తమిళ బ్రాహ్మణుల పరుప్పు రసం .
ఆలూరు కృష్ణప్రసాదు .
మేం చెన్నై లో నాలుగు సంవత్సరాలు ఉన్నాము .
మేం అక్కడ ఉన్నప్పుడు మేం ఉన్న కాలనీ లో తమిళ బ్రాహ్మణులు ఈ తమిళుల పరుప్పు రసం ఎలా చేసుకోవాలో మాకు నేర్పించారు .
తమిళం లో పరుప్పు అంటే పప్పు అని అంటారు . రసము ను చారు అని కూడా పిలుస్తారు .
కాబట్టి మన భాష లో చెప్పాలంటే దీనిని పప్పు చారు అని అనవచ్చు .
కాని ఈ పరుప్పు రసం మనం చేసే విధానానికి వారు చేసే విధానానికి చాలా వత్యాసం ఉంది .
ఇందులో మిరియాలు , ధనియాలు , జీలకర్ర మొదలైన ఓషధ విలువ కలిగిన పదార్ధములు కలుస్తాయి కనుక ఆరోగ్యానికి మరీ ముఖ్యంగా జీర్ణ శక్తి వృద్ధి చెందడానికి చాలా మంచిది .
పరుప్పు రసము తయారు చేయు విధానము .
కావలసినవి .
చింతపండు --- 40 గ్రాములు
పచ్చిమిర్చి ---- 3
కరివేపాకు -- మూడు రెమ్మలు.
కొత్తిమీర -- ఒక చిన్న కట్ట
టమోటో లు -- 2
నెయ్యి --- నాలుగు స్పూన్లు
పసుపు --- కొద్దిగా
ఉప్పు --- తగినంత .
కందిపప్పు --- అర కప్పు .
రసము ముద్దకు కావలసినవి .
ఎండుమిరపకాయలు --- 3
కందిపప్పు --- రెండు స్పూన్లు .
ధనియాలు -- రెండు స్పూన్లు .
మిరియాలు --- ఒక స్పూను
జీలకర్ర --- అర స్పూను
కరివేపాకు --- రెండు రెమ్మలు .
ఇంగువ --- కొద్దిగా .
ముందుగా చింతపండు విడదీసి గ్లాసు నీళ్ళల్లో పది నిముషాలు నానబెట్టుకుని పల్చగా రసం తీసుకుని అందులో మరో గ్లాసు నీళ్ళు పోసుకోవాలి .
టమోటో లు కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకుని పై తొక్క తీసుకుని వేరేగా ఉంచుకోవాలి .
టమోటో లు ఉడికించిన నీళ్ళు రసము గిన్నెలో పోసుకోండి .
అందులో పసుపు , తరిగిన పచ్చిమిర్చి , తగినంత ఉప్పు , రెండు రెమ్మలు కరివేపాకు , అర స్పూను పంచదార వేసుకుని పక్కన ఉంచుకోవాలి .
అర గ్లాసు కంది పప్పు సరిపడా నీళ్ళు పోసి కుక్కర్ లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచి మెత్తగా ఉడికించి , చల్లారి మూత రాగానే గరిటతో మెత్తగా యెనుపు కోవాలి .
రసము ముద్ద తయారీ విధానము .
స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి కాగగానే వరుసగా ఎండుమిర్చి , కందిపప్పు , ధనియాలు , మిరియాలు , ఇంగువ , జీలకర్ర , మరియు రెండు రెమ్మలు కరివేపాకు వేసి పోపు వేయించుకోవాలి .
పోపు చల్లారగానే ఇవ్వన్నీ మిక్సీ లో వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా ముద్దలా వేసుకోవాలి .
చివరగా ఉడికిన టమోటో లు కూడా ఆ ముద్దలో వేసి మెత్తగా మిక్సీ వేసుకుని వేరే గిన్నెలో కి తీసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద చింతపండు రసము ఉప్పు మొదలైనవి వేసిన గిన్నె పెట్టి రసము బాగా తెర్లుతున్నప్పుడు , ఉడికించి ఉంచుకున్న కందిపప్పు మరియు వేరేగా ఉంచుకున్న రసము ముద్ద కూడా వేసి బాగా తెర్లనిచ్చి దింపుకోవాలి .
ఆ తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే రెండు ఎండుమిర్చి ముక్కలుగా చేసి , మెంతులు , ఆవాలు , జీలకర్ర , ఇంగువ మరియు కరివేపాకు తో పోపు పెట్టు కోవాలి .
తర్వాత పైన కొత్తిమీర వేసుకోవాలి .
అంతే ఇడ్లీ లోకి , పూరీ , చపాతీలలోకి , వడల లోకి మరియు భోజనము లోకి ఎంతో రుచికరమైన తమిళ బ్రాహ్మణ పరుప్పు రసము సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment