Showing posts with label స్నాక్స్. Show all posts
Showing posts with label స్నాక్స్. Show all posts

Monday, September 3, 2018

బియ్యప్పిండి చక్కిలాలు

బియ్యపు పిండితో రుచికరమైన మీగడ చక్కిలాలు /  జంతికలు .

ఆలూరుకృష్ణప్రసాదు .

బియ్యపు పిండితో  మీగడ  చక్కిలాలు.

కావలసినవి .

మర పట్టించిన బియ్యపు  పిండి --  నాలుగు  కప్పులు.

మీగడతో ఉన్న పెరుగు  --  ఒక కప్పు.

(  జంతికలు  పుల్లగా  తినడానికి  ఇష్ట పడే వారు  పుల్లని మీగడ పెరుగు  వేసుకోవచ్చును. )

ఉప్పు  -- తగినంత

కారము  -- ఒక స్పూను

వాము   --  ఒక  స్పూను

నువ్వుపప్పు  -  ఒక  స్పూను

నూనె   --  350  గ్రాములు.

తయారీ  విధానము .

ఒక  బెసిన్లో మెత్తగా  మరపట్టించి జల్లెడ పోసుకున్న   బియ్యపు  పిండి ,  వాము , నువ్వుపప్పు , కారం,  వేసుకుని  అందులో  మీగడ పెరుగు మరియు  తగినంత  ఉప్పు వేసుకుని చేతితో  బాగా  కలుపు కోవాలి .

ఇప్పుడు  అవసరమైతే కొద్దిగా   నీళ్ళు పోసుకుంటూ  చక్కిలాలు  వేయటానికి  వీలుగా  పిండిని  గట్టిగా  కలుపుకోవాలి .

తర్వాత  బాగా పిండిని  మెదాయించుకోవాలి.

ఇప్పుడు   స్టౌ  వెలిగించి   బాండి పెట్టుకుని  మొత్తము   నూనె  పోసి  నూనెను  పొగలు  వచ్చే విధముగా  బాగా  కాగనివ్వాలి.

తర్వాత  పిండిని  చక్కిలాలు  వేసే  గిద్దలో  పెట్టుకుని  స్టౌ  మీడియం  సెగలో  పెట్టి  రెండు  రెండు  చొప్పున  చక్రాలు వేసుకుని బంగారు  రంగులో  వేయించుకుని  తీసేసుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా ఉండే చల్ల చక్రాలు /  మీగడ చక్రాలు  అల్పాహారానికి  సిద్ధం.

ఈ  చక్కిలాలు  పది రోజులు   పైన నిల్వ ఉంటాయి .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .

వేడివేడిగా ఉల్లిపాయ పకోడీలు

ఆలూరుకృష్ణప్రసాదు .

వేడి వేడి గా ఉల్లిపాయ  పకోడీలు.

కావలసినవి .

శనగపిండి  --  100 గ్రాములు .
ఉల్లిపాయలు  -- 3 
( నిలువుగా  సన్నగా  తరుగు కోవాలి . )
పచ్చిమిరపకాయలు  -  4 
( సన్నగా  తరుగు కోవాలి )
కరివేపాకు  --  నాలుగు  రెమ్మలు . ( ఆకులు వలుచుకుని  సన్నగా తరుగుకోవాలి  )
ఉప్పు  --  తగినంత .
కారం  --  అర స్పూను .
( పచ్చిమిరపకాయల  కారం సరిపోతుంది . కారంగా  కావాలనుకునే  వారు  అర స్పూను కారం వేసుకోండి . )

నూనె  --  200 గ్రాములు .

తయారీ విధానము .

ముందుగా  ఒక  బెసిన్ లో నిలువుగా  తరిగిన  ఉల్లిపాయలు , సన్నగా  తరిగిన  పచ్చిమిర్చి , సన్నగా తరిగిన  కరివేపాకు , కారంగా ఇష్ట పడే వారు అర స్పూను కారము  మరియు తగినంత  ఉప్పు వేసుకుని  చేతితో  నొక్కుతూ  బాగా కలుపుకోవాలి . ( పిసకాలి ) . ఉల్లిపాయల  నుండి నీరు వచ్చి  తడిగా అవుతుంది .

ఇప్పుడు  అందులో శనగపిండి వేసి చాలా కొద్దిగా  నీరు పోసుకుని  గట్టిగా  కలుపు కోవాలి.

తర్వాత  స్టౌ మీద  బాండీ  పెట్టి  మొత్తము  నూనె  వేసి ,  నూనె బాగా  పొగలు వచ్చేటట్లు కాగగానే , చిన్న చిన్న పకోడీలు  లాగా వేసుకుని  చిల్లుల గరిటెతో  బాగా  కదుపుతూ, పకోడీలు  బంగారు  రంగులో  వేయించుకుని  వేరే ప్లేటు లోకి  తీసుకోవాలి .

మేము  ఇలా చేసుకున్న పకోడీలు  వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని  కూర లాగా నంచుకుని తినేస్తాము.

ఈ పకోడీలు  మధ్యాహ్నము  అల్పాహారానికి  చాలా రుచిగా ఉంటాయి .

సంబంధించిన  ఫోటో మరియు రెసిపీ  నా స్వంతం .

Wednesday, July 4, 2018

వేయించిన శనగపప్పుతో చక్కిలాలు

ఆలూరుకృష్ణప్రసాదు .

వేయించిన  శనగపప్పు తో చక్కిలాలు.

కావలసినవి .

బియ్యపు  పిండి --  రెండు కప్పులు.

వేయించిన శనగపప్పు పిండి ( పుట్నాల పప్పు )  ---
ఒక కప్పు

ఈ పిండి  మిక్సీలో  వేసుకోవచ్చు .

మిక్సీ లో  వేసుకునేటప్పుడు  పప్పు లోనే  సరిపడా ఉప్పు , అర స్పూను  వాము , పావు స్పూను  జీలకర్ర   వేసి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

వెన్న  --  రెండు  స్పూన్లు 

వెన్న  దొరకని  యెడల  నాలుగు  స్పూన్లు  కాచిన  నెయ్యి   వేసుకోవాలి .

కారం  ---  స్పూను

ఇంగువ  ---  పావు స్పూను లో సగం .

నూనె  ---  అరకిలో .

తయారీ  విధానము .

ఒక  బెసిన్లో వేయించిన  శనగపప్పు (  పుట్నాల )  పొడి  (  జీలకర్ర , వాము తో  వేసినది ) ,  బియ్యపు  పిండి , కారం, ఇంగువ , వేసుకుని  చేతితో  బాగా  కలుపు కోవాలి . అందులో  వెన్న  కానీ  కాగే  నెయ్యి కాని  పోసి బాగా  కలుపు కోవాలి .

ఇప్పుడు  తగినన్ని  నీళ్ళు పోసుకుంటూ  చక్కిలాలు  వేయటానికి  వీలుగా  కలుపుకోవాలి .

తర్వాత  బాగా పిండిని  మెదాయించుకోవాలి.

ఇప్పుడు   స్టౌ  వెలిగించి   బాండి పెట్టుకుని  మొత్తము  అర కిలో నూనె  పోసి  నూనెను  పొగలు  వచ్చే విధముగా  బాగా  కాగనివ్వాలి.

తర్వాత  పిండిని  చక్కిలాలు  వేసే  గిద్దలో  పెట్టుకుని  స్టౌ  మీడియం  సెగలో  పెట్టి  రెండు  రెండు  చొప్పున  చక్రాలు వేసుకుని బంగారు  రంగులో  వేయించుకుని  తీసేసుకోవాలి .

అంతే  వేయించిన  శనగపప్పు ( పుట్నాల ) తో  చక్కిలాలు  సర్వింగ్ కు సిద్ధం.

ఈ  చక్కిలాలు  పది రోజులు  నిల్వ ఉంటాయి .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .

Saturday, April 14, 2018

వేడి వేడి ఉల్లిపాయ పునుగులు

ఆలూరుకృష్ణప్రసాదు .

మధ్యాహ్నపు అల్పాహారము.

వేడి వేడి ఉల్లిపాయ  పునుగులు.

ఇడ్లీ  పిండి  పునుగులు  వేసే  గంట ముందు  బయట పెట్టుకోవాలి.

మూడు స్పూన్లు  పచ్చిశనగపప్పు  ఒక గంట సేపు నీళ్ళలో  నానబెట్టు కోవాలి .

షుమారు రెండు కప్పుల ఇడ్లీ పిండికి , అర కప్పు  బియ్యపు పిండి, నానబెట్టిన పచ్చిశనగపప్పు , నాలుగు తరిగిన  పచ్చిమిర్చి ,  రెండు తరిగిన ఉల్లిపాయ ముక్కలు ,  తగినంత ఉప్పు ,  స్పూను కారం  ,  నాలుగు  రెమ్మలు తరిగిన   కరివేపాకు , కొద్దిగా  తరిగిన  కొత్తిమీర , రెండు స్పూన్లు  మైదా పిండి , చిటికెడు  వంట సోడా  వేసి  కొద్దిగా   నీళ్ళు  పోసి   పకోడీల పిండి మాదిరిగా గట్టిగా కలుపు కోవాలి  .

ఒక గంట సేపు అలాగే ఉంచాలి .

ఒక గంట తర్వాత స్టౌ  మీద  బాండీ  పెట్టి  200  గ్రాముల  నూనె  పోసి  నూనె  బాగా  కాగగానే   చేతితో కాని , స్పూను తో కాని  పునుగుల్లా వేసుకుని , వేడి వేడిగా  అల్లం  చట్నీతో తింటే  కర కర లాడుతూ  బాగుంటాయి .

సంబంధిత  రెసిపీ  మరియు ఫోటో నా స్వంతం .

Thursday, March 1, 2018

మసాలా పెసర పుణుకులు

మసాలా పెసర వడలు  లేదా మసాలా పెసర పుణుకులు .

కావలసినవి.

పచ్చ పెసలు  లేదా  మామూలు పెసలు  --  పావు కిలో
పచ్చిమిర్చి  --  12 
అల్లం  --  షుమారు  రెండంగుళాలు ముక్క
పై  చెక్కు తీసుకుని
ముక్కలు గా చేసుకోవాలి .

ఉల్లిపాయలు  --  రెండు . సన్నని  ముక్కలుగా  తరుగు కొవాలి .

కరివేపాకు  --  మూడు రెమ్మలు . సన్నగా  తరుగు కోవాలి .

కొత్తిమీర  --  ఒక కట్ట  సన్నగా  తరుగు కోవాలి .

పొదినా  ఆకు   అరకప్పు  --  సన్నగా  తరుగు కోవాలి .

ఉప్పు  --  తగినంత

నూనె  --  అర కిలో

తయారీ  విధానము .

ముందుగా   పెసలు   సరిపడా  నీళ్ళు  పోసి  నాలుగు  గంటల  సేపు  నానబెట్టు కోవాలి .

ఆ తర్వాత నీళ్ళు  వడకట్టు కోవాలి .

ఇప్పుడు  గ్రైండర్ లో కాని  మిక్సీ లో కాని  నాన బెట్టిన  పెసలు , పచ్చి మిర్చి , అల్లం  ముక్కలు మరియు  సరిపడ ఉప్పు వేసి  తగినన్ని  నీళ్ళు పోసుకుంటూ  గారెల పిండి మాదిరిగా   గట్టిగా  వేసుకుని  ఒక  గిన్నెలోకి తీసుకోవాలి .

ఇప్పుడు  అందులో  సన్నగా  తరిగిన  ఉల్లిపాయల  ముక్కలు , తరిగిన  కరివేపాకు , తరిగిన  కొత్తిమీర  మరియు తరిగిన  పొదినా  వేసుకుని  చేతితో  బాగా కలుపుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండీ పెట్టుకుని  మొత్తం  నూనె పోసి  నూనె పొగలు వచ్చే  విధముగా  కాగనివ్వాలి .

తర్వాత  పిండిని  అర చేతితో  అద్దుకుని  వడలు  లాగా వేసుకుని  బంగారు  రంగులో  వేయించుకోవాలి .

లేదా  చిన్న చిన్న పుణుకులు లా  వేసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  మసాలా పెసర వడలు  లేదా  మసాలా పెసర పుణుకులు  మధ్యాహ్నము  అల్పాహారమునకు  సిద్ధం .

ఈ వడలు లేదా పుణుకులు  వేడి వేడి అన్నంలో  నెయ్యి వేసుకుని  నంచుకుని  తినవచ్చు .

చాలా రుచిగా ఉంటాయి .

Friday, December 8, 2017

బీరకాయ, అరటికాయ బజ్జీలు

బీరకాయ మరియు అరటి కాయ బజ్జీలు.

తయారీ విధానము .

ఒక బీరకాయ  మరియు ఒక అరటికాయ పై చెక్కు  తీసుకుని  చక్రాలుగా తరుగు కోవాలి.

ఒక  100  గ్రాములు శనగపిండిలో ,  స్పూనున్నర   బియ్యపు పిండి, చిటికెడు  వంటసోడా , అర స్పూను  కారం, సరిపడా ఉప్పు వేసుకుని  సరిపడా నీళ్ళు పోసుకుని  చేతితో బాగా కలుపు కోవాలి .

తర్వాత  స్టౌ మీద బాండీ పెట్టుకుని  పావు కిలో  నూనె పోసుకుని  నూనె బాగా కాగాక  ఒక్కొక్క  ముక్కను పిండిలో ముంచి ఏడెనిమిది చొప్పున వేసి బంగారు రంగులో వేయించుకోవాలి .

అంతే మధ్యాహ్నం  అల్పాహారము  బీరకాయ మరియు అరటి కాయ బజ్జీలు  సేవించడానికి సిద్ధం.

మా చిన్నప్పుడు  బాపట్లలో   జగన్నాథం అనే వ్యక్తి  ఒక స్టాండు మీద  అన్ని వస్తువులు పోస్టాఫీసు  ఎదురుగా  4 గంటల కల్లా పెట్టుకుని  రాత్రి 10 గంటల ద్వారా జోరుగా  వ్యాపారం  చేసేవాడు.

మిరపకాయబజ్జీలు , బీరకాయ అరటి కాయ బజ్జీలు , చేగోడీలు, గరం గరం ( ముంత కింద పప్పు )  ఇలా అన్ని రకములు  వేడిగా  అమ్మేవాడు.

వేడిగా  అంటే  చిల్లుల ముంతలో  బొగ్గులు ( నిప్పులు )  పోసుకుని వేయించిన  అటుకుల మీద పెట్టుకొని  తన వెంట తీసుకుని  వచ్చేవాడు.

ఆలా వేడి వేడిగా  ఇచ్చే వాడు .

ఇంక బీరకాయ అరటి కాయ బజ్జీలలో అయితే  పెద్ద ఉల్లిపాయలు సన్నగా  తరిగి  బజ్జీలలో పెట్టి , పండు మిరపకాయల పచ్చడి  మెత్తగా  రుబ్బి అందులో  నిమ్మరసం పిండి  ఆ పచ్చడి  ఉల్లిపాయలు కూరిన బజ్జీలలో పెట్టి ఇచ్చేవాడు.

అలా తింటే దాని రుచి చెప్పనలవి కాదు .

మీరు  ఒకసారి ప్రయత్నించ వలసిందే.

Tuesday, December 5, 2017

పునుగులు

ఆలూరుకృష్ణప్రసాదు .

పునుగులు.

తయారీ విధానము .

షుమారు మూడు కప్పుల ఇడ్లీ పిండిలో తరిగిన  రెండు ఉల్లిపాయలు  ముక్కలుగా తరిగి , తరిగిన  నాలుగు పచ్చి మిరపకాయలు  ముక్కలుగా తరిగి  , తరిగిన  కొత్తిమీర , తరిగిన  కరివేపాకు , రెండు స్పూన్లు  బియ్యపు పిండి, స్పూను బొంబాయి రవ్వ , స్పూనున్నర  మైదా పిండి , స్పూను కారం , కొద్దిగా  ఇంగువ , తగినంత   ఉప్పు మరియు చిటికెడు  వంట సోడా వేసి కొద్దిగా  నీళ్ళు పోసుకుని చేతితో  బాగా కలిపి  పది నిముషాల తర్వాత  స్టౌ మీద బాండీ పెట్టి  పావు కె.జి . నూనె పోసి చేతితో కాని లేదా  స్పూనుతో కాని చిన్న చిన్న ఉండలు వలె వేసుకుని బంగారు రంగులో కర కర లాడే విధముగా  వేయించుకోవాలి.

అరటికాయ చిప్స్

అరటి కాయ  చిప్స్.

ఆంధ్రాలో అరటి కాయ చిప్స్ వాడకం తక్కువ  కాని  కేరళ  తమిళనాడులో  అరటి కాయ చిప్స్ వాడకం బాగా ఎక్కువ .

మేము  అరటి కాయను నీళ్ళలో  ఉంచి పై చెక్కు  తీసి చక్రాలుగా  తరిగి  మరిగే నూనెలో ఎర్రగా వేయించుకుని ఉప్పు కారం వేసుకుంటాము .

అన్నంలో కూరగా నంచుకుని తింటాము.

లేదా  సాంబారులో  అప్పడాల బదులు నంచుకుని తింటాము .

వెరైటీ మిర్చి బజ్జీ

ఆలూరుకృష్ణప్రసాదు .

మరో వెరైటి  మిర్చి బజ్జీ.

తయారీ విధానము .

ఓ పావు కిలో  బోలుగా ఉన్న పెద్ద సైజు మిర్చి  బజ్జీ తీసుకుని  మధ్యలో గాటు పెట్టు కోవాలి.

రెండు బంగాళా దుంపలు  ఉడక పెట్టుకుని పై తొక్క తీసుకుని , ముక్కలుగా  చేసుకోవాలి .

స్టౌ మీద బాండీ పెట్టి  మూడు స్పూన్లు   నూనె వేసి  నూనె బాగా కాగగానే , స్పూను  శనగపప్పు , స్పూను  మినపప్పు , పావు స్పూను జీలకర్ర , అరస్పూను ఆవాలు , కొద్దిగా  ఇంగువ,  కరివేపాకు మరియు రెండు పచ్చిమిర్చి  ముక్కలుగా  తరిగి వేసుకుని  పోపు పెట్టుకుని అందులో ఉడికించిన బంగాళా దుంపలు కొద్దిగా పసుపు, తగినంత  ఉప్పు  మరియు  తరిగిన  కొత్తిమీర  వేసి ముద్దకూర చేసుకోవాలి .

ఆ కూరను  మిరపకాయలలో బాగా నిండుగా  కూరుకోవాలి .

ఒక వంద గ్రాముల శనగ పిండిలో , ఒక స్పూనున్నర  బియ్యపు పిండి , కొద్దిగా  ఉప్పు  మరియు చిటికెడు  వంట సోడా వేసుకుని  తగినన్ని నీళ్ళు పోసుకుని బజ్జీలు వేసుకునే విధముగా  పిండిని  జారుగా కలుపు కోవాలి .

తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి పావు కిలో నూనె పోసి నూనె బాగా కాగనివ్వాలి .

తరువాత  Stuff చేసిన మిరపకాయలు  శనగ పిండిలో ముంచి బజ్జీలు నూనెలో వేసి కర కర లాడే విధముగా  వేయించుకోవాలి .

అంతే ఎంతో రుచిగా ఉండే  బంగాళా దుంప కూర Stuff  చేసిన  మిరపకాయల బజ్జీలు  అల్పాహారంగా సర్వింగ్  కు సిద్ధం.

అల్లం  పచ్చడితో తింటే బాగుంటుంది.

Friday, September 1, 2017

వేరుశనగ చక్కిలాలు

వేయించిన  శనగపప్పు తో చక్కిలాలు.

కావలసినవి .

బియ్యపు  పిండి --  రెండు కప్పులు.
వేయించిన శనగపప్పు పిండి --
ఒక కప్పు

ఈ పిండి  మిక్సీలో  వేసుకోవచ్చు .

మిక్సీ లో  వేసుకునేటప్పుడు  పప్పు లోనే  సరిపడా ఉప్పు , అర స్పూను  వాము , పావు స్పూను  జీలకర్ర   వేసి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

వెన్న  --  రెండు  స్పూన్లు 

వెన్న  దొరకని  యెడల  నాలుగు  స్పూన్లు  కాచిన  నెయ్యి   వేసుకోవాలి .

కారం  ---  స్పూను

ఇంగువ  ---  పావు స్పూను లో సగం .

నూనె  ---  అరకిలో .

తయారీ  విధానము .

ఒక  బెసిన్లో వేయించిన  శనగపప్పు  పొడి  (  జీలకర్ర , వాము తో  వేసినది ) ,  బియ్యపు  పిండి , కారం, ఇంగువ , వేసుకుని  చేతితో  బాగా  కలుపు కోవాలి . అందులో  వెన్న  కానీ  కాగే  నెయ్యి కాని  పోసి బాగా  కలుపు కోవాలి .

ఇప్పుడు  తగినన్ని  నీళ్ళు పోసుకుంటూ  చక్కిలాలు  వేయటానికి  వీలుగా  కలుపుకోవాలి .

తర్వాత  బాగా పిండిని  మెదాయించుకోవాలి.

ఇప్పుడు   స్టౌ  వెలిగించి   బాండి పెట్టుకుని  మొత్తము  అర కిలో నూనె  పోసి  నూనెను  పొగలు  వచ్చే విధముగా  బాగా  కాగనివ్వాలి.

తర్వాత  పిండిని  చక్కిలాలు  వేసే  గిద్దలో  పెట్టుకుని  స్టౌ  మీడియం  సెగలో  పెట్టి  రెండు  రెండు  చొప్పున  చక్రాలు వేసుకుని బంగారు  రంగులో  వేయించుకుని  తీసేసుకోవాలి .

అంతే  వేయించిన  శనగపప్పు తో  చక్కిలాలు  సర్వింగ్ కు సిద్ధం.

ఈ  చక్కిలాలు  పది రోజులు  నిల్వ ఉంటాయి .

Thursday, August 31, 2017

చేగోడీలు

ఆలూరుకృష్ణప్రసాదు .

చేగోడీలు.

కావలసినవి .

బియ్యపు పిండి  ---  మూడు కప్పులు.
పచ్చిశనగపప్పు  ---  ఒక కప్పు
కారం  ---  ఒక స్పూను.
ఉప్పు  --  తగినంత
వెన్న  --  నిమ్మకాయంత
నీళ్ళు  --  మూడుకప్పులు
నూనె  --  పావు కిలో

తయారీ  విధానము .

ముందుగా  పచ్చిశనగపప్పు    తగినన్ని  నీళ్ళు పోసి రెండు గంటలు నాన బెట్టుకుని  తర్వాత  నీళ్ళు వడకట్టుకుని  ఒక పళ్ళెంలో వేసుకోవాలి .

తర్వాత స్టౌ వెలిగించి గిన్నెలో ఒక  మూడు కప్పులు నీళ్ళు పోసి నీళ్ళు బాగా  తెర్లుతున్నప్పుడు అందులో  వెన్న, కారం , తగినంత  ఉప్పు  మరియు  బియ్యపు పిండి వేసి గరిటతో  బాగా కలపాలి .

పిండి  చల్లారగానే  చేతులకు  నూనె రాసుకుని పీట పై  ముద్దను వేసి  బాగా మెదిపి ముద్దను  పొడవుగా  చేసి వాటికి  శనగపప్పు  అద్ది  చిన్న చిన్న రౌండ్లుగా  తయారు చేసుకోవాలి.

అన్నీ  చేగోడీలు  తయారు  చేసుకోవాలి .

ఇప్పుడు స్టౌ మీద  బాండి పెట్టి   మొత్తము నూనె  పోసి  నూనె  బాగా కాగగానే  ఎడెనిమిది  చేగోడీల చొప్పున  నూనె లో వేసి  బంగారు  రంగులో  వేయించు కోవాలి .

అంతే  ఈ  వానాకాలంలో  వేడి వేడి  చేగోడీలు  మధ్యాహ్నము  వేళ అల్పాహారమునకు సిద్ధం.

క్యాబేజి పకోడీలు

ఆలూరుకృష్ణప్రసాదు .

క్యాబేజి  పకోడీలు .

కావలసినవి .

శనగపిండి  --  ఒక  కప్పు.
క్యాబేజి  షుమారు  150 గ్రాములు  తీసుకుని   ఎండు కొబ్బరి కోరాముతో సన్నగా  తురుముకుని  ఒక  కప్పు  క్యాబేజి  తురుము  సిద్ధం  చేసుకోవాలి .
పచ్చి మిరపకాయలు  --  5  సన్నగా  తరుగు కోవాలి .
అల్లం  --  చిన్న ముక్క  తీసుకుని పై చెక్కును  తీసి   సన్నగా  తురుము కోవాలి .  లేదా  సన్నని  ముక్కలుగా చేసుకోవాలి .
కరివేపాకు   --  తరుగుకొని  ఒక  పావు  కప్పు  సిద్ధం  చేసుకోవాలి .
ఉల్లిపాయలు  --  రెండు  సన్నగా  నిలువుగా  తరుగుకోవాలి .
కారం  ---  ఒక  స్పూను
పసుపు  --  కొద్దిగా
ఇంగువ  ---  కొద్దిగా
బియ్యపు  పిండి --  రెండు  స్పూన్లు .
నూనె  ---  350  గ్రాములు.

తయారీ విధానము  .

ఒక  గిన్నెలో , శనగపిండి ,  బియ్యపు  పిండి , క్యాబేజి తురుము,  తరిగిన  ఉల్లిపాయలు , తరిగిన  పచ్చిమిర్చి  ముక్కలు ,  తరిగిన   అల్లం  తురుము , కొద్దిగా  పసుపు , కొద్దిగా  ఇంగువ , తరిగిన  కరివేపాకు , స్పూను  కారం , తగినంత  ఉప్పు వేసి  కొద్దిగా  నీళ్ళు  పోసుకుని  చేతితో  పకోడీలు  వేయటానికి  వీలుగా  బాగా కలుపుకోవాలి .

ఆ తర్వాత  స్టౌ  వెలిగించి  బాండీ  పెట్టుకుని  మొత్తం  నూనె  పోసి  నూనె  బాగా  కాగగానే   చిన్న చిన్న  పకోడీలు  లాగా  వేసుకుని , బంగారు  రంగు  వచ్చే  విధముగా   వేయించుకుని  వేరే  ప్లేటు లోకి  తీసుకోవాలి .

అంతే .  అన్నం లోకి  మరియు  అల్పాహారమునకు  అనువుగా  ఉండే  వేడి  వేడి  క్యాబేజీ  పకోడీలు  సర్వింగ్  కు  సిద్ధం .

Sunday, July 23, 2017

బంగాళాదుంప జంతికలు

బంగాళాదుంపతో  జంతికలు .
ఆలూరు కృష్ణప్రసాదు .

బంగాళాదుంప  తో  జంతికలు  ఏమిటి  ?  అని  అనుకుంటున్నారా !
ఈ  రెసిపీ  చదవండి .
కావలసినవి .
బంగాళాదుంపలు  --  రెండు
శనగ పిండి  --   ఒక  కప్పు 
కారం  ---  స్పూను 
మిరియాల పొడి  --  పావు స్పూనుకు  తక్కువగా  
ఇంగువ  ---  కొద్దిగా 
నువ్వుపప్పు  --  స్పూను న్నర
ఉప్పు   --  తగినంత 
నూనె  ---  350  గ్రాములు .

తయారీ  విధానము .
ముందుగా   బంగాళా  దుంపలను  పై  చెక్కు   తీయకుండా  ముక్కలుగా   తరిగి ఒక  గిన్నెలో   తగినన్ని   నీళ్ళు  పోసి  మెత్తగా   ఉడికించుకోవాలి .
చల్లారిన  తర్వాత  పై చెక్కు   తీసుకుని ఒక  గిన్నెలో  వేసి  మెత్తగా   చేసుకోవాలి .
ఆ తర్వాత  అందులో  శనగపిండి , కారం , తగినంత  ఉప్పు , మెత్తని  మిరియాల పొడి , నువ్వు పప్పు మరియు  కొద్దిగా   ఇంగువ  వేసి  తగినన్ని   నీళ్ళు  పోసుకుని   జంతికలు  వేసుకోవటానికి  అనువుగా   కలుపు కోవాలి .
ఆ తర్వాత  స్టౌ మీద  బాండీ  పెట్టి  మొత్తము   నూనె  పోసి  నూనెను  బాగా  కాగనిచ్చి  స్టౌ ను  మీడియం  సెగన  పెట్టి , జంతికల  గొట్టము లో  ఈ  పిండిని  పెట్టి  జంతికలు  లాగా  వేసుకోవాలి .
బంగాళాదుంప   కలిపాము  కనుక  తొందరగా  వేగి పోతాయి .
నల్ల రంగు  రాకుండా  చూసుకుని   వేయించుకోవాలి .
రెండు  రోజుల కన్నా  నిల్వ ఉండవు  కనుక  తక్కువ   మోతాదులో  చేసుకోండి .
అంతే  ఎంతో  మిరియాలు , ఇంగువ , నువ్వు పప్పు రుచితో  తమిళనాడు   Style  జంతికలు  సర్వింగ్   కు  సిద్ధం.

Monday, July 17, 2017

అరటికాయ బంగాళాదుంప వడలు

అరటి కాయ బంగాళదుంప వడలు .
ఆలూరు కృష్ణప్రసాదు

అరటికాయలు  --  రెండు
బంగాళాదుంపలు  --  రెండు
పచ్చిమిరపకాయలు  --  5  చిన్న ముక్కలుగా   తరుగు కోవాలి .
కారం  --   స్పూను 
ఉప్పు  --  తగినంత 
తరిగిన  కరివేపాకు  --  పావు కప్పు
జీలకర్ర  --  పావు  స్పూను 
అల్లం  --  కొద్దిగా   చిన్న  ముక్కలుగా  చేసుకోవాలి . 
బియ్యపు  పిండి  --  అర  కప్పు.

తయారీ  విధానము  .
ముందుగా  అరటి కాయలు  నీళ్ళలో  అడ్డంగా  సగానికి   చెక్కు తీయకుండా  తరగాలి .
బంగాళాదుంప లు  కూడా  అలాగే తరగాలి .
ఈ రెండు  ముక్కలు  మునిగే వరకు  నీళ్ళు పోసి  స్టౌ మీద పెట్టి   ఉడకనివ్వాలి .
ఆ తర్వాత  చల్లారగానే నీళ్ళు  వార్చుకుని  చెక్కు తీసుకుని  ఒక  గిన్నెలో  వేసుకుని  అందులో  ఒక  ఉల్లిపాయ  చిన్న  ముక్కలుగా  తరిగి , జీలకర్ర  ,తరిగిన  పచ్చిమిర్చి , తరిగిన  కరివేపాకు , అల్లం ముక్కలు , బియ్యపు పిండి , కారం , ఉప్పు వేసి    అవసరమైతే  కొద్దిగా   నీళ్ళు  పోసుకుని  వడలు  వేసుకొనుటకు  వీలుగా  కలుపుకోవాలి .
స్టౌ  మీద  బాండీ  పెట్టి    అర  కిలో  నూనె  వేసి  నూనె  బాగా కాగగానే  చేతితో  చిన్న  చిన్న  వడలుగా చేసుకుని  బంగారు  రంగు  వచ్చే వరకు  వేయించుకోవాలి .
అంతే  వేడి  వేడి   అరటి కాయ  మరియు  బంగాళా  దుంప  వడలు  మధ్యాహ్నము  అల్పాహారమునకు  సిద్ధం .

సగ్గుబియ్యం వడలు

సగ్గు బియ్యము వడలు .
ఆలూరు కృష్ణప్రసాదు .

కావలసినవి .

సగ్గుబియ్యం  --  ఒక కప్పు
శనగపిండి  --   ఒక కప్పు
బియ్యపు పిండి  --  ముప్పావు  కప్పు
తరిగిన  కరివేపాకు  --  పావు కప్పు  
తరిగిన  పచ్చిమిర్చి  --  స్పూను న్నర
అల్లం   కొద్దిగా   మెత్తగా  దంచి  అర  స్పూను సిద్ధంగా  ఉంచుకోవాలి . 
జీలకర్ర   -  పావు  స్పూను  
కారం  --   అర స్పూను 
ఉప్పు  --  తగినంత 
నూనె  --  అర కిలో

తయారీ  విధానము .
ఒక  గిన్నెలో  సగ్గుబియ్యం  వేసుకుని  తగినన్ని  నీళ్ళు  పోసుకుని   మూడు  గంటలు  సేపు  నానపెట్టుకోవాలి .
ఆ తర్వాత  ఆ గిన్నెలో  కప్పు  శనగపిండి, ముప్పావు  కప్పు  బియ్యపు  పిండి , తరిగిన  కరివేపాకు  , సన్నగా  తరిగిన  పచ్చిమిర్చి ,  జీలకర్ర  , కొద్దిగా  దంచిన  అల్లం , కారం  మరియు  తగినంత  ఉప్పు వేసి  కొద్దిగా   నీళ్ళు పోసుకుని  పిండిని  వడలు  వేసే  విధంగా  కలుపుకోవాలి .
ఆ  తర్వాత  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తము   నూనె  వేసి  నూనె  బాగా కాగగానే   పిండిని  చిన్న  చిన్న  వడల్లా  చేతితో  తట్టి   వేసుకోవాలి .
అంతే  ఎంతో  రుచిగా  ఉండే  సగ్గు బియ్యము  వడలు  అల్పాహారమునకు  సిద్ధం.

Tuesday, July 11, 2017

గట్టి పకోడీలు

గట్టి  పకోడీలు  .
                                                                              ఆలూరు కృష్ణప్రసాదు

పకోడీలు  అందరూ  పలు  విధాలుగా   చేస్తారు  .
మెత్తని  పకోడీలు  , గట్టి పకోడీలు ,  ఉల్లిపాయ  పకోడీలు , కాలీ ఫ్లవర్  పకోడీలు ఇలా  రక రకాలుగా  చేస్తారు .
శనగ పిండి  మరియు  బియ్యపు  పిండి  పాళ్ళలో   తేడా ననుసరించి  గట్టి  పకోడీలు  మరియు  మెత్తని  పకోడీలు  చేసుకోవచ్చును .
ఈ  మధ్య  మెత్తని  పకోడీలు  గురించి  వివరించాను.
అవి  ఒక రోజు  మాత్రమే  నిల్వ  ఉంటాయి .
గట్టి  పకోడీలు  మూడు  నాలుగు   రోజులు  నిల్వ ఉంటాయి .
గట్టి  పకోడీలు  తయారీ  విధానము  .
కావలసినవి .
శనగపిండి  --   ఒక  కప్పు 
బియ్యపు  పిండి  --  పావు  కప్పు
ఉల్లిపాయలు  --  4
పచ్చిమిర్చి   --  8
కారం  --  స్పూను
ఉప్పు  --  తగినంత 
తరిగిన  కరివేపాకు  --  పావు కప్పు .
నూనె   --  అర  కిలో

తయారీ  విధానము  .
ముందుగా   ఉల్లిపాయలు  నిలువుగా   తరుగుకోవాలి .
పచ్చిమిర్చి  సన్నగా   ముక్కలుగా  తరుగుకోవాలి .
ఒక  బేసిన్  లో  తరిగిన   ఉల్లిపాయలు , పచ్చి మిర్చి  ముక్కలు , తగినంత  ఉప్పు , కారం  మరియు తరిగిన  కరివేపాకు  వేసి  చేతితో  బాగా  మెత్తగా  కలపాలి  .
బాగా  తడిగా  కొంచెం   నీరు  నీరుగా  వస్తుంది .
అందులో  శనగపిండి  మరియు  బియ్యపు పిండి  వేసుకుని   కొద్దిగా   నీళ్ళు పోసుకుంటూ  గట్టిగా   పకోడీలు వేసుకోవడానికి  వీలుగా  కలుపుకోవాలి .
తర్వాత  స్టౌ  మీద  బాండీ పెట్టి  మొత్తం  నూనె  పోసి  నూనె  బాగా  కాగగానే   చిన్న  చిన్న  పకోడీలు  లాగా  వేసి  ఎరుపు  రంగు  వచ్చే దాకా  వేయించుకోవాలి .
అంతే  గట్టి  పకోడీలు  అల్పాహారమునకు  సిద్ధం ,

Wednesday, July 5, 2017

ఉండ్రాళ్ళు


ఉండ్రాళ్ళు
ఆలూరు కృష్ణప్రసాదు .

కావాల్సిన పదార్ధాలు ;-

బియ్యపురవ్వ -- ఒకటిన్నర గ్లాసు
సెనగపప్పు -- పావుగ్లాసు
ఉప్పు -- ఒకటిన్నర టీ స్పూన్స్
నీళ్ళు -- ముడు గ్లాసులు
జీలకర్ర -- స్పూను 

తయారు చేసేవిధానం ;---
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో మూడు గ్లాసుల నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలి . 
ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో స్పూను జీలకర్ర మరియు పావు గ్లాసు పచ్చి శనగపప్పు వేసి రెండు పొంగులు రానివ్వాలి . 
ఇప్పుడు పొంగుతున్న నీళ్ళలో ఉప్పు వేసి మళ్ళి ఒక పొంగు రానిచ్చి బియ్యపురవ్వను పోసి ఉండ కట్టకుండా దగ్గర పడేదాకా కలిపి మూత పెట్టాలి. 
ఒక ఐదు నిముషాల తరువాత మూత తీసి రవ్వ మెత్తగా వుడికిందో లేదో చూడాలి . ఉడికిన రవ్వను స్టవ్ మిద నుంచి దించేసి బాగా చల్లార నివ్వాలి . 
ఇప్పుడు చల్లారిన రవ్వను ఉండలుగా చేసి ఒక గిన్నెలో పెట్టి ఆవిరి మీద ఒక్క పదినిముషాలు ఉడక నివ్వాలి ...
అంతే ఎంతో ప్రీతి పాత్రమైన ఉండ్రాళ్ళు రెడీ ..........
ఈ ఉండ్రాళ్ళు కొత్తిమీర చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి .

Sunday, July 2, 2017

పల్లీ పకోడీలు

పల్లీ  పకోడీలు .
ఆలూరు కృష్ణప్రసాదు .

తయారీ  విధానము .
ఒక కప్పు పల్లీలు  పొట్టు తోనే  మూడు గంటలు  తగినన్ని  నీళ్ళు పోసి  నానబెట్టు కోవాలి .
ఆ తర్వాత  మిక్సీ లో  కచ్చా  పచ్చాగా  వేసుకోవాలి .
అందులో  ఒక  కప్పు  శనగపిండి  , రెండు  స్పూన్లు  బియ్యపు  పిండి , స్పూను   జీలకర్ర  , స్పూనున్నర   తరిగిన  అల్లం ముక్కలు , కొద్దిగా   తరిగిన  కరివేపాకు  ,కొద్దిగా  తరిగిన   కొత్తిమీర  , స్పూను   కారం ,  తగినంత  ఉప్పు  , చిటికెడు   సోడా  ఉప్పు  వేసి కొద్దిగా   నీళ్ళు  పోసుకుంటూ  గట్టిగా   కలుపు కోవాలి .
ఆ  తర్వాత  స్టౌ  మీద  బాండి  పెట్టుకుని  అర  కె. జి  .  నూనె  పోసుకుని   నూనె  బాగా  కాగగానే  పకోడీలు  వేసుకొని  బంగారు  రంగు  రాగానే  తీసుకోవాలి .
అంతే  వేడి  వేడి  పల్లీ  పకోడీలు   మధ్యాహ్నము   టిఫిన్  కు  సిద్ధం .

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి