Thursday, April 16, 2020
బియ్యప్పిండి వడియాలు
Wednesday, July 4, 2018
మినప వడియాలు(చిన్నవి)
ఆలూరుకృష్ణప్రసాదు .
మినప్పిండి తో చిన్న వడియాలు .
ఇప్పుడు ఎండలు మండి పోతున్నాయి .
ఈ సమయంలో సగ్గు బియ్యం వడియాలు , బూడిద గుమ్మడి వడియాలు , ఊర మిరపకాయలు
పెట్టుకుంటే గల గలా ఎండుతాయి .
చాలా మంది బూడిద గుమ్మడికాయ వడియాలతో పాటే ఈ చిన్న వడియాలు పెట్టుకుంటారు .
ఈ వడియాలు తోటకూర కూరలో , వంకాయ అల్లం మిర్చి కూరలో , పనస పొట్టు కూరలో ఇలా చాలా కూరల్లో , విడిగా వేయించి కలుపుతారు .
దీనివల్ల ఆ కూరలకు అదనపు రుచి వస్తుంది.
మరి కొంత మంది కూరల్లో కలిపితే వడియాలు మెత్త పడతాయని , విడిగా వేయించుకుని కూర తో పాటుగా కలిపి , ముద్దలో పెట్టుకుని తింటారు .
మేము ఏడాదికి సరిపడా ఒక K . G . మినపగుళ్ళు నానబోసి ఒకే సారి పెట్టుకుంటాము .
అయితే వీటికి వాతావరణ మార్పుల బట్టి తొందరగా పురుగు పట్టే లక్షణం ఉంది కనుక మూడు నెలల కొకసారి ఏ రోజున ఎండ బాగా ఉంటుందో ఆ రోజున ఈ చిన్న వడియాలన్నీ చాటలో పోసి డాబా పైన ఎండ బెట్టు కుంటాము .
మళ్ళీ సాయంత్రం డబ్బా లో పోసుకుంటాము .
కొంతమంది Zip Lock Covers లో పోసి ఫ్రిజ్ లో పెట్టుకుంటారు .
కావలసినన్ని అవసరమయినపుడు వేయించుకోవటానికి తీసుకొని మళ్ళీ కవర్ ఫ్రిజ్ లో పెట్టేసుకుంటారు .
అప్పుడు కూడా పురుగు పట్టవు .
ఇదివరకు పాత రోజుల్లో గుడ్డల మీద పెట్టుకునేవారు .
చాలా కష్ట పడే వారు .
ఇప్పుడు ప్లాస్టిక్ Sheets వచ్చేసాయి .
అందరూ ఈ ప్లాస్టిక్ కవర్ల మీదే పెట్టుకుంటున్నారు .
ఆ విధంగా ప్లాస్టిక్ కవర్ల మీద పెట్టుకుంటే సులువుగా ఊడి వస్తాయి .
మేము పెట్టుకున్న వడియాలు అయిపోయినప్పుడు బజార్లో చాలా సార్లు కొన్నాము .
రుచి పచి లేకపోగా గట్టిగా వేయించాక గులక రాళ్ళు ఉన్నట్లు ఉన్నాయి .
అందువల్ల మీరు కూడా తప్పని సరై బజార్లో కొనవలసివస్తే ముందు ఓ 50 గ్రాముల వడియాలు కొనుక్కుని , వేయించి చూసుకుని నచ్చితే ఎక్కువ మోతాదులో కొనుక్కోండి .
మినపగుళ్ళతో చిన్న వడియాలు పెట్టుకునే విధానము .
****************************
ఒక అర కిలో మినపగుళ్ళు ముందు రోజు రాత్రి తగినన్ని నీళ్ళు పోసి నానబెట్టుకోండి .
మరుసటి రోజు ఉదయం మీరు Wet Grinder లో మీరు బూడిద గుమ్మడికాయ వడియాలకు పిండి ఎలా వేసుకుంటారో అలా మెత్తగా వేసుకొని ఒక గిన్నె లోకి తీసుకోండి .
ఒక 150 గ్రాముల పచ్చి మిరపకాయలు తొడిమలు తీసి మిక్సీ లో మెత్తగా వేసుకోవాలి .
తగినంత ఉప్పు , పావు స్పూను పచ్చి ఇంగువ మరియు పచ్చిమిర్చి మిశ్రమము పిండిలో వేసి చేత్తో బాగా కలిపి ప్లాస్టిక్ కవర్ల మీద చిన్న చిన్న సైజులో వడియాలు పెట్టుకోవాలి .
ఇప్పుడున్న ఎండల కయితే ఒక్క రోజులోనే ఎండి పోతాయి .
అవసరమయితే రెండో రోజున కూడా ఎండ బెట్టకుని ఒక Container లో పోసుకోండి .
మీకు మినపగుళ్ళతో చిన్న వడియాలు సిద్ధం.
మేము ఈ వడియాలు , ఊరు మిరపకాయలు , గుమ్మడి వడియాలు వేయించుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ వడియాలు కలుపుకు తినేస్తాము .
చాలా రుచిగా ఉంటాయి .
ఫోటో --- ఈ సంవత్సరం మేము పెట్టుకున్న వడియాలు .
సంబంధించిన రెసిపీ మరియు ఫొటోలు నా స్వంతం .
Thursday, March 1, 2018
ఊర మిరపకాయలు
ఆలూరుకృష్ణప్రసాదు .
ఊర మిరపకాయలు / చల్ల మిరపకాయలు .
ఒక లీటరున్నర పుల్లని గట్టి పెరుగు తగినన్ని నీళ్ళు పోసి మజ్జిగ చెసుకొవాలి .
ఒక కె. జి. మరీ కారం లేని బోలు పచ్చిమిరపకాయలు తీసుకుని కత్తి పీటతో మధ్యకు నిలువుగా గాటు పెట్టుకోవాలి .
తొడిమలు తీయరాదు .
సన్నని మిరపకాయలు కూడా వాడవచ్చును .
ఊరాక సన్న పచ్చి మిరపకాయలు కూడా రుచిగా ఉంటాయి.
ఇపుడు ఒక పెద్ద స్టీల్ టిఫిన్ లో మజ్జిగను పోసుకుని అందులో స్పూను పసుపు మరియు తగినంత ఉప్పు వేసుకుని చేతితో బాగా కలుపుకోవాలి .
అందులో గాటు పెట్టిన పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా కలిపి మూత పెట్టుకుని మూడు రోజులు కదపకుండా ఉంచాలి .
నాల్గవ రోజు ఉదయం చేతితో మిరపకాయలు తీసి మజ్జిగ టిఫిన్ లోనే కారనిచ్చి మిరపకాయలను ఒక వెడల్పాటి పళ్ళెంలో పోసుకుని ఆరు బయట ఎర్రని ఎండలో ఎండబెట్టుకోవాలి .
సాయంత్రం మళ్ళీ మిరపకాయలు మళ్ళీ మజ్జిగలో పోయాలి .
అలా మజ్జిగ పూర్తి అయ్యే వరకు షుమారు నాలుగు రోజులు ప్రతి రోజూ ఉదయం ఎండబెట్టి సాయంత్రం మరల పోస్తుండాలి .
మజ్జిగ పూర్తయ్యాక ఊర మిరపకాయలు బాగా తడి లేకుండా గల గల లాడే వరకు మరో నాలుగైదు రోజులు ఎండబెట్టుకోవాలి .
తర్వాత టిఫిన్ లో భద్ర పరచుకోవాలి .
కొంతమంది పచ్చిమిరపకాయలు ఊర వేయకముందే మజ్జిగ లో నాలుగు కాయలు నిమ్మరసం పిండుకుంటారు .
దీని వలన ఊరిన కాయలు రంగు మారకుండా తెల్లగా ఉంటాయని , రుచి కూడా మరింత పెరుగుతుందని అంటారు.
మీరు కూడా అలా చేసుకోవచ్చును.
మనకు అవసరమైనప్పుడు అవసరమైనవి తీసుకుని పప్పు , పప్పు కూరలు , కలగలపు పప్పు ఇలా వండుకున్నప్పుడు పక్కన ఆదరువుగా నూనెలో వేయించుకోవచ్చును .
ఈ ఊర మిరపకాయలు ఏడాది అంతా నిల్వ ఉంటాయి .
వానాకాలంలో , వాతావరణం చాలా మబ్బులుగా చలిగా ఉన్నప్పుడు , బాగా ఎండ వచ్చిన సమయంలో రెండు నెలలకు ఒకసారి ఎండలో పోసుకుని సాయంత్రం టిఫిన్ లో పోసుకుంటే మెత్తపడకుండా ఏడాది అంతా నిల్వ ఉంటాయి .
