ఆలూరుకృష్ణప్రసాదు .
చలిమిడి .
*******
ఆడపిల్లను అత్తవారింటికి పంపే సందర్భాలలో ప్రతి సారీ కన్నతల్లి , తన కూతురికి చలిమిడి పెట్టి పంపిస్తారు.
అలాగే తన కూతురు గర్భవతై మూడవ నెల రాగానే కన్న తల్లి వియ్యాల వారి ఇంటికి వెళ్ళి , దొంగ చలిమిడి అని కూతురి ఒడిలో చలిమిడి పెడతారు . ఎవ్వరికీ తెలుపకుండా చలిమిడి పెడతారు కనుక దొంగ చలిమిడి అనే పేరు వచ్చింది.
అలాగే కూతురుకు ఏడవ నెల లేదా తొమ్మిదివ నెల రాగానే సీమంతం చేసే సందర్భాలలో కూడా ఆడంబరంగా అందరు ముత్తైదువులనూ పేరంటానికి పిలిచి అమ్మాయికి మరియు వచ్చిన ముత్తైదువులందరికీ గాజులు తొడిగించి , చలిమిడి , నానబెట్టిన శనగలు , పసుపు , కుంకుమ , పువ్వులు , తమలపాకులు , పండ్లు తాంబూలముగా పంచి సీమంతం పేరంటం చేస్తారు.
అలాగే తన కుమార్తెకు అమ్మాయి కాని లేదా అబ్బాయి కాని పుట్టాక , మూడవ నెలలో కాని లేదా ఐదవ నెలలో కాని తమ కూతురును పుట్టిన బిడ్డతో సహా తిరిగి అత్తవారింటికి పంపుతున్న సమయంలో చొంగ చక్కిలాలు అంటారుఅవి తయారు చేసి , వాటితో సహా ఇచ్చి పంపే సందర్భంలో కూడా చలిమిడి కూడా తయారు చేసి అమ్మాయికి ఇచ్చి అత్త వారింటికి పంపుతారు.
ఇలా అన్ని శుభ సందర్భాలలో చలిమిడి కూతురుకు పెట్టి పంపడం అనేది తర తరాలుగా మన ఇళ్ళల్లో వస్తున్న సాంప్రదాయం .
ఇ లా చలిమిడి పెట్టి పంపడం తన బిడ్డకు కడుపు చలవే కాకుండా , ఇరు కుటుంబాలకు క్షేమకరం అని పెట్టి పంపుతారు .
వివాహం ఐన తర్వాత ఆడపిల్ల పుట్టింటికి వచ్చిన ప్రతి సారి ఇలా పుట్టింటి వారు చలిమిడి పెట్టి పంపడం అనేది చాలా మంది ఇళ్ళల్లో ఈనాటికీ సాంప్రదాయంగా పాటిస్తున్నారు.
అసలు ఆడపిల్లకు ప్రతి సందర్భంలో చలిమిడి పెట్టి అత్తారింటికి పంపడం అనేది , కడుపు చలవ అంటారు.
అలా చలిమిడి ఆడపిల్ల ఒడిలో పెట్టే సందర్భాలలో , చలిమిడి ముందు రోజు మధ్యాహ్నము కల్లా తయారు చేసి , ఆ రోజు రాత్రి చలిమిడిని పుట్టింట్లోనే నిద్ర చేయించి మరుసటి రోజు అమ్మాయి భోజనము చేసిన తర్వాత కొత్త చీర , గాజులు , పసుపు , కుంకుమ , పూలు , పండ్లతో సహా , అమ్మాయి నుదుటిన కుంకుమను పెట్టి చలిమిడితో సహా అమ్మాయి ఒడిలో పెడతారు.
అమ్మాయి సంతోషంగా పుట్టింటి నుండి అత్తవారింటికి వెడితే , ఇటు పుట్టింటి వారికి , అటు అత్తింటి వారికి కూడా ఆనందదాయకమే కదా.
అయితే ఈ చలిమిడి చేసే విధానము చాలా మందికి తెలియదు .
అందువలన పెద్దలను సంప్రదించి మీ అందరికీ చలిమిడి తయారు చేయు విధానము నేను వివరంగా తెలియచేస్తున్నాను .
చలిమిడి తయారు చేయు విధానము .
***************************
కావలసినవి .
బియ్యము -- ఒక కె. జి .
బెల్లం -- ముప్పావు కిలో
గసగసాలు -- రెండు స్పూన్లు .
స్టౌ మీద బాండి పెట్టి స్పూను నెయ్యి వేసుకుని నెయ్యి కాగగానే గసగసాలు వేసుకుని వేయించుకుని విడిగా తీసుకోవాలి .
గసగసాలు చలిమిడి లో వేయడానికి ఇష్ట పడని వారు గసగసాలు వేయకుండా చలిమిడి తయారు చేసుకొనవచ్చును . శుభ సందర్భాలలో నువ్వుపప్పు వాడరు . అందువలన నువ్వుపప్పు చలిమిడి లో వేయరు.
ఎండు కొబ్బరి -- ఒక చిప్ప.
చిన్న ముక్కలుగా తరిగి స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే తరిగిన కొబ్బరి ముక్కలు వేసుకుని కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన ముక్కలను విడిగా ఒక ప్లేటులో కి తీసుకోవాలి.
లేదా ఈ మధ్యన కొంతమంది జీడిపప్పు ను కూడా నేతిలో వేయించి వేసుకుంటున్నారు.
ఆ విధముగా ఎండు కొబ్బరి ముక్కలతో పాటుగా జీడిపప్పును కూడా వేయించి వేసుకొనవచ్చును .
ఇలా గసగసాలు , ఎండు కొబ్బరి ముక్కలు మరియు జీడిపప్పు నేతిలో వేయించు కోవడం అనేది చలిమిడి తయారు చేయడానికి ముందుగా పాకం పట్టే సమయంలో వేయించుకోవాలి .
వేరు శనగ గుళ్ళు చలిమిడి లో వాడరు.
యాలకులు -- ఎనిమిది యాలకులు తీసుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి . స్పూనున్నర కొలతగా తీసుకోవాలి .
తయారీ విధానము .
ఒక కె. జి . బియ్యము తగినన్ని నీళ్ళు పోసి ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి .
కావలసినవి సామగ్రి అన్నీ సిద్ధం చేసుకున్నాక మరుసటి రోజు బియ్యము వడకట్టి పిండి మరపెట్టించాలి .
మరపట్టించే అవకాశము లేని వారు మిక్సీ లో వేసుకొనవచ్చు.
పిండి తడిగా ఉన్నప్పుడు బాగా నొక్కి పట్టి ఉంచాలి .
బెల్లం గడ్డలను పొడిలా పచ్చడి బండతో దంచుకోవాలి .
స్టౌ మీద గిన్నె పెట్టి నలగొట్టిన బెల్లం వేసి , బెల్లం మునిగే వరకు నీళ్ళు పోసి జాగ్రత్తగా చూసి కదుపుతూ బాగా ఉండ పాకం రానివ్వాలి .
ఉండపాకం అంటే ఒక పళ్ళెంలో నీళ్ళు వేసి ఉడుకుతున్న కొద్ది పాకం నీళ్ళల్లో వేసి చేతితో చూస్తే పాకం బాగా ఉండలా రావాలి .
ఈ లోగా తడిపిండి బాగా జల్లించుకుని బరకగా ఉన్నది విడిగా తీసేసుకోవాలి .
ఉండపాకం రాగానే స్టౌ కట్టేసి దించి పాకంలో వేయించిన కొబ్బరి ముక్కలు , గసగసాలు , జీడిపప్పు మరియు యాలకులపొడి వేసి , కొద్ది కొద్దిగా గుప్పెడు గుప్పెడు బియ్యపు పిండిని పాకంలో వేసుకుంటూ ఆపకుండా వెంటనే అట్లకాడ గాని లేదా గరిటెతో కాని పాకం కలుపుకుంటూ చలిమిడి సరియైన విధంగా వచ్చేటట్లు చూసుకోవాలి .
తర్వాత పిండిలో మూడు చెంచాలు నెయ్యి వేసుకోవాలి .
పిండి చాలా మృదువుగా వస్తుంది .
తరువాత సందర్భానుసారం ఉండలుగా చేసుకోవచ్చు .
అంతే ఎంతో రుచిగా ఉండే చలిమిడి సిద్ధం.
ఇష్టమైనవారు జీడిపప్పు నేతితో వేయించుకుని వేసుకోవచ్చు .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన రెసిపీ మేము తయారుచేయు విధానము మరియు ఫోటో తయారుచేయు సమయమున తీసినది.
0 comments:
Post a Comment