Showing posts with label పచ్చళ్ళు. Show all posts
Showing posts with label పచ్చళ్ళు. Show all posts

Tuesday, May 12, 2020

కందిపచ్చడి & చింతపండు పచ్చడి.

ఆలూరుకృష్ణప్రసాదు 

సూపర్  కాంబినేషన్  ప్రాచీన  వంటకములు.

కందిపచ్చడి  &  చింతపండు  పచ్చడి.

కందిపచ్చడి.

ఆలూరుకృష్ణప్రసాదు .

రెసిపీ చాలా ఈజీ.

పన్నెండు  ఎండుమిరపకాయలు , కప్పున్నర  లేదా  (  షుమారు 150 గ్రాములు  ) కందిపప్పు ,  స్పూను  జీలకర్ర  బాండీలో నూనె వేయకుండా కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకుని , చల్లారగానే ఈ వేయించినవి ,  పావు స్పూను లో సగం  పచ్చి ఇంగువ  మరియు సరిపడా ఉప్పువేసి వాటిని మిక్సీ లో వేసుకుని  కొద్ది  కొద్దిగా  నీళ్ళు పోసుకుంటూ మరీ మెత్తగా  కాకుండా కొంచెం పప్పులు  తగిలే  విధముగా  మిక్సీ  వేసుకోవాలి .

అంతే  ఎంతో రుచికరమైన షుమారు వంద సంవత్సరాల పైగా  చరిత్ర కలిగిన తాతమ్మల నాటి  కందిపచ్చడి సర్వింగ్ కు సిద్ధం.

 ఇంక  ఈ పచ్చడిలో  అదనంగా చింతపండు , వెల్లుల్లి , కరివేపాకు ,  నేతితో పోపు లాంటి అదనపు   వన్నీ మీ  అభిరుచి ప్రకారము మీకు ఇష్టమైన  విధముగా  వేసుకోవచ్చును.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము  తయారుచేయు  విధానము  మరియు  ఫోటో  తయారు చేయు  సమయమున  తీసినది.

********************************

ఆలూరుకృష్ణప్రసాదు .

చింతపండు   పచ్చడి  .

సాధారణంగా   పెసరట్లు , దోశెలు ,  ఇడ్లీలు , గారెలు  మరియు  భోజనము  లోకి  అందరం  అల్లం   పచ్చడి  చేసుకుంటాము .

అలాగే   ఇప్పుడు  మామిడి  అల్లం  కూడ  బాగా  దొరుకుతోంది  కాబట్టి   చాలామంది  మామిడి  అల్లం  పచ్చడి  కూడా  చేస్తారు .

ఈ  రెండింటికన్నా  ప్రాచీనమైన   పచ్చడి  చింతపండు   పచ్చడి .

లోగడ  పెద్ద వాళ్ళందరూ   చింతపండు   పచ్చడినే  అన్ని సందర్భాలలోనూ చేసేవారు .

ఈ  చింతపండు  పచ్చడి  ఫ్రిజ్ లో  పెట్టక పోయినా  వారం  రోజులు  నిల్వ  ఉంటుంది .

చింతపండు   పచ్చడి తయారీ విధానము .

కావలసినవి .

చింతపండు   ---  పెద్ద   నిమ్మ కాయంత . షుమారుగా  60 గ్రాములు.
పసుపు  --  పావు స్పూను  .
ఉప్పు ---  తగినంత 
బెల్లం  --  చిన్న ముక్క . షుమారుగా 30 గ్రాములు.

పోపునకు .

ఎండుమిరపకాయలు   ---  15
మెంతులు  ---   పావు స్పూను  
ఆవాలు  ---   అర  స్పూను 
ఇంగువ   ---   కొద్దిగా 
నూనె  ---   నాలుగు   స్పూన్లు 

తయారీ  విధానము  .

ముందుగా   చింతపండు  రెబ్బలుగా  విడదీసి  పావు  గ్లాసు  వేడి  వేడి  నీటిలో  తడిపి  ఉంచుకోవాలి .

రసం  తీయనవసరం  లేదు .

ఆ  తర్వాత స్టౌ మీద బాండి  పెట్టి  నూనె  మొత్తము  వేసి ,   నూనె  బాగా  కాగగానే  వరుసగా  మెంతులు , ఎండుమిరపకాయలు వేయాలి . మెంతులు  వేగగానే  ఆవాలు  మరియు  ఇంగువ   వేసి  పోపు వేగగానే   స్టౌ  ఆపివేయాలి .

పోపు  చల్లారగానే  మిక్సీ  లో  ముందుగా  ఎండుమిరపకాయలు , పసుపు మరియు తగినంత  ఉప్పు     వేసి   మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

ఆ తర్వాత  తడిపిన  చింతపండు  నీళ్ళతో సహా , వేగిన  పోపు  మరియు  చిన్న   బెల్లం  ముక్కతో   సహా  మిక్సీ లో వేసి  మెత్తగా మిక్సీ వేసుకోవాలి. 

నీళ్ళు  పోయకుండా  గట్టిగా    విడిగా గిన్నెలోకి తీసుకోండి .

అంతే  ఇడ్లీ  , దోశెలు , పెసరట్లు , గారెలు  మరియు  భోజనము  లోకి  కూడా  ఎంతో  రుచిగా   ఉండే   చింతపండు  పచ్చడి  సర్వింగ్  కు  సిద్ధం .

మా  ఇంట్లో  ఈ చింతపండు  పచ్చడి చేసినప్పుడు  దీనికి  కాంబినేషన్ గా  కందిపచ్చడి  చేసుకుంటాము.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము  తయారు చేయు  విధానము   మరియు  ఫోటో  తయారు చేయు  సమయమున  తీసినది.

Sunday, April 19, 2020

కందిపప్పు కొబ్బరిముక్కల పచ్చడి .

కందిపప్పు కొబ్బరిముక్కల  పచ్చడి .
ఆలూరుకృష్ణప్రసాదు .

కావలసినవి .

కందిపప్పు  --  ఒక కప్పు
పచ్చికొబ్బరి  ముక్కలు --  ఒక కప్పు.
ఎండుమిరపకాయలు  --  పది 
జీలకర్ర  --  స్పూను 
చింతపండు  --  చిన్న ఉసిరి కాయంత.
ఉప్పు  --  తగినంత 
ఇంగువ -- కొద్దిగా 

పోపునకు .

ఎండుమిర్చి  --  మూడు.  చిన్న  ముక్కలుగా  చేసుకోవాలి 
చాయమినపప్పు  --  స్పూను 
ఆవాలు  --  అర  స్పూను 
కరివేపాకు  --  రెండు  రెమ్మలు
నెయ్యి  --  నాలుగు  స్పూన్లు 

తయారీ విధానము .

ముందుగా  స్టౌ  మీద బాండీ   పెట్టి  రెండు స్పూన్లు  నెయ్యి వేసి  నెయ్యి  బాగా  కాగగానే  కందిపప్పు , ఎండుమిర్చి , జీలకర్ర మరియు ఇంగువ వేసి  కందిపప్పు  కమ్మని  వేగిన వాసన వచ్చే వరకు  వేయించుకోండి. 

తర్వాత  అందులోనే  చిన్న ముక్కలుగా  తరిగిన  కొబ్బరి ముక్కలు  వేసి  పచ్చి వాసన పోయేవరకు  ఉంచి  దింపి  వేరేగా  పళ్ళెంలో  తీసుకోండి .

పోపు  చల్లారగానే   ముందుగా  మిక్సీ లో వేయించిన  ఎండుమిరపకాయలు , వేయించిన  కందిపప్పు  , తడిపిన చింతపండు మరియు తగినంత ఉప్పు వేసి  మెత్తగా  మిక్సీ  వేసుకోండి.

తర్వాత  వేగిన  కొబ్బరి  ముక్కలు కూడా వేసి ,  కొద్దిగా  నీళ్ళు పోసుకుని   మెత్తగా  మిక్సీ  వేసుకోండి .

తర్వాత వేరే గిన్నెలో కి తీసుకోండి.

ఇప్పుడు  స్టౌ మీద బాండీ పెట్టి  మిగిలిన రెండు స్పూన్లు  నెయ్యి వేసి  నెయ్యి బాగా కాగగానే  ఎండుమిర్చి  ముక్కలు , మినపప్పు , ఆవాలు మరియు కరివేపాకు  వేసి  పైన పోపు  పెట్టుకోండి .

అంతే   ఇడ్లీ , దోశెలు , గారెలు , చపాతీలు  మరియు భోజనము  లోకి  ఎంతో రుచిగా  ఉండే  కందిపప్పు  కొబ్బరి ముక్కల పచ్చడి సర్వింగ్  కు సిద్ధం.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ మేము తయారుచేయు  విధానము  మరియు ఫోటో  తయారుచేయు  సమయమున  తీసినది.

Monday, September 3, 2018

వామన చింతకాయలు

ఆలూరుకృష్ణప్రసాదు .

వామన చింతకాయలు .

వామన చింతకాయలు అంటే  కొత్తగా  సీజన్లో  చింత చెట్లకు  కాసే, గింజ పట్టని  చిన్న చిన్న చింతకాయలు.

ఇవి చిన్నవిగా ఉంటాయి కనుక వామనుల వారు కూడా పొట్టిగా  ఉంటారు కనుక మా ప్రాంతంలో  వీటిని  వామన చింతకాయలు లేదా  చిట్టి /  పొట్టి చింతకాయలు అని అంటాము .

ఈ చింతకాయలతో  పులిహోర  చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

మనం  ఇంట్లో చేసుకునే పులిహోరకు , గుళ్ళో మనకు ఆచార్యుల వారు పెట్టే పులిహోరకు  రుచిలో చాలా తేడా ఉంటుంది .

గుళ్ళో ప్రసాదం రుచి మనకు  ఇంట్లో రాదు.

కారణం మనం పులిహోరలో చింతపండు రసం వాడతాము.

ఆచార్యుల వారు చింతకాయలు  తొక్కి పులిహోర లో వేసి తయారు చేస్తారు .

అదే ప్రధానమైన తేడా.

ఈ విషయం నా చిన్ననాటి పూజారి స్నేహితుడు  చెప్పారు .

ఇంక వామన చింతకాయలతో పులిహోర ఏ విధముగా  తయారు చేస్తారో  మనం తెలుసుకుందాం .

వామన చింతకాయలతో పులిహోర .
**********************

వామన చింతకాయులు. --
ఒక  100  గ్రాములు .

ఈ కాయలను  శుభ్రంగా  కడిగి ఆర నిచ్చి , చిన్న ముక్కలుగా తరుగుకొని , తగినంత  ఉప్పు  మరియు అర స్పూను పసుపు వేసుకుని  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

ఈ మొత్తం  100  గ్రాముల  పచ్చడిలో  సగం పచ్చడి అంటే షుమారు 50  గ్రాముల  పచ్చడి తీసుకోవాలి .

మిగిలిన  పచ్చడి విడిగా చిన్న జాడీ లోకి తీసుకుంటే ,తర్వాత అవసరమైనప్పుడు  మనం మామూలుగా  చింతకాయ పచ్చడి భోజనాలలోకి చేసుకోవచ్చును.

పచ్చిమిర్చి  --  10
కరివేపాకు  --  నాలుగు  రెమ్మలు .
బియ్యము  --  ఒక గ్లాసు లేదా
షుమారు  150  గ్రాములు.
పసుపు --  అర  స్పూను
ఉప్పు  --  తగినంత .

పోపునకు.

ఎండుమిరపకాయలు  -- 8 .
పచ్చిశనగపప్పు  -- రెండు స్పూన్లు .
చాయమినపప్పు --  రెండు స్పూన్లు
వేరుశనగ గుళ్ళు -- నాలుగు స్పూన్లు .
ఆవాలు --  ముప్పావు స్పూన్ .
జీడిపప్పు  --  8  పలుకులు .
ఇంగువ  - తగినంత .
నూనె  --  125 గ్రాములు.

తయారీ విధానము .

ఒక గ్లాసు  బియ్యం కడిగి  తగినన్ని  నీళ్ళు పోసుకుని స్టౌ మీద పెట్టి  కొంచెం  పొడి పొడి లాడే విధముగా  వండుకోవాలి .

ఇప్పుడు  ఒక బేసిన్ లో ఉడికిన అన్నం వేసుకుని ,  అందులో పావు స్పూను పసుపు , రెండు రెమ్మలు కరివేపాకు , కొద్దిగా  ఉప్పు మరియు  ఒక అర గరిటెడు  నూనె వేసి , గరిటెతో వేడి మీదనే బాగా కలుపు కోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండి  పెట్టి మిగిలిన మొత్తము  నూనె వేసుకుని , నూనె బాగా కాగగానే  వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , ఆవాలు,  ఇంగువ , వేరుశనగ గుళ్ళు మరియు  జీడిపప్పు ను వేసి పోపును బాగా వేగనివ్వాలి .

తర్వాత అందులో పచ్చి మిర్చి , కరివేపాకును వేసి రెండు నిముషాలు  పచ్చి మిర్చి ని  మగ్గ నివ్వాలి .

తర్వాత  మిక్సీ  వేసుకుని  సిద్ధంగా  ఉంచుకున్న  చింతకాయల  మిశ్రమమును కూడా పోపులో వేసుకుని  రెండు నిముషాలు  ఈ మిశ్రమము పచ్చి వాసన పోయేదాకా  మగ్గనివ్వాలి.

తర్వాత  ఈ పోపును  బెసిన్ లో సిద్ధంగా  ఉంచుకున్న  అన్నము లో వేసుకుని  చేతితో  నాలుగు  మూలలా  బాగా కలిసే విధముగా  కలుపుకోవాలి .

చింతకాయల మిశ్రమములో మరియు  అన్నము లో  సరిపడే  ఉప్పు వేసుకుంటాము  కనుక రుచి చూసి ఉప్పు తగ్గితే కలుపుకోండి .

అంతే ఘుమ ఘుమ  లాడే  ఇంగువ వాసనతో  వామన చింతకాయలతో పులిహోర  సర్వింగ్  కు సిద్ధం.

ఇప్పుడు  మార్కెట్లో ఈ చిన్న చింతకాయలు బాగా దొరుకుతున్నాయి  .

కనుక  ఇప్పుడు ఈ వామన చింతకాయల పులిహోర చేసుకోవచ్చును.

శ్రావణ మాసం లో లక్ష్మీ అమ్మ వారికి , భాద్రపద మాసంలో గణపతికి , ఆశ్వయుజ మాసంలో  దుర్గా  దేవికి  మహా నైవేద్యం గా కూడా  ఈ పులిహోర నివేదన చేయవచ్చును .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటోలు నా స్వంతం .

పల్లీలు పచ్చికొబ్బరి చట్నీ

పల్లీలు మరియు  పచ్చి కొబ్బరి  తో  చట్నీ.

తయారీ  విధానము .

స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు స్పూన్లు  నూనె వేసి నూనె కాగగానే ,  అర కప్పు వేయించని  పల్లీలు ,  పావు కప్పు  పచ్చిశనగపప్పు , ఆరు  పచ్చిమిరపకాయలు వేసి  మగ్గ పెట్టు కోవాలి .

చల్లారగానే  ఈ  మిశ్రమము , ఒక అరకప్పు పచ్చి కొబ్బరి  తురుము మిక్సీ లో  వేసుకుని  , మూడు రెబ్బలు  చింతపండు , తగినంత ఉప్పు వేసుకుని  కొద్దిగా   నీళ్ళు పోసుకుని  పచ్చడి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

వేరే గిన్నెలోకి  తీసుకోవాలి .

తిరిగి  స్టౌ మీద పోపు గరిటె పెట్టుకుని  రెండు స్పూన్లు  నెయ్యి వేసుకుని   ఎండుమిర్చి  ముక్కలు , మినపప్పు , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు  వేసుకుని  పోపు పెట్టుకోవాలి .

ఈ  పచ్చడి  ఇడ్లీ , దోశెలు , పూరీలు  మరియు భోజనము లోకి రుచిగా  ఉంటుంది .

కొత్తిమీర చట్నీ

ఆలూరుకృష్ణప్రసాదు .

కొత్తిమీర  చట్నీ.

కొత్తిమీర  --  ఒక కప్పు.
తురిమిన పచ్చి కొబ్బరి --  ఒక కప్పు.
పచ్చిమిర్చి  --  ఎనిమిది .
చింతపండు  --  ఉసిరి కాయంత.
ఇంగువ  --  కొద్దిగా .
ఉప్పు  --  తగినంత .

తయారీ  విధానము .

ముందుగా  మిక్సీ లో  పైన  కొత్తిమీర , పచ్చి కొబ్బరి , పచ్చి మిర్చి , చింతపండు , ఇంగువ  మరియు  తగినంత ఉప్పు  వేసుకుని , మరీ మెత్తగా కాకుండా మిక్సీ  వేసుకోవాలి .

నూరిన పచ్చడి వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి.

తర్వాత స్టౌ మీద పోపు గరిటె  పెట్టుకుని  రెండు స్పూన్లు  నెయ్యి  వేసి  నెయ్యి బాగా కాగగానే  మూడు ఎండుమిరపకాయలు  చిన్న ముక్కలుగా చేసుకుని , స్పూను  మినపప్పు , అర స్పూను ఆవాలు మరియు రెండు రెమ్మలు కరివేపాకు వేసి పోపు వేయించుకుని   పచ్చడిలో  వేసుకుని  స్పూనుతో బాగా కలుపుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే  కొత్తిమీర  పచ్చడి  ఇడ్లీ , దోశెలు , వేడి వేడి పూరీలు మరియు భోజనము లోకి  సిద్ధం .

పచ్చిశనగపప్పు పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు

పచ్చిశనగపప్పు  తో పచ్చడి.
********************

తయారీ  విధానము .

పది  ఎండుమిరపకాయలు , గ్లాసు పచ్చిశనగపప్పు , స్పూను  జీలకర్ర మరియు  కొద్దిగా  ఇంగువ
నూనె  వేయకుండా  బాండీలో  కమ్మని  వాసన  వచ్చేదాకా   వేయించుకోవాలి .

చల్లారగానే  మిక్సీ లో వేయించిన పచ్చిశనగపప్పు   , ఎండుమిరపకాయలు  , జీలకర్ర   మిశ్రమం ,  మరియు తగినంత   ఉప్పు  వేసి   కొద్దిగా నీళ్ళు  పోసి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .

ఎవరి అభిరుచిని పట్టి వారు  ఈ క్రింద తెలియ చేసిన విధముగా  చేసుకోవచ్చును.

వెల్లుల్లి  ఇష్టపడే వారు ఒక  నాలుగైదు  వెల్లుల్లి   రెబ్బలు  పచ్చడిలో  వేసుకుని  మిక్సీ  వేసుకుంటారు .

రెండు రెబ్బలు చింతపండు కూడా మిక్సీ  లో  పచ్చడిలో  వేసి  మిక్సీ  వేసుకుంటారు.

పచ్చి మామిడి  కాయ ముక్కలు అరకప్పు ,  పచ్చికొబ్బరి పావుకప్పు మరియు మూడు రెబ్బలు  కరివేపాకు ను కూడా పచ్చడిలో  వేసి మిక్సీ  వేసుకుంటారు .

కొంతమంది  స్టౌ  మీద  పోపు గరిటె పెట్టి  మూడు  స్పూన్లు   నెయ్యి  వేసి  రెండు  ఎండుమిర్చి  ముక్కలుగా  చేసి , మినపప్పు , ఆవాలు , ఇంగువ  మరియు  కరివేపాకు   వేసి   పచ్చడిలో   పోపు  పెట్టుకుంటారు .

మీ  అభిరుచి  ప్రకారం  ఏ  విధంగానైనా  మార్చి  చేసుకోవచ్చును .

కందిపచ్చడి

షుమారు 100 సంవత్సరాల  నుండి పెద్దలు  తయారు చేసే కంది పచ్చడి .

కందిపచ్చడి.

తయారీ విధానము .

150 గ్రాముల కందిపప్పు , స్పూనున్నర  జీలకర్ర , పది ఎండుమిరపకాయలు  బాండిలో నూనె లేకుండా  కమ్మని  వాసన వచ్చే వరకు వేయించుకోవాలి.

చల్లారగానే  తగినంత  ఉప్పు వేసి , కొద్దిగా  నీళ్ళు పోసుకుని  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

రోటి  సౌకర్యం  ఉన్నవారు మధ్య మధ్య లో నీళ్ళు చిలకరించుకుంటూ పొత్రముతో మరీ మెత్తగా  కాకుండా  రుబ్బుకుంటే చాలా రుచిగా ఉంటుంది .

నిజానికి  కందిపచ్చడి , కొబ్బరి పచ్చడి రోట్లో రుబ్బుకుంటేనే రుచిగా  ఉంటాయి ,

ఇష్టమైన వారు ఎనిమిది వెల్లుల్లి  రెబ్బలు పచ్చడి రుబ్బేటప్పుడు కాని లేదా మిక్సీ  వేసుకునేటప్పుడు కాని వేసుకోవచ్చును.

రుచికరమైన  కందిపచ్చడి  దోశెల లోకి,  గారెల లోకి, ఇడ్లీల లోకి , చపాతీలలోకి మరియు భోజనము లోకి  సిద్ధం.

ఎవరి అభిరుచి అనుసారంగా కొద్దిగా  చింతపండు  వేయడం , కరివేపాకు  వేసి రుబ్బడం  మరియు పైన పోపు వేసుకోవడం చేసుకొనవచ్చును .

అవి అన్నీ కాలానుగుణంగా వచ్చిన మార్పులు .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.

దబ్బకాయ కారం

ఆలూరుకృష్ణప్రసాదు .

దబ్బ  కాయ  కారం  .

కావలసినవి .

పసుపు పచ్చని దబ్బకాయ --    ఒకటి 

కాయను మధ్యకు  తరిగి  ఒక గిన్నెలో  రసం పిండుకోవాలి .

గింజలను  తీసేసు కోవాలి.

పోపునకు .

ఎండుమిరపకాయలు   --  పదిహేను.
ఆవాలు  ---  స్పూను
మెంతులు  --  స్పూను
ఇంగువ  --  పావు స్పూను
నూనె  --  మూడు  స్పూన్లు
ఉప్పు  --  తగినంత
పసుపు   --  కొద్దిగా

తయారీ  విధానము .

ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు  నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే , వరుసగా  ఎండుమిరపకాయలు , మెంతులు , ఆవాలు  మరియు ఇంగువ  వేసి పోపును   వేయించుకోవాలి.

చల్లారిన తర్వాత  మిక్సీ లో  ఈ   పోపు , కొద్దిగా  పసుపు , సరిపడా ఉప్పు వేసి    మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత  ఆ పొడి ఒక గిన్నెలోకి తీసుకుని  ముందుగా  తీసి వుంచుకున్న  దబ్బ కాయ రసం  కూడా గిన్నెలో  వేసి  స్పూను తో బాగా కలుపుకోవాలి .

అలా  చేసుకున్న  దబ్బ కాయ  కారం
కొద్దిగా  పలుచగా  ఉన్నట్లుగా  అన్పించినా  తరువాత  కారం రసాన్ని పీల్చుకుని  గట్టి  పడుతుంది .

అంతే  పుల్ల పుల్లగా  ఇంగువ ఘుమ ఘుమ లతో , ఇడ్లీ , దోశెలు , గారెలు  మరియు  భోజనము  లోకి  దబ్బ  కాయ కారం  సర్వింగ్  కు  సిద్ధం.

ఈ కారం పది రోజులు నిల్వ ఉంటుంది .

సంబంధించిన  రెసిపీ  మరియు ఫోటో నా స్వంతం.

వంకాయ ముక్కల పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

వంకాయ  ముక్కల పచ్చడి .

కావలసినవి .

వంకాయలు  -- పావు కిలో .

చింతపండు  -- పెద్ద ఉసిరి కాయంత . 
విడదీసి కొద్దిగా  నీళ్ళలో పది నిముషాల  ముందు తడిపి ఉంచుకోవాలి .

పచ్చిమిర్చి  -  8
కరివేపాకు  --  మూడు రెమ్మలు .
కొత్తిమీర  -- చిన్న కట్ట .
పసుపు  - కొద్దిగా .
ఉప్పు -- తగినంత
నూనె  --  అయిదు స్పూన్లు .

పోపునకు .

ఎండుమిర్చి  -- 4
చాయమినపప్పు  - స్పూను
ఆవాలు -  అర స్పూను .
మెంతులు -- కొద్దిగా
జీలకర్ర   --  పావు స్పూను
ఇంగువ  --  కొద్దిగా

తయారీ విధానము .

ముందుగా  వంకాయలు నీళ్ళలో వేసుకుని  పులుసు ముక్కల మాదిరిగా  కాస్త పెద్ద ముక్కలు తరుగుకుని  నీళ్ళలోనే ఉంచుకోవాలి .

తర్వాత  స్టౌ మీద బాండీ పెట్టి  మూడు స్పూన్లు  నూనె వేసి నూనె బాగా కాగగానే  తరిగి  సిద్ధంగా ఉంచుకున్న  వంకాయ ముక్కలు  , పచ్చిమిర్చి  మరియు కొద్దిగా  పసుపు  వేసి మూతపెట్టి  మీడియం సెగన  ముక్కలను ఓ పది నిముషాలు  మగ్గనిచ్చి దింపి వేరే ప్లేటు లోకి తీసుకోవాలి .

ఆ తర్వాత  స్టౌ మీద  మళ్ళీ బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసి నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిర్చి , మెంతులు , చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు  వేసి పోపు వేయించుకోవాలి .

తర్వాత మిక్సీ లో ముందుగా ఎండుమిర్చి ,తడిపిన చింతపండు  మరియు  తగినంత  ఉప్పు వేసి మెత్తగా మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత  మగ్గించి  సిద్ధంగా  ఉంచుకున్న  వంకాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి  వేసి మరీ మెత్తగా  కాకుండా  పచ్చడి మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత  మిగిలిన  పోపు మరియు కొత్తిమీర కూడా  వేసి  ఒకసారి మిక్సీ  వేసుకుని  వేరే గిన్నెలోకి తీసుకోవాలి .

అంతే . ఎంతో రుచిగా  ఉండే వంకాయ పచ్చడి  దోశెలు , చపాతీలు  మరియు  భోజనము లోకి సర్వింగ్ కు  సిద్ధం.

సంబంధించిన  రెసిపీ  మరియు ఫోటో నా స్వంతం .

Monday, July 9, 2018

కొత్త పండు మిరపకాయల పచ్చడి

కొత్త  పండు మిరపకాయల పచ్చడి.

సాంపిల్ గా  ఒక  అర కిలో పెట్టుకున్నాం.

ఒక అర కిలో పండు మిరపకాయలలో స్పూనున్నర  పసుపు,  ఒక 75 గ్రాములు మెత్తని ఉప్పు వేసి  రోటిలో  తొక్కుకోవాలి .

ఒక జాడిలో  100 గ్రాముల కొత్త చింతపండు  విడదీసి  మధ్యలో  పెట్టుకోవాలి .

ఇంగువ  పలుకులు కూడా  మధ్యలో పెట్టుకుని  మూడో  రోజు  మెత్తగా  రుబ్బుకోవాలి .

ఒక  జాడీలో  భద్ర పరుచుకోవాలి .

కావలసినప్పుడు   కొంత పచ్చడి తీసుకుని  అందులో స్పూను మెంతిపిండి  వేసుకుని , బాండిలో  నాలుగు స్పూన్లు  నూనె వేసుకుని  ఆవాలు, ఎండుమిర్చి  ముక్కలు మరియు ఇంగువ వేసి పోపు  పెట్టుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే పండుమిరపకాయల పచ్చడి  దోశెలు , చపాతీలు మరియు భోజనము  లోకి  సర్వింగ్ కు సిద్ధం.

ఇడ్లీలోకి కొత్తిమీర చట్నీ

ఆలూరుకృష్ణప్రసాదు .

వేడి వేడి ఇడ్లీ కొత్తిమీర  చట్నీతో .

కొత్తిమీర  చట్నీ.

తయారీ విధానము.

ఆరు పచ్చిమిర్చి , రెండు చిన్న కట్టల కొత్తిమీర , తగినంత   ఉప్పు వేసుకుని  మెత్తగా  మిక్సీ వేసుకుని , ఒక కాయ నిమ్మరసం పిండుకొని , తర్వాత నేతితో  రెండు ఎండుమిరపకాయలు  ముక్కలుగా తుంచి , ముప్పావు స్పూను మినపప్ఫు , అర స్పూను ఆవాలు , రెండు రెమ్మలు కరివేపాకు  మరియు కొద్దిగా  ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి .

మామిడికాయ ముక్కల పచ్చడి

ఆహా !!  ఏమి రుచి .

ప్రియమిత్రులందరికీ

ఆలూరుకృష్ణప్రసాదు .

మామిడి కాయతో ముక్కల పచ్చడి .( మెంతి బద్దలు  )

కావలసినవి .

పుల్లని పచ్చి మామిడి కాయ  --  ఒకటి .

పై చెక్కు తీసుకుని  చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .

ముక్కలను విడిగా ప్లేటులోకి తీసుకుని  పైన  కొద్దిగా పసుపు వేసుకోవాలి .

నూనె  --  నాలుగు  స్పూన్లు

ఎండుమిరపకాయలు  - 12 
మెంతులు --    స్పూను
ఆవాలు --   స్పూను
ఇంగువ --   కొద్దిగా
ఉప్పు  --  తగినంత
పసుపు --  కొద్దిగా

తయారీ విధానము .

స్టౌ మీద బాండీ పెట్టుకొని  మొత్తము  నూనె పోసి  నూనె బాగా కాగగానే   ముందుగా మెంతులు మరియు ఎండుమిరపకాయలు   వేసి బాగా వేగనివ్వాలి .
తర్వాత అందులోనే ఆవాలు  మరియు ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి.

పోపు చల్లారగానే ముందుగా   మిక్సీ లో వేయించిన పోపు  మరియు తగినంత  ఉప్పు వేసి మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి . 

తీపి ఇష్టమైన వారు చిన్న బెల్లం ముక్క మిక్సీ లో వేసుకుని మిక్సీ  వేసుకోవచ్చును,

ఆ తర్వాత  మామిడి కాయ ముక్కలు కూడా వేసుకుని  ఒకసారి ముక్కలు నలగకుండా  మిక్సీ వేసుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .

అంతే. భోజనము లోకి , చపాతీల లోకి , రోటీల లోకి మరియు దోశెల లోకి ఎంతో రుచిగా  ఉండే మామిడి  కాయ ముక్కల పచ్చడి సర్వింగ్  కు సిద్ధం.

ఈ ముక్కల పచ్చడినే  మెంతి బద్దలు అని కూడా అంటారు .

బెల్లం  వేయకపోతే ఒక వారం , వేస్తే నాలుగు రోజులు  ఈ ముక్కల పచ్చడి నిల్వ ఉంటుంది .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.

మరిన్ని  రుచికరమైన వంటలకు ఆహా !!  ఏమి రుచి బ్లాగ్ ను దర్శించండి .

సింపుల్‌గా కొబ్బరిపచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

సింపుల్  గా  కొబ్బరి  పచ్చడి .

కావలసినవి .

కొబ్బరి కాయ  --  ఒకటి

కాయను  పగుల  కొట్టి  చిప్పల లో నుండి  చాకుతో  కొబ్బరి  తీసుకుని   చిన్న  చిన్న  ముక్కలుగా  చేసుకోవాలి .

పచ్చి  మిరపకాయలు  --  8

కొత్తిమీర   --  ఒక  చిన్న  కట్ట .

వేళ్ళు  ముదురు కాడలు  తీసివేసి  శుభ్రంగా కడిగి  వేరే  ఉంచుకోవాలి .

ఉప్పు  ---  తగినంత

పసుపు  ---  చిటికెడు

పోపునకు .

నెయ్యి   --  మూడు స్పూన్లు

ఎండుమిరపకాయలు  -  మూడు . ముక్కలుగా  చేసుకోవాలి .

మినపప్పు  --  స్పూను

జీలకర్ర   ---  పావు  స్పూను

ఆవాలు  ---  అర స్పూను

కరివేపాకు  ---  రెండు రెమ్మలు

ఇంగువ  ---  కొద్దిగా .

తయారీ  విధానము .

ముందుగా  మిక్సీ  లో  పచ్చి  కొబ్బరి  ముక్కలు , పచ్చి మిరపకాయలు , కొత్తిమీర , తగినంత  ఉప్పు  మరియు  కొద్దిగా  పసుపు  వేసి  పచ్చడి  మరీ  మెత్తగా  కాకుండా మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  పోపు  గరిటె పెట్టి  మూడు  స్పూన్లు  నెయ్యి వేసి  నెయ్యి బాగా  కాగగానే  వరుసగా  ఎండు మిరపకాయలు ముక్కలు , మినపప్పు , ఆవాలు , జీలకర్ర  ,  ఇంగువ  మరియు  కరివేపాకు   వేసి  పోపు  పెట్టుకొని  పోపు  బాగా  వేగగానే   పచ్చడిలో  వేసి స్పూనుతో బాగా కలుపుకోవాలి .

తర్వాత  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .

అంతే . కొత్తిమీర  సువాసనతో  ఎంతో  రుచిగా   ఉండి , సింపుల్ గా తయారు చేయటానికి   వీలుగా , ఇడ్లీ , దోశె , రోటి ,  చపాతీ, వడలు  మరియు  భోజనము   లోనికి  ఎంతో  రుచికరమైన  కొబ్బరి  పచ్చడి  సర్వింగ్   కు  సిద్ధం.

Wednesday, July 4, 2018

బీరకాయ సొరకాయ పచ్చడి

ఈ రోజు పరిచయం  చేస్తున్న  కాంబినేషన్ పచ్చడి.

బీరకాయ మరియు ఆనపకాయ /  సొరకాయ పచ్చడి .

కావలసినవి .

బీరకాయలు  --  రెండు.
సొరకాయ  --  250 గ్రాములు  ముక్క .
పచ్చి మిరపకాయలు  -- 12 .
చింతపండు  -- నిమ్మకాయంత . విడదీసి కొద్ది నీళ్ళలో తడిపి ఉంచుకోవాలి .
కొత్తిమీర  -- ఒక చిన్న కట్ట.
పసుపు  --  కొద్దిగా
ఉప్పు   --  తగినంత
నూనె  --  మూడు స్పూన్లు .

పోపునకు.

నూనె --  రెండు స్పూన్లు
ఎండుమిరపకాయలు  - 5
చాయమినపప్పు -  స్పూనున్నర
జీలకర్ర  - పావు స్పూను
మెంతులు -- పావు స్పూన్  కు తక్కువ .
ఆవాలు -- అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా
కరివేపాకు  --  రెండు రెమ్మలు.

తయారీ విధానము .

బీరకాయలు  ఒకసారి బాగా కడుగుకుని  పై చెక్కు  తీసి  కాస్త పెద్ద  ముక్కలుగా తరుగు కోవాలి .

ఇష్టమైన వారు చెక్కుతో సహా తరుగు కోవచ్చు. 

ఆనపకాయ /  సొరకాయ  చెక్కు తీసి కాస్త పెద్ద ముక్కలుగా  తరుగుకోవాలి .

ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి  మూడు స్పూన్లు  నూనె వేసి నూనె బాగా కాగగానే  బీరకాయ ముక్కలు , సొరకాయ ముక్కలు , పచ్చి మిరపకాయలు మరియు కొద్దిగా  పసుపు వేసి  మూత పెట్టి  ముక్కలను బాగా మగ్గ నివ్వాలి. 

ఆ తర్వాత అందులోనే  కొత్తిమీర ను  వేసి  మగ్గ నివ్వాలి .

మగ్గినవి  వేరే ప్లేటులోకి  తీసుకోవాలి .

తిరిగి  స్టౌ మీద బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసి  నూనె బాగా కాగగానే  వరుసగా  మెంతులు , ఎండుమిరపకాయలు , చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు  , ఇంగువ మరియు కరివేపాకును వేసి పోపు వేయించుకోవాలి .

పోపు చల్లారగానే  ముందుగా  రోటిలో  ఎండుమిరపకాయలు , తడిపిన చింతపండు మరియు ఉప్పు వేసి పచ్చడి బండతో  మెత్తగా  దంపుకోవాలి .

తర్వాత  మగ్గబెట్టిన  బీరకాయ , సొరకాయ మరియు పచ్చిమిర్చి  మిశ్రమము వేసి పచ్చడి బండతో  మెత్తగా  నూరుకోవాలి .

తర్వాత  మిగిలిన  పోపును కూడా వేసి బండతో మరోసారి  బాగా నూరుకుని , వేరే గిన్నెలోకి  తీసుకోవాలి .

అంతే. ఇంగువ మరియు  కొత్తిమీర  ఘమ ఘమలతో  బీరకాయ మరియు ఆనపకాయ  రోటి పచ్చడి దోశెలలోకి, రోటీల లోకి మరియు  భోజనము  లోకి  సర్వింగ్  కు సిద్ధం.

సంబంధించిన  రెసిపీ  మరియు  ఫోటో  నా స్వంతం.

వివిధ పప్పుధాన్యాలతో పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

కందిపప్పు , పచ్చిశనగపప్పు  మరియు చాయపెసరపప్పు  మూడు కలిపిన పచ్చడి .

కావలసినవి .

కందిపప్పు  -  ఒక కప్పు
పచ్చిశనగపప్పు  -  అర కప్పు
చాయపెసరపప్పు - పావు కప్పు
ఎండుమిరపకాయలు -  12
నూనె  - మూడు స్పూన్లు
జీలకర్ర  - ముప్పావు స్పూను
ఇంగువ - కొద్దిగా
చింతపండు  -  చిన్న నిమ్మకాయంత
పసుపు  --  కొద్దిగా
ఉప్పు   - తగినంత

తయారీ విధానము .

ముందుగా  చింతపండు  విడదీసి కొద్దిగా  నీళ్ళతో తడిపి ఉంచుకోవాలి .

స్టౌ  మీద బాండీ పెట్టి మొత్తము  నూనె వేసి నూనె బాగా కాగగానే , ముందుగా  కందిపప్పు , పచ్చిశనగపప్పు , ఎండుమిరపకాయలు మరియు  జీలకర్రను  వేసి పప్పును సగం వేగనివ్వాలి .

తర్వాత  అందులో చాయపెసరపప్పు  మరియు ఇంగువ వేసి పప్పులను  పూర్తిగా  కమ్మని వాసన వచ్చేదాకా  వేగనివ్వాలి .

చల్లారగానే  ముందుగా  ఎండుమిరపకాయలు , పసుపు  మరియు ఉప్పును మిక్సీ లో వేసి  మెత్తగా మిక్సీ వేసుకోవాలి .

తర్వాత  మిగిలిన  పప్పులు మరియు తడిపిన చింతపండును వేసి ,  కొద్దిగా  నీళ్ళు పోసుకుని మరీ  మెత్తగా కాకుండా  మిక్సీ   వేసుకోవాలి .

తర్వాత  వేరే  గిన్నెలో కి  తీసుకోవాలి .

తర్వాత   స్టౌ మీద పోపు గరిటె పెట్టి , రెండు స్పూన్లు  నెయ్యి వేసి  రెండు ఎండుమిర్చి  ముక్కలుగా చేసి , చాయమినపప్పు  అర స్పూను , ఆవాలు పావు స్పూను , కరివేపాకు  రెండు రెమ్మలు తో పోపు పెట్టుకుని   స్పూను తో కలుపు కోవాలి.

ఈ పచ్చడి ఇడ్లీ , దోశెలు, చపాతీలు , రోటీలు మరియు భోజనము లోకి కూడా చాలా రుచిగా  ఉంటుంది .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి