రాచ ఉసిరి కాయలతో పప్పు
ఆలూరుకృష్ణప్రసాదు .
రాచ ఉసిరి కాయలతో పప్పు .
కావలసినవి .
రాచ ఉసిరి కాయలు -- 200 గ్రా
కందిపప్పు -- 150 గ్రా
పచ్చి మిరపకాయలు -- 6
కరివేపాకు -- నాలుగు రెమ్మలు
పసుపు -- కొద్దిగా
ఉప్పు --- తగినంత
కారం --- ఒకటిన్నర స్పూను
పోపుకు .
నూనె --- మూడు స్పూను
ఎండుమిరపకాయలు --- మూడు
ముక్కలుగా చేసుకోవాలి .
మెంతులు --- పావు స్పూను
జీలకర్ర -- పావు స్పూను
ఆవాలు --- అర స్పూను
ఇంగువ --- కొద్దిగా
తయారీ విధానము .
ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు వేసుకుని ఒకసారి కడిగి తగినన్ని నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టుకోవాలి .
రాచ ఉసిరి కాయలు కట్ చేసుకుని లోపల గింజ తీసి ముక్కలుగా తరుగు కోవాలి .
పచ్చిమిర్చి నిలువుగా తరుగు కోవాలి .
పప్పు మూడొంతులు ఉడకగానే రాచ ఉసిరి ముక్కలు , పచ్చిమిర్చి , కరివేపాకు , కొద్దిగా పసుపు వేసి పప్పును పూర్తిగా ఉడకనివ్వాలి .
పప్పు ఉడికాక తగినంత ఉప్పు , ఒక స్పూను కారం వేసి మరో మూడు నిముషాలు ఉంచి దింపు కోవాలి .
తదుపరి స్టౌ మీద పోపు గరిటె పెట్టి నూనె వేసి నూనె కాగగానే ఎండుమిర్చి , మెంతులు , జీలకర్ర ,
ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు పెట్టుకుని పప్పులో కలుపుకుని గరిటతో బాగా కలుపుకోవాలి .
వెల్లుల్లి ఇష్టమైన వారు ఇంగువ బదులు ఒక ఆరు వెల్లుల్లి రేకలు పోపులో వేసుకోవచ్చు .
ఇదే విధంగా పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు .
అంతే ఇంగువ సువాసనతో రాచ ఉసిరి కాయలతో పప్పు సర్వింగ్
కు సిద్ధం .
0 comments:
Post a Comment