Wednesday, May 31, 2017

దోసకాయ పప్పు .

 దోసకాయ పప్పు .
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

ఆ మాత్రం దోసకాయ పప్పు చేసుకోవడం కూడా రాని వారుంటారా ?
ఇదొక రెసిపీ నా ? అని అనుకోవద్దు .
ఇప్పుడంతా కొత్త పోకడల వంటలు కదా .
దోసకాయ పప్పు అని చెప్పగానే వెంటనే
1. ఇందులో చింతపండు బదులు మామిడి కాయ ముక్కలు వేసుకుంటే taste అదిరి పోతుంది
2. మేము దోసకాయతో పాటు ఉల్లిపాయల బదులుగా టమోటో లు వేసుకుంటాము .
3. మేం దోసకాయ పప్పు లో చింతపండు వేయం . కొండ గోంగూర వెసుకుంటాం.
4 ఈ సారి ఇంగువ బదులు నాలుగు వెల్లుల్లి రెబ్బలు పోపులో తగిలించండి . Taste అదిరిపోతుంది .
5 . మేము గరమ్ మసాలా పొడి ఒక స్పూను వేసుకుంటాము .
ఈసారి మీరు కూడా తగిలించండి.
ఇలా రక రకాల కామెంట్లు కనిపిస్తాయి .
అలా మార్చి చేయడం తప్పని కాదు .
ఎవరి అభిరుచి ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు .
అయితే అసలు దోసకాయ పప్పు రెసిపీ మిస్ కాకూడదు కదా .
అంటే traditional రెసిపీ .
ఇంక అసలు కధ లోకి వద్దాము .
దోసకాయ పప్పు .
కావలసినవి .
కందిపప్పు ---- ఒక పెద్ద గ్లాసు .
పసుపు పచ్చని గట్టిగా ఉండే 
 దోసకాయ --- పెద్దది ఒకటి .

ఉల్లిపాయలు -- మూడు .
పచ్చి మిర్చి --- ఆరు .
చింతపండు --- నిమ్మకాయంత
కారం -- ఒక స్పూను
పసుపు --- పావు టీ స్పూను
ఉప్పు --- తగినంత
కరివేపాకు --- రెండు రెమ్మలు
పోపుకు .
నూనె --- మూడు స్పూన్లు
ఎండుమిరపకాయలు -- మూడు 
తుంపుకుని ముక్కలు చేసుకోవాలి .

మెంతులు -- పావు స్పూను
జీలకర్ర --- పావు స్పూను
ఆవాలు --- అర స్పూను
ఇంగువ --- కొద్దిగా .
కరివేపాకు --- రెండు రెమ్మలు .
తయారీ విధానము .
ముందుగా దోసకాయ పై చెక్కు తీసుకుని ముక్క , గింజలు చేదు ఉన్నాయో లేదో చూసుకుని , గింజలతో సహా ముక్కలు గా తరుగుకోవాలి .
ఉల్లిపాయలు ముక్కలుగా తరుగు కోవాలి .
చింతపండు విడదీసి కొద్ది నీళ్ళతో తడిపి ఉంచుకోవాలి .
పచ్చి మిర్చి నిలువుగా తరుగు కోవాలి .
మేము మా ఇంట్లో ఏ వంటకైనా కుక్కర్ వాడము .
గిన్నెలలోనే చేసుకుంటాము .
ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు వేసి ఒకసారి కడిగి తగినన్ని నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టి పప్పు మూడు వంతులు ఉడకనివ్వాలి .
ఉప్పు ముందు వేయ వద్దు .
పప్పు ఉడకదు .
తర్వాత దోసకాయ ముక్కలు , ఉల్లిపాయ ముక్కలు , తడిపిన చింతపండు , పచ్చిమిర్చి , కరివేపాకు , పసుపు వేసి మూత పెట్టి మరో పది నిముషాలు పూర్తిగా ఉడకనివ్వాలి .
తర్వాత ఒక స్పూను కారం , తగినంత ఉప్పువేసి రెండు నిముషాలు ఉడక నిచ్చి దింపు కోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే ముందు మెంతులు వేసి వేగనివ్వాలి .
తరువాత వరుసగా ఎండుమిర్చి ముక్కలు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు వేగగానే పప్పులో పోపు పెట్టుకుని గరిటతో బాగా కలుపుకోండి .

అంతే . ఇంగువ ఘమ ఘమ తో ఎంతో రుచిగా ఉండే ప్రాచీన వంటకం దోసకాయ పప్పు సర్వింగ్ కు సిద్ధం.
ఈ పప్పు అన్నం లోకి రోటీలలోకి కూడా బాగుంటుంది .
దోసకాయ పప్పు లో పాత తరం వాళ్ళు పప్పులో ఉల్లిపాయ వేస్తే దేవునికి నైవేద్యానికి పనికి రాదని , చాలా మంది ఇళ్ళల్లో పెద్ద ఉల్లిపాయ కూడా తినక పోవడం వల్ల ఉల్లిపాయ వేయకుండానే చేసేవారు.
మేం ఉల్లిపాయ వేసి ఒక సారి వేయకుండా మరోసారి రెండు రకములుగా కూడా చేసుకుంటాము .
నిజానికి 100% ప్రాచీన దోసకాయ పప్పు వంటకం ఉల్లిపాయ వేయనిదే.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి