Showing posts with label టిఫిన్స్. Show all posts
Showing posts with label టిఫిన్స్. Show all posts

Thursday, March 1, 2018

ఉప్పుడు పిండి

బియ్యపు రవ్వతో  పిండి లేదా ఉప్మా.

కావలసినవి .

బియ్యపు రవ్వ  --  ఒక గ్లాసు.
చాయ పెసర పప్పు --  పావు  గ్లాసు
పచ్చి కొబ్బరి   --  అర చిప్ప
నూనె  --  నాలుగు  స్పూన్లు
పచ్చి మిరపకాయలు  --  5  నిలువుగా  చీలికలు  చేసుకోవాలి .
కరివేపాకు  --  మూడు రెమ్మలు

పోపుకు .

ఎండుమిరపకాయలు --   3  ముక్కలుగా  చేసుకోవాలి .
పచ్చిశనగపప్పు  --  రెండు స్పూన్లు
చాయమినపప్పు  --  స్పూనున్నర
జీలకర్ర  --  స్పూను
ఆవాలు  --  స్పూను
నెయ్యి  --  మూడు స్పూన్లు
నీళ్ళు  --  మూడు  గ్లాసులు.
ఉప్పు -- తగినంత

తయారీ  విధానము .

చాయపెసరపప్పు  తగినన్ని  నీళ్ళు  పోసి  గంటన్నర  సేపు  నానబెట్టుకోవాలి .

తర్వాత  నీరు  వడగట్టుకొని వేరే  ప్లేటులో  తీసుకోవాలి .

పచ్చి కొబ్బరి   తురుము కోవాలి.

ఇప్పుడు  స్టౌ  మీద  మందపాటి  గిన్నె కాని  లేదా  బాండీ కాని  పెట్టుకుని  నాలుగు  స్పూన్లు  నూనె  వేసుకుని  నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , పచ్చిమిర్చి  మరియు  కరివేపాకు  వేసి  పోపు పెట్టుకోవాలి.

పోపు  వేగగానే  మొత్తం  మూడు గ్లాసుల  నీళ్ళు , నానబెట్టిన  చాయపెసరపప్పు  వేసి  , తగినంత  ఉప్పును  వేసి  మూత పెట్టి  నీళ్ళు బాగా తెర్లనివ్వాలి .

ఆ  తర్వాత  పచ్చి కొబ్బరి  తురుము  అందులో  వేసి  గరిటెతో  బాగా కలిపి  రెండు నిముషాలు  తెర్ల నివ్వాలి .

ఆ తర్వాత  సన్నగా  బియ్యపు రవ్వ పోసుకుంటూ  ఉండకట్టకుండా  అట్లకాడతో  బాగా కలపాలి .

తర్వాత  మూడు స్పూన్లు  నెయ్యి వేసి  అట్లకాడతో  బాగా కలపాలి .

తర్వాత  స్టౌ  సిమ్ లో  పెట్టి  మరో  పది నిముషాలు సన్నని సెగన మగ్గనివ్వాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  బియ్యపు  రవ్వతో  పిండి  సర్వింగ్  కు సిద్ధం.

ఇందులో  నంచుకోవటానికి చట్నీ.

చిన్న నిమ్మకాయంత చింతపండు ( అయిదు నిముషాలు  తడిపి ), ఒక చిన్న కట్ట కొత్తిమీర , ఆరు  పచ్చి మిరపకాయలు , కొద్దిగా  బెల్లం మరియు  సరిపడా  ఉప్పు వేసి  మెత్తగా  మిక్సీ  లో వేసుకుని  వేరే గిన్నెలోకి తీసుకోవాలి .

తర్వాత స్టౌ మీద  పోపు  గరిటె  స్పెట్టి , రెండు స్పూన్లు  నెయ్యి వేసి  రెండు ఎండుమిరపకాయలు , స్పూను  మినపప్పు , అర స్పూను  ఆవాలు , కొద్దిగా  ఇంగువ మరియు రెండు రెమ్మలు  కరివేపాకు  వేసుకుని  పోపు పెట్టుకుని పచ్చడిలో  కలుపు కోవాలి .

ఈ పచ్చడి  పిండి లోకి  కాంబినేషన్ గా బాగుంటుంది .

Sunday, December 10, 2017

వేడి వేడి ఇడ్లీ కొత్తిమీర  చట్నీతో

ఆలూరుకృష్ణప్రసాదు .

వేడి వేడి ఇడ్లీ కొత్తిమీర  చట్నీతో .

కొత్తిమీర  చట్నీ.

తయారీ విధానము.

ఆరు పచ్చిమిర్చి , రెండు చిన్న కట్టల కొత్తిమీర , తగినంత   ఉప్పు వేసుకుని  మెత్తగా  మిక్సీ వేసుకుని , ఒక కాయ నిమ్మరసం పిండుకొని , తర్వాత నేతితో  రెండు ఎండుమిరపకాయలు  ముక్కలుగా తుంచి , ముప్పావు స్పూను మినపప్ఫు , అర స్పూను ఆవాలు , రెండు రెమ్మలు కరివేపాకు  మరియు కొద్దిగా  ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి .

Friday, December 8, 2017

టమోటా దోశెలు

ఆలూరుకృష్ణప్రసాదు .

టమోటా దోశెలు .

మాములుగా దోశెల పిండి  అంటే  కప్పు మినపప్పు కు  రెండున్నర  కప్పుల బియ్యం ముందు రోజు  రాత్రి నానబోసుకుని ఉదయాన్నే నీళ్ళు వడగట్టి  మెత్తగా  గ్రైండ్  చేసుకుని  తీసుకోవాలి .

అందులో  తగినంత   ఉప్పు కలుపు కోవాలి .

4 తయారైన టమోటాలు ముక్కలుగా  తరుగుకోవాలి.

ఈ టమోటా ముక్కలు , 5 ఎండుమిరపకాయలు , ఒక స్పూను జీలకర్ర  మిక్సీలో వేసుకుని  మెత్తగా  వేసుకోవాలి .

దోశెల పిండిలో ఈ మిశ్రమాన్ని  వేసుకుని  గరిటతో బాగా కలుపుకుని , స్టౌ మీద పెనం పెట్టి  పల్చగా దోశెల లాగా  వేసుకోవాలి .

అంతే ఎంతో రుచిగా ఉండే  టమోటో   వేడి వేడి దోశెలు  సర్వింగ్ కు సిద్ధం.

ఒక ఉల్లిపాయ  మరియు రెండు పచ్చిమిరపకాయలు  సన్నగా ముక్కలుగా  తరుగుకొని ఈ దోశెలపై  వేసుకోవచ్చు .

ఈ దోశెలు కొబ్బరి చట్నీతో తింటే  చాలా రుచిగా ఉంటాయి.

Sunday, November 12, 2017

బొంబాయి రవ్వ పొంగల్

ఆలూరుకృష్ణప్రసాదు .

సూజి రవ్వతో [ బొంబాయి రవ్వ  ]  పొంగల్.

చాలా మందికి    సాధారణంగా ఉప్మా  అల్పాహారముగా  ఇష్ట పడరు .

అటువంటి వారు  బొంబాయి  రవ్వతో  పొంగల్  చేసుకుంటే  చాలా రుచిగా ఉంటుంది .

ఈ మధ్యన కాకినాడ  మా మేనమామ గారి ఇంటికి వెళ్ళినప్పుడు  మా అత్తయ్య  చేసి పెట్టింది .

మా అందరికీ  వెరైటీ గా చాలా బాగుందనిపించింది .

ఇందులో  ప్రక్కన నంచుకుని తినటానికి   కొబ్బరి చట్నీ  మరియు సాంబార్  రెండూ  అత్తయ్య చేసింది .

ఆ రెండింటితో  తిన్నప్పుడు  ఈ రవ్వ పొంగలి  సూపర్ గా  ఉందనిపించింది .

మరి మీరు కూడా ప్రయత్నించండి.

కావలసినవి.

బొంబాయి  రవ్వ  --   ఒక  గ్లాసు. ( షుమారు  పావు కిలో )
చాయపెసరపప్పు  --  30  గ్రాములు .
జీడిపప్పు  --  20
మిరియాలు --  ఒక స్పూనున్నర .
నెయ్యి --  50 గ్రాములు
పచ్చిమిరపకాయలు  --  12
అల్లం  --  ఒక  చిన్న ముక్క ( షుమారు 30  గ్రాములు . )
జీలకర్ర  -- స్పూనున్నర
కరివేపాకు  --  నాలుగు  రెమ్మలు.
ఉప్పు  --  తగినంత .

నీళ్ళు  ఒక గ్లాసు రవ్వకు  మూడు గ్లాసులు .

తయారీ విధానము .

ముందుగా  చాయపెసరపప్పు  ను ఒకసారి కడుగుకుని  నీళ్ళలో  ఒక  అరగంట సేపు నాన బెట్టుకోవాలి .

పచ్చి మిర్చి  చిన్న చిన్న ముక్కలుగా  తరుగు కోవాలి.

అల్లం  పై చెక్కు తీసుకుని  చిన్న చిన్న ముక్కలుగా  తరుగు కోవాలి.

మిరియాలు  అమాన్ దస్తాలో లేదా  రోటిలో మెత్తగా  దంపుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద బాండీ  లేదా  మందపాటి  గిన్నె పెట్టి  మూడు స్పూన్లు  నూనె విడిగా  తీసి మిగిలిన  నెయ్యి అంతా   వేసి నెయ్యి బాగా కాగగానే  వరుసగా మిరియాల పొడి , జీలకర్ర , జీడిపప్పు ముక్కలు   వేసుకుని  వేగగానే  పచ్చి మిర్చి  ముక్కలు , అల్లం ముక్కలు మరియు కరివేపాకు  వేసుకుని  పోపు బాగా వేగ గానే మొత్తము  నీళ్ళు పోయాలి .

అందులో నాన బెట్టిన పెసర పప్పు వేసి  నీళ్ళు బాగా తెర్లి  పెసరపప్పును  కొద్దిగా  ఉడకనివ్వాలి . తర్వాత తగినంత  ఉప్పు వేసి  నీళ్ళు బాగా తెర్లుతున్నప్పుడు సన్నగా రవ్వ  పోస్తూ అట్లకాడతో ఉండ కట్టకుండా  బాగా కలుపుతూ  ఉండాలి.

తర్వాత  మూతపెట్టి  ఒక పది నిముషాలు  సన్నని  సెగన మగ్గనివ్వాలి.

దింపే ముందు  మరో మూడు స్పూన్లు  నెయ్యి  వేసి  దింపుకోవాలి .

ఈ రవ్వ పొంగల్ వేడి వేడిగా కొబ్బరి  చట్నీ సాంబార్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది .

ఈ పొంగల్  నెయ్యితో  చేసుకుంటేనే  చాలా రుచిగా ఉంటుంది.

Thursday, August 31, 2017

మైసూర్ మసాలా దోశే

ఆలూరుకృష్ణప్రసాదు .

మైసూర్ మసాలా దోశె.

కావలసినవి .

మినపప్పు   --  అరకప్పు
బియ్యము  ---  రెండు కప్పులు
అటుకులు  -- పావుకప్పు
మెంతులు  ---  అరస్పూను
ఉప్పు  --  కొద్దిగా
నూనె  --  100 గ్రాములు.

తయారీ  విధానము .

బియ్యము  , మినపప్పు , మెంతులు  సరిపడా  నీళ్ళు  పోసి ఆరు  గంటల సేపు  నానబెట్టు కోవాలి.

అటుకులు  పై  మూడింటిని  గ్రైండ్  చేయబోయే  పది నిముషాలు   ముందు నాన బెట్టు కోవాలి .

ఇప్పుడు  నానబెట్టిన బియ్యము , మినపప్పు ,  మెంతులు  మిశ్రమము , మరియు  నానబెట్టిన అటుకులు కూడా  కలిపి గ్రైండర్ లో కొద్దిగా  నీళ్ళు పోసుకుని  మెత్తగా  గ్రైండ్  చేసుకోవాలి .

ఈ పిండిలో  దోశెలు  వేసుకునే ముందు కొద్దిగా  నీళ్ళు మరియు కొద్దిగా  ఉప్పు  వేసి  దోశెలు  వేసుకునే  విధముగా  సిద్ధం చేసుకోవాలి.

మసాల దోశె  కూర తయారు  చేసుకునే విధానము.

కావలసినవి.

బంగాళాదుంపలు  --  మూడు
ఉల్లిపాయలు   --  రెండు
పచ్చిమిర్చి  --  5
కొత్తిమీర   --  తరిగినది  అర కట్ట .
ఉప్పు  ---  తగినంత
కరివేపాకు --  రెండు  రెమ్మలు

పోపునకు.

ఎండుమిర్చి  --  3  ముక్కలుగా  చేసుకోవాలి.
మినపప్పు  --  స్పూను
ఆవాలు  --  అర స్పూను

తయారీ  విధానము .

ముందుగా  బంగాళాదుంపలు   నాలుగు  ముక్కలుగా  తరుగుకుని  కుక్కర్  లో  మూడు  విజిల్స్  వచ్చే వరకు ఉంచి  చల్లారగానే  బంగాళాదుంపల  పై  చెక్కు  తీసుకుని  మెత్తగా  చేసుకుని  విడిగా వేరే ప్లేటులో  ఉంచుకోవాలి .

స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు  నూనె  వేసి నూనె  బాగా  కాగగానే  వరుసగా  ఎండుమిర్చి  ముక్కలు , మినపప్పు , ఆవాలు  మరియు కరివేపాకు  వేసి  పోపు  వేగగానే  ఉల్లిపాయల  ముక్కలు , తరిగిన  పచ్చిమిర్చి   ముక్కలు  వేసి   మూతపెట్టి   బాగా  మగ్గనివ్వాలి .

తర్వాత  ఉడికిన బంగాళాదుంపలు , కొద్దిగా  పసుపు , తగినంత  ఉప్పు వేసి బాగా  మగ్గనిచ్చి  కొత్తిమీర  కూడా వేసుకుని  దింపుకోవాలి.

దోశెలపై  వేసుకునే  పొడి .

పది ఎండుమిరపకాయలు , ఇష్టమైన  వారు అయిదు వెల్లుల్లి  రెబ్బలు నూనెలో  వేయించుకుని  కొద్దిగా  పసుపు మరియు కొద్దిగా  ఉప్పు వేసుకుని  మిక్సీ లో  పొడిగా   చేసుకోవాలి ,

ఈ పొడి  ఒక  కప్పులో  తీసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ వెలిగించి  పెనం పెట్టి   పెనం పైన  నూనె  రాసి  పెనం బాగా వేడెక్కగానే  దోశె వేసి  దోశె   పైన అంతా కొద్దిగా  వెన్న రాసి , కారం పొడి  కూడా రాసి ,  రెండు  స్పూన్లు  కూర  పెట్టుకుని   దోశె  పైన  కొద్దిగా   నూనె  వేసి   బాగా కాల నివ్వాలి.

ఇదే  పద్ధతిలో  మిగిలిన   దోశెలను  కూడా  వేసుకోవాలి .

ఈ  మైసూర్  మసాలా  దోశెలు   వేడి  వేడిగా  కొబ్బరి చట్నీ  మరియు  అల్లం   చట్నీతో  సర్వ్  చేసుకోవాలి .

Wednesday, July 5, 2017

సెట్ దోశె కొబ్బరి చట్నీతో .

సెట్ దోశె కొబ్బరి చట్నీతో .

ఆలూరు కృష్ణప్రసాదు .

తయారీ విధానము .
ఒక గ్లాసు మినపగుళ్ళు , రెండు గ్లాసులు బియ్యము ముందు రోజు రాత్రి నానబోసుకోవాలి .
మరుసటి రోజు ఉదయం నీళ్ళు వడగట్టి గ్రైండర్ లో దోశెలకు వేసుకున్నట్లుగా కొద్దిగా ఉప్పు వేసుకుని మెత్తగా వేసుకోవాలి .
పిండిని ఫ్రిజ్ లో పెట్టకుండా బయటనే ఉంచి అయిదు గంటల పాటు పులవ నివ్వాలి .
స్టౌ మీద బాండీ పెట్టి నూనె వేసుకుని చిన్న చిన్న ఊతప్పముల మాదిరిగా కొద్దిగా మందంగా వేసుకోవాలి .

అంతే సెట్ దోశెలు సిద్ధం.

Sunday, July 2, 2017

జీడిపప్పు ఉప్మా

"జీడిపప్పు ఉప్మా" మరియు "కొబ్బరి చట్నీ."
                                                                      ఆలూరు కృష్ణప్రసాదు .

కావలసిన వస్తువులు:-
బొంబాయి రవ్వ 1కప్పు .
పచ్చి మిరపకాయలు 5 సన్నగా తరిగి పెట్టుకోవాలి .
.అల్లం చిన్న ముక్క పై  చెక్కు  తీసి  శుభ్రం చేసి సన్నగా తరిగి ఉంచుకోవాలి.
కరివేపాకు మూడు  రెబ్బలు నీటితో కడిగి శుభ్రం చేసి  పెట్టుకోవాలి.
కొత్తిమీర నాలుగు పరకలు శుభ్రంగా తరిగి ఉంచుకోవాలి.
.అరచెంచా ఉప్పు.
జీడిపప్పు 25గ్రాములు నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
మూడు  స్పూన్లు  నూనె తాళింపుకు.
తయారు చేసే విధానం:----
ముందు రవ్వను నూనె లేకుండా బాణాలి లో వేయించి పెట్టుకోవాలి.
తరువాత నూనె ఒక మొత్తం వేసి వేడి కాగానే  అందులో స్పూను ఆవాలు,స్పూను మినపప్పు,స్పూను శనగపప్పు, అర స్పూను జీలకర్ర, కరివేపాకువేసి చిటపట లాడాక,,పచ్చిమిరపకాయ తరుగు,అల్లం వెల్లుల్లి తరుగు వేసి కలపాలి.
రవ్వ వేసి కొద్దిసేపు కలియపెట్టి గ్యాస్టవ్ ఆఫ్ చేయాలి.
ఒక మందపాటి గిన్నె/అదే బాణాలిలో రెండున్నర కప్పుల నీళ్ళు వేసి కొద్దిగా మరుగుతుండగా రవ్వతో పాటు వేయించి ఉన్న పోపు దినుసులు వేసి ఉండకట్టకుండా కలియబెట్టాలి.
అవసరమైతే అడుగంటకుండా ఇంకొంచెం నూనె కలపాలి.
మరుగుతూ ఉన్నప్పుడే తగినంత  ఉప్పు వేసి కలియబెట్టి ఉప్మా రెడీ అయినట్లనిపించగానే దించేయాలి.
నీళ్ళు ఇగిరి పోవడం ద్వారా కనుక్కోవచ్చు.
దింపిన తరువాత వేయించిన జీడిపప్పు మరియు కరివేపాకు,కొత్తిమీరతో అలంకరించి ఉప్మా వడ్డించాలి.
ఘుమఘుమ లాడే వేడి వేడి ఉప్మా నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది."
గమనిక:-"వేయించిన జీడిపప్పు అలంకరిస్తున్నప్పుడే కలపాలి.అప్పుడే జీడిపప్పు మెత్తగా లేకుండా కరకర లాడుతుంది.
కొబ్బరి చట్నీ:-
"కొబ్బరి ఒక  చిప్ప చిన్న  ముక్కలుగా   తరిగి ఉంచుకోవాలి .
పుట్నాలపప్పు పావు  కప్పు ,అల్లం ఒక ముక్క,నాలుగు పచ్చి మిరపకాయలు,ఉప్పు తగినంత.

తయారీ విధానం:-
"కొబ్బరి ముక్కలు  ,తగిన ఉప్పు మిక్సీలో వేసి రుబ్బాక కొంచెం నీళ్ళు మరియు అల్లం ,పచ్చిమిరపకాయలు, పుట్నాలపప్పు వేసి మెత్తగా కాటుక వలే మిక్సీలో రుబ్బుకోవాలి.
తరువాత ఈ చట్నీకి బాణాలిలో నూనె వేసి అవాలు,మినపప్పు,జీలకర్ర,కరివేపాకు(,ఒక ఎండుమిరపకాయ ఇష్టమున్నవారు)తో నూనెలో తాళింపు వేసి ఈ కొబ్బరి చట్నీకి అలంకరించాలి.
ఇష్టం లేని వారు పుట్నాలపప్పు వేయకుండా కూడా చేయవచ్చు.అప్పుడు మిరపకాయలు రెండు తగ్గించాలి."

Monday, June 19, 2017

టమోటో బాత్

టమోటో బాత్
ఆలూరు కృష్ణప్రసాదు .

వేడి  వేడి  జీడిపప్పు   టమోటో  బాత్   కొబ్బరి చట్నీ మరియు  అల్లం   చట్నీతో .
తయారీ  విధానము .
పోపు  అంతా  ఉప్మా లాగా బాండీలో  నాలుగు  స్పూన్లు   నూనె వేసి  కాగగానే   ఎండుమిర్చి  శనగపప్పు  మినపప్పు  ఆవాలు కరివేపాకు  వేసి పోపు వేగగానే    మూడు  తరిగిన పచ్చిమిర్చి  , రెండు టమోటాలు , రెండు  ఉల్లిపాయలు   ముక్కలు తరిగి  పోపులోనే  మగ్గపెట్టి , గ్లాసు  బొంబాయిరవ్వకు  రెండు గ్లాసుల  నీళ్ళు  పోసి , సరిపడా  ఉప్పువేసి , నీళ్ళు  బాగా తెర్లుతున్నప్పుడు ఈ రవ్వ పోసి , అట్ల కాడతో  బాగా కదిపి  మూత పెట్టాలి .
నాలుగు  లవంగాలు  , రెండు యాలకులు  , దాసిన చెక్క , మూడు   మిరియాలు  అమాన్  దస్తాలో  వేసి  మెత్తగా  దంచుకుని  ఆ పొడిని  ఈ బాత్ లో  వేసి , మూడు  స్పూన్లు   నెయ్యి వేసి  మరో  మూడు  నిముషాలు   ఉంచి  దింపుకోవాలి .
పైన  నేతిలో  వేయించిన  జీడిపప్పు   తో  అలంకరించుకోవాలి .

Wednesday, June 14, 2017

పూరిలోకి ఉల్లిపాయ కూర

పూరిలోకి ఉల్లిపాయ కూర
ఆలూరి కృష్ణ ప్రసాద్ 


నాలుగు  పెద్ద  ఉల్లిపాయలు   ముక్కలుగా  తరుగుకోవాలి.
స్టౌ మీద బాండీ  పెట్టి  నాలుగు స్పూన్లు   నూనె వేసి  నూనె  కాగగానే   పోపులో  మూడు  ఎండు మిర్చి   ముక్కలుగా  చేసి  వేసుకోవాలి . 
వరుసగా  రెండు స్పూన్లు  పచ్చి శనగపప్పు , స్పూను  మినపప్పు , పావు స్పూను  జీలకర్ర ,  అర స్పూను  ఆవాలు,  మూడు  పచ్చి మిరపకాయలు  ముక్కలు, రెండు  రెబ్బలు కరివేపాకు  దూసివేయాలి.  అందులో  ఉల్లిపాయల  ముక్కలు  , తగినంత  ఉప్పువేసి   ఉల్లిపాయలు  నల్ల బడకుండా  మగ్గనివ్వాలి.
ఉల్లిపాయలు  మగ్గాక  అరగ్లాసు నీళ్ళలో  రెండు  స్పూన్లు   శనగపిండి  వేసి  బాగా  కలిపి  , ఆ నీళ్ళు  కూరలో  పోసి  అయిదు  నిముషాలు  ఉడకనివ్వాలి .
కూర  అసలు  రుచి  తెలియాలంటే  ఇంక  కారం  అక్కరలేదు. ఉల్లిపాయల  తీపి  తెలుస్తుంది . పచ్చిమిర్చి  కారం చాలు .
కాదు  కారంగా  ఉండాలనుకుంటే  స్పూను  కారం వేసుకోండి . మేం  కారం  వేసుకోం. 
రెండు మూడు సార్లు  ఈ ఉల్లిపాయల  కూర పోస్టింగు   పెట్టాను .  మిమ్మల్ని   వెతుక్కోమంటే  బాగుండదని  మళ్ళీ  మీకు  చెప్పాను .

నిమ్మకాయరసంతో రవ్వపులిహోర

నిమ్మకాయ రసము తో  రవ్వ పులిహోర.
ఆలూరి కృష్ణ ప్రసాద్ 


కావలసినవి .
బియ్యపు  రవ్వ  --  ఒక  గ్లాసు
నిమ్మకాయలు  --  మూడు
పసుపు  --   అరస్పూను
ఉప్పు  ---  తగినంత 
కరివేపాకు  ---  నాలుగు  రెమ్మలు
పచ్చిమిరపకాయలు  --  6
వేరు శనగ  గుళ్ళు  ---  పావు కప్పు 
నూనె  ---  100  గ్రాములు  
పోపు  సామగ్రి .
ఎండుమిరపకాయలు   ---  6
పచ్చి శనగపప్పు  ---  మూడు  స్పూన్లు .
చాయమినపప్పు  --  రెండు స్పూన్లు 
ఆవాలు  ---  స్పూను 
జీలకర్ర   --  పావు  స్పూను 
ఇంగువ  --  మరి  కాస్త
జీడిపప్పు  -  15  పలుకులు
తయారీ  విధానము .
ముందుగా   మూడు నిమ్మ కాయలు  కట్  చేసుకుని   చేదు  దిగకుండా  రసం  తీసుకుని   వేరే  కప్పు లో  ఉంచుకోవాలి .
పచ్చిమిరపకాయలు   నిలువుగా   చీలికలు గా  కట్ చేసుకోవాలి .
స్టౌ  వెలిగించి  ఒక  గిన్నెలో  గ్లాసున్నర  నీళ్ళు   పోసుకుని  బాగా తెర్ల  నివ్వాలి .
నీళ్ళు   మరుగు తున్నప్పుడు  ఒక  స్పూను  నూనె  వేసి  కొంచెం   ఉప్పు వేసి  గ్లాసు  బియ్యము  రవ్వ వేసి బాగా  ఉడక నివ్వాలి  .
ఆ విధంగా  ఉడికిన  రవ్వను  ఒక  బేసిన్  లోకి  వంపుకుని  ,  నాలుగు  స్పూన్లు   నూనె  ,  కొంచెం   పసుపు  , కరివేపాకు  వేసి  గరిటతో  ఉండలు  లేకుండా బాగా  కలుపుకోవాలి.
ఇప్పుడు  మళ్ళీ  స్టౌ వెలిగించి   బాండి  పెట్టి  మిగిలిన   నూనె  వేసి  వరుసగా  ఎండుమిరపకాయలు  (  తుంపకుండా  ) ,  పచ్చి శనగపప్పు ,  చాయమినపప్పు ,
వేరుశనగ   గుళ్ళు  ,  ఆవాలు ,పచ్చి మిర్చి ,
కరివేపాకు  ,  జీడిపప్పు  , ఇంగువ  వేసి  పోపు  బాగా  వేగ నివ్వాలి .
పోపు  వేగిన  వెంటనే ,  ముందుగా  సిద్ధం  గా  చేసుకున్న  నిమ్మ రసం , పోపు  కూడా  వేసి  గరిటతో  బాగా  కలుపుకోవాలి .
ఉప్పు  సరిపోయిందో  లేదో  చూసుకుని  అవసరమయితే  కలుపుకోవాలి .
అంతే  ఘుమ  ఘుమ లాడే  నిమ్మ కాయలతో రవ్వ  పులిహోర  సర్వింగ్  కు సిద్ధం .
ఈ  రవ్వ  పులిహోర  రెండు  రోజులు  నిల్వ ఉంటుంది   కాబట్టి దూర  ప్రయాణము లకు  వెళ్ళే వారు  నిక్షేపంగా  తయారు  చేసుకుని   తీసుకు  వెళ్ళవచ్చును.

Saturday, June 10, 2017

రవ్వ దోశె  కొబ్బరి   మరియు  అల్లం   చట్నీతో .

రవ్వ దోశె  కొబ్బరి  మరియు  అల్లం  చట్నీతో .
ఆలూరు  కృష్ణ  ప్రసాదు 


రవ్వ దోశె  కొబ్బరి   మరియు  అల్లం   చట్నీతో .
తయారీ  విధానము .
ఒక  కప్పు  బియ్యపు  పిండికి  , పావు కప్పు  మైదా  పిండి ,  పావు కప్పు  బొంబాయి రవ్వ  ఒక గిన్నెలో  వేసుకోవాలి.
అందులో  అర స్పూను  జీలకర్ర  , మూడు  సన్నగా  తరిగిన  పచ్చి మిర్చి   వేసుకోవాలి.
తగినంత   ఉప్పు  వేయాలి.
పావు కప్పు మజ్జిగతో  పాటు  తగినన్ని  నీళ్ళు  పోసుకుంటూ ,మామూలు  దోశె  పిండి  కన్నా  కొంచెం  పల్చగా  చేసుకుని   ఒక  అరగంట  సేపు  అలా ఉంచాలి.
పూర్తిగా   మజ్జిగతో  కలిపితే  దోశె  పెనానికి  అంటుకుంటుంది.
ఇక  స్టౌ  మీద  పెనం  పెట్టి  పెనం బాగా  కాగాక  నూనె వేసి గరిటతో  పెనం మధ్యన  కాకుండా  చివర నుండి  చాకచక్యంగా  చిల్లులు  చిల్లుగా  పోసుకుంటూ రావాలి.
ఇందులో  తురిమిన  కొబ్బరి , తురిమిన  క్యారెట్ , జీడిపప్పు   పలుకులు  దోశెలపై  వేసుకుని  మరి కాస్త  నూనె వేసుకుని   కాల్చుకుని  తింటే  అద్భుతమైన  రుచిగా ఉంటుంది.
మొదట  ఒకటి  రెండు  దోశెలు  అంత  బాగా  రాకపోయినా  తర్వాత  దోశెలు  బాగానే  వస్తాయి.
కంగారు  పడవద్దు .

పూరీలు ఉల్లిపాయ కూరతో.


పూరీలు  ఉల్లిపాయ కూరతో.
ఆలూరుకృష్ణప్రసాదు .

పూరీలు  ఉల్లిపాయ కూరతో. (  బంగాళా  దుంప  వేయకుండా )
సింపుల్ గా  ఉల్లిపాయ కూర  తయారీ  విధానము .
నాలుగు పెద్ద ఉల్లిపాయులు  ముక్కలుగా  తరుగుకోండి.
స్టౌ మీద  బాండి పెట్టి  నాలుగు  స్పూన్ల నూనె వేసి  ,  నూనె  బాగా  కాగాక  మూడు  ఎండు  మిర్చి  ముక్కలు , చాయమినపప్పు  స్పూను , పచ్చి  శనగపప్పు  స్పూను , కొద్దిగా  జీలకర్ర  , ఆవాలు అరస్పూను , మూడు  పచ్చిమిరపకాయల  ముక్కలు  , రెండు రెమ్మలు  కరివేపాకు  వేసి  పోపు వేసి , పోపు వేగాక  తరిగి  ఉంచుకున్న  ఉల్లిపాయల  ముక్కలు , కొద్దిగా  పసుపు , తగినంత  ఉప్పు  వేసి  బాగా  మగ్గ నివ్వాలి.

తర్వాత  ఒక  అరగ్లాసు నీళ్ళలో  స్పూను శనగపిండి  వేసి  బాగా  కలిపి ఆ  నీళ్ళు  కూరలో పోసి  దింపేయాలి .
అంతే  వేడి  వేడి  పూరీల లోకి  వేడి  వేడి  కూర  సర్వింగ్ కు  సిద్ధం .

Wednesday, June 7, 2017

పొంగల్ .

పొంగల్ .
ఆలూరి కృష్ణ ప్రసాద్ 

తమిళ నాడు  అంతటా  ప్రతి రోజు  హోటళ్ళలో ఉప్మా  చేయరు. పొంగల్  చేస్తారు . కారణం  బొంబాయి రవ్వ , మైదా  పిండి  ఆరోగ్య  రిత్యా  తగు  మోతాదులో   ఉపయోగించు  కోవాలని  అందరూ  చెప్తున్నారు .

ఈ  పొంగల్  బియ్యముతో  చేసుకుంటారు  కాబట్టి  ఆరోగ్యానికి  చాలా  మంచిది . 
ఇంక  పొంగల్  తయారు  చేయడానికి  కావలసిన  వస్తువులు .

బియ్యము  --  ఒక  గ్లాసు 
చాయపెసరపప్పు  --  అర  గ్లాసు 
మిరియాలు  --   ఒకటిన్నర   స్పూను .
నెయ్యి  ---   ఒక  చిన్న  కప్పు.
ఉప్పు  --   తగినంత 
అల్లం తరుగు  --  ఒకటిన్నర   స్పూను 
 జీలకర్ర   --  అర  స్పూను .
జీడిపప్పు  ---  30  గ్రాములు 
కరివేపాకు   -  మూడు  రెమ్మలు  
పచ్చిమిర్చి   --  ఐదు  పొడుగ్గా   తరుగు కోవాలి .
ఇంగువ  ---   కొద్దిగా

ముందుగా  బియ్యాన్ని  , పెసరపప్పును  మునిగే వరకు  నీళ్ళు పోసి ఒక  గంట సేపు విడి  విడిగా  నానబెట్టు కోవాలి . స్టౌ  వెలిగించి  బాండీ  పెట్టుకొని  మూడు  స్పూన్లు  నెయ్యి  వేసి   జీడిపప్పు ను  వేయించుకొని  పక్కన  పెట్టుకోవాలి .   మిరియాలను  కొంచెం  కచ్చా పచ్చాగా  దంచుకొని  ఒక  ప్లేటులో  పెట్టుకోండి. 

అదే  బాండిలో  మరో  రెండు స్పూన్లు   నెయ్యి వేసి  దంచి  పెట్టుకున్న  మిరియాలు  , జీలకర్ర  , అల్లం తరుగు ,  ఇంగువ , పచ్చి  మిర్చి  , కరివేపాకు  వేసి  పోపు వేగాక  ఒకటి  మూడు  చొప్పున  నీళ్ళు పోసి   అందులో  తగినంత   ఉప్పు వేసి అదే  నీళ్ళలో  నానబెట్టి  ఉంచుకున్న   బియ్యము  పెసరపప్పు  వేసి  మూత పెట్టి  మెత్తగా   ఉడకనివ్వాలి .

దింప బోయే  ముందు  మిగిలిన  నెయ్యి ,  వేయించి  ప్రక్కన  పెట్టుకున్న  జీడిపప్పు   వేసి  మరో  మూడు  నిముషాలు  ఉంచి  దింపు కోవాలి .

వేడి  వేడి  పొంగల్  సర్వింగ్  కు సిద్ధం .ఇందులోకి  కొబ్బరి  చట్నీ ,  టమోటో  చట్నీ  రెండూ  బాగుంటాయి .

తమిళనాడు  అంతటా  అన్ని హోటళ్ళలోనూ  చక్కగా  లేత  అరిటాకు వేసి  పొంగల్  పెట్టి   పై రెండు  చట్నీలు  వేసి , వేడి  వేడిగా  పొగలు  కక్కుతున్న  సాంబారు  వేస్తారు .

ఎంత  రుచిగా  ఉంటుందో  ! మళ్ళీ  మధ్యాహ్నము  ఒంటి గంట  దాకా  ఆకలి  వెయ్యదు .

Tuesday, May 30, 2017

కొట్టింక బుట్టలు .

కొట్టింక బుట్టలు .
ఆలూరి కృష్ణ ప్రసాద్

రావుల పాలెం బస్టాండు వద్ద Seperate గా పెద్ద Stall ఉంది.
నాకు తెలిసిన తయారీ విధానము.
మినపప్పు రుబ్బి అందులో బియ్యపు రవ్వ కలిపి అందులో కొద్దిగా ఉప్పువేసి పనసాకులతో నాలుగు ఆకులు కలిపి బుట్టలా కుట్టి
ఈ రుబ్బిన పిండి అందులో వేసి గ్యాస్ స్టౌ మీద డేగిశా పెట్టి అందులో ఎండు గడ్డి వేసి అందులో నీళ్ళు పోసి ( బుట్టలు మునిగి పోకుండా ) దానిపై ఈ బుట్టలు పెట్టి , ఆవిరి పై ఇడ్లీల మాదిరి ఉడక నిస్తారు.

వాటికి పనసాకుల వాసన పట్టి ఎంతో రుచిగా ఉంటాయి.
వేడిగానే కొబ్బరి చట్నీ మరియు అల్లం చట్నీతో పనసాకుల బుట్టల లోనే తింటారు .
శ్రావణ బహుళ అమావాస్య పోలాల అమావాస్య.
ఆ రోజు కంద చెట్టుకు కంద గౌరి పూజ చేసి ఈ కొట్టెంక బుట్టలు మా అత్త గారు నైవేద్యం పెట్టే వారుట. మా అత్తగారు .
మాకు ఆ ఆచారం లేదు .
suggession by tripura sundari cheela :
1:2ratio lo minapa pappu nd vari nooka teesukovali. Minapa pappu konchem gattiga rubbukovali. Nooka rubbulo mix cheyali. Minimum 4 hours pyna tayaru chesina mix bayata pettali. Daniki allam pachi mirchi paste kalipi panasa buttalalo veyali. Ee buttalu ni idli laga cooker lo pettali. Kani cooker lo water posi panasa aakulu lo vistaraku konni aakulu petti buttalu vati pyanapettali. Lekapote water buutalaloki water vellipotundi. Vari nooka nachani vallu uppudu ravvavadavachu Appudu 1:3 ratio vadali. Eesari try cheyandi.

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి