ఆలూరుకృష్ణప్రసాదు .
సాంబార్ . ( సాంబారు పొడి కాకుండా ముద్ద వేసి )
కావలసినవి .
కందిపప్పు --- ఒక గ్లాసు
చింతపండు -- 40 గ్రాములు
ఆనపకాయ / సొరకాయ --పావుకిలో పై చెక్కు తీసి ముక్కలుగా తరుగుకోవాలి .
ములక్కాడలు -- రెండు . ముక్కలుగా తరుగు కోవాలి.
బెండకాయలు -- 8 ముక్కలుగా తరుగు కోవాలి.
వంకాయలు -- రెండు నీళ్ళలో ముక్కలుగా తరుగు కోవాలి
పచ్చిమిర్చి -- 6 నిలువుగా చీలికలు గా తరుగు కోవాలి
కరివేపాకు -- మూడు రెమ్మలు
కొత్తిమీర -- ఒక కట్ట
పసుపు -- కొద్దిగా
ఉప్పు --- తగినంత
బెల్లం -- కొద్దిగా
పోపుకు .
ఎండుమిరపకాయలు -- మూడు
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
నూనె -- రెండు స్పూన్లు
సాంబారు ముద్ద.
***********
చాలామంది సాంబారు పెట్టేటప్పుడు " సాంబారులో వేసుకునే ముద్ద ఎలా తయారు చేస్తారు ?
అందులో ఏ ఏ పదార్థాలు వాడతారు ?
తెలియ చెయ్యమని " అడుగుతున్నారు .
అందువలన సాంబారు ముద్ద లో ఏ ఏ పదార్థాలు వేసుకోవాలో , ఎలా
తయారు చేసుకోవాలో సభ్యులందరి సౌలభ్యం కొరకు తెలియచేస్తున్నాను .
సాంబారు ముద్ద.
************
కావలసినవి .
ఎండుమిరపకాయలు - 5
పచ్చిశనగపప్పు -- రెండు స్పూన్లు .
ధనియాలు -- రెండు స్పూన్లు
మెంతులు -- పావు స్పూను
ఆవాలు -- పావు స్పూను
ఇంగువ -- కొద్దిగా
మిరియాలు -- అర స్పూను
బియ్యము - స్పూను
ఎండు కొబ్బరి / లేదా పచ్చి కొబ్బరి -- అర చిప్ప.
చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
నూనె - మూడు స్పూన్లు
సాంబారు ముద్ద తయారీ విధానము .
**************
ముందుగా స్టౌ వెలిగించి బాండీ పెట్టి మొత్తం నూనె వేసి , నూనె బాగా కాగగానే ముందు మెంతులు వేసి మూడు వంతులు వేగ నివ్వాలి .
మెంతులు సరిగ్గా వేగకపోతే సాంబారు చేదు వస్తుంది .
తర్వాత వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , ధనియాలు , మిరియాలు , బియ్యము , ఆవాలు మరియు ఇంగువ వేసి పోపు కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి .
తర్వాత అందులోనే ఎండుకొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి .
పోపు బాగా చల్లారగానే మిక్సీ లో పోపు అంతా వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత అందులోనే ఒక అర గ్లాసు నీళ్ళు ( పైకి తన్నకుండా ) రెండుసార్లుగా పోసుకుంటూ ముద్దను మెత్తగా వేసుకోవాలి .
ఈ ముద్దను తెర్లుతున్న సాంబారు లో వేసి గరిటెతో బాగా కలిపి మరో పది నిముషాలు సాంబారులో ముద్ద బాగా కలిసే విధముగా తెర్ల నివ్వాలి .
సాంబారు ముద్ద ఈ విధముగా తయారు చేసుకుని ఒక సారి సాంబారు పెట్టుకుని చూడండి .
సాంబారు తయారీ విధానము .
*************
చింతపండు రెండు గ్లాసుల వేడి నీటిలో ఒక పదిహేను నిముషములు నానబెట్టి రసం తీసుకోవాలి .
కుక్కర్ లో తగినన్ని నీళ్ళు పోసి ఒక గిన్నెలో కందిపప్పు సరిపడా నీళ్ళు పోసి మూతపెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి .
తరువాత మూత తీసి పప్పును గరిటతో మెత్తగా యెనుపుకోవాలి .
అందులో చింతపండు రసము , పసుపు, తగినంత ఉప్పు , చిన్న బెల్లం ముక్క, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు , ఆనపకాయ ముక్కలు , బెండకాయ ముక్కలు , వంకాయ ముక్కలు , ములక్కాడ ముక్కలు , అన్నీ వేసి మరో గ్లాసు నీళ్ళు పోసి ఒక ఇరవై నిముషాలు పాటు స్టౌ మీద ముక్కలన్నీ ఉడికే వరకు ఉంచి బాగా తెర్లనివ్వాలి.
తరువాత పైన చెప్పిన విధముగా ముందుగా తయారు చేసి సిద్ధము చేసుకున్న సాంబారు ముద్దను తెర్లుతున్న సాంబారులో వేసి గరిటె తో బాగా కలపాలి .
సాంబారు ముద్ద సాంబారులో బాగా ముక్కలకు కలిసే విధముగా మరో పది నిముషాలు ఉంచి దింపి పైన తరిగిన కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకోవాలి.
తర్వాత స్టౌ మీద పోపు గరిట పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిర్చి ముక్కలు , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు వేసుకుని సాంబారులో వేసుకుని గరిటతో బాగా కలుపుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే సాంబార్ ఇడ్లీ, వడలు , పూరీలు , చపాతీలు మరియు భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం.
సంబంధిత రెసిపీ మరియు ఫోటోలు నా స్వంతం.
0 comments:
Post a Comment