Showing posts with label రసం. Show all posts
Showing posts with label రసం. Show all posts

Wednesday, July 4, 2018

టమోటో రసము

ఆలూరుకృష్ణప్రసాదు .

టమోటో  రసము .

తయారీ విధానము .

ఒక గిన్నెలో  మూడు గ్లాసులు  నీళ్ళు పోయండి .

అందులో నిమ్మకాయంత చింతపండు  వేయండి.

తగినంత  ఉప్పు వేయండి . రెండు పచ్చి మిరపకాయలు  తుంపి  అందులో వేయండి .

రెండు రెమ్మలు కరివేపాకు దూసి అందులో వేయండి . రెండు టమోటో లు  ముక్కలుగా  తరిగి  వేయండి . కొద్దిగా  పసుపు వేయండి .

మిక్సీ లో  మూడుస్పూన్ల ధనియాలు , మూడు ఎండుమిరపకాయలు , స్పూను  జీలకర్ర , పదిహేను మిరియాలు , స్పూనున్నర   పచ్చిశనగపప్పు ,  స్పూను కందిపప్పు  బాండీలో వేసి  నూనె వేయకుండా  ఒట్టి బాండీలో మరీ ఎర్రగా కాకుండా వేయించుకోండి .

తర్వాత అందులో  కొద్దిగా  ఇంగువ వేసి మిక్సీ లో మెత్తగా  పొడి  చేసుకోండి .

ఈ పొడిని ఒక సీసాలో భద్ర  పరచుకోండి .

రెండు మూడు సార్లు రసము పెట్టుకున్నప్పుడు  వాడుకోవచ్చును.

ఇప్పుడు స్టౌ మీద అన్నీ వేసి సిద్ధంగా  ఉంచుకున్న   రసము  పెట్టి  బాగా తెర్ల నివ్వండి.

అందులో  మనము సిద్ధం చేసుకున్న  రసము పొడి రెండు స్పూన్లు వేసి మరో మూడు నిముషములు తెర్ల నిచ్చి దింపుకుని , అందులో కొత్తిమీర  తుంపి వేసుకోండి.

ఇప్పుడు  స్టౌ మీద పోపు గరిటె పెట్టి రెండు స్పూన్లు  నూనె వేసి నూనె బాగా కాగగానే  ముందుగా  పావు స్పూనులో సగం మెంతులు వేయండి. తర్వాత రెండు ఎండుమిర్చి  ముక్కలుగా  తరిగి  వేయండి. పావు స్పూన్ జీలకర్ర , పావు స్పూను  ఆవాలు  మరియు కొద్దిగా  ఇంగువ వేసి  పోపు పెట్టుకుని , వేగిన పోపు రసము లో వేసుకుని  గరిటతో బాగా కలుపుకోండి .

ఇల్లంతా  ముక్కుపుటాలదిరిపోయే ఇంగువ వాసలతో టమోటో  రసము   సర్వింగ్  కు సిద్ధం .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .

Monday, July 17, 2017

కందిపప్పు చారు

టమోటో , మునగ కాడలు కందిపప్పు పప్పు  చారు .
ఆలూరు కృష్ణప్రసాదు .

తయారీ విధానము.
ఒక  అర కప్పు  కందిపప్పు   ఒకసారి  కడిగి  కుక్కర్  లో  సరిపడా  నీళ్ళు , రెండు  టమోటో లు  ముక్కలుగా  తరిగి  , మరియు  కొద్దిగా పసుపు  వేసి మూడు  విజిల్స్  వచ్చే వరకు   ఉంచి  స్టౌ  ఆపేయాలి .
తర్వాత  కుక్కర్  తీసి  పప్పు బాగా యెనిపి , అందులో  నాలుగు  పచ్చిమిర్చి  ముక్కలుగా తరిగి , రెండు  ములక్కాడలు  ముక్కలుగా  తరిగి , నిమ్మకాయంత  చింతపండు  రసం  ఒక గ్లాసు నీళ్ళలో   పది  నిముషాలు నానబెట్టిన  రసం ,  రెండు రెమ్మలు  కరివేపాకు  , సరిపడా  ఉప్పు వేసి  మరో గ్లాసు నీళ్ళు పోసి  స్టౌ మీద  పెట్టి   ములక్కాడలు  ఉడికే  వరకు  మరగనివ్వాలి .
ఆ తర్వాత   పప్పు చారు  దింపాలి .
తర్వాత  స్టౌ మీద  బాండీ  పెట్టి  రెండు  స్పూన్లు   నూనె  వేసి , నూనె  బాగా కాగగానే   వరుసగా  మూడు ఎండుమిరపకాయలు  ముక్కలుగా  చేసి , పావు స్పూను  జీలకర్ర  ,  అర స్పూను  ఆవాలు  ,  కొద్దిగా  ఇంగువ మరియు  కొద్దిగా  కరివేపాకు   వేసి  పోపు  పెట్టుకోవాలి .
ఆ తర్వాత  కొత్తిమీర   తరిగి   పైన  వేసుకోవాలి .
అంతే  ఘమ  ఘమ లాడే  ములక్కాడ  , టమోటో  కందిపప్పు  పప్పు చారు  సర్వింగ్  కు  సిద్ధం.

Sunday, June 25, 2017

పరుప్పు రసం

తమిళ  బ్రాహ్మణుల  పరుప్పు  రసం .
ఆలూరు కృష్ణప్రసాదు .

మేం  చెన్నై   లో   నాలుగు  సంవత్సరాలు  ఉన్నాము .
మేం  అక్కడ  ఉన్నప్పుడు  మేం  ఉన్న  కాలనీ  లో  తమిళ  బ్రాహ్మణులు   ఈ  తమిళుల  పరుప్పు రసం  ఎలా  చేసుకోవాలో  మాకు  నేర్పించారు .
తమిళం  లో  పరుప్పు  అంటే  పప్పు  అని  అంటారు . రసము  ను  చారు  అని కూడా  పిలుస్తారు .
కాబట్టి  మన భాష లో  చెప్పాలంటే  దీనిని  పప్పు చారు  అని   అనవచ్చు .
కాని  ఈ  పరుప్పు  రసం  మనం చేసే  విధానానికి   వారు  చేసే  విధానానికి   చాలా  వత్యాసం  ఉంది .
ఇందులో  మిరియాలు  , ధనియాలు , జీలకర్ర   మొదలైన  ఓషధ  విలువ కలిగిన  పదార్ధములు  కలుస్తాయి  కనుక   ఆరోగ్యానికి   మరీ  ముఖ్యంగా  జీర్ణ శక్తి  వృద్ధి చెందడానికి   చాలా  మంచిది .
పరుప్పు  రసము  తయారు  చేయు విధానము .
కావలసినవి  .
  
చింతపండు  ---  40  గ్రాములు

పచ్చిమిర్చి    ----   3
కరివేపాకు   --  మూడు రెమ్మలు.
కొత్తిమీర   --  ఒక  చిన్న కట్ట
టమోటో లు  --  2
  
నెయ్యి  ---  నాలుగు   స్పూన్లు

పసుపు   ---  కొద్దిగా
ఉప్పు   ---   తగినంత .
కందిపప్పు   ---  అర  కప్పు .
రసము  ముద్దకు  కావలసినవి .
ఎండుమిరపకాయలు   ---  3  
కందిపప్పు   ---    రెండు  స్పూన్లు .
ధనియాలు  --  రెండు స్పూన్లు .
మిరియాలు  ---  ఒక  స్పూను 
జీలకర్ర   ---  అర  స్పూను 
కరివేపాకు   ---  రెండు  రెమ్మలు .
ఇంగువ  ---  కొద్దిగా .

ముందుగా   చింతపండు   విడదీసి  గ్లాసు  నీళ్ళల్లో  పది నిముషాలు  నానబెట్టుకుని పల్చగా రసం  తీసుకుని అందులో  మరో  గ్లాసు  నీళ్ళు  పోసుకోవాలి .
టమోటో  లు  కొద్దిగా   నీళ్ళు  పోసి  ఉడికించుకుని  పై  తొక్క తీసుకుని   వేరేగా  ఉంచుకోవాలి .
టమోటో  లు  ఉడికించిన  నీళ్ళు    రసము  గిన్నెలో   పోసుకోండి .
అందులో  పసుపు ,  తరిగిన   పచ్చిమిర్చి  ,  తగినంత  ఉప్పు , రెండు  రెమ్మలు  కరివేపాకు   , అర స్పూను   పంచదార  వేసుకుని   పక్కన  ఉంచుకోవాలి  .
అర  గ్లాసు  కంది పప్పు  సరిపడా  నీళ్ళు  పోసి  కుక్కర్  లో మూడు  విజిల్స్  వచ్చే వరకు  ఉంచి  మెత్తగా   ఉడికించి , చల్లారి  మూత  రాగానే  గరిటతో  మెత్తగా  యెనుపు కోవాలి .
రసము  ముద్ద  తయారీ  విధానము .
స్టౌ  మీద  బాండీ  పెట్టి  రెండు  స్పూన్లు   నెయ్యి  వేసి  నెయ్యి   కాగగానే  వరుసగా   ఎండుమిర్చి  , కందిపప్పు  , ధనియాలు , మిరియాలు , ఇంగువ , జీలకర్ర  ,  మరియు  రెండు  రెమ్మలు  కరివేపాకు  వేసి  పోపు  వేయించుకోవాలి .
పోపు  చల్లారగానే  ఇవ్వన్నీ  మిక్సీ  లో  వేసి  కొద్దిగా   నీళ్ళు  పోసి   మెత్తగా   ముద్దలా  వేసుకోవాలి .
చివరగా  ఉడికిన  టమోటో లు కూడా  ఆ ముద్దలో  వేసి  మెత్తగా   మిక్సీ   వేసుకుని   వేరే  గిన్నెలో కి  తీసుకోవాలి .
ఇప్పుడు   స్టౌ   మీద   చింతపండు   రసము  ఉప్పు  మొదలైనవి  వేసిన  గిన్నె   పెట్టి  రసము  బాగా  తెర్లుతున్నప్పుడు , ఉడికించి  ఉంచుకున్న   కందిపప్పు   మరియు  వేరేగా  ఉంచుకున్న   రసము  ముద్ద కూడా  వేసి  బాగా  తెర్లనిచ్చి  దింపుకోవాలి .
ఆ తర్వాత   స్టౌ  మీద  బాండీ  పెట్టి   రెండు స్పూన్లు  నెయ్యి  వేసి  నెయ్యి  బాగా  కాగగానే    రెండు  ఎండుమిర్చి  ముక్కలుగా  చేసి , మెంతులు , ఆవాలు , జీలకర్ర  , ఇంగువ  మరియు  కరివేపాకు  తో  పోపు పెట్టు కోవాలి .
తర్వాత  పైన  కొత్తిమీర   వేసుకోవాలి .
అంతే  ఇడ్లీ లోకి , పూరీ , చపాతీలలోకి ,  వడల లోకి  మరియు  భోజనము   లోకి  ఎంతో  రుచికరమైన  తమిళ  బ్రాహ్మణ  పరుప్పు  రసము  సర్వింగ్   కు  సిద్ధం.

Monday, May 29, 2017

మైసూర్ రసం

మైసూర్ రసం 
ఆలూరి కృష్ణ ప్రసాద్

తయారీ విధానం.
కావలసిన పదార్ధములు ; ---
పచ్చి శనగపప్పు -- 50 గ్రాములు
చింతపండు --- 25 గ్రాములు
టమోటాలు --- ఓ మాదిరి సైజువి -- 4
కరివేపాకు --- మూడు రెమ్మలు 
 కొత్తిమీర --- ఒక చిన్న కట్ట 
పచ్చి మిరపకాయలు -- 3

మైసూర్ రసంలోకి ముద్ద తయారీ విధానం.
కావలసిన పదార్ధములు ---
ఎండు మిరపకాయలు -- 3
ధనియాలు --- 2 టీ స్పూన్లు
పచ్చి శనగపప్పు -- 1 స్పూన్ 
ఆవాలు -- తగినన్ని
మిరియాలు -- పావు టీ స్పూన్ 
ఇంగువ -- తగినంత
పచ్చి కొబ్బరి --- చిన్న గరిటెడు
--- తురిమినది .

తయారు చేయు విధానం ---
ముందుగా పచ్చి శనగపప్పు కడిగి తగినన్ని నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టి సగానికి పైగా ఉడక నివ్వాలి .
అలా ఉడికుతున్న సమయంలో టమోటాలు కాస్త పెద్ద ముక్కలుగా తరిగి అందులో వేసి ఉడక నివ్వాలి .
టమోటాలు ఉడికాక పై తొక్కను వలచి ముక్కలు పక్కన పెట్టుకోవాలి .
చింతపండులో తగినన్ని నీరు పోసి ఓ పావుగంట నాన బెట్టుకోవాలి.
తదుపరి మాములుగా పిండి రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి .

ఇప్పుడు మైసూర్ రసం ముద్ద కోసం స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్ల నూను వేసి నూనె బాగా కాగాక ఎండు మిరపకాయలు , ధనియాలు , పచ్చి శనగపప్పు , మిరియాలు వేసి వేగాక ఆవాలు ఇంగువ పచ్చి కొబ్బరి వేసి దింపి పక్కన పెట్టుకుని చల్లారాక మిక్సిలో వేసి తగినంత నీరు పోసి ముద్దగా చేసుకోవాలి.
ముద్ద మెత్త పడగానే ఉడికిన పచ్చి శనగపప్పు , ఉడికిన టమోటాలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఆ తర్వాత ఆ ముద్దను ఒక గిన్నె లోకి తీసుకొని అందులో ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు రసం కలుపుకుని సరిపడా నీళ్ళు చేర్చుకుని అందులో కొద్దిగా పసుపు , తరిగిన పచ్చిమిరపకాయలు , సరిపడా ఉప్పు , కరివేపాకును వేసి బాగా కలిపి స్టౌ మీద పెట్టి బాగా తెర్ల నివ్వాలి.
తర్వాత దింపి కొత్తిమీర వేసి పోపు పెట్టుకోవాలి.
ఆ పోపులో రెండు ఎండు మిరపకాయలు , కొద్దిగా మెంతులు , జీలకర్ర , ఆవాలు , ఇంగువా వేసి పెట్టు కోవాలి.
అంతే ఘమ ఘమ లాడే రుచికరమైన మైసూర్ రసం సిద్ధం.

ఇది రసం కనుక ఇతర ముక్కలు వేసుకోనవసరం లేదు .

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి