ఆలూరుకృష్ణప్రసాదు .
పొదీనా పచ్చడి .
కావలసినవి .
పొదీనా ---
మాకు ఇక్కడ ఇప్పుడు పొదీనా పెద్ద పెద్ద కట్టలుగా కట్ట పది రూపాయలకు అమ్ముతున్నారు .
పెద్ద కట్ట అయితే ఒకటి లేదా చిన్న కట్టలు అయితే మూడు తీసుకోవాలి .
ఒకసారి ఇసుక లేకుండా కట్టలను కడిగి , ఆకును వలుచుకుని ఓ పదిహేను నిముషాలు తడి లేకుండా నీడ పట్టున ఆర నివ్వాలి .
ఎండలో పెడితే ఆకు ఎండి పోతుంది .
ఈ ఆకు షుమారుగా మూడు కప్పులు వచ్చే విధంగా చూసుకోవాలి .
నూనె -- ఆరు స్పూన్లు
ఎండుమిరపకాయలు -- 15
చింతపండు -- నిమ్మకాయంత .
విడదీసి ఉంచుకోవాలి .
మెంతులు -- స్పూనున్నర .
ఆవాలు -- స్పూను
పసుపు -- పావు స్పూను
ఉప్పు -- తగినంత
ఈ పచ్చడి ఈ రోజు వెరైటీ గా గోంగూర పచ్చడి మాదిరిగా చేసుకున్నాము .
అందువల్ల ఇందులో పచ్చిమిరపకాయలు , పచ్చిశనగపప్పు వంటివి వేయలేదు .
పొదీనా ఆకులో సహజమైన వాసన ఉంటుంది కనుక ఇంగువ కూడా వేయలేదు .
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే సిద్ధంగా ఉంచుకున్న పొదీనా ఆకును వేసి బాగా మగ్గ నిచ్చి దింపుకుని వేరే ప్లేటు లోకి తీసుకోవాలి .
తిరిగి స్టౌ మీద బాండీ పెట్టి మిగిలిన నూనె మొత్తం వేసి నూనె బాగా కాగగానే , వరుసగా మెంతులు , ఎండుమిరపకాయలు , ఆవాలు మరియు పసుపు వేసి పోపు వేగిన వాసన వచ్చే వరకు వేయించుకోవాలి .
ఇప్పుడు ముందుగా మిక్సీ లో వేయించిన పోపు , చింతపండు మరియు తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత వేయించి సిద్ధంగా ఉంచుకున్న పొదీనా ఆకు కూడా వేసి పచ్చడి మరీ పేస్టులా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుని పైన రెండు ఎండుమిర్చి , చాయమినపప్పు మరియు ఆవాలతో పోపు పెట్టుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే ఈ పొదీనా పచ్చడి భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం .
హామీ పత్రం.
సంబంధిత రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.
0 comments:
Post a Comment