Thursday, June 1, 2017

పాత చింతకాయ పచ్చడితో

పాత చింతకాయ పచ్చడితో 
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

మొన్న మా బంధువులింటికి వెళ్ళి నపుడు వాళ్ళ పనిమనిషి ఇత్తడి బిందె తోమడానికి ఏదైనా వేయండమ్మా అని అడిగితే ఆవిడ ఒక పళ్ళెంలో పెద్ద నిమ్మకాయంత చింతకాయ పచ్చడి తెచ్చి పనిమనిషికి ఇచ్చి మా వైపు చూస్తూ " కొత్త చింతకాయ పెట్టు కున్నాము . పిల్ల లెవరూ ఈ పాత చింతకాయ పచ్చడి మొహం చూడరు. అయిపోయే దాకా ఇత్తడి గిన్నెలు తోమడానికి పనిమనిషికి ఇదే ఇస్తాను. కనీసం చింతపండు ఖర్చు ఆదా అవుతుంది " అని అంది.
మా చిన్న అమ్మమ్మ పాత చింతకాయ తో ఏం చేసేదో చెప్పాను .
నిజమా అని నోరు వెళ్ళ బెట్టింది .
మరి ఆమె ఏం చేసేది ?
స్టౌ మీద బాండీ పెట్టి నాలుగు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే పది ఎండు మిరపకాయలు , అర స్పూను మెంతులు , స్పూనున్నర మినపప్పు , అర స్పూను ఆవాలు, కొద్దిగా ఇంగువ వేసి పోపు వేయించుకునేది .
ఒక కప్పు పాత చింతకాయ పచ్చడి తీసుకునేది . ఒక 40 గ్రా. బెల్లం తీసుకునేది . కొద్దిగా ఉప్పు తీసుకునేది .
రోటి దగ్గరకు వెళ్ళి పచ్చడి బండతో ముందు పోపంతా వేసి దంపుకుని మెత్తగా నలిగాక ఉప్పు బెల్లం వేసి మెత్తగా దంపి తర్వాత పాత చింతకాయ పచ్చడి వేసి పొత్రము తో మధ్ధ మధ్య నీళ్ళు చిలకరించుకుంటూ మెత్తగా కాటుకలా రుబ్బేది .
మేము స్కూల్ నుంచి రాగానే రండిరా టిఫిన్ పెడతాను అంటూ రెండు దోశెలు ఈ పచ్చడి వేసి పెట్టేది.
మేమంతా ఏం పచ్చడి అమ్మమ్మా ? చాలా బావుంది . అంటే ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ చింతపండు పచ్చడిరా అన్నది .
అప్పుడు మాకేం తెలుసు అది చింతపండు పచ్చడి కాదు పాత చింతకాయ పచ్చడి తో చేసిందని .
ఈ పచ్చడి మిక్సీలో కూడా చేసుకోవచ్చు .
తీపి ఇష్టమైతే ఇలా చేసుకుని చూడండి .
మేం అన్నం లో తింటాం .
దోశెలలోకి బాగుంటుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి