కప్పు పంచదార మరియు కప్పు నీళ్ళు  పోసి  గరిటతో బాగా కలపాలి .

నీళ్ళు  బాగా  తెర్లుతుండగానే  శనగ పిండిని  కొద్ది కొద్దిగా  పోసుకుంటూ  ఉండకట్టకుండా  గరిటెతో బాగా కలుపుతూ ఉండాలి .

పిండి  బాగా  కలవగానే  ముందుగా  సిద్ధం చేసుకున్న నెయ్యి  గరిటెతో కొద్ది  కొద్దిగా  పొసుకుంటూ  స్టౌ  మీడియం  సెగలో  ఉంచి  గరిటెతో  బాగా  కలుపుతుండాలి .

ఒక వెడల్పాటి  పళ్ళానికి  నెయ్యి రాసుకుని  సిద్ధంగా ఉంచుకోవాలి .

పాకం , పిండి , నెయ్యి  అన్నీ  బాగా కలిసి  పొంగు మాదిరిగా  వచ్చి  బాగా దగ్గర  పడుతున్నప్పుడు  జాగ్రత్తగా చూసుకుని  పాకాన్ని  పళ్ళెంలో  పోసి  వేడి మీదనే  ముక్కలు కోసుకోవాలి .

మెత్తగా  ఇష్ట పడేవారు  కొంచెం  ముందుగా , గట్టిగా  ఇష్టపడేవారు  కొద్దిగా  ముదురు పాకం రానిచ్చి దింపుకోవాలి .

కొంతమంది  కప్పు నెయ్యి మరియు కప్పు నూనె కలిపి  చేసుకుంటారు .

మేమయితే పూర్తిగా  నెయ్యి తోనే  చేస్తాము .

అంతే  ఎంతో రుచిగా కమ్మని  నేతి వాసనతో ఉండే  సంక్రాంతి  స్పెషల్  మైసూర్  పాక్  మీ అందరి కోసం సిద్ధం.

Tuesday, December 5, 2017

అశోకా హల్వా

ఆలూరుకృష్ణప్రసాదు .

అశోకా హల్వా.

కావలసినవి .

చాయ పెసరపప్పు -- ఒక కప్పు
గోధుమ పిండి --  రెండు స్పూన్లు
యాలకులు  -- 5 మెత్తగా  పొడి చేసుకోవాలి.
పంచదార --  ఒక కప్పున్నర
నెయ్యి  --  ఒక కప్పు
జీడిపప్పు  --  15  పలుకులు .

తయారీ  విధానము .

స్టౌ వెలిగించి  బాండీ  పెట్టి  కప్పు పెసరపప్పు వేసి పెసరపప్పు  కమ్మని వాసన వచ్చే దాకా వేయించు కోవాలి .

తర్వాత కుక్కర్లో  గిన్నె పెట్టి  వేయించిన  పప్పు వేసి  సరిపడా  నీళ్ళు పోసి  మూడు విజిల్స్  వచ్చే వరకు  ఉంచాలి .

తర్వాత  మెత్తగా  పప్పును యెనపాలి .

తర్వాత బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నెయ్యి వేసి  ముందుగా  జీడిపప్పు  వేయించుకుని  విడిగా  ప్లేటులో తీసుకుని  ఉంచుకోవాలి .

తర్వాత  అదే బాండీలో  మరో స్పూను  నెయ్యి వేసి  గోధుమ పిండి కమ్మని వాసన వచ్చే వరకు  వేయించుకుని పక్కన  పెట్టు కోవాలి .

తర్వాత అదే బాండీలో
మళ్ళీ నాలుగు స్పూన్లు  నెయ్యి వేసి ఉడికించి ఉంచుకున్న  పెసర పప్పు  మరియు పంచదార వేసి గరిటతో బాగా కలుపుతూ ఉండాలి.

రెండూ దగ్గర  పడి  ఉడుకుతుండగానే  పది నిముషాల  తర్వాత  వేయించిన  గోధుమ పిండి , యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని    మిఠాయి రంగు కొద్దిగా  పాలల్లో  కలుపుకుని   ఉడుకుతున్న హల్వాలో  పోసి గరిటతో  బాగా కలుపుకోవాలి .

తర్వాత  మిగిలిన  నెయ్యి  , జీడిపప్పు పలుకులు  వేసి  గరిటతో  బాగా కలుపుకోవాలి .

అంతే ఎంతో రుచిగా  ఉండే  తమిళనాడు  స్పెషల్ అశోకా హల్వా  సర్వింగ్  కు సిద్ధం.

Thursday, August 31, 2017

కొబ్బరి బర్ఫీ

కొబ్బరి  బర్ఫీ.

కావలసినవి.

కొబ్బరి  తురుము  ---  రెండు కప్పులు
పంచదార  ---  ఒకటిన్నర  కప్పు
యాలకుల  పొడి  --  అర  స్పూను .
జీడిపప్పు  --  ఎనిమిది
నెయ్యి  ---  మూడు  స్పూన్లు

తయారీ  విధానము .

ముందుగా   స్టౌ  మీద  బాండి  పెట్టి  మొత్తం   నెయ్యి వేసి  నెయ్యి  బాగా కాగగానే  ముందుగా  జీడిపప్పు  వేసి  బంగారు  రంగులో  వేయించి  వేరే  ప్లేటులో  ఉంచుకోవాలి .

తర్వాత   అదే  నెయ్యి  బాండీలో  పచ్చి కొబ్బరి తురుము  మరియు  పంచదార  వేసి  స్టౌ  మీడియం  సెగలో  పెట్టి  అట్లకాడతో  మిశ్రమాన్ని   బాగా  కలుపుతూ  బాగా  పాకం వచ్చి  దగ్గర పడి , రెండు  చేతి  వేళ్ళతో  పట్టుకుని  చూస్తే  పాకం  చేతికి  అంటుకునే  వరకు  ఉంచాలి .

తర్వాత  అందులో  యాలకుల  పొడి మరియు జీడిపప్పు  ను కూడా వేసుకుని   బాగా కలిపాలి .

ఒక  పళ్ళానికి   నెయ్యి రాసి  ఈ  పాకం  అందులో  వేసి అట్లకాడతో  నాలుగు  మూలలా  చదును చేసి వేడి  మీదనే  చాకుతో  ముక్కలుగా  కోసుకోవాలి.

అంతే  రుచికరమైన  కొబ్బరి   బర్ఫీ  సర్వింగ్  కు  సిద్ధం.

క్యారట్ హల్వా

క్యారట్   హల్వా .

కావలసినవి .

తురిమిన  క్యారెట్  --  రెండు కప్పులు.
పంచదార  --  ఒక కప్పు
యాలకుల పొడి  --  అర స్పూను .
జీడిపప్పు  --  పది పలుకులు .
కిస్మిస్   --  పది
బాదంపప్పు  --  5 
నెయ్యి  --  50  గ్రాములు.

తయారీ  విధానము .

ముందుగా  షుమారు  ఒక  ఆరు నుండి  ఎనిమిది  క్యారెట్లను  శుభ్రంగా  కడుగుకొని  (  పై  చెక్కు  తీయడం  మీ  ఇష్టం )  ఎండు కొబ్బరి కోరాముతో  కోరుకుని  రెండు  కప్పులు  క్యారెట్  తురుమును  సిద్ధం చేసుకోవాలి .

పై  చెక్కు  తీయకపోతేనే  బలవర్ధకం .
యాలకులు  పొడి  కొట్టి  అర స్పూను  సిద్ధం చేసుకోవాలి .

స్టౌ  మీద  బాండీ  పెట్టి  నాలుగు  స్పూన్లు   నెయ్యి  వేసి  జీడిపప్పు , బాదం పప్పు , కిస్మిస్  వేయించుకుని  వేరే  ప్లేటు లోకి  తీసుకుని   విడిగా   తీసి ఉంచుకోవాలి .

అదే బాండీలో  మరో  రెండు  స్పూన్లు  నెయ్యి వేసి  క్యారెట్  తురుము  వేసి  పచ్చి వాసన పోయి  కమ్మని  వాసన  వచ్చేదాకా   వేయించుకుని  విడిగా   వేరే  ప్లేటులో  ఉంచుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద  మరలా బాండీ  పెట్టి  కప్పు పంచదార  వేసి , పంచదార మునిగే  వరకు   నీళ్ళు పోసి  తీగ పాకం రానివ్వాలి .

అంటే  రెండు  వేళ్ళతో  ముట్టుకుంటే  పాకం  తీగలా  సాగాలి .

ఆ తర్వాత  అందులో  అర  స్పూను  యాలకుల  పొడి వేసి  బాగా  కలిపి  ,  వేయించుకుని  వేరే  ఉంచిన  క్యారెట్ తురుము ,  జీడిపప్పు  , బాదం , కిస్మిస్  మరియు  రెండు  స్పూన్లు  నెయ్యి వేసి  అట్లకాడతో  బాగా  కలుపుతూ  మరో  అయిదు  నిముషాలు  ఉంచి  దింపుకోవాలి .

అంతే  వేడి  వేడి  క్యారెట్  హల్వా  సర్వింగ్  కు  సిద్ధం.

Sunday, July 2, 2017

కజ్జికాయలు

కజ్జి  కాయలు .
                                                                            ఆలూరు కృష్ణప్రసాదు .

తయారీ  విధానము .
ముందుగా  ఒక కప్పు  మైదా  పిండిలో  చిటికెడు  ఉప్పు వేసి  కొద్దిగా   కాచిన  నూనె  పోసి  సరిపడా  నీళ్ళు  పోసుకుంటూ  పూరీల పిండిలా  కలుపుకుని  పక్కన  పెట్టుకోవాలి .
ముందుగా  రెండు  ఎండు  కొబ్బరి  చిప్పలు  ఎండు  కొబ్బరి  కోరాముతో  తురుము  కోవాలి .
బెల్లము  ఒకటిన్నర   కప్పు  పొడిగా  చేసుకోవాలి  .
ఒక  కప్పు  పుట్నాల  పప్పు  సిద్ధంగా   ఉంచుకోవాలి  .
  
ఈ  మూడింటిని   మరియు  అర స్పూను   యాలకుల  పొడిని  మిక్సీ  లో   వేసి  మరీ  మెత్తగా  కాకుండా  వేసుకోవాలి .

ఇప్పుడు  కజ్జి కాయలలో  మనం  పెట్టుకునే  మిశ్రమం   సిద్ధం  అయ్యింది .
ఇప్పుడు  అప్పడాల  పీట  పై  ముందుగా  మనం  సిద్ధంగా  ఉంచుకున్న  పిండిని  చిన్న  చిన్న ఉండలుగా  చేసుకుంటూ  అప్పడాల  పీటపై   చిన్న  చిన్న పూరీల  మాదిరిగా   పల్చగా  వత్తుకుని     కజ్జి కాయల  చెక్కను  తీసుకొని  వత్తుకున్న పిండిని   పెట్టి అందులో పెట్టి  స్పూనున్నర  ఎండు కొబ్బరి  మిశ్రమం  పెట్టి  వత్తి  చివరలు నీళ్ళ చేయితో  తడిపి  మూసి  అంచుల పక్కన  ఉన్న  అదనపు  పిండిని    తీసి  వేయాలి .
ఇలా  ముందుగా  అన్ని  కజ్జి కాయలు   సిద్ధం  చేసుకోవాలి .
ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  అర కె. జి . నూనె  పోసి  నూనె  బాగా  కాగగానే   ఒక్కొక్క  కజ్జి కాయను  వేసుకుంటూ అలా  ఐదారు  కజ్జి కాయల  చొప్పున  వేసి బంగారు  రంగు  వచ్చే వరకు   వేయించు కోవాలి .
అంతే  ఎంతో  రుచిగా  ఉండే  కజ్జి కాయలు  సర్వింగ్  కు  సిద్ధం .
ఈ  కజ్జికాయలు  15   రోజులు  పైన  నిల్వ  ఉంటాయి .
ఇందులో  వేయించిన  శనగపప్పు   బదులుగా  ఒక  కప్పు  బొంబాయి  రవ్వ   నేతిలో  వేయించి  ఎండు కొబ్బరి  పొడి  మరియు  బెల్లం పొడి గాని  లేదా  పంచదార  పొడి  గాని  వేసి  చేసుకుంటారు .
ఒక చోట  పచ్చి   కొబ్బరి  మరియు బెల్లం  పాకం  పట్టి  కొబ్బరి  లౌజు  లాగా  చేసి  ఆ  లౌజును    కజ్జి కాయలలో  పెట్టి  వేయించారు  .
అది  కూడా బాగానే  ఉంది .

మరమరాల ఉండలు

మర మరాల ఉండలు .
ఆలూరుకృష్ణప్రసాదు .

తయారీ  విధానము ..
ఒక నూటయాభై గ్రాముల  బెల్లం  మెత్తని  పొడిగా   చేసుకోవాలి  .
స్టౌ  మీద  బాండీ  పెట్టి  ఈ  బెల్లపు  పొడి  వేసి   బెల్లము  మునిగే  వరకు  నీళ్ళు  పోసుకుని  చేతితో  పాకం  ఉండ మాదిరిగా   వచ్చే విధంగా  అంటే  పళ్ళెంలో  నీళ్ళు  పోసి  అందులో  పాకం  వేసి  చేతితో  పట్టుకుంటే  ఉండ  అయ్యే విధంగా  పాకం రాగానే  రెండు  చెంచాలు  నెయ్యి  పావు చెంచా  యాలకుల పొడి  వేసి  షుమారుగా  పట్టినన్ని  బాగా  కర  కర  లాడుతున్న  మరమరాలు  పోసి  , వేడి  కొద్దిగా   తగ్గగానే  చేతికి  నెయ్యి రాసుకుని  ఉండలు  కట్టుకోవాలి .
అంతే  పిల్లలు   తియ్యగా   ఇష్టపడే  మరమరాల  ఉండలు  సిద్ధం .

బూందీ లడ్డూ

బూందీ లడ్డూ   
                                                                            ఆలూరు కృష్ణప్రసాదు .

కావలసినవి .
శనగపిండి - కప్పు
కుంకుంపువ్వు -  కొద్దిగా 
యాలకులపొడి- పావు స్పూను
జీడిపప్పు పలుకులు - టేబుల్ స్పూన్
నూనె- 2 కప్పులు
పంచదార-ఒకటి న్నర కప్పు.
ఉప్పు --  చిటికెడు

తయారీ  విధానము .
ముందుగా శనగపిండిలో  చిటికెడు  ఉప్పు కలిపి జల్లించుకుని తగినన్ని నీళ్లు పోసి పిండిని చిక్కగా జారుగా కలుపుకోవాలి.
తరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసి, కాగిన తర్వాత నూనెలో పడేలా సన్నని జల్లిలో పిండిమిశ్రమాన్ని పోస్తూ బూందీ చేయాలి.
తరువాత పక్క స్టవ్ మీద కప్పు నీళ్లు పోసి పంచదార తీగ పాకం వచ్చే  విధంగా పాకం పట్టాలి. ఇందులో యాలకుల పొడి వేసి కలపాలి.
వేడిగా ఉన్నప్పుడే బూందీ ని పంచదార పాకం లో వేసి, బాగా కలపాలి.
తర్వాత జీడిపప్పు, మరియు  కుంకుమ  పువ్వు వేసి లడ్డూలు చేసుకోవాలి.

Sunday, June 25, 2017

సజ్జప్పాలు లేదా సజ్జ పూరీలు

సజ్జప్పాలు లేదా సజ్జ పూరీలు
ఆలూరు కృష్ణప్రసాదు .

సజ్జప్పాలు  లేదా  సజ్జ పూరీలు .
తయారు  చేయు  విధానము  .
పావు కిలో  మైదా  పిండి  లో  చిటికెడు   ఉప్పు వేసి తగినన్ని    నీళ్ళు పోసి  బొబ్బట్లు  కు  కలుపు కునే  విధంగా  పిండిని   పల్చగా  తోపుకు  అనుగుణంగా   కలుపు కోవాలి .
అందులో  రెండు స్పూన్లు   నూనె  వేసి  బాగా  కలుపు  కొని  విడిగా  ఒక  అరగంట  సేపు  మూత  పెట్టి  ఉంచుకోవాలి .
స్టౌ  మీద  గిన్నె పెట్టి   అందులో   రెండు  గ్లాసుల    నీళ్ళు పోసి    నీళ్ళు  బాగా తెర్లగానే  గ్లాసు  పంచదార వేసి,   పంచదార   నీళ్ళలో  కరగగానే   గ్లాసు  బొంబాయి  రవ్వ  ఉండకట్టకుండా సన్నగా   పోసుకుంటూ  అట్లకాడతో  తిప్పుతూ  కలుపు కోవాలి .
తదుపరి  అందులో  అర స్పూను   యాలకుల  పొడి  మరియు  మూడు  స్పూన్లు   నెయ్యి  వేసి    రవ్వ  ఉడకగానే  దింపు కోవాలి .
ఇప్పుడు  రవ్వ  కేసరి  తయారు  అయ్యింది  .
రవ్వ కేసరి  కొద్దిగా  చల్లారగానే   చేతికి  నెయ్యి  రాసుకుని  నిమ్మకాయంత    ఉండలుగా  చేసుకుని   వేరే   పళ్ళెంలో  విడిగా  పెట్టు కోవాలి .
ఆ తర్వాత  ఒక   ప్లాస్టిక్   కవర్  తీసుకుని    కవరుకు  నూనె  రాసుకుని  పక్కన  పెట్టుకోవాలి  .
ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  అర కె. జి .  నూనె  పోసి  నూనెను సన్నని  సెగన   బాగా  కాగ  నివ్వాలి  
  తర్వాత అర చేతికి    నూనె  రాసుకుని      కొంచెం   తోపు  పిండి  తీసుకొని   అర చేతిలోకి  తీసుకుని    అర చేతిలో  పల్చగా  పరుచుకుని , మధ్యలో  రవ్వ కేసరి  ఉండ పెట్టుకుని  తోపు  పిండితో  ఉండ  మొత్తము     మూసి  వేయాలి .
తర్వాత  నూనె  రాసి  సిద్ధముగా  ఉంచుకున్న   ప్లాస్టిక్   కవరు పై  ఆ ఉండను  పెట్టుకుని  చిన్న  చిన్న  పూరీల  సైజులో  మధ్య  మధ్య  నూనె  చెయ్యి  చేసుకుంటూ   నాలుగు   వైపులా  రౌండ్  గా  సమంగా  వత్తు కుని , ఒక్కొక్కటిగా   బాండీ లోని  కాగుతున్న  నూనెలో  వేసి  రెండు  ప్రక్కలా  బంగారు  రంగు  వచ్చే  వరకు కాల్చుకుంటూ    విడిగా  తీసుకోవాలి  .
అంతే  ఎంతో  రుచిగా   ఉండి  శుభ కార్యక్రమాల్లో  అందురూ  తరచుగా  చేసుకునే  సజ్జప్పాలు  లేదా  సజ్జ  పూరీలు  సర్వింగ్   కు  సిద్ధం .
ఈ  సజ్జ పూరీలు  రెండు  రోజులు   నిల్వ  ఉంటాయి .

అరిసెలు

అరిసెలు
ఆలూరు కృష్ణప్రసాదు .


అరిసెలు  తయారీ  విధానము .
ఒక  కె. జి  . బియ్యము   ముందు  రోజు  రాత్రి  నీళ్ళలో  నాన  పోసుకోవాలి .
మరుసటి  రోజు  బియ్యాన్ని  వడ కట్టి  మిల్లులో  మెత్తని   పిండిలా  వేయించుకోవాలి .
పిండి  పట్టించి  వెంటనే  జల్లెడ  పోసుకుని   ఒక  గిన్నెలో  పోసి   పిండిలోని    తడి  ఆరకుండా గట్టిగా  నొక్కి  పెట్టి  ఉంచాలి .
ఒక  వెడల్పాటి   పాత్రలో  ముప్పావు  కిలో  బెల్లం  మెత్తగా   పొడి  చేసి  వేసి  బెల్లం  మునిగే  వరకు   నీళ్ళు  పోసి   స్టౌ  మీద  పెట్టి బెల్లం నీళ్ళలో  వేసి  చూస్తే  పాకం  ఉండగా   అయ్యే  విధంగా పాకం  రానివ్వాలి .
అంటే  పళ్ళెంలో  నీళ్ళు పోసి పాకం  అందులో  వేసి  చూస్తే ఉండలా  కట్టే  విధంగా  పాకం  రావాలి .
పాకం లో  నాలుగు  చెంచాల  నెయ్యి   వెయ్యాలి .
తర్వాత  పాకంలో  అర  స్పూను  యాలకుల  పొడి  వేసి స్టౌ మీద నుండి  దింపి  వెంటనే  బియ్యపు పిండి  పోస్తూ గరిటతో  గబ  గబా  కలియ బెట్టు కోవాలి .
పాకం  చల్లారక  ముందే  కలియబెట్టటం  పూర్తవ్వాలి .
దింపగానే  మరో  నాలుగు  చెంచాలు  నెయ్యి  వెయ్యాలి .
అలా  రెండుసార్లు   నెయ్యి వేసుకుంటే   పాకం  రుచిగా  మృదువుగా  ఉండటమే  కాక  ఉండలుగా చేయటానికి   అనువుగా   వస్తుంది .
ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి   ముప్పావు  కే .జి . నూనె  పోసి  నూనెను  బాగా  కాగనివ్వాలి .
చలిమిడి  చల్లారగానే   పిండిని  ముద్దలుగా  చేసుకుని  ఒక  ప్లాస్టిక్   కవరు  మీద  చేతికి   నూనె రాసుకుని  ముద్దను  చేతితో  పల్చగా   వత్తుకుని  కాగిన  నూనెలో  వేసి  చక్కగా   రంగు  వచ్చే వరకు   వేయించుకొని , అరిసెల   చెక్కల  మధ్య  పెట్టి  గట్టిగా  నొక్కుకొని  నూనె  పూర్తిగా  పోయాక  అరిసెలు  తీసి     వెడల్పాటి  పళ్ళెంలో  కాస్త  ఆరనిస్తే  బాగా  కరకరలాడుతూ  ఎంతో  రుచిగా ఉంటాయి .
మెత్తగా  కావాల్సిన వారు    కొంచెం  నొక్కితే  సరిపోతుంది .
అరిసెలు  చేయడానికి   మరో  మనిషి  సాయం  ఉంటే  సులువుగాను , త్వరగాను  అయిపోతుంది .
ఈ  అరిసెలు నెల రోజులు   పైగా  నిలవ ఉంటాయి .
బాలింతలు  ఆర్నెల్ల వరకు   అరిసెలు  తినకూడదు .

మినప సున్నుండలు

మినప సున్నుండలు .
ఆలూరు కృష్ణప్రసాదు .

తయారీ  విధానము  .
ఒక  కె. జి  .   మినప  గుళ్ళు  (  పొట్టు  లేనివి  ) బాండీ లో   నూనె  వేయకుండా   కమ్మని  వాసన  వచ్చే దాకా  వేయించుకోవాలి .
ఆ తర్వాత  మిక్సీ  లో  గాని  లేదా  పిండి  మరలో  గాని  మెత్తని    పొడిగా   వేసుకుని   ఆ పొడి  డబ్బాలో  పోసుకుని  గట్టిగా   మూత  పెట్టు కోవాలి .
మనం  ఎప్పుడు  మినప  సున్నుండలు  చేసుకోవాలని  అనుకుంటే  అప్పుడు  కప్పు  మినప సున్నికి  అర కప్పు  బాగా  మెత్తగా   దంచిన  బెల్లపు  పొడి  గాని  , మెత్తగా   గ్రైండ్   చేసిన  పంచదార  కాని  పొడిలో  వేసి  బాగా  చేత్తో   కలుపు కోవాలి  .
షుమారు  పావు  కప్పు   బాగా  కాగిన  వేడి  వేడి  కల్తీ లేని  మంచి  నెయ్యి  పిండిలో  పోసుకుంటూ  చేత్తో  గట్టిగా   ఉండలు  కట్టు కోవాలి .
బాలింతలకు  కూడా  నడుము  గట్టి  పడుతుందని  ఈ   సున్నుండలు  పెడతారు .
పెద్ద, చిన్న , పిల్లలూ  అందరూ  ఎంతో  ఇష్టంగా  తినే  మినప  సున్నుండలు  రెడీ .
ఒక్కసారి  ఎక్కువ   మోతాదులో   కలుపుకునే  కన్నా  మన  ఇంట్లో  జనాన్ని  బట్టి  కాస్త  కాస్త  కలుపుకుంటే  తాజా  తాజా గా  ఉంటాయి .

Sunday, June 18, 2017

రవ్వ లడ్డూ

రవ్వ లడ్డూ  తయారీ  విధానము .
ఆలూరు కృష్ణప్రసాదు

ఇక  రవ్వ లడ్డు  కు  ఒక కప్పు  బొంబాయి  రవ్వ  నేతిలో  వేయించుకోవాలి .
ఎండు కొబ్బరి  ఒక చిప్ప  ఎండు కొబ్బరి  కోరాముతో  తురుముకుని  నెయ్యి వేసి  వేయించుకోవాలి .
అర కప్పు  పంచదార  మిక్సీలో మెత్తగా  పొడి  వేసుకోండి.
నేతిలో  జీడిపప్పు   , కిస్మిస్   వేయించుకోండి .
ఇప్పుడు  బేసిన్లో నేతిలో  వేయించిన  బొంబాయి రవ్వ , నేతిలో  వేయించిన  ఎండు  కొబ్బరి , మిక్సీలో  మెత్తగా  వేసిన  పంచదార  మరియు  నేతిలో  వేయించిన  జీడిపప్పు  , కిస్మిస్  వేసి    కొద్దిగా కాచి చల్లారిన  పాలు పోసి  ఉండలు  కట్టుకోండి .
అంతే  రవ్వ లడ్డూలు  సిద్ధం .

Wednesday, June 7, 2017

చిమ్మిరి ఉండలు .

చిమ్మిరి  ఉండలు .
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

image courtesy: google

కావలసిన  పదార్ధములు.

వేయించిన  శనగపప్పు  --   50  గ్రాములు
నువ్వు పప్పు   తెల్లనిది  ----   100  గ్రాములు
బెల్లం  --   100  గ్రాములు
ఎండు కొబ్బరి  --   ఒకచిప్ప.

తయారీ  విధానము .

ముందుగా  ఎండు కొబ్బరి  చిన్న చిన్న  ముక్కలుగా  కట్ చేసుకోవాలి.

బెల్లం  పొడిలా  దంచుకోవాలి . ముక్కలుగా  మిక్సీలో  వేస్తే  మిక్సీ  బ్లేడ్స్  విరగవచ్చు.

నువ్వు పప్పు  వేయించ నవసరం  లేదు .

ఇప్పుడు  మిక్సీలో  ముందుగా   ఎండు కొబ్బరి ముక్కలు  వేసుకుని   గ్రైండ్  చేయాలి .

ఆ తర్వాత  తెల్ల నువ్వు పప్పు ,  పుట్నాల పప్పు , మిక్సీలో  వేసి  మూడు  మెత్తగా  అయ్యాక  చివరగా  బెల్లం పొడి  కూడా  వేసి  మెత్తగా   మిక్సీ  వేసుకోవాలి .

ఈ  మూడింటి  మిశ్రమం  ఒక ప్లేటులోనికి  తీసుకొని  ఉండలుగా  చేతితో  కట్టుకోవాలి .

అంతే  రుచికరమైన  చిమ్మిరి  ఉండలు  సిద్ధం.

బాగా  నీరసంగా   అన్పించినప్పుడు  ఒకటి  రెండు  ఉండలు తీసుకుంటే  నీరసం  మటు మాయం.


ఎక్కువగా   తింటే  నువ్వులు  వేడి  చేయవచ్చు .

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి