కొత్తిమీర నిల్వ పచ్చడి .
ఆలూరి కృష్ణ ప్రసాద్
కావలసినవి .
కొత్తిమీర పెద్ద కట్టలు సీజన్ బట్టి రూ.5/- రూ . 10/- కు దొరుకుతాయి .
అటువంటివి మూడు కట్టలు తీసుకొని వేళ్ళు మరియు పెద్ద కాడలు తీసివేసి చిన్న కొమ్మలతో ఉన్న కొత్తిమీర తీసుకొని శుభ్రంగా కడిగి నీడన ఆర బెట్టు కోవాలి .
చింతపండు --- 75 గ్రాములు
నూనె ---- 50 గ్రాములు
ఎండుమిరపకాయలు -- 20
మెంతులు -- పావు స్పూను
ఆవాలు --- స్పూను
జీలకర్ర --- అర స్పూను
ఇంగువ -- మరి కాస్త
పసుపు -- పావు స్పూను
ఉప్పు --- తగినంత
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి , నూనె బాగా కాగగానే ఆరిన కొత్తిమీర ను తడిపోయేవరకు వేయించుకోవాలి .
తర్వాత అందులో చింతపండు , కొద్దిగా పసుపు , తగినంత ఉప్పు వేసి వేసి ఒక పది నిముషముల పాటు మగ్గనివ్వాలి .
తర్వాత మళ్ళీ స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి , ఎండుమిర్చి , మెంతులు , జీలకర్ర , వేసి పోపు వేయించుకోవాలి .
పోపు చల్లారగానే ముందు పోపునంతా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
తర్వాత అందులో మగ్గిన కొత్తిమీర ను వేసి మరోసారి మిక్సీలో మెత్తగా తిప్పు కోవాలి
తర్వాత మరోసారి బాండీ పెట్టి మిగిలిన నూనె అంతా పోసి నూనె బాగా కాగగానే మరి కాస్త ఇంగువ , ఆవాలు వేసి పోపు వేయించి పచ్చడిలో కలుపు కోవాలి .
తర్వాత వేరే జాడీలో తీసుకోవాలి .
ఈ పచ్చడి అన్నం లోకి రోటీలలోకి మరియు దోశెల లోకి బాగుంటుంది .
ఒక నెల రోజులు నిల్వ ఉంటుంది .
0 comments:
Post a Comment