Monday, September 3, 2018

వామన చింతకాయలు

ఆలూరుకృష్ణప్రసాదు .

వామన చింతకాయలు .

వామన చింతకాయలు అంటే  కొత్తగా  సీజన్లో  చింత చెట్లకు  కాసే, గింజ పట్టని  చిన్న చిన్న చింతకాయలు.

ఇవి చిన్నవిగా ఉంటాయి కనుక వామనుల వారు కూడా పొట్టిగా  ఉంటారు కనుక మా ప్రాంతంలో  వీటిని  వామన చింతకాయలు లేదా  చిట్టి /  పొట్టి చింతకాయలు అని అంటాము .

ఈ చింతకాయలతో  పులిహోర  చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

మనం  ఇంట్లో చేసుకునే పులిహోరకు , గుళ్ళో మనకు ఆచార్యుల వారు పెట్టే పులిహోరకు  రుచిలో చాలా తేడా ఉంటుంది .

గుళ్ళో ప్రసాదం రుచి మనకు  ఇంట్లో రాదు.

కారణం మనం పులిహోరలో చింతపండు రసం వాడతాము.

ఆచార్యుల వారు చింతకాయలు  తొక్కి పులిహోర లో వేసి తయారు చేస్తారు .

అదే ప్రధానమైన తేడా.

ఈ విషయం నా చిన్ననాటి పూజారి స్నేహితుడు  చెప్పారు .

ఇంక వామన చింతకాయలతో పులిహోర ఏ విధముగా  తయారు చేస్తారో  మనం తెలుసుకుందాం .

వామన చింతకాయలతో పులిహోర .
**********************

వామన చింతకాయులు. --
ఒక  100  గ్రాములు .

ఈ కాయలను  శుభ్రంగా  కడిగి ఆర నిచ్చి , చిన్న ముక్కలుగా తరుగుకొని , తగినంత  ఉప్పు  మరియు అర స్పూను పసుపు వేసుకుని  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

ఈ మొత్తం  100  గ్రాముల  పచ్చడిలో  సగం పచ్చడి అంటే షుమారు 50  గ్రాముల  పచ్చడి తీసుకోవాలి .

మిగిలిన  పచ్చడి విడిగా చిన్న జాడీ లోకి తీసుకుంటే ,తర్వాత అవసరమైనప్పుడు  మనం మామూలుగా  చింతకాయ పచ్చడి భోజనాలలోకి చేసుకోవచ్చును.

పచ్చిమిర్చి  --  10
కరివేపాకు  --  నాలుగు  రెమ్మలు .
బియ్యము  --  ఒక గ్లాసు లేదా
షుమారు  150  గ్రాములు.
పసుపు --  అర  స్పూను
ఉప్పు  --  తగినంత .

పోపునకు.

ఎండుమిరపకాయలు  -- 8 .
పచ్చిశనగపప్పు  -- రెండు స్పూన్లు .
చాయమినపప్పు --  రెండు స్పూన్లు
వేరుశనగ గుళ్ళు -- నాలుగు స్పూన్లు .
ఆవాలు --  ముప్పావు స్పూన్ .
జీడిపప్పు  --  8  పలుకులు .
ఇంగువ  - తగినంత .
నూనె  --  125 గ్రాములు.

తయారీ విధానము .

ఒక గ్లాసు  బియ్యం కడిగి  తగినన్ని  నీళ్ళు పోసుకుని స్టౌ మీద పెట్టి  కొంచెం  పొడి పొడి లాడే విధముగా  వండుకోవాలి .

ఇప్పుడు  ఒక బేసిన్ లో ఉడికిన అన్నం వేసుకుని ,  అందులో పావు స్పూను పసుపు , రెండు రెమ్మలు కరివేపాకు , కొద్దిగా  ఉప్పు మరియు  ఒక అర గరిటెడు  నూనె వేసి , గరిటెతో వేడి మీదనే బాగా కలుపు కోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండి  పెట్టి మిగిలిన మొత్తము  నూనె వేసుకుని , నూనె బాగా కాగగానే  వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , ఆవాలు,  ఇంగువ , వేరుశనగ గుళ్ళు మరియు  జీడిపప్పు ను వేసి పోపును బాగా వేగనివ్వాలి .

తర్వాత అందులో పచ్చి మిర్చి , కరివేపాకును వేసి రెండు నిముషాలు  పచ్చి మిర్చి ని  మగ్గ నివ్వాలి .

తర్వాత  మిక్సీ  వేసుకుని  సిద్ధంగా  ఉంచుకున్న  చింతకాయల  మిశ్రమమును కూడా పోపులో వేసుకుని  రెండు నిముషాలు  ఈ మిశ్రమము పచ్చి వాసన పోయేదాకా  మగ్గనివ్వాలి.

తర్వాత  ఈ పోపును  బెసిన్ లో సిద్ధంగా  ఉంచుకున్న  అన్నము లో వేసుకుని  చేతితో  నాలుగు  మూలలా  బాగా కలిసే విధముగా  కలుపుకోవాలి .

చింతకాయల మిశ్రమములో మరియు  అన్నము లో  సరిపడే  ఉప్పు వేసుకుంటాము  కనుక రుచి చూసి ఉప్పు తగ్గితే కలుపుకోండి .

అంతే ఘుమ ఘుమ  లాడే  ఇంగువ వాసనతో  వామన చింతకాయలతో పులిహోర  సర్వింగ్  కు సిద్ధం.

ఇప్పుడు  మార్కెట్లో ఈ చిన్న చింతకాయలు బాగా దొరుకుతున్నాయి  .

కనుక  ఇప్పుడు ఈ వామన చింతకాయల పులిహోర చేసుకోవచ్చును.

శ్రావణ మాసం లో లక్ష్మీ అమ్మ వారికి , భాద్రపద మాసంలో గణపతికి , ఆశ్వయుజ మాసంలో  దుర్గా  దేవికి  మహా నైవేద్యం గా కూడా  ఈ పులిహోర నివేదన చేయవచ్చును .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటోలు నా స్వంతం .

1 comments:

  1. Dear Sir,
    Namaskaram ! I came to know about you from Rajyalakshmi sakahara vantalu and have been following your recipes since then. I share your recipes with my mother and sisters and we all appreciate them very much, Thank you for sharing them, They are very colorful and appealing,I have a made a payment on paytm for your book . I did not get any acknowledgment and I am not sure how this way will work out. I am assuming paytm will forward my address to you . I did not find any contact email of yours hence I am posting a comment here.
    Regards,
    Usha Rani P

    ReplyDelete

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి