Showing posts with label దోశలు. Show all posts
Showing posts with label దోశలు. Show all posts

Monday, July 9, 2018

కొబ్బరి దోశలు

ఆలూరుకృష్ణప్రసాదు .

కొబ్బరి  దోశెలు.

కావలసినవి .

బియ్యము --  కప్పు.
మినపగుళ్ళు -- పావు కప్పు.
పచ్చి కొబ్బరి  చిప్ప -- ఒకటి
ఉప్పు -- తగినంత
నూనె  -  పావుకప్పు .

తయారీ విధానము .

ముందుగా  బియ్యము  మరియు మినపగుళ్ళు ఒక గిన్నెలో పోసుకుని నాలుగు  గంటల సేపు నానబెట్టు కోవాలి .

పచ్చి కొబ్బరిని చాకుతో చిన్న చిన్న ముక్కలుగా  కోసుకోవాలి .

తరువాత  నానబెట్టిన బియ్యము మినపగుళ్ళు  గ్రైండర్ లో వేసుకుని  కొద్దిగా  నీళ్ళు పోసుకుని  మెత్తగా  దోశెల పిండి మాదిరిగా  గ్రైండ్ చేసుకోవాలి .

అందులోనే  పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని దోశెల పిండి మాదిరిగా గ్రైండ్  చేసుకుని  వేరే గిన్నెలోకి  తీసుకోవాలి .

ఆ పిండిలో తగినంత  ఉప్పు కలుపుకుని  గరిటెతో బాగా కలుపుకుని , ఒక గంట సేపు పిండిని బయట ఉంచుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద పెనం పెట్టుకుని , పెనం బాగా వేడెక్కగానే  నూనె వేసుకుని  పల్లగా  దోశెల మాదిరిగా  పోసుకోవాలి .

ఈ కొబ్బరి దోశెలు  కొబ్బరి చట్నీ లేదా అల్లపు చట్నీతో తింటే చాలా రుచిగా  ఉంటాయి .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.

Saturday, April 14, 2018

మరో వెరైటి దోశెలు

ఆలూరుకృష్ణప్రసాదు .

మరో వెరైటీ  దోశెలు.

చల్ల (  మజ్జిగ  )  దోశెలు.

కావలసినవి .

మజ్జిగ  --  మూడు కప్పులు .
బియ్యము  --  కప్పు
మినపగుళ్ళు  --  ఒక  గరిటెడు.
మెంతులు  --  అర  స్పూను .

ఉల్లి కారమునకు . ( దోశెల పైన రాయడానికి  )

ఉల్లిపాయలు  -   రెండు ( ముక్కలుగా  తరుగుకోవాలి )
ఎండుమిరపకాయలు  - రెండు
పచ్చిమిర్చి  --  నాలుగు
జీలకర్ర  --  అర స్పూను
ఉప్పు  --  తగినంత .
పసుపు  --  కొద్దిగా
నూనె --  ఒక  50  గ్రాములు .

తయారీ విధానము .

ముందుగా బియ్యము , మినపగుళ్ళు  నీళ్ళల్లో కడగాలి .

ఒక గిన్నెలో  మజ్జిగ  పోసుకుని  అందులో   బియ్యము  , మినపగుళ్ళు , మెంతులు  వేసుకుని  ఒక అయిదు గంటల సేపు నానబెట్టుకోవాలి .

తర్వాత  గ్రైండర్ లో  వేసుకుని  , కొద్దిగా  ఉప్పు వేసుకుని  దోశెల పిండిలా  మెత్తగా  వేసుకోవాలి . 

రుబ్బిన పిండిని  విడిగా  వేరే గిన్నె లోకి తీసుకోవాలి .

తర్వాత   మిక్సీ లో  ఉల్లిపాయ  ముక్కలు , జీలకర్ర , రెండు ఎండుమిరపకాయలు  , నాలుగు  పచ్చి మిరపకాయలు , కొద్దిగా  పసుపు  మరియు  కొద్దిగా  ఉప్పు  వేసుకుని  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

ఈ కారాన్ని  వేరేగా  తీసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద  పెనం పెట్టి  పెనం వేడెక్కగానే  పల్చగా  దోశెలు  వేసుకుని ఒక్కొక్క  దోశె   పైన  ఒక స్పూను  ఉల్లి కారం వేసుకుని  అట్లకాడతో  దోశె అంతా రాసి , స్పూను  నూనె వేసి  రెండు వైపులా  బాగా  కాలనివ్వాలి .

ఇలాగే  అన్ని దోశెలు  వేసుకోవాలి .

ఈ దోశెలు  కొబ్బరి  చట్నీతో  చాలా రుచిగా  ఉంటాయి .

సంబంధిత  రెసిపీ  మరియు ఫోటోలు   నా స్వంతం .

వెరైటి దోశెలు

ఆలూరుకృష్ణప్రసాదు .

మరో  వెరైటీ  దోశెలు  .

మూడు గ్లాసుల  పుల్లని  మజ్జిగ  లో  ఒక  గ్లాసు  అటుకులు , రెండు  గ్లాసుల  బియ్యము   కలిపి  ముందు  రోజు  రాత్రి  నాన బెట్టు కోవాలి .

ఉదయాన్నే  అయిదు  పచ్చిమిర్చి ,  ఒక తరిగిన   ఉల్లిపాయ   తగినంత  ఉప్పు  వేసి  మెత్తగా  మిక్సీ   వేసుకోవాలి  .

బయట  ఒక  గంట సేపు  ఉంచాలి .

తర్వాత  స్టౌ  మీద  పెనం  పెట్టుకుని  దోశెల లాగా  వేసుకోవాలి .

ఈ  దోశెలు  చాలా  మృదువుగా   ఉంటాయి .

ఈ  దోశెలలోకి  వెరైటీగా  పండు మిరపకాయల పెరుగు చట్నీ చేసాము .( ఫోటోలో  చూడండి  . )

ఎంతో  రుచిగా  ఉంది .

రెసిపీ  విడిగా  పెడుతున్నాను .

సంబంధిత  రెసిపీ మరియు ఫోటో  నా స్వంతం .

*************************

Tuesday, May 30, 2017

ముదిరిన ఆనపకాయతో దోసెలు

ముదిరిన ఆనపకాయతో దోసెలు
ఆలూరి కృష్ణ ప్రసాద్

ఆనపకాయ కొన్ని ప్రాంతాల వారు సొరకాయ అని పిలుస్తారు .
కొంత మంది ఆనపకాయ ,దోసకాయలలో ఏముంటుంది ? నీరు తప్ప.
ఆ రెండింటిలో అని పెదవి విరిచేస్తారు .

కాని దోసకాయ కందిపప్పు లో వేస్తే రుచి మరే పప్పుకు రాదు.
అలాగే లేత లేత ఆనపకాయలు సన్న ముక్కలు తరిగి మెత్తగా ఉడికించి అందులో పోపు వేసి నువ్వుల పొడి జల్లితే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది .
మరి లేత ఆనపకాయ అనే కొంటాము .
తీరా కాయ తరిగితే ముదురు .
అయ్యో ఏం చేయాలి ?
మొత్తం కాయ పారేయ్యాలసిందేనా ?
ఈ ముదురు కాయతో పప్పు చేసినా , కూర చేసినా Waste అని దిగులు పడకండి .

ఈ ముదిరిన ఆనపకాయతో దోసెలు వేసుకుంటే .
ఆనపకాయతో అదీ ముదిరిన కాయతో దోసెలా ? అని అనుకోకండి .
మేం చేసి చూసాం .
ఇంటికి వచ్చిన బంధువులందరికీ 
పెట్టాము .

దోశెలు చాలా బాగున్నాయి ఎలా చేసారు ? ఎలా చేసారు ? అని అడిగారు .
మీరు కూడా ప్రయత్నించండి .
ఆనపకాయ దోశెలు తయారు చేయు విధానము ; -----
ముందుగా ఒక గ్లాసు బియ్యం మూడు గంటల ముందు నాన బెట్టుకోండి .
ఆ తర్వాత నానబెట్టిన బియ్యాన్ని కడిగి వేసి , అందులో తగినంత ఉప్పు , అర స్పూన్ జీలకర్ర వేసి , నీళ్ళు కొద్దిగా పోసుకుంటూ , తరిగిన ఆనపకాయ ముక్కలు గింజలు ఉన్నా మరేం పర్వాలేదు మెత్తగా దోశె పిండి లాగా వేసుకోండి .
ఆ తర్వాత అందులో ఒక స్పూన్ ఎండు కారం కలపండి .
పిండిని బాగా కలిపి , ఒక గంట బైట ఉంచేయండి .
ఆ మిక్సీ పట్టిన పిండిని తర్వాత దోశెలు వేసుకునే ముందు కొద్దిగా నీళ్ళు కలుపుకుని గరిట జారుగా చేసుకొని , స్టౌ మీద పెనం పెట్టి నూనె వేసి దోశెలు వేసుకోండి .
అంతే వేడి వేడి ఆనపకాయ దోసెలు తినడానికి రెడి రెడీ.
ఈ దోశెలను టమోటా చట్నీతో తింటే అదిరి పోతుంది .
దోశెల లోకి టమోటా చట్నీ తయారు చేయు విధానము .
ముందుగా మూడు ఒక మాదిరిగా పండిన టమోటాలను తీసుకొని ముక్కలుగా తరగండి .
ఆ ముక్కల్లో కొద్దిగా పసుపు వేసి బాండిలో రెండు స్పూన్లు నూనె వేసి మగ్గ బెట్టుకోండి.
నాలుగు ఎండు మిరపకాయలు , మెంతులు కొద్దిగా , ఆవాలు కొద్దిగా , ఇంగువ కొద్దిగా , ఒక స్పూన్ చాయ మినపప్పు , కరివేపాకు కొద్దిగా వేసి పోపు పక్కన పెట్టుకోండి .
ఇప్పుడు మిక్సీలో వేయించిన ఎండు మిరపకాయలు వేసి తిప్పండి . అవి మెత్తగా అయిన తర్వాత తగినంత ఉప్పు మగ్గిన టమోటా ముక్కలు కొత్తిమీర వేసి మెత్తగా అయ్యాక పోపు కూడా వేసి మరోసారి తిప్పండి .
అంతే ఘమ ఘమ లాడే టమోటాల చట్నీ వేడి వేడి దోశెల లోకి సిద్ధం.
టమోటాల లో కొంచెం పులుపు ఉంటుంది కనుక వేరే చింతపండు వేయనవసరం లేదు.

రవ్వ దోశె

రవ్వ దోశె 
ఆలూరి కృష్ణ ప్రసాద్

రవ్వ దోశె కొబ్బరి మరియు అల్లం చట్నీతో .
తయారీ విధానము .
ఒక కప్పు బియ్యపు పిండికి , పావు కప్పు మైదా పిండి , పావు కప్పు బొంబాయి రవ్వ ఒక గిన్నెలో వేసుకోవాలి.

అందులో అర స్పూను జీలకర్ర , మూడు సన్నగా తరిగిన పచ్చి మిర్చి వేసుకోవాలి.
తగినంత ఉప్పు వేయాలి.
పావు కప్పు మజ్జిగతో పాటు తగినన్ని నీళ్ళు పోసుకుంటూ ,మామూలు దోశె పిండి కన్నా కొంచెం పల్చగా చేసుకుని ఒక అరగంట సేపు అలా ఉంచాలి.
పూర్తిగా మజ్జిగతో కలిపితే దోశె పెనానికి అంటుకుంటుంది.
ఇక స్టౌ మీద పెనం పెట్టి పెనం బాగా కాగాక నూనె వేసి గరిటతో పెనం మధ్యన కాకుండా చివర నుండి చాకచక్యంగా చిల్లులు చిల్లుగా పోసుకుంటూ రావాలి.
ఇందులో తురిమిన కొబ్బరి , తురిమిన క్యారెట్ , జీడిపప్పు పలుకులు దోశెలపై వేసుకుని మరి కాస్త నూనె వేసుకుని కాల్చుకుని తింటే అద్భుతమైన రుచిగా ఉంటుంది.
మొదట ఒకటి రెండు దోశెలు అంత బాగా రాకపోయినా తర్వాత దోశెలు బాగానే వస్తాయి.
కంగారు పడవద్దు .

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి