అరిసెలు
ఆలూరు కృష్ణప్రసాదు .
అరిసెలు తయారీ విధానము .
ఒక కె. జి . బియ్యము ముందు రోజు రాత్రి నీళ్ళలో నాన పోసుకోవాలి .
మరుసటి రోజు బియ్యాన్ని వడ కట్టి మిల్లులో మెత్తని పిండిలా వేయించుకోవాలి .
పిండి పట్టించి వెంటనే జల్లెడ పోసుకుని ఒక గిన్నెలో పోసి పిండిలోని తడి ఆరకుండా గట్టిగా నొక్కి పెట్టి ఉంచాలి .
ఒక వెడల్పాటి పాత్రలో ముప్పావు కిలో బెల్లం మెత్తగా పొడి చేసి వేసి బెల్లం మునిగే వరకు నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టి బెల్లం నీళ్ళలో వేసి చూస్తే పాకం ఉండగా అయ్యే విధంగా పాకం రానివ్వాలి .
అంటే పళ్ళెంలో నీళ్ళు పోసి పాకం అందులో వేసి చూస్తే ఉండలా కట్టే విధంగా పాకం రావాలి .
పాకం లో నాలుగు చెంచాల నెయ్యి వెయ్యాలి .
తర్వాత పాకంలో అర స్పూను యాలకుల పొడి వేసి స్టౌ మీద నుండి దింపి వెంటనే బియ్యపు పిండి పోస్తూ గరిటతో గబ గబా కలియ బెట్టు కోవాలి .
పాకం చల్లారక ముందే కలియబెట్టటం పూర్తవ్వాలి .
దింపగానే మరో నాలుగు చెంచాలు నెయ్యి వెయ్యాలి .
అలా రెండుసార్లు నెయ్యి వేసుకుంటే పాకం రుచిగా మృదువుగా ఉండటమే కాక ఉండలుగా చేయటానికి అనువుగా వస్తుంది .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి ముప్పావు కే .జి . నూనె పోసి నూనెను బాగా కాగనివ్వాలి .
చలిమిడి చల్లారగానే పిండిని ముద్దలుగా చేసుకుని ఒక ప్లాస్టిక్ కవరు మీద చేతికి నూనె రాసుకుని ముద్దను చేతితో పల్చగా వత్తుకుని కాగిన నూనెలో వేసి చక్కగా రంగు వచ్చే వరకు వేయించుకొని , అరిసెల చెక్కల మధ్య పెట్టి గట్టిగా నొక్కుకొని నూనె పూర్తిగా పోయాక అరిసెలు తీసి వెడల్పాటి పళ్ళెంలో కాస్త ఆరనిస్తే బాగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి .
మెత్తగా కావాల్సిన వారు కొంచెం నొక్కితే సరిపోతుంది .
అరిసెలు చేయడానికి మరో మనిషి సాయం ఉంటే సులువుగాను , త్వరగాను అయిపోతుంది .
ఈ అరిసెలు నెల రోజులు పైగా నిలవ ఉంటాయి .
బాలింతలు ఆర్నెల్ల వరకు అరిసెలు తినకూడదు .
0 comments:
Post a Comment