Showing posts with label పులుసులు. Show all posts
Showing posts with label పులుసులు. Show all posts

Monday, September 3, 2018

ముక్కల పులుసు

ఆలూరుకృష్ణప్రసాదు .

ముక్కల  పులుసు .

కావలసినవి .

చింతపండు  --  50 గ్రాములు విడదీసి  15 నిముషముల ముందు  వేడి నీటిలో నానబెట్టి ఒక గ్లాసు చిక్కని రసం తీసుకొని  సిద్ధంగా  ఉంచుకోవాలి.

ఆనపకాయ /   సొరకాయ  -- లేతది.
కాయలో  సగం  ముక్క లేదా షుమారు 150 గ్రాముల ముక్క.
దోసకాయ   --  ఒకటి
బెండకాయలు  --  ఎనిమిది
టమోటోలు  --  రెండు
వంకాయలు -- రెండు
పచ్చి మిర్చి  ---   5
కరివేపాకు  --   మూడు  రెబ్బలు
కొత్తిమీర    ---  ఒక  కట్ట
పసుపు  ---   కొద్దిగా
ఉప్పు  ---  తగినంత
బియ్యపు  పిండి  --   స్పూనున్నర
కారం  ---  అర స్పూను .

పోపుకు  .

నూనె  ---   రెండుస్పూన్లు
ఎండుమిరపకాయలు   --  3
మెంతులు ---   కొద్దిగా
జీలకర్ర  ---  పావు స్పూను
ఆవాలు  --  అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా
బెల్లం  --  చిన్న ముక్క

తయారీ  విధానము .

అనపకాయ /  సొరకాయ  పై చెక్కు తీసి  ముక్కలుగా  తరుగు కోవాలి.

అదే  విధంగానే   దోసకాయ  కూడా  పై  చెక్కు  తీసి  గింజల  చేదు  చూసుకుని   ముక్కలుగా   తరుగు  కోవాలి.

వంకాయలు , టమోటోలు  మరియు  బెండకాయలు ముక్కలుగా  తరుగు కోవాలి .

పచ్చిమిర్చి   నిలువుగా   చీలికలు  గా  తరగాలి  .

ఒక  గిన్నెలో  ఈ  తరిగిన   ముక్కలన్నీ  వేసి  , చింతపండు  రసం వేసి  మరి ఒక  రెండు  గ్లాసుల  నీళ్ళు పోయాలి .

అందులో  పసుపు , ఉప్పు , చిన్న బెల్లం  ముక్క వెయ్యాలి .

పచ్చిమిర్చి , కరివేపాకు   కూడా  వెయ్యాలి .

ఇప్పుడు  స్టౌ  వెలిగించి   ఈ  పులుసు  గిన్నె  పెట్టి  మీడియం  సెగన  ముక్కలన్నీ  ఉడికి  దగ్గర  పడేలా  ఉడకనివ్వాలి . తర్వాత అర స్పూను  కారం వెయ్యాలి.

తర్వాత  ఒక  అర గ్లాసు  నీళ్ళలో   ఒకటిన్నర   స్పూను  బియ్యపు  పిండి  వేసి  చేత్తో బాగా  కలిపి  మరుగుతున్న పులుసు లో  పోయాలి .

మరో మూడు నిముషముల తర్వాత పులుసు  చిక్క పడగానే  దింపుకోవాలి .

తర్వాత  స్టౌ  మీద  పోపు  గరిట  పెట్టుకుని  రెండు స్పూన్లు   నూనె  వేసి  నూనె కాగగానే  ఎండుమిర్చి , మెంతులు , జీలకర్ర  , ఆవాలు , ఇంగువ  వేసి  పోపు  పెట్టు కోవాలి .

పైన  తరిగిన   కొత్తిమీర   వేసుకోవాలి .

అంతే  ఘమ  ఘమ  లాడే  ఇంగువ  పోపుతో ఆనప కాయ  దోసకాయ  వంకాయ  బెండకాయల ముక్కల   పులుసు  సర్వింగ్   కు  సిద్ధం.

టమోటో పచ్చి పులుసు

ఆలూరుకృష్ణప్రసాదు .

టమోటో  పచ్చి పులుసు .

కావలసినవి .

మంచి రంగు వచ్చి గట్టిగా  ఉన్న టమోటోలు  --  పావు కిలో  లేదా  4
ఉల్లిపాయలు  ---  3
పచ్చిమిరపకాయలు  --  5 
చింతపండు  --  టమోటో లో కొంచెం  పులుపు ఉంటుంది  కనుక  చిన్న నిమ్మకాయంత  చింతపండు  సరిపోతుంది .
పసుపు  --  కొద్దిగా
ఉప్పు  --  తగినంత
కరివేపాకు  --  మూడు  రెమ్మలు
కొత్తిమీర  --  ఒక  చిన్న కట్ట
నూనె  --  నాలుగు  స్పూన్లు

పోపుకు .

ఎండుమిరపకాయలు  --  3
చాయమినపప్పు --  ఒక స్పూను
జీలకర్ర   --  పావు  స్పూను
ఆవాలు  --  అర స్పూను 
ఇంగువ  --  కొద్దిగా

తయారీ  విధానము .

ముందుగా  టమోటో లు ముక్కలుగా  తరుగు కోవాలి .

నిమ్మకాయంత  చింతపండు   గ్లాసు  నీళ్ళలో  పదిహేను  నిముషాలు   నాన బెట్టుకుని , పల్చగా  గ్లాసు  రసం  తీసి  వేరే  గిన్నెలో   ఉంచుకోవాలి .

గ్లాసు  రసం  సిద్ధం  చేసుకోవాలి .

ఉల్లిపాయలు   సన్నని  ముక్కలుగా  తరుగు కోవాలి .

పచ్చి మిరపకాయలు   చిన్న ముక్కలుగా  తరుగు కోవాలి .

ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసి నూనె బాగా కాగగానే  తరిగిన  టమోటో  ముక్కలను మరియు కొద్దిగా  పసుపును వేసి , మూత పెట్టి   ఏడెనిమిది నిముషాలు ముక్కలను మగ్గనివ్వాలి.

తర్వాత చింతపండు  రసం  వేరే గిన్నెలో  వేసుకుని  మగ్గిన టమోటో  ముక్కలు అందులో వేసుకుని  చేతితో బాగా నలుపు కోవాలి.

తర్వాత తరిగిన  పచ్చిమిర్చి  ముక్కలు , సరిపడా  ఉప్పు , కరివేపాకు , తరిగిన  కొత్తిమీర  వేసి
చెత్తో  మగ్గిన టమోటో లు   చింతపండు  రసం  బాగా  కలిసే విధంగా  కలుపుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి మిగిలిన మొత్తము   నూనె  వేసి  నూనె  బాగా కాగగానే  వరుసగా  ఎండుమిర్చి  ముక్కలు , చాయమినపప్పు , జీలకర్ర  , ఆవాలు , ఇంగువ , కరివేపాకు  వేసి  పోపు  వేగగానే  తరిగిన   ఉల్లిపాయ  ముక్కలు  పోపులో  వేసి   ఉల్లిపాయలు   బంగారు  రంగు  వచ్చే  వరకు  మూత పెట్టి  మగ్గనివ్వాలి .

తర్వాత  మగ్గపెట్టిన  ఉల్లిపాయలు టమోటో  పచ్చిపులుసు  మిశ్రమం  లో  వేసి  గరిటతో  బాగా  కలుపు  కోవాలి .

కొంతమంది సన్నగా  తరిగిన పచ్చి ఉల్లిపాయల  ముక్కలు  వేయించకుండా పచ్చివే పులుసులో కలుపుతారు.

ఆ విధంగా చేసినా  చాలా రుచిగా ఉంటుంది .

కొంతమంది  టమోటోలు  నూనెలో మగ్గ పెట్టకుండా  సిమ్ సెగన  స్టౌ పైన  కాయలు  చిట్లకుండా కాల్చి  , కాలిన పై పొర తీసి వేసి  పులుసు పచ్చడిలో  వంకాయలు పులుసు  పచ్చడి చేసే విధముగా కలుపుతారు .

ఆ విధముగా  కూడా  రుచిగా  ఉంటుంది.

అంతే  అన్నం లోకి  మరియు  చపాతీలలోకి  ఎంతో  రుచిగా  ఉండే టమోటో  పచ్చిపులుసు 
సర్వింగ్  కు  సిద్ధం .

కాంబినేషన్ గా కంది పచ్చడి , పచ్చిశనగపప్పు  పచ్చడి  మరియు కందిపొడి  బాగుంటాయి .

Saturday, April 14, 2018

సాంబార్

ఆలూరుకృష్ణప్రసాదు .

సాంబార్ . ( సాంబారు పొడి కాకుండా  ముద్ద వేసి )

కావలసినవి .

కందిపప్పు  ---  ఒక గ్లాసు
చింతపండు  --  40  గ్రాములు
ఆనపకాయ /  సొరకాయ   --పావుకిలో  పై చెక్కు  తీసి ముక్కలుగా  తరుగుకోవాలి .
ములక్కాడలు  --  రెండు . ముక్కలుగా  తరుగు కోవాలి.
బెండకాయలు  --  8  ముక్కలుగా  తరుగు కోవాలి.
వంకాయలు  --  రెండు  నీళ్ళలో  ముక్కలుగా  తరుగు కోవాలి
పచ్చిమిర్చి  --  6  నిలువుగా   చీలికలు గా  తరుగు కోవాలి
కరివేపాకు  --  మూడు  రెమ్మలు
కొత్తిమీర   --  ఒక కట్ట
పసుపు  --  కొద్దిగా
ఉప్పు  ---  తగినంత
బెల్లం  --  కొద్దిగా  

పోపుకు .

ఎండుమిరపకాయలు  --  మూడు
ఆవాలు -- అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా
నూనె  --  రెండు స్పూన్లు

సాంబారు ముద్ద.
***********

చాలామంది  సాంబారు పెట్టేటప్పుడు  " సాంబారులో  వేసుకునే  ముద్ద ఎలా తయారు  చేస్తారు ?

అందులో  ఏ ఏ పదార్థాలు  వాడతారు ?

తెలియ చెయ్యమని  " అడుగుతున్నారు .

అందువలన  సాంబారు  ముద్ద  లో ఏ ఏ పదార్థాలు  వేసుకోవాలో , ఎలా  
తయారు చేసుకోవాలో  సభ్యులందరి సౌలభ్యం  కొరకు  తెలియచేస్తున్నాను .

సాంబారు  ముద్ద.
************

కావలసినవి .

ఎండుమిరపకాయలు  - 5
పచ్చిశనగపప్పు  --  రెండు స్పూన్లు .
ధనియాలు --  రెండు స్పూన్లు
మెంతులు --  పావు స్పూను
ఆవాలు -- పావు స్పూను
ఇంగువ  -- కొద్దిగా
మిరియాలు --  అర స్పూను
బియ్యము  -  స్పూను
ఎండు కొబ్బరి /  లేదా  పచ్చి కొబ్బరి  -- అర చిప్ప.
చిన్న ముక్కలుగా  చేసుకోవాలి .
నూనె  -  మూడు  స్పూన్లు

సాంబారు  ముద్ద తయారీ విధానము .
**************

ముందుగా  స్టౌ వెలిగించి  బాండీ పెట్టి  మొత్తం  నూనె వేసి , నూనె బాగా కాగగానే  ముందు మెంతులు వేసి మూడు వంతులు వేగ నివ్వాలి .

మెంతులు సరిగ్గా  వేగకపోతే  సాంబారు  చేదు వస్తుంది .

తర్వాత వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , ధనియాలు , మిరియాలు ,  బియ్యము , ఆవాలు మరియు ఇంగువ వేసి పోపు కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి .

తర్వాత అందులోనే ఎండుకొబ్బరి లేదా పచ్చి కొబ్బరి  ముక్కలు కూడా వేసి పచ్చి వాసన పోయేదాకా  వేయించుకోవాలి .

పోపు  బాగా చల్లారగానే  మిక్సీ లో పోపు అంతా వేసి   మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత అందులోనే   ఒక అర గ్లాసు నీళ్ళు   ( పైకి  తన్నకుండా  ) రెండుసార్లుగా పోసుకుంటూ  ముద్దను   మెత్తగా  వేసుకోవాలి .

ఈ  ముద్దను  తెర్లుతున్న సాంబారు లో వేసి  గరిటెతో  బాగా కలిపి  మరో పది నిముషాలు  సాంబారులో  ముద్ద బాగా కలిసే  విధముగా  తెర్ల నివ్వాలి .

సాంబారు  ముద్ద ఈ విధముగా  తయారు చేసుకుని ఒక సారి సాంబారు  పెట్టుకుని చూడండి .

సాంబారు తయారీ  విధానము .
*************

చింతపండు   రెండు గ్లాసుల  వేడి నీటిలో  ఒక పదిహేను  నిముషములు  నానబెట్టి  రసం తీసుకోవాలి .

కుక్కర్  లో  తగినన్ని  నీళ్ళు పోసి ఒక  గిన్నెలో   కందిపప్పు  సరిపడా  నీళ్ళు పోసి మూతపెట్టి  నాలుగు  విజిల్స్  వచ్చే వరకు   ఉంచాలి .

తరువాత  మూత తీసి  పప్పును  గరిటతో  మెత్తగా  యెనుపుకోవాలి .

అందులో  చింతపండు  రసము , పసుపు,  తగినంత ఉప్పు ,  చిన్న బెల్లం  ముక్క, తరిగిన  పచ్చిమిర్చి  ముక్కలు , ఆనపకాయ ముక్కలు ,  బెండకాయ ముక్కలు ,  వంకాయ  ముక్కలు , ములక్కాడ ముక్కలు , అన్నీ  వేసి  మరో  గ్లాసు నీళ్ళు  పోసి  ఒక  ఇరవై నిముషాలు  పాటు  స్టౌ మీద  ముక్కలన్నీ  ఉడికే వరకు  ఉంచి  బాగా  తెర్లనివ్వాలి.

తరువాత పైన చెప్పిన  విధముగా  ముందుగా  తయారు చేసి సిద్ధము చేసుకున్న సాంబారు ముద్దను  తెర్లుతున్న సాంబారులో  వేసి  గరిటె తో బాగా కలపాలి .

సాంబారు ముద్ద సాంబారులో బాగా ముక్కలకు కలిసే విధముగా మరో  పది నిముషాలు  ఉంచి  దింపి  పైన   తరిగిన  కొత్తిమీర   వేసుకుని  మూత పెట్టుకోవాలి.

తర్వాత  స్టౌ మీద  పోపు గరిట పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసి  నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిర్చి  ముక్కలు ,  ఆవాలు , ఇంగువ మరియు  కరివేపాకు  వేసి  పోపు వేసుకుని  సాంబారులో  వేసుకుని  గరిటతో  బాగా  కలుపుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే   సాంబార్  ఇడ్లీ, వడలు , పూరీలు , చపాతీలు  మరియు  భోజనము  లోకి  సర్వింగ్  కు  సిద్ధం.

సంబంధిత రెసిపీ మరియు ఫోటోలు నా స్వంతం.

మరో  కొత్త  వెరైటీ  మజ్జిగ  పులుసు .

ఆలూరుకృష్ణప్రసాదు .

మరో  కొత్త  వెరైటీ  మజ్జిగ  పులుసు .

కావలసినవి .

పెరుగు  --  అర లీటరు.

పెరుగు   ఒక వెడల్పాటి  గిన్నెలోకి  తీసుకుని  సరిపడా  నీళ్ళు పోసుకుని  కవ్వంతో గిలక్కొట్టుకొని  మరి కొన్ని నీళ్ళు పోసుకుని   ఉంచుకోవాలి .

పులుపు ఇష్టమైన వారు పుల్లని పెరుగును  , కమ్మగా ఇష్టమైన వారు కమ్మని పెరుగును వాడుకోవచ్చును .

ఆనపకాయ --  ఒక ముక్క
క్యారెట్  --  రెండు
బంగాళా దుంపలు  --
రెండు .

ఈ మూడు  పై చెక్కు తీసుకుని  ముక్కలుగా  తరుగుకుని  సరిపడా  నీళ్ళు పోసి  మెత్తగా  ఉడికించుని , వడకట్టుకుని  విడిగా  ఉంచుకోవాలి .

మజ్జిగ  పులుసులో  ముద్దకు . ( 1 )

బియ్యం  --  స్పూనున్నర .
పచ్చిశనగపప్పు  --  మూడు స్పూన్లు .

సరిపడా  నీళ్ళు పోసి  రెండు గంటలు  నాన బెట్టు కోవాలి .

ముద్దకు  ( 2 )

నూనె --  స్పూను  .

ఎండుమిరపకాయలు  -  2 

మినపప్పు  -- స్పూనున్నర .

స్టౌ మీద బాండీ పెట్టి  స్పూను  నూనె వేసి  నూనె బాగా కాగగానే  రెండు ఎండుమిరపకాయలు , స్పూనున్నర  మినపప్పు  వేసి వేయించుకుని  విడిగా  ఉంచుకోవాలి .

ముద్దకు  ( 3)

పచ్చి కొబ్బరి  --  పావు చిప్ప ( చిన్న ముక్కలుగా  చేసుకోవాలి .)
అల్లం  -  చిన్న ముక్క.(  పై చెక్కు తీసుకుని  ముక్కలుగా  చేసుకోవాలి . )
పచ్చి మిరపకాయలు  --  ఎనిమిది 
కొత్తిమీర  --  చిన్న కట్ట ఒకటి
కరివేపాకు  --  రెండు రెమ్మలు .
పసుపు  --  పావు స్పూను .
ఉప్పు  --  తగినంత .

(1) , (2 ) & (3 )

నానబెట్టిన బియ్యం , పచ్చిశనగపప్పు , వేయించిన ఎండుమిరపకాయలు , చాయమినపప్పు , పచ్చి కొబ్బరి ముక్కలు ,  పచ్చిమిరపకాయలు ,  అల్లం ముక్కలు , శుభ్రం చేసిన కొత్తిమీర  కట్ట ఒకటి , రెండు రెమ్మలు కరివేపాకు , పావు స్పూను  పసుపు  మరియు  సరిపడా  ఉప్పు   మొత్తం  మిక్సీ లో వేసి   కొద్దిగా  నీళ్ళు పోసి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి . 

ఇప్పుడు   సిద్ధంగా  ఉంచుకున్న  మజ్జిగలో  ఈ ముద్దను  వేసుకుని  గరిటెతో  బాగా కలుపు కోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసి , నూనె బాగా కాగగానే   రెండు ఎండుమిరపకాయలు  ముక్కలుగా  చేసి , పావు స్పూను  మెంతులు , పావు స్పూను  ఆవాలు , కొంచెము  ఇంగువ  మరియు రెండు రెమ్మలు కరివేపాకు వేసి పోపు వేయించుకుని  పోపు  చల్లారగానే  మజ్జిగ  పులుసులో  వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి .

పోపు  వేసాకే  మజ్జిగ  పులుసు వెచ్చబెట్టాలి .

లేకపోతే  మజ్జిగ  పులుసు విరిగి పోతుంది .

ఇప్పుడు  పోపు పెట్టిన  ఈ మజ్జిగ  పులుసును  స్టౌ మీద పెట్టి పొంగ కుండా గరిటెతో బాగా కలుపుతూ తెర్ల నివ్వాలి .

ఆ తర్వాత ఉడికించి  సిద్ధంగా  ఉంచుకున్న  ముక్కలు కూడా  వేసి  మజ్జిగ  పులుసును  బాగా  తెర్లనివ్వాలి .

బాగా  తెర్లాక పులుసును  క్రిందకు  దింపి, మరో చిన్న కట్ట కొత్తిమీర  తరిగి  వేసుకుని మూత పెట్టు కోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  ఈ  కొత్త  వెరైటీ  మజ్జిగ  పులుసు  భోజనము లోకి  సిద్ధం.

హామీ పత్రం .

సంబంధిత  రెసిపీ  మరియు  ఫోటో  నా స్వంతం .

Monday, February 5, 2018

బెండకాయలతో రుచికరమైన మజ్జిగ పులుసు .

ఆలూరుకృష్ణప్రసాదు .

బెండకాయలతో  రుచికరమైన మజ్జిగ  పులుసు .

కావలసినవి .

పెరుగు  --  అర లీటరు
బెండకాయలు  --  లేతవి  పావు కిలో .
పచ్చిమిరపకాయలు  --   ఆరు నిలువుగా  చీలికలు  చేసుకోవాలి .
కరివేపాకు  --  మూడు  రెమ్మలు
కొత్తిమీర  --  ఒక కట్ట
ఉప్పు   --  తగినంత

ముందుగా   స్పూనున్నర  పచ్చిశనగపప్పు , చిన్న అల్లం  ముక్క , పావు  స్పూను  ఆవాలు  ఒక  గిన్నెలో  వేసుకుని  మునిగే  వరకు  నీరు పోసి  ఒక గంట  సేపు  నానబెట్టుకోవాలి .

తర్వాత   నీరు  వేరుగా  వడకట్టుకుని   మిక్సీ లో  నానబెట్టిన  పచ్చిశనగపప్పు , ఆవాలు ,   అల్లం  ముక్క , చిన్న  పచ్చి కొబ్బరి ముక్క  ముక్కలుగా  చేసుకుని వేసుకోవాలి.

రెండు పచ్చిమిర్చి ,   వేసి కొద్దిగా  విడిగా  తీసి  ఉంచిన  నీరు  పోసుకుంటూ   మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

ఒక గిన్నెలో   మొత్తము  పెరుగు  వేసుకుని  తగినన్ని  నీరుపోసుకుని  కవ్వముతో  మజ్జిగ  చేసుకోవాలి .

నీరు  మరో  రెండు గ్లాసుల  నీళ్ళు పోసుకోవాలి .

అందులో  తరిగిన  పచ్చిమిరపకాయలు , కరివేపాకు , తగినంత  ఉప్పు , రుబ్బిన  ముద్ద అందులో  వేసుకుని  గరిటతో  బాగా  కలుపుకోవాలి .

లేత  బెండ కాయలు  ముక్కలుగా  తరుగు కోవాలి .

స్టౌ  మీద  బాండీ  పెట్టి   రెండు  స్పూన్లు  నూనె వేసి  బెండకాయ ముక్కలను  వేసి  ముక్కలను  బాగా  మగ్గనివ్వాలి .

చల్లారగానే  ముక్కలను   మజ్జిగలో  కలుపుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసి  నూనె  బాగా కాగగానే  మూడు ఎండుమిరపకాయలు  ముక్కలుగా చేసి , కొద్దిగా  మెంతులు , పావు స్పూను  జీలకర్ర , పావు స్పూను  ఆవాలు  కొద్దిగా  ఇంగువ మరియు కరివేపాకు  వేసుకుని  పోపు  వేగగానే  మజ్జిగ లో  వేసుకుని  గరిటెతో బాగా కలుపుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  ఈ మజ్జిగ  పులుసును  పెట్టి  పొంగకుండా , విరగకుండా  గరిటెతో  బాగా కలుపుతూ  పదిహేను నిముషాల పాటు  తెర్లనిచ్చి  , కొత్తిమీర  కూడా వేసుకుని దింపుకోవాలి.

ముందుగా  మరగనిచ్చి  తర్వాత పోపు పెడితే  పులుసు విరిగే  ప్రమాదం ఉంది .

అంతే  వేడి వేడి  మజ్జిగ  పులుసు సర్వింగ్  కు సిద్ధం.

Saturday, January 6, 2018

నిమ్మకాయ చారు

ఆలూరుకృష్ణప్రసాదు .

చింతపండు   కె. జి . రు.300 /- దాటింది .

మాకు  నిత్యం చారు కాని పులుసు కాని రెండు పూటలా కావాలి .

మరి  కొంతవరకైనా  చింతపండు ఖర్చు  అదుపు  చేయాలంటే  ప్రత్యామ్నాయం  నిమ్మకాయ చారు .

నిమ్మకాయ  చారు .

ఒక  గిన్నెలో  రెండు  గ్లాసుల  నీళ్ళు  పోసుకోండి .

అందులో  పావు  స్పూను  పసుపు  వేయండి .

రెండు  పచ్చిమిర్చి   ముక్కలుగా   చేసి  వేయండి .

రెండు  రెమ్మల  కరివేపాకు   వేయండి .

తగినంత   ఉప్పు వేయండి .

రెండు  నిమ్మకాయలు  కోసి  వేరే  కప్పులో  రసం  తీసుకోండి .

రెండు ఎండు మిరపకాయలు , స్పూను  ధనియాలు , పావు  స్పూను  జీలకర్ర  , నాలుగు   మిరియాలు  రోట్లో  దంచుకోండి .
లేదా  మిక్సీ   లో  పొడి  వేసుకోండి .

చారుపొడి  ఇంట్లో  రెడీగా  ఉంటే  ఆ  పొడి  స్పూనున్నర   వేసుకోవచ్చు .

అప్పుడు రసం  పొడి  కొట్టు కోనక్కర లేదు ,

ఇప్పుడు  స్టౌ  మీద  చారు  గిన్నె  పెట్టి  బాగా  మరగ నివ్వండి .

అందులో  నే చెప్పిన  కొట్టిన  పొడి  గాని   లేదా చారు  పొడి  గాని  వేయండి .

బాగా  కాగనిచ్చి  దింపి  పిండిన  నిమ్మరసం  అందులో  పోసి  గరిటతో  బాగా  కలపండి .

స్టౌ  మీద  కాగుతూ  ఉండగా  నిమ్మరసం   పోస్తే  చారు  చేదు  వస్తుంది .

కొత్తిమీర   తరిగి   అందులో  వేయండి .

ఇప్పుడు  స్టౌ  మీద  పోపు  గరిటె  పెట్టి  రెండు స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే   రెండు  ఎండుమిర్చి   ముక్కలు , కొద్దిగా   మెంతులు , కొద్దిగా   జీలకర్ర , పావు  స్పూను  ఆవాలు  ,  కొద్దిగా   ఇంగువ   వేసి  పోపు  పెట్టుకోండి .

అంతే  వేడి  వేడి   నిమ్మరసం తో  చారు  సిద్ధం . 

మీకు  హోటల్  చారు  రుచి   రావాలంటే   పొడిలో  రెండు  వెల్లుల్లి   రెబ్బలు  వేసుకుని   దంపుకోండి .

అప్పుడు  పోపులో  ఇంగువ  వేయవద్దు .

వెరైటీ టమాటో రసం

ఆలూరుకృష్ణప్రసాదు .

మరో వెరైటీ  టమోటో  రసం.

కావలసినవి.

టమోటోలు  --  4
చింతపండు  --  నిమ్మకాయంత
పచ్చిమిరపకాయలు  - 4
కరివేపాకు  --  మూడు రెమ్మలు
కొత్తిమీర  --  చిన్న కట్ట లో సగం.
పసుపు  --  కొద్దిగా
ఉప్పు  --  తగినంత

ఇంటిలో చారు పొడి సిద్ధంగా  లేని వారు చారు పొడి సిద్ధం చేసుకోవాలి .

కావలసినవి .

ఎండుమిరపకాయలు -2
ధనియాలు -- స్పూనున్నర 
జీలకర్ర  --  అర స్పూను
పచ్చి శనగపప్పు - స్పూను
కందిపప్పు  -  అర స్పూను
మిరియాలు  --  పావు స్పూను.
ఇంగువ -- కొద్దిగా

పై దినుసులన్నీ  నూనె వేయకుండా బాండీలో  వేయించుకుని   చల్లారగానే  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

ఈ రసము పొడి  మూడు  నాలుగు సార్లు  రసము  పెట్టుకోవడానికి ఉపయోగ పడుతుంది .

చారులో పోపునకు.

నూనె  -- స్పూను
మెంతులు  --  కొద్దిగా
జీలకర్ర  --  కొద్దిగా
ఆవాలు --  కొద్దిగా
ఇంగువ --  కొద్దిగా

తయారీ విధానము.

చింతపండు  విడదీసి  పది నిముషాలు  ముందు  నీటిలో నానబెట్టు కోవాలి .

తర్వాత గ్లాసుడు  రసము తీసుకొని  వేరే ఉంచుకోవాలి.

టమోటోలు  పెద్ద ముక్కలుగా  తరిగి ఉంచుకోవాలి .

ఒక గిన్నెలో  ఒక గ్లాసుడు  నీళ్ళు పోసి  టమోటో  ముక్కలు  వేసుకుని  ముక్కలు  మెత్తగా  అయ్యే వరకు  ఉడకనివ్వాలి .

నీళ్ళు విడిగా  ఉంచుకోవాలి .

ముక్కలు  చల్లారగానే  మిక్సీ లో మెత్తగా  వేసుకోవాలి .

లేదా  చేతితో మెత్తగా  చేసుకోవాలి .

ఇప్పుడు  ఒక  గిన్నెలో  సిద్ధంగా  ఉంచుకున్న టమోటో  రసము , చింతపండు  రసము పోసుకోవాలి.

అవసరమయితే మరో అర గ్లాసు నీళ్ళు పోసుకోవచ్చును.

అందులో  కొద్దిగా  పసుపు, తగినంత  ఉప్పు , తరిగిన  పచ్చిమిరపకాయ ముక్కలు , కరివేపాకు  వేసుకుని  స్టౌ మీద పెట్టి  బాగా తెర్లనివ్వాలి .

ఆ తర్వాత  రెండు స్పూన్లు  రసము పొడి వేసి మరో అయిదు నిముషాలు  తెర్లనివ్వాలి .

దింపుకుని  పైన తరిగిన  కొత్తిమీర  వేసుకొని  మూత పెట్టుకోవాలి.

తర్వాత  స్టౌ మీద  పోపు గరిటె పెట్టుకుని నూనె వేసుకుని  నూనె కాగగానే  ఎండుమిర్చి  ముక్కలు , మెంతులు , జీలకర్ర , ఆవాలు మరియు ఇంగువ వేసి  పోపు రసము లో పెట్టుకోవాలి .

అంతే ఎంతో రుచిగా  ఉండే టమోటో  రసము  భోజనము లోకి  సర్వింగ్ కు సిద్ధం.

ఇందులో బెల్లం  వేయకూడదు.

ఈ రసము రెండు రోజులు  నిల్వ ఉంటుంది .

Sunday, December 10, 2017

కంది కట్టు

ఆలూరుకృష్ణప్రసాదు .

కంది కట్టు.

ఇది గోదావరి జిల్లాలలో పెద్ద వాళ్ళందరూ  చేసే వారు.

బలవర్ధకమైనది .

తయారీ విధానము .

కంది కట్టు .

మా అత్తగారు  కూడా చేస్తారు .
కందిపప్పు లో ఎక్కువగా  నీళ్ళు పోసి పప్పు పొంగకుండా ఉడుకుతున్నప్పుడు  పై నీళ్ళన్నీ  వేరే గిన్నెలోకి తీసే వారు.

తర్వాత అందులో ఉడికిన తర్వాత  మెత్తగా  యెనిపిన గరిటె కంది పప్పు వేసి బాగా కలిపి , కాస్త ఉప్పు వేసి ,  ఎండుమిర్చి ముక్కలు, జీలకర్ర , ఆవాలు, ఇంగువ మరియు కరివేపాకు  వేసి నేతితో పోపు పెట్టేవారు .

అచ్చు పప్పు చారులా చాలా రుచిగా ఉంటుంది .

మేము కూడా చేసుకుంటాము తరచుగా.

Tuesday, December 5, 2017

టమోటో ,   బెండకాయలు మరియు మునగ కాడలు వేసి కందిపప్పుతో పప్పు  చారు .

ఆలూరుకృష్ణప్రసాదు .

టమోటో ,   బెండకాయలు మరియు మునగ కాడలు వేసి కందిపప్పుతో పప్పు  చారు .

తయారీ విధానము.

ఒక   కప్పు  కందిపప్పు   ఒకసారి  కడిగి  కుక్కర్  లో  సరిపడా  నీళ్ళు పోసి మూడు  విజిల్స్  వచ్చే వరకు   ఉంచి  స్టౌ  ఆపేయాలి .

తర్వాత  కుక్కర్  తీసి  పప్పు బాగా యెనిపి , అందులో  నాలుగు  పచ్చిమిర్చి  ముక్కలుగా తరిగి , రెండు  ములక్కాడలు  ముక్కలుగా  తరిగి ,  రెండు టమోటో లు ముక్కలు గా తరిగి , ఆరు బెండకాయలు ముక్కలుగా తరిగి , నిమ్మకాయంత  చింతపండు  రసం  గ్లాసు నీళ్ళలో   పది  నిముషాలు నానబెట్టి  రసం తీసుకుని  ,  కాస్త పసుపు, రెండు రెమ్మలు  కరివేపాకు  , సరిపడా  ఉప్పు వేసి  మరో గ్లాసు నీళ్ళు పోసి  స్టౌ మీద  పెట్టి   ములక్కాడలు  ఉడికే  వరకు పుప్పు చారు   మరగనివ్వాలి .

ఆ తర్వాత   పప్పు చారు  దింపాలి .

తర్వాత  స్టౌ మీద  బాండీ  పెట్టి  రెండు  స్పూన్లు   నూనె  వేసి , నూనె  బాగా కాగగానే   వరుసగా  మూడు ఎండుమిరపకాయలు  ముక్కలుగా  చేసి , కొద్దిగా  మెంతులు , పావు స్పూను  జీలకర్ర  ,  అర స్పూను  ఆవాలు  ,  కొద్దిగా  ఇంగువ మరియు  కొద్దిగా  కరివేపాకు   వేసి  పోపు  పెట్టుకోవాలి .

ఆ తర్వాత  కొత్తిమీర   తరిగి   పైన  వేసుకోవాలి .

అంతే  ఘమ  ఘమ లాడే  ములక్కాడ  ,  బెండకాయ , టమోటో  కందిపప్పుతో  పప్పు చారు  సర్వింగ్  కు  సిద్ధం.

ఇష్టమైన వారు చిన్న బెల్లం  ముక్క వేసుకోవచ్చు .

వెల్లుల్లి  ఇష్టపడే వారు  ఇంగువ బదులుగా ఎనిమిది వెల్లుల్లి  రేకలు వేసుకుని  పోపు వేసుకోవచ్చును.

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి