Showing posts with label ఊరగాయలు. Show all posts
Showing posts with label ఊరగాయలు. Show all posts

Tuesday, May 12, 2020

మెంతికాయ

ఆలూరుకృష్ణప్రసాదు .

మెంతికాయ.  (  మెంతి  ఆవకాయ  )

ఏడాది  నిల్వ  ఊరగాయ .

కావలసినవి.

మామిడి కాయలు  -25.  కాయలు పుల్లగా, గట్టిగా మరియు  పీచుండాలి.

బాగా కడిగి  శుభ్రంగా  పొడి గుడ్డతో  తుడుచుకుని ఒక గంట సేపు  నీడన ఆరబెట్టి కాయల పైన  చెక్కుతీసుకుని , ఆవకాయకు ముక్కలు ఏ విధముగా  లోపలి  టెంకతో తరుగుతామో అదే విధముగా  తరుగుకోవాలి. 

ముక్కల లోపల  జీడి మరియు టెంక పైన పైపొరను  తీసి వేసుకోవాలి.

కొంతమంది పై  చెక్కుతో సహా  ముక్కలను  తరుగుతారు. ఆ విధముగా  ముక్కలు  తరిగినా  ఊరగాయ బాగానే  ఉంటుంది .

తర్వాత షుమారుగా  150  గ్రాములు  పట్టే  ఒక గ్లాసును  కొలతగా  పెట్టుకోండి.

ఆ గ్లాసు  కొలత  ప్రకారం ***

1/2 గ్లాసు - మెంతులు. షుమారు  75 గ్రాములు.
1 గ్లాసు - ఆవాలు. షుమారు 150 గ్రాములు.
4 గ్లాసుల కారం -  షుమారుగా 600 గ్రాములు.
మెత్తని ఉప్పు -  నాలుగు  గ్లాసులు. షుమారుగా - 600  గ్రాములు.
నూనె  -  A . S . Brand  పప్పు  నూనె  -
              ఒక  K. G.
ఇంగువ  -  మెత్తని  పొడి  స్పూనున్నర .

తయారీ  విధానము .

ముందుగా  స్టౌ మీద బాండీ పెట్టి  నూనె వేయకుండా  మెంతులు, ఆవాలు  విడివిడిగా  వేయించి చల్లారిన తర్వాత మెత్తని పొడిగా చేసుకోవాలి. ఆ పొడిని  విడి విడిగా ఉంచుకోవాలి.

మెంతులు బాగా  కాఫీపొడి రంగు వచ్చే దాకా వేయించుకోవాలి.

మెంతులు  సరిగా  వేగక పోతే  ఊరగాయ  చేదు  వస్తుంది. 

తర్వాత ఒక  పెద్ద  పళ్ళెము లో మొత్తము   కారం  వేసుకుని , ఈ రెండూ అనగా ఆవపొడి  మరియు మెంతి పొడి కూడా  వేసుకుని  చేతితో  బాగా కలుపుకోవాలి.

అందులోనే  తరిగిన  మామిడి కాయ ముక్కలు , మొత్తము పసుపు , మొత్తము  ఉప్పు  మరియు రెండు గరిటెలు  కాచి  చల్లార్చిన  నూనెను  వేసుకుని  చేతితో  బాగా  కలుపుకోవాలి. 

ఈ  విధముగా  కలిపిన  ముక్కలను ఒక  జాడీలో  వేసుకుని  మూత పెట్టి  మూడు రోజులు  ఊర నివ్వాలి.

మూడు రోజుల తర్వాత  జాడీ లోని  ముక్కలను  చేతితో  బాగా  కలుపుకుని  ముక్కలను  ఊటను  జాడి లోనే  ఉంచి ,  ముక్కలను మాత్రము ఒక పళ్ళెము లో వేసుకుని  ఒక రోజంతా ముక్కలను బాగా  ఎండ బెట్టు కోవాలి.

ముక్కలు  ఎండిన  తర్వాత ***

స్టౌ మీద బాండీ పెట్టి  మిగిలిన మొత్తము  నూనెను  పోసుకుని నూనెను  బాగా కాగనివ్వాలి.

నూనె బాగా కాగిన తర్వాత అందులో మొత్తము ఇంగువ వేసి నూనెను బాగా చల్లారనివ్వాలి.

నూనె  బాగా  చల్లారిన  తర్వాత ***

ఎండిన ముక్కలను మరియు జాడీలోని ఊటను  ఒక  పళ్ళెములో పోసుకుని చేతితో  బాగా కలుపుకుని అందులో  ఈ చల్లారిన  నూనెను  పోసుకుని  తిరిగి   చేతితో  బాగా కలుపుకుని  జాడీలో  పెట్టుకోవాలి.

మామిడికాయల సైజు మారుతూ ఉంటుంది కనుక, కలిపేటప్పుడు ముక్కల్ని బట్టి అవసరమైతే కాస్త గుండ మరియు  ఉప్పు తగ్గితే  మరి కాస్త ఉప్పు  చూసుకుని  వేసుకోవాలి.

అంతే. ఎంతో  రుచిగా  ఉండే  ఏడాది  ఊరగాయ  మెంతికాయ  (  మెంతి  ఆవకాయ )  సిద్ధం.

ఈ మెంతి ఆవకాయ  లో మెంతి పిండి కలుస్తుంది  కనుక  మామూలు ఆవకాయ  మాదిరిగా  వేడి చేయదని  పెద్దలు చెబుతారు.

సంబంధించిన  రెసిపీ  మేము  ఈ  ఊరగాయ  తయారు చేయు  విధానము  మరియు  ఫోటోలు  తయారు చేయు సమయమున  తీసినవి.
ఆలూరుకృష్ణప్రసాదు .
జత పరచిన  ఫోటోలు .

1.  పళ్ళెములో  ఎండిన  తర్వాత  మెంతికాయ  ముక్కలు.

2 . ముక్కలు  ఎండిన తర్వాత ఊట మరియు  కాచిన ఇంగువ  నూనె పోసి  కలిపిన  మెంతి  ఆవకాయ.

3. మెంతి ఆవకాయ  కలిపిన  తర్వాత  జాడీ లోకి  వెళ్ళబోతున్న  మెంతి ఆవకాయ  ఊరగాయ.

Sunday, April 19, 2020

నిమ్మకాయ ఊరగాయ

నిమ్మకాయ  ఊరగాయ.
ఆలూరుకృష్ణప్రసాదు .
కావలసినవి.

గుండ్రని పసుపు పచ్చని ,  పై తొక్క పలుచగా ఉన్న నిమ్మకాయలు -     20

పసుపు  -  స్పూనున్నర 

మెత్తని ఉప్పు  -   షుమారుగా  150 గ్రాములు.

కారం   -  షుమారుగా  125  గ్రాములు.

మెంతి పిండి  - రెండున్నర  స్పూన్లు .

(  30  గ్రాముల మెంతులను  బాండీలో నూనె  వేయకుండా  బాగా  వేయించి  చల్లారిన తర్వాత  మిక్సీ లో  మెత్తని  పొడిగా  వేసుకుని  ఒక సీసాలో  వేసుకోవాలి. ) ఈ పొడి  మరో రెండు మూడుసార్లకు  వస్తుంది.

తయారీ విధానము.

ముందుగా  నిమ్మ కాయలు  తడి గుడ్డతో  శుభ్రంగా  తుడుచుకుని ఓ పది నిముషాలు  నీడన  ఆర  నివ్వాలి.

అందులో  15  నిమ్మ కాయలు ముక్కలుగా తరుగు కోవాలి.

ఒక అయిదు  నిమ్మ కాయలు  రసం ఒక  గిన్నెలో  వేరుగా తీసుకోవాలి .

ఒక  బేసిన్ లో తరిగిన  నిమ్మకాయ ముక్కలు మరియు  విడిగా గిన్నెలోకి తీసిన నిమ్మరసం ముక్కలలో పోసుకోవాలి.

అందులో  పసుపు  మరియు  మొత్తము  ఉప్పును వేసుకుని  చేతితో  బాగా కలుపు కోవాలి.

దీనిని  ఒక జాడిలోకి  తీసుకోవాలి . మూడు రోజులు  కదపకుండా  ఉంచాలి.

నాలుగవ రోజు ఉదయం  ఒకసారి జాడీ లోని  ముక్కలను చేతితో బాగా కలుపుకుని ,  ఒక్కొక్క  ముక్కలోని రసము జాడిలోనే  చేతితో  పిండు కోవాలి.

ఆ విధముగా  పిండిన  ముక్కల లోని గింజలను  మరియు  జాడీ లోని  రసము లోని గింజలను  పూర్తిగా చేతితో తీసి వేసుకుని గింజలను  పడెయ్యాలి.

రసము పిండిన  ముక్కలను  ఒక పళ్ళెము  లో వేసుకుని  ఎర్రని  ఎండలో  రెండు రోజులు  ఎండబెట్టుకోవాలి. రసమును  ఎండ బెట్టవలసిన అవసరము లేదు.

ఆ విధముగా  ముక్కలను ఎండబెట్టడం వలన  ముక్కల పై తొక్క లోని  చేదు పోతుంది .

రెండు రోజులు  ముక్కలు  ఎండిన తర్వాత  ఒక బెసిన్ లో జాడీ లోని రసము  మొత్తమును  పోసుకోవాలి.

ఆ తర్వాత ఎండబెట్టిన  ముక్కలను  కూడా  రసములో  పోయాలి.

ఇప్పుడు  రెండు  పద్ధతులలో  ఈ నిమ్మకాయ ఊరగాయ వాడుకొనవచ్చును .

మొదటి  పద్ధతి.

 మొత్తము పచ్చడిలో   కారము మరియు  రెండున్నర  స్పూన్లు  మెంతి పిండి  వేసుకుని  చేతితో  బాగా  కలుపుకోవాలి.

ఆ తర్వాత  మొత్తము  పచ్చడిని  ఒక జాడీ లోకి  తీసుకోవాలి .

కావలసినప్పుడు  ఒక  ముప్పావు కప్పు  పచ్చడి తీసుకుని   అందులో  పోపు పెట్టుకుని వాడుకొనవచ్చును .

పోపు  వేయు  విధానము .

స్టౌ మీద పోపు గరిటె  పెట్టుకుని  మూడు  స్పూన్లు  నూనె వేసుకుని , నూనె బాగా కాగగానే  నాలుగు  ఎండుమిరపకాయలు , పావు స్పూన్లులో  సగం మెంతులు , అర స్పూను ఆవాలు మరియు  కొద్దిగా  ఇంగువ వేసుకుని  వాడుకొనవచ్చును .

రెండవ పద్ధతి.

అసలు  కారము  మెంతి పిండి  కలపకుండా  ఎండిన ముక్కలు  రసము  కలిపిన  తర్వాత  జాడీ లోకి  తీసుకోవాలి.

కావలసినప్పుడు  ఒక ముప్పావు  కప్పు  పచ్చడి  విడిగా  తీసుకుని  అందులో  రెండు  స్పూన్లు  కారము మరియు అర స్పూను  మెంతి పిండిని  వేసుకుని  స్పూనుతో బాగా కలుపుకోవాలి.

ఇందులో  పోపు  మొదట  చెప్పిన  పద్ధతిలో  ప్రకారము  వేసుకొనవచ్చును .

ఈ నిమ్మకాయ  ఊరగాయ  వేడి వేడి అన్నంలో నెయ్యి  వేసుకుని కలుపుకుని తింటే చాలా రుచిగా  ఉంటుంది.

వేడి వేడి  అన్నంలో నెయ్యి వేసుకుని  ముద్ద పప్పు కలుపుకుని  ఈ నిమ్మకాయ ఊరగాయ నంచుకుని  తింటే  కూడా  చాలా రుచిగా  ఉంటుంది.

అంతే. ఇడ్లీలు , దోశెలు , గారెలు , చపాతీలు  మరియు భోజనము లోకి  ఎంతో రుచిగా ఉండే  నిమ్మకాయ ఊరగాయ  సర్వింగ్  కు సిద్ధం.

ఈ ఊరగాయ  ఖచ్చితంగా   నాలుగు నెలలు  తాజాగా   రుచిగా  ఉంటుంది .

నిమ్మకాయ ఊరగాయ  ముక్కలు  మరియు రసములో  కొంతమంది  పచ్చిమిర్చి  మరియు  అల్లం  ముక్కలు  వేసుకుంటారు.

కారం కలిపి పోపు  పెట్టిన తర్వాత  ఈ అల్లం  ముక్కలు  మరియు పచ్చిమిర్చి  పెరుగు అన్నంలో  నంచుకోవడానికి  చాలా రుచిగా ఉంటాయని అంటారు.

మీకు  ఇష్టమైన యెడల  ఆ విధముగా  వేసుకొనవచ్చును .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారు చేయు  విధానము  మరియు  ఫోటో  తయారుచేయు  సమయమున  తీసినది.

Thursday, April 16, 2020

బెల్లం‌ ఆవకాయ

ఆంధ్రా స్పెషల్ - బెల్లం  ఆవకాయ.

ఆలూరుకృష్ణప్రసాదు

 శ్రీకాకుళం , విజయనగరం , విశాఖపట్టణం , తూర్పు గోదావరి మరియు  పశ్చిమ  గోదావరి జిల్లాల వారు  ఈ బెల్లం ఆవకాయ ఏడాది నిల్వ ఊరగాయను ఎక్కువ మంది  పెట్టుకుంటారు.

మిగిలిన ఆంధ్ర ప్రాంతం వారు చాలా తక్కువగా  పెట్టుకుంటారు.

మేము  ఆవకాయ , మాగాయలతో పాటుగా  ఈ బెల్లం  ఆవకాయను ప్రతి సంవత్సరం  తప్పనిసరిగా  పెట్టుకుంటాం.

నా ఊహ తెలిసినప్పటి నుండి  అంటే  షుమారు 60 సంవత్సరాల  పై నుండీ  మా ఇంట్లో  తప్పనిసరిగా  బెల్లం  ఆవకాయను ప్రతి సంవత్సరం పెట్టుకుంటాము.
ఈ బెల్లం  ఆవకాయ నిక్షేపంగా  ఏడాదిన్నర కూడా నిల్వ ఉంటుంది.

అందుకు ప్రధాన కారణం  మూడు రోజులు ఈ బెల్లం  ఆవకాయను ఎర్రటి  ఎండలో పెడతాము . అందువలన  ఈ బెల్లం ఆవకాయ పాడవదు.

చాలామంది  పై తెలిపిన ప్రాంతాల వారు కాకుండా  ఇతర ప్రాంతాల వారు , దాని రుచి తెలియని వారు " ఆవకాయ లో బెల్లం  ఏమిటి ? " అని మొహం చిట్లిస్తారు. అలా అనే వారు ఈ ఆవకాయ రుచి చూడని వారు మాత్రమే అని  నా అభిప్రాయం.

మేం గుంటూరు జిల్లా లో ఉన్నా ,   మేం తప్పనిసరిగా  ప్రతి సంవత్సరం  పెట్టుకుంటాం కనుక  , మా అన్నదమ్ముల స్నేహితులు , మా ఇరుగు పొరుగు  చుట్టు ప్రక్కల వారు  అందరికీ  మా వల్ల ఈ బెల్లం ఆవకాయ  అలవాటు  చేసాము. వారందరికీ  ఎంతో నచ్చింది.

ప్రతి ఏడు మా అమ్మని ప్రత్యేకంగా  అడిగి  కనీసం ఒక చిన్న హార్లిక్స్  సీసాడు  బెల్లం ఆవకాయ పట్టుకు వెడతారు.

ప్రస్తుతం  మేము తెనాలి లో ఉంటున్నాం కనుక మేము బెల్లం  ఆవకాయ పెట్టుకుంటాం అని తెలిసిన మా స్నేహితులందరూ ప్రత్యేకంగా  అడిగి  మరీ  ఒక చిన్న హార్లిక్స్ సీసాడు బెల్లం  ఆవకాయ పట్టుకుని వెడతారు. తిన్నారా ఎలా ఉంది ? అని అడిగితే " మేము ఇద్దరం  తింటే అయిపోతుంది కదండీ. బెంగుళూరులో ఉంటున్న మా అబ్బాయికి  మీ బెల్లం  ఆవకాయ చాలా ఇష్టం. అందువల్ల వాడికి  పంపాము " అని అంటారు.

ఇదంతా నేను ఎందుకు  చెబుతున్నానంటే  తినని వాళ్ళకు , తినడానికి  ఇష్ట పడని వాళ్ళకే ఈ బెల్లం ఆవకాయ నచ్చదు. ఒకసారి తిని దాని రుచి తెలుసుకున్న వాళ్ళు ఏ ప్రాంతం వారయినా  తినకుండా  ఉండలేరు.

మా చిన్నతనంలో  మా అమ్మ  రెండు పెద్ద జాడీల నిండా అంటే షుమారు ఓ 50 మామిడి కాయలతో ఈ బెల్లం ఆవకాయ పెట్టేది. అమ్మది  భారీ చెయ్యి. పెట్టిన నాలుగో రోజు నుండి  మూడు రోజులు మేడ మీద ఎండలో  పెట్టేది.

మా స్నేహితులు , మా అన్నదమ్ముల స్నేహితులు  మాతో ఆడుకోవడాని కనే మిషతో  మా ఇంటికి  వచ్చి మేడ మీద జాడీ లో  ఎండ బెట్టిన బెల్లం  ఆవకాయ ముక్కలను చేతితో తీసుకుని  ' హాంఫట్ హాంఫట్ ' అంటూ తినేసేవారు. మా అమ్మకు  తర్వాత తెలిసి  ' ఏ చేతులతో పడితే ఆ చేతులతో  ఆవకాయలు ముట్టుకోకూడదు. ఏడాది పచ్చళ్ళు పాడవుతాయి ' అని కోప్పడేదనుకోండి. ఇవి మా గుంటూరు జిల్లాలో మాఅందరికీ మా స్నేహితులతో  ఈ బెల్లం ఆవకాయ మధుర జ్ఞాపకములు.

ఇక  అసలు విషయానికి  వద్దాము.

బెల్లం ఆవకాయ.
************

మేము మరియు లోగడ మా అమ్మమ్మ మరియు  కాకినాడ  లో ఉన్న మా బంధువులు  అందరూ ఈ బెల్లం  ఆవకాయ పెట్టుకోవడానికి  కలెక్టరు మామిడి / చిత్తూరు మామిడి / తోతాపురి (  ఈ మూడు పేర్లు  ఒకటే కాయ )  కాయనే  వాడతారు. ప్రధాన కారణం  ఈ బెల్లం  ఆవకాయ పెట్టుకోవడానికి  ఈ కాయ బాగుంటుందనే వారు.

ఈ చిత్తూరు మామిడి కాయ లేత కాయ కాకుండా  బాగా తయారయ్యి లోపల టెంక మరియు పీచు ఉన్న కాయలనే ఎంచుకునే వారు. కాయ అసలు పండకుండా బాగా గట్టిగా ఉండాలి.

అలాగే  బెల్లం  ఆవకాయలో వాడే బెల్లం  కూడా  మామూలుగా  మనం ఇళ్ళల్లో  వాడే బెల్లం  కాకుండా , మేము కాకినాడ  ప్రాంతం వారమే కాబట్టి  షుమారు నెలరోజుల ముందే అంటే  కాయ రాకముందే ప్రత్యేకంగా  ' బూరుగు పల్లి '  బెల్లం  ఒక మూడు కిలోలు  తెప్పించుకునే వారము . కాకినాడ పెద్ద మార్కెట్ దగ్గర  కల  పచారీ  షాపులలో  బెల్లం ఆవకాయకు  బూరుగు పల్లి బెల్లం  కావాలని  అడిగితే  ఇచ్చే వారు.

ఇప్పుడు  తెనాలిలో ఉన్నా  ప్రతి సంవత్సరం  బెల్లం  ఆవకాయ కోసం కాకినాడ  నుంచి  బంధువుల ద్వారా బూరుగపల్లి బెల్లం తెప్పించుకుంటాము.

కావలసినవి.

చిత్తూరు  మామిడి  కాయలు  -  10  కాయలు.
( షుమారుగా  రెండున్నర  కిలోల ముక్కలు వస్తాయి . )

బూరుగు పల్లి  బెల్లం  లేదా  దొరకనిచో మామూలు బెల్లం  --  ఒక  కిలో లేదా కిలోం పావు  బెల్లం తీసుకుని  రోటిలో దంపుకుని ఒక కిలో బెల్లం పొడి వచ్చే విధముగా  సిద్ధం చేసుకోవాలి.

కారము , ఉప్పు , ఆవపిండి - మూడు కలిపి   --  ఒక కిలో.

ఇందులో  -

కారము  -  400 గ్రాములు.
ఆవపిండి - 350 గ్రాములు.
మెత్తని ఉప్పు - 250 గ్రాములు.
( అయోడైజ్డ్  కానిది . )

ఈ మూడు పైన తెలిపిన పాళ్ళలో తీసుకుని  ఒక బేసిన్  లో వేసుకుని  చేతితో  బాగా కలుపుకొని  విడిగా  ఒక  జాడీలో కాని జార్ లో కాని పోసుకుని  సిద్ధంగా  ఉంచుకోవాలి.

పసుపు  -  స్పూనున్నర .

మెంతులు  -  స్పూనున్నర .

చింతపండు  -  నిమ్మకాయంత  తీసుకుని శుభ్రం  చేసుకుని , గింజలను  తీసి వేసి విడదీసుకుని  రోటిలో  తొక్కి చిన్న చిన్న బిళ్ళలుగా చేసుకోవాలి.

బెల్లం  ఆవకాయ సిద్ధ మయ్యాక   --

పోపునకు  --

సామర్లకోట  A . S . Brand నువ్వు పప్పు నూనె  -  పావు కిలో.

ఎండుమిరపకాయలు  - 12

వెల్లుల్లి  పాయలు  -  150 గ్రాములు.

వెల్లుల్లి పాయలు  విడదీసి  రెబ్బలు మీద పొట్టు అంతా  తీసుకుని   సిద్ధం చేసుకోవాలి. 

ఆవాలు  --  రెండు  స్పూన్లు .

తయారీ విధానము.

బాగా తయారయ్యి  టెంక  పట్టి  అసలు పండకుండా గట్టిగా  ఉన్న చిత్తూరు మామిడి  కాయలు  ఒక  పది కాయలు తీసుకోవాలి.

వాటిని ఒక  టబ్ లో నీటిలో వేసుకుని  ఒక  అరగంట సేపు నీటిలో నాన నివ్వాలి.

తర్వాత  ఒక్కొక్క  కాయను తీసుకుని  పొడిగా  గుడ్డతో కాయలను శుభ్రంగా తుడుచు కోవాలి. మరో అరగంట సేపు కాయలను  పొడిగా  ఆర నివ్వాలి.

తర్వాత  మామిడి  కాయల మీద ఉన్న చెక్కును పీలర్ తో కాని  లేదా కత్తి పీటతో కాని లేదా ఆల్ చిప్పతో కాని తీసుకోవాలి . మొత్తము  అన్ని కాయల మీద పై చెక్కును తీసుకోవాలి .

ముందు కాయను మధ్యలో సగానికి  తరుకుని  టెంకలోని పై పొట్టు తీసి వేయాలి. ఇలా అన్ని కాయలకు  తీసి వేయాలి.

తర్వాత  మామూలుగా  ఆవకాయ పెట్టడానికి  ముక్కలు ఏ విధముగా  తరుగుతామో  అదే విధముగా  ప్రతి ముక్క పైన టెంక వచ్చే విధముగా  ముక్కలను తరుగు కోవాలి.

ఇప్పుడు  ఒక పెద్ద బేసిన్ తీసుకుని  తరిగి  సిద్ధంగా  ఉంచుకున్న  మామిడి  కాయ ముక్కలను  బేసిన్ లో వేసుకోవాలి.

అందులో స్పూనున్నర  పసుపు వేసుకుని ముక్కలకు పట్టే  విధముగా  బాగా కలుపు కోవాలి.

కారం , ఆవపిండి  మరియు  ఉప్పు  ఈ మూడు కలిపి  సిద్ధంగా  ఉంచుకున్న  కిలో గుండను  మరియు  స్పూనున్నర  మెంతులు  ముక్కలలో వేసుకుని గుండ ముక్కలకు పట్టే విధముగా  బాగా కలుపు కోవాలి.

ఇప్పుడు సిద్ధంగా  ఉంచుకున్న  ఒక  కిలో బెల్లం  పొడి  మరియు చిన్న చిన్న బిళ్ళలను చేసి సిద్ధంగా  ఉంచుకున్న  చింతపండును కూడా  అందులో వేసి చేతితో బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు  ఈ కలిపిన మిశ్రమము మరియు ముక్కలు  మొత్తము  ఒక  పెద్ద జాడీలో పెట్టుకుని  గట్టిగా  మూత పెట్టుకోవాలి.  ఒక ప్రక్కన కదపకుండా  పూర్తిగా  మూడు రోజులు  ఉంచాలి.

ఇలా  ఉంచడం బెల్లం  మరియు ముక్కలకు  ఆవకాయలో తడి బాగా  వస్తుంది.

పూర్తిగా  మూడు రోజులు  కదపకుండా  ఉన్న  పిదప  నాలుగవ  రోజు ఆవకాయను  చెక్క గరిటె తో బాగా కలుపు కోవాలి.

ఈ బెల్లం  ఆవకాయ  అంతా  ఒకటి లేదా రెండు  బేసిన్  లలో  పోసుకుని  ఉదయం  9 గంటల నుండి  సాయంత్రం  5  గంటల  వరకు  పూర్తిగా  మూడు రోజులు ఎర్రటి  ఎండలో  పెట్టాలి. ప్రతి రోజు ఎండలో నుండి తెచ్చాక చెక్క గరిటెతో ఆవకాయ  బాగా కలుపు తుండాలి.

ఇలా  పూర్తిగా  మూడు రోజులు  ఎండబెట్టినందువలన  పచ్చడి  లోని పాకం పూర్తిగా  గట్టి పడుతుంది. ఆవకాయ లోని  తడి అంతా  పోతుంది. ప్రతి ముక్కకు  తీపి  కారము మొత్తము  సమంగా పట్టుకుంటాయి.  పచ్చడి  పూర్తిగా  దగ్గర  పడుతుంది.

మీరు కొద్దిగా  ఆవకాయ పెట్టుకున్నా  లేదా  ఎండలు  విపరీతంగా  ఉన్నా  ఆవకాయ రెండు  రోజులు ఎండబెట్టితే  సరిపోతుంది .  అటువంటప్పుడు  మరీ ఎక్కువగా  ఎండితే  ఆవకాయ మరీ  ఎండి పోయి  పిడస కట్టినట్లుగా  అయి పోతుంది. మీరు మాత్రం ఈ విషయము  జాగ్రత్తగా   గమనించుకోవాలి.

పూర్తిగా  మూడు రోజులు  ఎండ బెట్టిన తర్వాత  ఆ రోజు  సాయంత్రం బెల్లం  ఆవకాయ లో  పోపు పెట్టుకోవాలి.

ఒక  వెల్లుల్లి  వేసి పోపు పెడితే  బెల్లం  ఆవకాయ ని అంటారని , వెల్లుల్లి తో పాటుగా  ఎండుమిరపకాయలు  , ఆవాలు మరియు కరివేపాకును  వేసి పోపు పెడితే  దప్పళపు ఆవకాయ  అంటారని  మా అమ్మమ్మ  వాళ్ళు చెప్పారు.

ఇక మూడవ రోజు  సాయంత్రం  ఎండలో నుండి  తెచ్చిన  బెల్లం  ఆవకాయలో  పోపు  పెట్టుకునే  విధానము.

స్టౌ  మీద  బాండి  పెట్టి  మొత్తము  పావు కిలో  పప్పు నూనెను  బాండీలో పోయాలి.

బాండిలో నూనె బాగా కాగగానే  తొడిమలు  తీసిన  ఎండుమిరపకాయలు , ఆవాలు  మరియు కరివేపాకును  వేసి పోపును వేగ నివ్వాలి.  అందులోనే  ఒలిచి  సిద్ధంగా  ఉంచుకున్న  వెల్లుల్లి పాయలు కూడా  వేసుకుని  వెల్లుల్లి  పాయలు  బంగారు రంగులో  వచ్చే వరకు  వేయించు కోవాలి.

ఈ వేగిన  పోపును  వేడిగానే  బెల్లం  ఆవకాయ లో  వేసుకుని  చెక్క గరిటెతో  బాగా కలుపు కోవాలి.

చల్లారగానే  తిరిగి  జాడీలోనికి  తీసుకుని  జాడి పైన  వాసిన కట్టుకుని  భద్రపరుచుకోవాలి.

కావలసినప్పుడు   చిన్న జాడీల లోకి తీసుకుని   వాడుకొనవచ్చును .

అంతే. ఇడ్లీల లోకి , దోశెల లోకి , గారెల లోకి , రోటీల లోకి , చపాతీల లోకి  మరియు  భోజనము  లోకి  అద్భుతమైన  రుచిగా  ఉండే  బెల్లం  ఆవకాయ  సర్వింగ్  కు  సిద్ధం.

సంబంధించిన  రెసిపీ మేము  తయారుచేయు  విధానము  మరియు ఫోటోలు  తయారుచేయు  సమయమున తీసినది.
ఆలూరుకృష్ణప్రసాదు .
ముఖ్య గమనిక  --

మేము ఈ బెల్లం ఆవకాయకు  మామిడి కాయల  పై  చెక్కు తీస్తాము.
మీరు  కావాలిస్తే  పై చెక్కు తో ముక్కలు తరుగు కోవచ్చును.

మేము  చిత్తూరు  మామిడి కాయలతోనే  ఈ బెల్లం  ఆవకాయ పెడతాము.
మీరు  మామూలుగా  ఆవకాయ పెట్టే కాయలతో  కూడా  బెల్లం  ఆవకాయ పెట్టుకోవచ్చును .

మేము  బూరుగు పల్లి  బెల్లమే  బెల్లపు  ఆవకాయ  తయారు చేయడానికి  వాడతాము.
మీరు మీకు మార్కెట్లో  దొరికే  ఏ రకమైన బెల్లంతో నైనా  బెల్లం ఆవకాయ పెట్టుకోవచ్చును .

మేము  ఈ బెల్లం  ఆవకాయలో  వెల్లుల్లి  పాయలు  వేసుకుంటాము .
మీరు వెల్లుల్లి  వేయకుండా  బెల్లం  ఆవకాయ పెట్టుకోవచ్చును .

మేము  ఈ బెల్లం  ఆవకాయలో  ఇంగువ  వేసుకోము.
మీరు కావాలనుకుంటే  ఇంగువ  వేసుకోవచ్చును.

Monday, July 9, 2018

పండుమిరపకాయలతో ఊరగాయ

ఆలూరుకృష్ణప్రసాదు .

పండుమిరపకాయలతో ఊరగాయ.

తయారీ విధానము .

పండు మిరపకాయలు  - 15
శుభ్రంగా తడి గుడ్డతో  తుడుచుకుని , దాని పై తొడిమలు  తీసి వేసి  ఒక అరగంట సేపు  ఆర పెట్టుకోవాలి .

వాటి మధ్యలో గాటు పెట్టుకుని  పూర్తిగా  గింజలను  తొలగించి , ఆ గింజలను  వేరేగా  ప్లేటులో  తీసుకోవాలి .

రెండు స్పూన్లు  ఆవాలు , రెండు స్పూన్లు  మెంతులు , రెండు  స్పూన్లు  సోంపు  తీసుకుని  బాండీలో  నూనె లేకుండా  దోరగా  వేయించుకోవాలి .

ఆ తర్వాత  మిక్సీ లో మెత్తగా  వేసుకోవాలి .

ఒక  ప్లేటులో  ఈ పొడిని , విడిగా  తీసి ఉంచుకున్న  గింజలను , స్పూను పసుపు , స్పూనున్నర  ఉప్పు ,ఆరు స్పూన్లు  నూనె వేసి  చేత్తో  బాగా  కలుపుకోవాలి .

అందులో రెండు కాయల   నిమ్మరసం  పిండుకుని పండు  మిరపకాయలలో  కూరుకోవాలి .

మరుసటి  రోజు  భోజనము లో  ఊరగాయగా వాడుకోవచ్చును .

ఉసిరి ఆవకాయ

ఆలూరుకృష్ణప్రసాదు .

ఉసిరి  ఆవకాయ .  (  నిల్వ  ఊరగాయ  )

కావలసినవి .

పెద్ద ఉసిరి కాయలు  --  రెండు కిలోలు.
ఎండు కారం  --  400 గ్రాములు.
ఆవపిండి  --  350 గ్రాములు
ఉప్పు మెత్తనిది  - 300 గ్రాములు
పసుపు  --   రెండు స్పూన్లు 
ఎండుమిరపకాయలు  -  15
నూనె  --  600 గ్రాములు
ఆవాలు  --  మూడు స్పూన్లు 
ఇంగువ  --    స్పూను.

ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి   200   గ్రాముల  నూనె వేసి నూనె బాగా కాగగానే  ఉసిరికాయలు  వేసి  మూత పెట్టి  పది హేను నిముషాలు పాటు  మగ్గనివ్వాలి .

తర్వాత  మూత తీసి  మరో అయిదు నిముషాలు  నీరు  తడి లేకుండా  ఇగర నివ్వాలి .

తర్వాత  మగ్గ పెట్టి  సిద్ధంగా ఉంచుకున్న కాయలపై  పై  పసుపు, కారం , ఆవపిండి , మెత్తని   ఉప్పు ఒక బేసిన్ లో  వేసి  నాలుగు  మూలలా  చేతితో  బాగా కలుపు కోవాలి .

మళ్ళీ  స్టౌ మీద బాండీ  పెట్టి  మిగిలిన మొత్తము నూనె  వేసి నూనెను  బాగా  కాగనివ్వాలి .

బాగా  కాగిన నూనెలో  ఎండుమిరపకాయలు , ఆవాలు , ఇంగువ (  మరి కాస్త  )  వేసి  పోపు వేగాక  చల్లారనిచ్చి  ఆ నూనెను  ముక్కల లో పోసి  గరిటతో  బాగా  కలుపుకోవాలి.

చల్లారగానే  ఒక  జాడి  లోకి  తీసుకోవాలి .

వాడుకునే టప్పుడు  చిన్న  గిన్నెలలోకి  అవరమైన  పచ్చడి  తీసి  వాడుకుంటే  ఎక్కువ  రోజులు  నిల్వ ఉంటుంది .

అంతే ముక్కుపుటాలు అదిరిపోయే  ఇంగువ  వాసనతో  ఉసిరికాయతో  ఆవకాయ  సర్వింగ్  కు  సిద్ధం.

ఈ పచ్చడి  నాలలుగు  నెలల  పైన  నిల్వ ఉంటుంది .

Saturday, April 14, 2018

ఆవకాయ

ఆలూరుకృష్ణప్రసాదు .

ఆవకాయ. ( ఏడాది  ఊరగాయ )

ఇప్పుడు  ఆవకాయల  సీజన్ .

అందరూ  అదే  పనిలో  బిజి  బిజీ .

మరి  ఆవకాయ  ఎలా  పెట్టు కోవాలో  మన సభ్యులందరికీ  తెలియచేస్తున్నాను.

తయారీ  విధానము .

అవకాయ .

మామిడి కాయను  సైజును , పులుపును బట్టి కొలతలు  కొంచెం  అటుఇటుగా ఉంటాయి

మామిడికాయలు  - 12

As బ్రాండ్ పప్పు నూనె   - one and half kg

పసుపు -- ఒక స్పూను

మెంతులు  --  మూడు స్పూన్లు

కొంతమంది   శనగలు , మరి కొంతమంది  వెల్లుల్లి  రెబ్బలు  ఆవకాయ లో కలిపేటప్పుడు వేసుకుంటారు .

ఈ శనగలు , వెల్లుల్లి  రేకలు మీ మీ ఇష్టాన్ని బట్టి  షుమారుగా వేసుకోవచ్చు .

ముందుగా మామిడికాయలు బజారు నుంచి తెచ్చి నీటిలో వెయ్యాలి .

కొద్దిసేపు ఒక బకెట్ లో ఉంచిన తరువాత ఒక్కొక్క కాయను  గుడ్డతో
తుడిచి ముచ్చికలు తీసి  పెచ్చుతో సహా ముక్కలుగా కట్ చేసుకోవాలి .

తరువాత ఒకొక్క ముక్కను గుడ్డ పెట్టి తుడిచి అందులో పల్చటి పొరను తీసెయ్యాలి .

ఇప్పుడు  ప్రతి ఊరిలోనూ ఏ రకం కాయ కావాలో మనం ఎన్నుకుంటే వాళ్ళే నీళ్ళల్లో కడిగి  , గుడ్డ పెట్టి కాయను తుడిచి ఆవకాయ కత్తి పీటతో కాయ చితకకుండా  , పెచ్చుతో సహా ముక్కలుగా కట్ చేసి ఇస్తున్నారు .

దాని నిమిత్తం  కాయకు ఇంతని వసూలు చేస్తున్నారనుకోండి .

ఇప్పుడు  ఒక బేసిన్ లో  మొత్తము  నూనె పోసుకుని  తరిగి సిద్ధంగా  ఉంచుకున్న  ముక్కలను నూనెలో వేయాలి.

అలా  కొద్దిసేపు నూనె అంతా  ముక్కలకు పట్టేటట్లు ఉంచాలి .

ఈ విధంగా నూనె లో  ముక్కలను వెయ్యటం వలన  సంవత్సరము అంతా  ముక్క గట్టిగా  ఉంటుంది  .

ముక్క మెత్తగా  అవ్వదు.

ఇప్పుడు ఓ  పళ్ళెంలో  అవ పిండి , ఉప్పు , కారం , పసుపు , మెంతులు వేసి  కలిపి గుచ్చు ఎత్తుకోవాలి

ఇందాక నూనెలో వేసిన ముక్కలు కు ఈ మిశ్రము కలిపి బాగా చెక్క గరిటెతో కానీ  చేతి తో  బాగా కలుపుకోవాలి

ఒక జాడీలో పెట్టుకుని ఒక గుడ్డ వాసము కట్టాలి.

మూడవ రొజు తిరగ కలపాలి.

ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి .

లోగడ  పెద్ద వారందరూ ఈ ఏడాది  ఆవకాయ తిరగ కలపటానికి , మధ్యలో కొంచెం  కొంచెం  విడిగా  తీసుకోవడానికి  చెక్క గరిటెలు వాడేవారు.

తిరిగి  మళ్ళీ  గుడ్డతో వాసిన కట్టే వారు.

ఇలా చేయడం వలన ఏటి కేడాది ఆవకాయ రంగు మారకుండా ఘమ ఘమ లాడుతూ ఉండేది .

ఆవకాయ లో కలిపే ఆవపిండి  పాళ్ళు  వివరంగా  ఇస్తున్నాను .

ముక్కలు  షుమారుగా  కొలుచుకుని  అంటే   మూడు  కే. జి ల  ముక్కలకు  రెండు  కె.జీ ల  ఆవపిండి,  కారం , ఉప్పు  మిశ్రమం   కలపాలి .

ఈ  మిశ్రమం  కలి పేటప్పుడు  మొత్తం   గుండ  రెండు  కె. జీ. లను  కుంటే   800  గ్రాములు  ఆవ పిండి ,  700  గ్రాములు  కారం ,   500  గ్రాములు  మెత్తని   ఎండబెట్టిన  ఉప్పు వేసి  కలపాలి .

అయోడైజ్డ్  ఉప్పును వాడవద్దు .

పచ్చడి  రుచి పాడవుతుంది.

బజార్లో విడిగా  ఉప్పు పాకెట్లు అమ్ముతారు .

అవి తెచ్చి  తడి లేకుండా  ఎండబెట్టుకోవాలి .

కొత్తావకాయ కలిపి  జాడీలలో పెట్టుకున్న తర్వాత ,   ఆ బేసిన్ లో  మిగిలిన  ఆవపిండి లో   వేడి వేడి అన్నం , మరియు నెయ్యి వేసి కలిపి అమ్మ పెట్టిన  ముద్దలు తిన్న ఆ మధురానుభూతులు ,  ఆ అద్భుతమైన  రుచి  జీవితంలో  మర్చిపోగలమా ?

మునక్కాడ ఆవకాయ

ఆలూరుకృష్ణప్రసాదు .

మునక్కాడ ఆవకాయ .

ములక్కాడలు  కొద్దిగా ముదురుగా గింజతో  ఉండాలి . ---  4

అంగుళంన్నర  ముక్కలుగా  తరుగు కోవాలి .

నూనె  ---  100 గ్రాములు .

చింతపండు  --  75 గ్రాములు .

విడదీసుకుని  వేడి నీళ్ళల్లో  ఒక  అరగంట   నానబెట్టుకుని  చిక్కగా  పులుసు  తీసుకుని  స్టౌ మీద బాగా ఉడక పెట్టుకోవాలి .

కారం  --  అయిదు స్పూన్లు .

మెంతి పిండి  --  స్పూను .

ఆవపిండి  --  రెండు స్పూన్లు 

మెత్తని  ఉప్పు  --  మూడు  స్పూన్లు .

పసుపు  --  అర స్పూను .

మెంతులు  -- అర స్పూను .

తయారీ  విధానము .

ముందుగా  కారము , మెంతిపిండి , ఆవపిండి  ఈ మూడు  మరియు  మెత్తని  ఉప్పు ఒక చిన్న బేసిన్ లో వేసుకుని  ఆవకాయకు మాదిరిగా  చేతితో  బాగా కలుపుకోవాలి .

తయారీ విధానము .

ముందుగా  స్టౌ  మీద బాండి పెట్టి  షుమారు 50  గ్రాముల  నూనె వేసి  నూనె బాగా కాగగానే  అందులో అర స్పూను  మెంతులు వేసి మెంతులను కొద్దిగా  వేగనిచ్చి  అందులో  మునక్కాడ ముక్కలను వేసి బాగా  ముక్కలను  బాగా వేగ నివ్వాలి .

ఆ తర్వాత ముక్కలను  బాగా చల్లార నివ్వాలి .

తర్వాత  ఉడికించి  చల్లారిన  చిక్కని చింతపండు రసము , అన్నీ కలిపిన మిశ్రమము , పసుపు వేసి బాగా  గరిటెతో  కలుపుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద బాండీ పెట్టి  మొత్తము నూనె వేసి  నూనె బాగా కాగగానే ఒక ఆరు ఎండుమిరపకాయలు , స్పూను  ఆవాలు   మరియు  కొద్దిగా  ఇంగువ వేసి  పోపు   బాగా చల్లారాక  ఆవకాయలో కలిపి ఓ  మూడు గంటల పాటు  పిండి  ముక్కలు  ఊర  నిచ్చి  తర్వాత జాడీలోకి  తీసుకోవాలి .

వెల్లుల్లి  ఇష్టమైన వారు  ఇంగువ బదులుగా  పై  తొక్క వలిచిన  ఓ  30  వెల్లుల్లి  రెబ్బలు  పోపులో వేసుకుని  వేగనిచ్చి చల్లారాక  ఆవకాయలో  కలుపుకోవచ్చు .

మేము  ఇంతవరకు ఈ  మునక్కాయ ఆవకాయ  పెట్టలేదు . మొదటిసారిగా కొద్దిగా  వెల్లుల్లి  వేయకుండా పెట్టుకున్నాము .

రుచి  బాగానే ఉంది .

ఇష్టమైన వారు  ప్రయత్నించండి .

షుమారు  ఓ  రెండు నెలలు  నిల్వ ఉంటుందనుకుంటాను .

ఈ  మునగావకాయ భోజనము లోకి  మరియు  చపాతీల లోకి కూడా  రుచిగా ఉంటుంది.

Thursday, March 1, 2018

కొత్తావకాయ

ఆలూరుకృష్ణప్రసాదు .

కొత్తావకాయ. ( సాంపిల్  )

కావలసినవి .

మామిడి  కాయలు  -  2
కారం  --  50  గ్రాములు
ఆవపిండి  --  40  గ్రాములు
ఉప్పు  --   35  గ్రాములు
మెంతులు  --  స్పూను
పసుపు --  స్పూను 
నూనె  --  100  గ్రాములు

తయారీ విధానము .

మామిడి కాయలు  కడిగి పొడి గుడ్డ పెట్టుకుని  తడిలేకుండా తుడుచుకుని  పై చెక్కు తీయకుండా మధ్యకు తరుగుకొని , మధ్యలో  జీడి  మరియు లోపల పొర తీసివేసి ముక్కలుగా  తరుగుకోవాలి .

ఈ ముక్కలలో  గరిటెడు  నూనె  , మొత్తము  పసుపు  వేసి  చేతితో  బాగా  కలుపుకొని  విడిగా  ఉంచుకోవాలి .

ఒక బేసిన్ లో  కారం , ఆవ పిండి , ఉప్పు  మరియు  మెంతులు వేసుకుని , చేతితో బాగా కలుపుకోవాలి .

అందులో  కలిపిన ముక్కలు మరియు మొత్తము  నూనె  వేసుకుని  బాగా  కలుపుకుని  ఒక సీసాలో  తీసుకోవాలి .

మరుసటి  రోజునుండి  ఈ ఆవకాయ  తిరగ కలిపి  వాడుకోవచ్చు .

ఈ ఆవకాయ  ఏప్రిల్ లో  అసలు  ఆవకాయలు  పెట్టేవరకు  అంటే  రెండు నెలలు  నిక్షేపంలా  ఉంటుంది .

Sunday, December 10, 2017

పండుమిరపకాయలతో ఊరగాయ

ఆలూరుకృష్ణప్రసాదు .

పండుమిరపకాయలతో ఊరగాయ.

తయారీ విధానము .

పండు మిరపకాయలు  - 15
శుభ్రంగా తడి గుడ్డతో  తుడుచుకుని , దాని పై తొడిమలు  తీసి వేసి  ఒక అరగంట సేపు  ఆర పెట్టుకోవాలి .

వాటి మధ్యలో గాటు పెట్టుకుని  పూర్తిగా  గింజలను  తొలగించి , ఆ గింజలను  వేరేగా  ప్లేటులో  తీసుకోవాలి .

రెండు స్పూన్లు  ఆవాలు , రెండు స్పూన్లు  మెంతులు , రెండు  స్పూన్లు  సోంపు  తీసుకుని  బాండీలో  నూనె లేకుండా  దోరగా  వేయించుకోవాలి .

ఆ తర్వాత  మిక్సీ లో మెత్తగా  వేసుకోవాలి .

ఒక  ప్లేటులో  ఈ పొడిని , విడిగా  తీసి ఉంచుకున్న  గింజలను , స్పూను పసుపు , స్పూనున్నర  ఉప్పు ,ఆరు స్పూన్లు  నూనె వేసి  చేత్తో  బాగా  కలుపుకోవాలి .

అందులో రెండు కాయల   నిమ్మరసం  పిండుకుని పండు  మిరపకాయలలో  కూరుకోవాలి .

మరుసటి  రోజు  భోజనము లో  ఊరగాయగా వాడుకోవచ్చును .

Thursday, August 31, 2017

దొండకాయ ముక్కల ఊరగాయ

ఆలూరుకృష్ణప్రసాదు .

దొండకాయ  ముక్కల  ఊరగాయ .

కావలసినవి .

దొండకాయలు --  15  కాయలు పచ్చిగా ఉండాలి . పండకూడదు.
నిమ్మకాయలు  -- 4 కాయలు మధ్యకు కోసి  ఒక గిన్నెలో  రసం తీసుకోవాలి .
కారం --  మూడు స్పూన్లు .
మెంతిపొడి  ---  స్పూను
ఉప్పు  ---  తగినంత .
పసుపు   ---  కొద్దిగా

పోపునకు .

నూనె  ---  మూడు స్పూన్లు
ఎండుమిరపకాయలు  --3  చిన్న ముక్కలుగా  చేసుకోవాలి.
ఆవాలు --- స్పూను
ఇంగువ  ---  కొద్దిగా

తయారీ  విధానము .

ఒక గిన్నెలో  తరిగిన  దొండకాయ ముక్కలు , నిమ్మరసం , కొంచెం  పసుపు,  కారం , మెంతిపొడి మరియు తగినంత  ఉప్పు వేసి స్పూను తో  బాగా  కలుపుకోవాలి .

స్టౌ  మీద బాండి  పెట్టి  మూడు స్పూన్లు  నూనె వేసి  నూనె బాగా కాగగానే  ఎండుమిర్చి ముక్కలు , ఆవాలు మరియు ఇంగువ  వేసి  పోపు  వేగగానే  ముక్కల పచ్చడిలో వేసి  బాగా కలుపు కుని  రెండు గంటల సేపు  మూత పెట్టి ఉంచాలి .

దొండకాయ ముక్కలు  నిమ్మరసం లో  బాగా ఊరతాయి .

తర్వాత  సర్వ్ చేసుకోవాలి .
అంతే  ఎంతో  రుచిగా  ఉండే  దొండకాయ ముక్కల  ఊరగాయ  దోశెలు  మరియు భోజనము  లోకి  సర్వింగ్ కు సిద్ధం.

Monday, July 17, 2017

దోసకాయ ముక్కల పచ్చడి

దోసకాయ ముక్కల  పచ్చడి .
ఆలూరు కృష్ణప్రసాదు .

కావలసినవి .
పసుపు రంగు గట్టి  దోసకాయ  ---  ఒకటి.
పై  చెక్కు   తీసి  చిన్న  చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి .
చిన్న నిమ్మకాయంత  చింతపండు   విడదీసి  కొద్దిగా నీళ్ళతో  తడిపి  ఉంచుకోవాలి ..
  
పచ్చిమిరపకాయలు  --  10

కొత్తి మీర   ---  రెండు కట్టలు .
మరి కాస్త  వేసుకున్నా  చాలా  రుచిగా  ఉంటుంది .

కట్టలు  విడదీసి  కాడలు  తీసేసి  కొత్తిమీర   శుభ్రం  చేసుకోవాలి .
ఉప్పు   ---   తగినంత
పసుపు  ---  కొద్దిగా .
పోపుకు  .
ఎండుమిరపకాయలు  --  6
మినపప్పు   ---  స్పూను
మెంతులు  ---   పావు  స్పూను
ఆవాలు  ---   అర  స్పూను 
ఇంగువ  ---  కొద్దిగా
నూనె  ---   50  గ్రాములు
తయారీ  విధానము  .
ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తం  నూనె  పోయాలి.
నూనె  బాగా  కాగనివ్వాలి  .
నూనె బాగా కాగగానే   మెంతులు , ఎండుమిరపకాయలు  ,  మినపప్పు , ఆవాలు  మరియు  ఇంగువ  వేసి  పోపు  బాగా  వేగనివ్వాలి .
ఎక్కువ   నూనె  ఉంటే  ఆఖరున  పచ్చడిలో  కలుపుకోవచ్చు.
బాండీ లోనే  ఉంచేయండి
పోపు  చల్లారగానే  ముందుగా   మిక్సీ లో  ఎండుమిరపకాయలు , తగినంత  ఉప్పు  మరియు  పసుపు వేసి  మిక్సీ   మెత్తగా   వేసుకోవాలి .
తరువాత  పచ్చిమిర్చి  , తడిపిన  చింతపండు   మరియు  పోపు  వేసి  మెత్తగా మిక్సీ   వేసుకోవాలి
చివరగా  దోసకాయ  ముక్కలు  మరియు కొత్తిమీర  వేసి   ఒకే  ఒక్కసారి  దోసకాయ  ముక్కలు  నలగ  కుండా  మిక్సీ   వేసుకుని  ఒక  గిన్నెలోకి  తీసుకుని  బాండీలో  కాగిన  మిగిలిన  నూనె  అందులో పోసి   గరిటతో  ముక్కలు  పచ్చడి  బాగా కలిసేటట్లు  కలుపుకోవాలి .
అంతే  ఎంతో  రుచిగా   ఉండే  దోసముక్కలు  పచ్చడి  సర్వింగ్   కు  సిద్ధం .

Monday, July 10, 2017

దబ్బకాయ ఊరగాయ

దబ్బకాయ  ఊరగాయ .
ఆలూరుకృష్ణప్రసాదు .

కావలసినవి .
పెద్ద సైజు  దబ్బకాయలు  పసుపుపచ్చ  రంగువి .  తోలు  పల్చగా  ఉన్నవి  ---  3
మెత్తని  ఉప్పు  మామూలు  ఉప్పు  పాకెట్లు  విడిగా   దొరుకుతాయి  పచ్చళ్ళకు . మెత్తని  మామూలు  ఉప్పు  కె. జి  . రూ. 6 /  -  ఉంటుంది  .
ఒక  కె. జి .  పాకెట్  కొని  అందులో  ----   పావు కిలో  తీసుకోవాలి .
పసుపు  ---   ఒక స్పూను  .
తయారీ విధానము  .
దబ్బకాయలు  శుభ్రంగా   గుడ్డతో  తుడుచు కోవాలి .
రెండు  దబ్బకాయలు  ముక్కలుగా  తరుగుకోవాలి .
ఒక దబ్బకాయ  మధ్యకు  తరిగి   రసం  తీసి  ఉంచుకోవాలి .
ఒక  బేసిన్  లో   తరిగిన  దబ్బకాయ  ముక్కలు , పసుపు,  విడిగా  తీసిన  కాయ రసం  మరియు  ఉప్పు వేసి చేతితో  బాగా  కలుపుకొని , ఒక  జాడీలో  భద్రపరుచుకోవాలి .
ఒక  20  రోజుల  పాటు    ముక్కలకు  ఉప్పు  మరియు  పులుపు  పట్టడానికి  అలాగే  కదపకుండా  ఉంచుకోవాలి .
తర్వాత  మేము  అవసరమైనప్పుడల్లా  కొద్ది  కొద్దిగా   ముక్కలు  రసం  తీసి  విడిగా   కలుపుకుంటాము .
ఆ  విధానము .
ఓ  అయిదు  స్పూన్లు   ముక్కలు  రసం  తీసుకోవాలి .
అందులో  రెండు స్పూన్లు   కారం  వేసుకోవాలి  .
  అర స్పూను  మెంతి  పిండి  వేసుకోవాలి  .
ఉప్పు  ముందు  వేసాము  కనుక  మరలా  వేయనక్కరలేదు .
కలపకుండా  అలాగే  ఉంచాలి .
స్టౌ  మీద  బాండీ  పెట్టి  అయిదు  స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా  కాగాక  నాలుగు  ఎండుమిర్చి   ముక్కలుగా  తుంచి  , పావు  స్పూను  మెంతులు ,  అర స్పూను  ఆవాలు ,  కొంచెం   ఎక్కువగా  ఇంగువ  వేసి  కాగే  కాగే నూనె  పోపు  ముక్కలపై  ఉన్న  కారం  పై  పోయాలి .
రెండు  నిముషాలు   ఆగి  స్పూనుతో  బాగా  కలుపుకోవాలి .
అంతే .  నిమ్మకాయ   ఊరగాయ  కన్నా  ఎంతో  రుచిగా మరియు  ఆరోగ్యంగా   ఉండే  దబ్బకాయ  ఊరగాయ  అన్నంలోకి  మరియు  ఇడ్లీ , దోశెలలోకి  సర్వింగ్  కు  సిద్ధం.

Wednesday, May 31, 2017

మామిడి కాయ తురుము పచ్చడి .

మామిడి కాయ తురుము పచ్చడి .
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

కావలసినవి.
మామిడి కాయ -- 1
ఎండు మిరపకాయలు - 8
మెంతులు --- ఒక స్పూను 
ఆవాలు -- ఒక స్పూను 
ఇంగువ -- కొద్దిగా 
పసుపు -- కొద్దిగా 
ఉప్పు -- తగినంత 
నూనె -- తగినంత

తయారు చేయు విధానము .
మామిడి కాయ పై చెక్కు తీసి ఎండు కొబ్బరి కోరము తో తురుము కోవాలి.
స్టౌ మీద బాండీ పెట్టి నూనె వేసి నూనె బాగా కాగాక ఎండు మిర్చి , మెంతులు , ఆవాలు , ఇంగువ , వేసి పోపు వేయించుకోవాలి .
ఈ పోపు మిక్సీలో వేసి తగినంత ఉప్పు మరియు పసుపు వేసి మెత్తగా వేసుకోవాలి .
ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని గిన్నెలో తీసుకొని తురిమిన మామిడి కాయ కోరును అందులో వేసి బాగా కలపాలి.
ఆ తర్వాత మరో మూడు స్పూన్లు నూనె బాండీలో వేసి నూనె కాగాక ఆవాలు , ఇంగువ వేసి పైన మళ్ళీ పోపు వేసుకోవాలి .
అంతే నోరూరించే మామిడి కాయ తురుము పచ్చడి భోజనము లోకి సిద్ధం.

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి