ఆలూరుకృష్ణప్రసాదు .
కొత్త వెరైటీగా.
టమోటో పులుసు పచ్చడి.
కావలసినవి .
పండి గట్టిగా ఉన్న టమోటోలు - 3
ఉల్లిపాయలు - 3
పచ్చిమిర్చి - 6
కొత్తిమీర - ఒక చిన్న కట్ట
పసుపు -- కొద్దిగా .
చింతపండు - నిమ్మకాయంత
ఉప్పు - తగినంత .
పోపుకు .
నూనె - నాలుగు స్పూన్లు .
ఎండుమిర్చి - 3 . ముక్కలుగా చేసుకోవాలి.
చాయమినపప్పు - స్పూను .
జీలకర్ర - పావు స్పూను.
ఆవాలు - అర స్పూను
ఇంగువ - కొద్దిగా
కరివేపాకు - రెండు రెమ్మలు.
తయారీ విధానము .
ముందుగా చింతపండు విడదీసి శుభ్రం చేసుకుని పావు గ్లాసు వేడి నీళ్ళల్లో పావు గంట సేపు నాన బెట్టుకుని చిక్కగా రసం తీసుకోవాలి .
కొత్తిమీర విడదీసి శుభ్రం చేసుకోవాలి.
ఉల్లిపాయలు సన్నని ముక్కలుగా తరుగుకుని విడిగా వేరే ప్లేటులో ఉంచుకోవాలి.
టమోటోలు ముక్కలుగా తరుగుకోవాలి.
ఇప్పుడు మిక్సీ లో టమోటో ముక్కలు , కొత్తిమీర , పచ్చిమిర్చి , చింతపండు రసము మరియు కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా గ్రేవి మాదిరిగా వేసుకోవాలి .
విడిగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిర్చి ముక్కలు , చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు ను వేసి పోపును బాగా వేగనివ్వాలి .
అందులోనే తరిగిన ఉల్లిపాయ ముక్కలు , కొద్దిగా పసుపు మరియు సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి పది నిముషాలు ఉల్లిపాయలను మగ్గనివ్వాలి.
ఉల్లిపాయలు మగ్గగానే ముందుగా సిద్ధం చేసుకున్న గ్రేవి మిశ్రమమును కూడా వేసి గరిటెతో బాగా కలిపి మూత పెట్టి మరో పది నిముషాలు ఉల్లిపాయ ముక్కలతో టమోటో గ్రేవిని ఉడకనివ్వాలి .
తరువాత వేరే డిష్ లోకి తీసుకుని పైన కొత్తిమీర వేసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే టమోటో పులుసు పచ్చడి భోజనము లోకి, చపాతీలు రోటీల లోకి సర్వింగ్ కు సిద్ధం .
ఈ పులుసు పచ్చడిలో విడిగా ఎండుకారం వేయనవసరం లేదు.
పచ్చిమిర్చి టమోటో కొత్తిమీర లతో మిక్సీ వేసుకున్నాము కనుక ఆ కారం సరిపోతుంది.
బెల్లం కూడా వేయనవసరం లేదు.
ఈ టమోటో పులుసు పచ్చడి మూడు రోజులు నిల్వ ఉంటుంది.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన రెసిపీ మేము తయారు చేయు విధానము మరియు ఫోటో తయారు చేయు సమయమున తీసినది .
0 comments:
Post a Comment