Saturday, April 14, 2018

షడ్రుచులు

ఆలూరుకృష్ణప్రసాదు .

షడ్రుచులు అంటారు.
అవి ఏమిటి  ?

తీపి
పులుపు
ఉప్పు
కారము
చేదు
వగరు

మనం  ప్రతి  రోజూ చేసుకునే వంటలు  షడ్రుచుల  సమ్మేళనంగా  ఉండాలి .

ముఖ్యంగా  వంటకాలలో చేదు రుచి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది .

ఆ చేదు  మెంతులు , మెంతికూర , మునగాకు , కాకరకాయ ఇలాంటి  పదార్ధముల ద్వారా  మనకు లభిస్తుంది .

ఈ విధముగా  చేదు  భోజన పదార్ధములు  తింటే   షుగర్  కంట్రోల్  అవుతుంది .

అలా అని  ఒక్కొక్క సారి  కూరగాయలలో చేదు దోసకాయలు , చేదు బీరకాయలు , చేదు దొండకాయలు  తగులుతుంటాయి .

అలాటివి వాడటం వలన ఆరోగ్యం కన్నా అనారోగ్య  సమస్యలు  కల్గుతాయి .

అటువంటి కూరలు వండకుండా పారవేయడం మంచిది .

ఇలా  చేదు ఎక్కువగా  లభించే  పదార్థములలో  ముఖ్యంగా  లభించేది  వేప పువ్వు.

ఈ వేప పువ్వు  ఉదరములోని  క్రిములను  నాశనము  చేస్తుంది .

కొంతమంది  ఈ సీజన్ లో లభించే  క్రింద రాలిన , లేదా చెట్టు కొమ్మలపై  పూసే  వేప పువ్వులను  ఏరుకుని , లేదా కోసుకొని  బాగా ఎండబెట్టుకుని పచ్చి పులుసు గా  చేసుకుంటారు .

ఇలా  చేసుకుని తినడం వలన ఉదర సంబంధమైన సమస్యలు  దూరమవుతాయి .

మరి కొంతమంది  షుగర్  కంట్రోల్  కావడానికి  ప్రతి  రోజు  లేత  వేప చిగురు నూరి   చిన్న ఉండలుగా  చేసుకుని  పరకడుపున  తింటారు .

కాబట్టి  భోజనము లోకి  చేదు పదార్ధములు కూడా అప్పుడప్పుడు  చేర్చుకోవడం  మంచిది .

వేప పువ్వు పచ్చి పులుసు.

వేప పువ్వు  ఈ రెండు నెలలలోనే  దొరుకుతుంది .

అలా దొరికిన  పువ్వులను  సేకరించి  ఎండపెట్టుకుని , ఒక సీసాలో భద్రపరచు కోవాలి .

పైన తెలిపినట్లు  వేప పువ్వు ఆరోగ్యానికి  చాలా మంచిది .

అలా ఎండబెట్టిన వేపపువ్వును  ఓ పావు కప్పు లేదా ఓ నాలుగు  చెంచాలు  తీసుకోవాలి .

స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు  నెయ్యి వేసుకుని , నెయ్యి బాగా  కాగగానే  ఈ ఎండిన  వేపపువ్వును  వేసుకుని   కమ్మని వాసన వచ్చేవరకు  వేయించుకోవాలి .

వేయించిన  వేపపువ్వును  విడిగా  ఓ పళ్ళెం  లోకి  తీసుకోవాలి .

నిమ్మకాయంత  చింతపండు  తీసుకుని  అందులో  ఓ  ముప్పావు  గ్లాసు నీళ్ళు పోసుకుని  ఓ  పావు గంట సేపు  నానబెట్టాలి .

ఆ తర్వాత  నానబెట్టిన  చింతపండును  బాగా చేతితో  పిసికి   రసము తీసుకుని ఒక గిన్నెలో పోసుకోవాలి .

ఆ రసములో  ఓ చిన్న బెల్లం  ముక్క పొడి చేసి వేసుకోవాలి .

అందులో  సరిపడా  ఉప్పు , కొద్దిగా  పసుపు , అర స్పూను  కారము  అందులో వేసుకోవాలి .

ఇప్పుడు  వేయించి ఉంచుకున్న వేప పువ్వు ను , కొద్దిగా  కరివేపాకు చింతపండు  రసము గిన్నెలో వేసుకుని బాగా కలిపి   స్టౌ మీద పెట్టి  ఓ పది నిముషాల పాటు  బాగా తెర్ల నివ్వాలి .

తర్వాత దింపుకుని  స్టౌ  మీద  పోపు గరిటె పెట్టుకుని , రెండు స్పూన్లు  నెయ్యి వేసి  నెయ్యి బాగా కాగగానే  రెండు ఎండుమిరపకాయలు  ముక్కలుగా  చేసి , స్పూను  మినపప్పు , అర స్పూను  ఆవాలు , కొద్దిగా  ఇంగువ , కొద్దిగా  కరివేపాకు , రెండుపచ్చిమిర్చి  ముక్కలుగా  చేసి వేసి పోపు  బాగా వేగగానే  పచ్చి పులుసులో వేసి  కొద్దిగా  తరిగిన  కొత్తిమీరను  వేసి  బాగా గరిటెతో కలుపుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా , చిరు చేదుగా  ఉండే  వేప పువ్వుతో పచ్చి పులుసు భోజనము లోకి  మరియు చపాతీలలోకి  సర్వింగ్ కు సిద్ధం.

హామీ పత్రం.

సంబంధిత  ఫోటో  మరియు  రెసిపీ  నా  స్వంతం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి