బీరకాయ ఉల్లికారము కూర .
ఆలూరి కృష్ణ ప్రసాద్
కావల్సిన వస్తువులు.
ఎండు మిరపకాయలు --- 6
పచ్చి శనగపప్పు --- పావు కప్పు
చాయ మినపప్పు --- పావు కప్పు
ఆవాలు ---- అర స్పూను
పెద్ద ఉల్లిపాయలు --- 4
ఉప్పు --- తగినంత
బీరకాయలు ---- 4
నూనె -- తగినంత
ఈ బీరకాయ ఉల్లికారం కూరకు
కాయలు ఎంత లేతగా ఉంటే కూర అంత రుచిగా ఉంటుంది.
ఫోటోలో చూపిన విధంగా సన్నగా ఓ మాదిరి పొడవైన కాయలు తీసుకోండి .
పైన చెక్కుని తీసి కాయ లోపల చేదు ఉందేమో చూసుకోండి .
చేదు కాయ చెక్కు రెండూ పారేయండి .
అలా చెక్కు తీసిన బీరకాయను
మధ్యలో రెండు లేక మూడు ముక్కలుగా చేసుకొని గుత్తి వంకాయ కూర చేసుకునే విధంగా కాయను నాలుగు పక్షాలుగా చేయండి. కాయను ముక్కలుగా కోయవద్దు . మిగిలిన అన్ని కాయలను అదే విధంగానే కోసుకోండి .
తీసిన బీర చెక్కును పార వెయ్యవద్దు. పక్కన పెట్టుకోండి.
లేత బీర చెక్కు అయితే నిక్షేపంగా పచ్చడి చేసుకో వచ్చు .
ఇప్పుడు ఉల్లిపాయలు పై పొట్టు తీసి పులుసు ముక్కల్లాగా పెద్ద ముక్కలు తరుగు కోండి.
ఆ తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి నాలుగు చెంచాలు నూనె వేసి నూనె బాగా కాగాక పచ్చి శనగపప్పు , చాయ మినపప్పు ,
ఎండు మిరపకాయలు , ఆవాలు వేసి పోపు కమ్మని వాసన వచ్చే దాక వేయించి అందులోనే తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మూత పెట్టి సన్నని సెగన ఒక అయిదు నిముషముల పాటు మగ్గనివ్వండి.
ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేదాక ఒక మాదిరిగా మగ్గితే చాలు. పూర్తిగా వేగ నివ్వద్దు .
ఇప్పుడు స్టౌ ఆపి పోపు చల్లారాక వేయిచుకున్న పోపు , తగినంత ఉప్పు వేసి రెండు మూడు సార్లు తిప్పి ముద్ద పూర్తిగా పేస్ట్ అయిపోకుండా తీసి ఒక ప్లేటులో పక్కన పెట్టుకోండి .
ఉల్లిపాయలలో తడి ఉంటుంది కనుక నీళ్ళు అసలు పోయవద్దు.
ఇప్పుడు నాలుగు పక్షాలుగా చేసుకున్న బీరకాయలలో ఆ ముద్దను కూరి కొంత ముద్దను విడిగా ఉంచుకోండి.
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి అయిదు ఆరు చెంచాలు నూనె వేసి నూనె బాగా కాగాక ఈ ఉల్లికారం కూరిన కాయలను నూనెలో వేసి మధ్య మధ్యలో అడుగంట కుండా అట్లకాడతో కలుపుతూ ఒక పది నిముషాలు మూత పెట్టి మగ్గ నివ్వండి . బీరకాయల్లో స్వతహాగా నీరు ఉంటుంది కనుక వేరుగా నీరు పోయనవసరం లేదు . కాయల్లోనుండి నీరు బయటకు వచ్చి ముక్కలు మగ్గుతాయి.
ఇలా ముక్కలు మగ్గాక మిగిలిన ముద్దను ఇప్పుడు వేసి మూతపెట్టకుండా మగ్గనివ్వండి.
ఒక అయిదు నుండి ఎనిమిది నిముషాల్లో నీరు ఇగిరిపోయి నూనె బయటకు వచ్చి కమ్మని వేగిన వాసన వస్తుంది .
తర్వాత వేసిన ముద్ద కూడా కాయలకు పడుతుంది .
ముద్ద మాడకుండా వేగిందో లేదో చూసుకుని ఇప్పుడు స్టౌ ఆపి మూత పెట్టి అయిదు నిముషాలు అయ్యాక కూరను వేరే Bowl లోకి తీసుకోండి .
అంతే ఘమ ఘమ వేగిన ఉల్లికారం సువాసనలతో బీరకాయ ఉల్లికారం కూర భోజనం లోకి సిద్ధం.
ఇప్పుడు చెప్పిన కూర గ్రేవి ఉంటుంది కాబట్టి బాగా ఆటు వస్తుంది.
కనీసం ఆరు మందికి సరిపోతుంది .
అదే బీరకాయలు కిలో కాయలు ముక్కలు తరిగి పోపులు వేసుకుంటే ముగ్గురుకు కూడా సరిపోదు.
ఇది కేవలం ఉల్లికారం కూర కాబట్టి పోపులో ధనియాలు , జీలకర్ర మెంతులు కరివేపాకు కొత్తిమీర వంటివి వాడలేదు .
మసాలా కూరగా చేసుకునే వారు అవి వారికి ఇష్టమైతే పై చెప్పినవి పోపులో వేసుకోవచ్చు .
0 comments:
Post a Comment