ఆలూరుకృష్ణప్రసాదు .
ముక్కల పులుసు .
కావలసినవి .
చింతపండు -- 50 గ్రాములు విడదీసి 15 నిముషముల ముందు వేడి నీటిలో నానబెట్టి ఒక గ్లాసు చిక్కని రసం తీసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి.
ఆనపకాయ / సొరకాయ -- లేతది.
కాయలో సగం ముక్క లేదా షుమారు 150 గ్రాముల ముక్క.
దోసకాయ -- ఒకటి
బెండకాయలు -- ఎనిమిది
టమోటోలు -- రెండు
వంకాయలు -- రెండు
పచ్చి మిర్చి --- 5
కరివేపాకు -- మూడు రెబ్బలు
కొత్తిమీర --- ఒక కట్ట
పసుపు --- కొద్దిగా
ఉప్పు --- తగినంత
బియ్యపు పిండి -- స్పూనున్నర
కారం --- అర స్పూను .
పోపుకు .
నూనె --- రెండుస్పూన్లు
ఎండుమిరపకాయలు -- 3
మెంతులు --- కొద్దిగా
జీలకర్ర --- పావు స్పూను
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
బెల్లం -- చిన్న ముక్క
తయారీ విధానము .
అనపకాయ / సొరకాయ పై చెక్కు తీసి ముక్కలుగా తరుగు కోవాలి.
అదే విధంగానే దోసకాయ కూడా పై చెక్కు తీసి గింజల చేదు చూసుకుని ముక్కలుగా తరుగు కోవాలి.
వంకాయలు , టమోటోలు మరియు బెండకాయలు ముక్కలుగా తరుగు కోవాలి .
పచ్చిమిర్చి నిలువుగా చీలికలు గా తరగాలి .
ఒక గిన్నెలో ఈ తరిగిన ముక్కలన్నీ వేసి , చింతపండు రసం వేసి మరి ఒక రెండు గ్లాసుల నీళ్ళు పోయాలి .
అందులో పసుపు , ఉప్పు , చిన్న బెల్లం ముక్క వెయ్యాలి .
పచ్చిమిర్చి , కరివేపాకు కూడా వెయ్యాలి .
ఇప్పుడు స్టౌ వెలిగించి ఈ పులుసు గిన్నె పెట్టి మీడియం సెగన ముక్కలన్నీ ఉడికి దగ్గర పడేలా ఉడకనివ్వాలి . తర్వాత అర స్పూను కారం వెయ్యాలి.
తర్వాత ఒక అర గ్లాసు నీళ్ళలో ఒకటిన్నర స్పూను బియ్యపు పిండి వేసి చేత్తో బాగా కలిపి మరుగుతున్న పులుసు లో పోయాలి .
మరో మూడు నిముషముల తర్వాత పులుసు చిక్క పడగానే దింపుకోవాలి .
తర్వాత స్టౌ మీద పోపు గరిట పెట్టుకుని రెండు స్పూన్లు నూనె వేసి నూనె కాగగానే ఎండుమిర్చి , మెంతులు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ వేసి పోపు పెట్టు కోవాలి .
పైన తరిగిన కొత్తిమీర వేసుకోవాలి .
అంతే ఘమ ఘమ లాడే ఇంగువ పోపుతో ఆనప కాయ దోసకాయ వంకాయ బెండకాయల ముక్కల పులుసు సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment