Monday, May 29, 2017

కూటు

కూటు
ఆలూరి కృష్ణ ప్రసాద్

ప్రియమిత్రులారా !
ఈ రోజు పెసర పప్పు లేదా కందిపప్పు తో కూటు చేయడం గురించి మీకు తెలియచేస్తాను.
ఈ కూటుకు లేత ఆనపకాయ కానీ లేత బూడిద గుమ్మడికాయ కాయ కాని వేసుకోవాలి .
కావలసిన పదార్ధములు ; ---
కందిపప్పు లేదా 
పెసరపప్పు --- ఒక కప్పు
పచ్చిమిర్చి --- మూడు
చింతపండు --- నిమ్మకాయంత
నానబెట్టి గుజ్జు తీసుకోవాలి.
లేత ఆనపకాయ లేదా
లేత గుమ్మడికాయ -- చిన్నది - 1
కరివేపాకు --- మూడు రెమ్మలు
మినపప్పు --- ఒక స్పూన్
ఆవాలు --- 1/2 స్పూన్
ఇంగువ --- కొద్దిగా 
జీలకర్ర --- పావు స్పూను 
నూనె --- తగినంత 
పసుపు -- కొద్దిగా 
ఎండుమిర్చి -- మూడు
ఉప్పు -- తగినంత .

కూటు పొడికి కావలసిన దినుసులు ; --
ధనియాలు -- రెండు చెంచాలు 
జీలకర్ర --- అర చెంచా
మిరియాలు -- పావు చెంచా
ఎండు మిర్చి -- ఐదు లేక ఆరు
పచ్చి కొబ్బరి తురుము -- పావు కప్పు.

తయారు చేయు విధానము ; ---
ముందుగా కూటు దినుసులన్నీ నూనె లో వేయించి చల్లారాక
మిక్సీలో మెత్తని పొడిగా చేసుకోవాలి .

కందిపప్పు లేదా పెసర పప్పు శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేసి తగినన్ని నీళ్ళు పోయాలి . అందులో పై చెక్కు తీసిన లేత ఆనపకాయ లేదా బూడిద గుమ్మడికాయ ముక్కలు సన్నగా తరిగి తగినంత పసుపు , పచ్చి మిర్చి ముక్కలు , కరివేపాకు రెమ్మలు వేసి నాలుగు లేదా ఐ దు కూతలు వచ్చేదాకా ఉడికించాలి.
ఉప్పు ముందు వేయకూడదు.
వేస్తే పప్పు ఉడకదు.

ఆ తర్వాత చింతపండు మిశ్రమం , ముందు మనం సిద్ధం చేసుకున్న కూటు దినుసుల పొడి , తగినంత ఉప్పు వేసి కుక్కర్ విజిల్ తీసి మరో మూడు లేదా నాలుగు నిముషాలు ఉడికించాలి ,
ఆ తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి , నూనె బాగా కాగగానే , వరుసగా మూడు ఎండుమిర్చి ముక్కలుగా తుంపి , మినపప్పు , ఆవాలు , జీలకర్ర , ఇంగువ , మరియు రెండు రెమ్మలు కరివేపాకు వేసి పోపు వేయించి కూటులో కలపాలి .
ఘమ ఘమ లాడే కూటు అన్నం లేదా చపాతీలలోకి రెడీ .
ఈ ఫోటో లోని కూటు పెసర పప్పు తో చేసినది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి