Showing posts with label పొడులు. Show all posts
Showing posts with label పొడులు. Show all posts

Tuesday, May 12, 2020

పల్లీ పొడి

ఆలూరుకృష్ణప్రసాదు .

పల్లీ పొడి  .  (  వేరుశనగ  పొడి. )

కావలసినవి . 

పల్లీలు  --  150 గ్రాములు .

షాపుల్లో  వేయించిన  పల్లీ  గింజలు  విడిగా  అమ్ముతారు .

ఆ పల్లీలు  తెచ్చుకుని  పై పొట్టు తీసేసుకోవాలి .

ఒక వేళ  దొరకని  పక్షంలో  పచ్చి వేరుశనగ  గుళ్ళు  తెచ్చుకుని , బాండీలో  నూనె  వేయకుండా  వేయించుకోవాలి.

చల్లారగానే  పై పొట్టు  తీసేసు కోవాలి.

ఎండుమిరపకాయలు  - 12 .

పచ్చిశనగపప్పు  -  రెండు స్పూన్లు .

చాయమినపప్పు  -  రెండు స్పూన్లు .

ధనియాలు  -  మూడు  స్పూన్లు .

నువ్వుపప్పు  -  మూడు  స్పూన్లు .

ఎండు కొబ్బరి  ముక్కలు -  పావు కప్పు.

జీలకర్ర  -- స్పూను.  

ఉప్పు  -- తగినంత 

నూనె   -- నాలుగు  స్పూన్లు 

కరివేపాకు  -  ఐదు రెమ్మలు .

తయారీ విధానము .

స్టౌ  మీద  బాండీ పెట్టి  మొత్తము నాలుగు స్పూన్లు  నూనెను  వేసుకుని , నూనె  బాగా కాగగానే వరుసగా పై పొట్టు తీసిన  వేరుశనగ గుళ్ళు ,  పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , ఎండుమిరపకాయలు , ధనియాలు , జీలకర్ర , నువ్వుపప్పు , ఎండు కొబ్బరి  ముక్కలు మరియు కరివేపాకును  వేసుకుని  కమ్మని  వాసన వచ్చే వరకు వేయించు కోవాలి.

చల్లారగానే మిక్సీ లో వేసుకుని  అందులో  తగినంత  ఉప్పును  వేసి  మెత్తని  పొడిగా  చేసుకోవాలి.

ఈ పొడిని  వేరే  సీసాలో  భద్రపరుచుకోవాలి.

ఈ  పొడి  ఇడ్లీ , దోశేలు, చపాతీలు , భోజనములోకి ,  మరియు  వేపుడు  కూరలలోకి  కూడా  చాలా  రుచిగా  ఉంటుంది .

ఇష్టమైన  వారు  ఎనిమిది  వెల్లుల్లి  రెబ్బలు  పై పొట్టును  తీయకుండా  పొడిలో  వేసుకుని మిక్సీ  వేసుకొనవచ్చును .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన రెసిపీ మేము తయారు చేయు విధానము  మరియు ఫోటో  తయారు చేయు సమయమున  తీసినది.

పులుసు పొడి

ఆలూరుకృష్ణప్రసాదు .

పులుసు పొడి.

కావలసినవి.

ఎండుమిరపకాయలు  - 15
పచ్చిశనగపప్పు  -  30 గ్రాములు.
చాయ మినపప్పు  - 20 గ్రాములు.
ధనియాలు -  పావు కప్పు
మెంతులు  -  రెండు స్పూన్లు 
ఎండు కొబ్బరి -  అర చిప్ప.
చిన్న ముక్కలుగా  కట్ చేసుకోవాలి.
ఇంగువ  -  పావు  స్పూను.
నూనె  -  నాలుగు  స్పూన్లు .

తయారీ  విధానము.

స్టౌ  మీద బాండీ పెట్టి  మొత్తము  నూనెను  వేసుకుని , నూనెను  బాగా కాగనివ్వాలి.

నూనె బాగా కాగగానే  వరుసగా  మెంతులు , ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , ధనియాలు , 
ఇంగువను  వేసుకుని  కమ్మని  వాసన  వచ్చే వరకు  వేయించుకోవాలి.

పోపు  వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కూడా  పోపులో వేసి  కొబ్బరి  ముక్కలను  దోరగా  వేయించుకోవాలి.

పోపు  చల్లారగానే  మిక్సీ  లో  మెత్తని  పొడిగా  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత  ఈ పొడిని  ఒక  సీసాలోకి  తీసుకోవాలి .

ఈ  పులుసు పొడి , పులుసు లోని  ముక్కలన్నీ బాగా  ఉడికి  పులుసు  బాగా  తెర్లుతున్నప్పుడు  రెండు స్పూన్లు  ఈ పులుసు  పొడిని  పులుసులో వేసుకుని , పులుసును  మరో ఐదు నిముషాలు  తెర్లనిచ్చి  దింపు కోవాలి.

ఈ కొలతలతో పులుసు పొడి కొట్టుకుంటే  పది సార్లకు  పైగా  వస్తుంది. మూడు నెలలు  పైగా  నిల్వ ఉంటుంది .

పొడి కొట్టగానే  సీసా  ఫ్రిజ్ లో పెట్టుకుని , కావలసినప్పుడు  పొడి  ఫ్రిజ్ లో నుండి  తీసుకుని , తిరిగి సీసాను  ఫ్రిజ్ లో పెట్టుకుంటే  ఈ పొడితో పెట్టిన  ముక్కల పులుసు ,   ఫ్రెష్ గా  సువాసనలతో అప్పటికప్పుడు  కొట్టిన పొడితో  పెట్టిన పులుసులా తాజాగా  ఉంటుంది.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారుచేయు  విధానము  మరియు ఫోటో   తయారుచేయు  సమయమున  తీసినది.

ఇది  సాంబారు  పొడి  కాదు. సాంబారు  పొడి తయారీ విధానము  వేరు.

ఇందులో  ఉప్పు  వేయరు.
సరిపడా  ఉప్పును  పులుసులోనే  వేసుకోవాలి.

Friday, April 24, 2020

వెరైటీ కారప్పొడి



దోశెలలోకి  మరియు ఇడ్లీల లోకి  మరో  వెరైటీ  కారప్పొడి .
ఆలూరుకృష్ణప్రసాదు .


కావలసినవి.

ఎండుమిరపకాయలు  - 20
పచ్చిశనగపప్పు  - 100 గ్రాములు.
చాయమినపప్పు -  50 గ్రాములు.
కరివేపాకు -  ఒక కప్పున్నర.
నూనె  -  నాలుగు స్పూన్లు 
ఇంగువ - పావు స్పూను 
ఉప్పు  -  తగినంత .

తయారీ  విధానము.

 స్టౌ  మీద  బాండీ  పెట్టి  నూనె  వేయకుండా  ముందుగా  పచ్చిశనగపప్పు ఎర్రగా  కమ్మని వాసన వచ్చే వరకు వేయించు కోవాలి. వేగిన పచ్చిశనగపప్పు  వేరే ప్లేటులోకి  తీసుకోవాలి .

తర్వాత  చాయమినపప్పు  కూడా  బాండిలో  నూనె వేయకుండా  కమ్మగా  వేగిన  వాసన వచ్చేదాకా  వేయించుకోవాలి. తర్వాత  వేగిన చాయమినపప్పు  విడిగా  మరో ప్లేటులోకి  తీసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద తిరిగి  బాండీ పెట్టి  మొత్తము  నాలుగు  స్పూన్లు  నూనెను వేసుకుని  నూనె బాగా  కాగగానే  ఎండుమిరపకాయలు , కరివేపాకు  మరియు ఇంగువను  వేసి  మిరపకాయలు  మరియు కరివేపాకు  వేగే  వరకు  వేయించుకోవాలి.

ఇవ్వన్నీ  చల్లారిన తర్వాత  ముందుగా  మిక్సీ లో వేయించిన ఎండుమిరపకాయలు , కరివేపాకు ,  ఇంగువ  మిశ్రమము  మరియు  తగినంత  ఉప్పును వేసుకుని  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

ఆ తర్వాత  అందులోనే  నూనె వేయకుండా  వేయించిన  పచ్చిశనగపప్పు  మరియు చాయమినపప్పు  కూడా వేసుకుని  మరీ మెత్తగా  కాకుండా  కొంచెం  పప్పులు నోటికి  తగిలే విధముగా  మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత  ఈ మిశ్రమమును  ఒక పళ్ళెంలో  వేసుకుని చేతితో  బాగా  కలుపుకుని   ఒక సీసాలోకి  తీసుకోవాలి .

అంతే  ఇడ్లీ , దోశెలు , గారెలు  మరియు చపాతీల లోకి  కారప్పొడి  సర్వింగ్  కు సిద్ధం.

ఇదే విధముగా  పొడి కొట్టుకుని  వంకాయ మరియు  దొండకాయ వంటి  కాయల పళంగా  చేసుకునే కూరలలో పెట్టుకోవచ్చును .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము  తయారుచేయు  విధానము  మరియు ఫోటో  తయారుచేయు  సమయమున తీసినది.

చింత చిగురు పొడి

చింత చిగురు పొడి.

ఆలూరుకృష్ణప్రసాదు .

కావలసినవి.

చింత  చిగురు  -  150 గ్రాములు.

ఎండుమిరపకాయలు  - 12

చాయమినపప్పు  -  రెండు  స్పూన్లు .

ధనియాలు  -  ఆరు స్పూన్లు .

జీలకర్ర  -  అర స్పూను

వెల్లుల్లి  - 20  రెబ్బలు.

(  వెల్లుల్లి  ఇష్టపడని  వారు వెల్లుల్లి  బదులుగా  మరో స్పూను జీలకర్ర  వేసుకుని పొడి  కొట్టు కొన వచ్చును. ) 

ఉప్పు  -  తగినంత .

నూనె  -  ఐదు  స్పూన్లు .

తయారీ విధానము .

ముందుగా  చింత చిగురు పుల్లలు లేకుండా శుభ్రం చేసుకోవాలి.

చింత చిగురు ఒకసారి కడిగి తడి లేకుండా  ఒక గంట సేపు నీడన  ఆర బెట్టు కోవాలి.

వెల్లుల్లి  పై పొట్టు తీయకుండా  ఒలిచి  ఉంచుకోవాలి.

ఇప్పుడు  స్టౌ మీద బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసి , నూనె బాగా కాగగానే  చింత చిగురు నూనెలో వేసుకుని  ఆకును బాగా  తడి లేకుండా మగ్గ నివ్వాలి.

ఆకు మగ్గగానే  విడిగా  వేరే పళ్ళెంలోకి తీసుకోవాలి .

తర్వాత  తిరిగి  స్టౌ మీద బాండీ పెట్టుకుని  మిగిలిన  మూడు స్పూన్లు నూనెను వేసుకుని నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు , చాయమినపప్పు , ధనియాలు మరియు జీలకర్రను  వేసుకుని పోపు కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి.

పోపు చల్లారగానే  మిక్సీ లో ముందుగా   ఎండుమిరపకాయలు  మరియు ఉప్పును వేసుకుని మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత  మిగిలిన పోపును మరియు చింత చిగురును  వేసుకుని  మిక్సీ   వేసుకోవాలి.

చివరగా  వెల్లుల్లి  పాయలు కూడా వేసుకుని  ఒకసారి మిక్సీ  వేసుకుని , ఒక పళ్ళెములో పోసుకుని  చేతితో  బాగా కలుపుకుని ఒక సీసా లోకి  తీసుకోవాలి .

చింతచిగురులో స్వతహాగా పులుపు ఉంటుంది  కనుక ఈ పొడిలో విడిగా  చింతపండు  వేయనవసరం లేదు.

ఈ పొడి పది రోజులు నిల్వ  ఉంటుంది .

వేడి వేడి అన్నంలో నెయ్యి  వేసుకుని ఈ చింత చిగురు పొడిని వేసుకుని తింటే చాలా రుచిగా  ఉంటుంది . ఆరోగ్యానికి  చాలా మంచిది. నోరు అరుచిగా ఉన్నా తొలగి పోతుంది.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారు చేయు విధానము  మరియు ఫోటో  తయారు చేయు సమయమున  తీసినది.

Monday, September 3, 2018

ఇడ్లీ , దోశెలు  మరియు చపాతీల లోకి  కారప్పొడి .

ఇడ్లీ , దోశెలు  మరియు చపాతీల లోకి  కారప్పొడి .

కావలసినవి .

నూనె  -- మూడు స్పూన్లు .
ఎండుమిరపకాయలు  - 12
పచ్చిశనగపప్పు -- అర కప్పు
చాయమినపప్పు  -- అర కప్పు
ధనియాలు  --  అర కప్పు
కరివేపాకు  --  కప్పు
ఉప్పు   -- తగినంత

తయారు చేయు విధానము .

ముందుగా  స్టౌ  మీద బాండీ పెట్టుకుని నూనె మొత్తము  పోసి  నూనె  బాగా కాగనిచ్చి  వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చి శనగపప్పు , చాయమినపప్పు , ధనియాలు  వేసి బాగా  వేగ నివ్వాలి .

తర్వాత   అందులో కరివేపాకు  కూడా వేసి ఎర్రగా  వేగ నివ్వాలి .

చల్లారగానే  మొత్తము  మిక్సీ లో వేసి  పప్పులు  పూర్తిగా  నలగ కుండా  మిక్సీ  వేసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  ఇడ్లీ , దోశెల లోకి కారప్పొడి  సిద్ధం.

ధనియాల పొడి

ధనియాల పొడి .

నోరు  అరుచిగా  ఉన్నా , జ్వరపడిన వారికి  పత్యం పెట్టాలన్నా , బాలింతలకు  పథ్యానికి  ఈ  ధనియాల పొడి  ఎక్కువగా  పెడతారు .

జలుబు  కఫం వంటివి  కూడా  హరిస్తుంది .

వేడి  వేడి అన్నంలో నెయ్యి బాగా వేసుకుని  ఈ పొడిని  మొదటి  ఐటమ్  గా  వేసుకుని  తింటే  ఆరోగ్య  రిత్యా  చాలా మంచిది .

కడుపులో  ఇబ్బందిగా  ఉన్నవారికి  , గ్యాస్  ప్రాబ్లమ్స్  ఉన్న వారికి  కూడా ఈ ధనియాల పొడి  వాడటం వలన  ఆ ఇబ్బందులు  తొలగి  పోతాయి .

ధనియాల పొడి  తయారీ  విధానము .

కావలసినవి .

ఎండుమిరపకాయలు  --   15
ధనియాలు  --  75  గ్రాములు
మినపప్పు  --  మూడు  స్పూన్లు
చింతపండు  --  చిన్న నిమ్మకాయంత
కరివేపాకు  --  రెండు రెమ్మలు .
ఉప్పు  --  తగినంత
నూనె  --  మూడు స్పూన్లు .

తయారీ  విధానము .

ముందుగా   చింతపండు   విడదీసి  గింజలు  లేకుండా  శుభ్రం  చేసుకోవాలి .

ధనియాలు  పుల్లలు  లేకుండా  శుభ్ర పరుచు కోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండీ  పెట్టి  మొత్తము  నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు , మినపప్పు  , ధనియాలు , వేసి  వేయించుకుని , తర్వాత కరివేపాకు  కూడా  వేసి  కమ్మని  వేపు  వచ్చే వరకు  వేయించుకోవాలి .

చల్లారగానే  మిక్సీ లో   వేయించిన  దినుసులు  , చింతపండు  మరియు  తగినంత  ఉప్పు వేసి మెత్తగా   పొడిగా  వేసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  ధనియాల పొడి  సర్వింగ్  కు  సిద్ధం .

ఇందులో  మెంతులు , ఆవాలు , జీలకర్ర  , శనగపప్పు , ఇంగువ  వంటివి  వెయ్యరు .

వెల్లుల్లి  తినే  వారు  కూడా  ఇది  కేవలం  ధనియాల పొడి  కావున  వేసుకోపోవడం  మంచిది .

ఈ  పొడి  భోజనము  లోకే  కాకుండా  ఇడ్లీ , దోశెలలోకి కూడా  బాగుంటుంది .

కందిపొడి

ఆలూరుకృష్ణప్రసాదు .

కందిపొడి .

కావలసినవి.

కందిపప్పు  --  100 గ్రాములు.
మినపగుళ్ళు /
లేదా చాయమినపప్పు  - 50 గ్రాములు.
ఎండుమిరపకాయలు  --  15
జీలకర్ర  --  స్పూను
ఇంగువ పొడి   --  పావు స్పూను లో సగం.
ఉప్పు  -- తగినంత

తయారీ విధానము.

స్టౌ మీద  బాండీ పెట్టి  ముందుగా  కందిపప్పు , ఎండుమిరపకాయలు , జీలకర్ర  బాండీ  లో నూనె వేయకుండా  కమ్మని  వేగిన  వాసన వచ్చే వరకు  వేయించుకోవాలి.

వేరే  ప్లేటు లోకి  తీసుకోవాలి .

తర్వాత  మినపగుళ్ళు  కాని , చాయమినపప్పు  కాని  బాండిలో  వేసుకుని కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి .

విడిగా  వేరే పళ్ళెంలో  తీసుకోవాలి .

విడిగా  వేయించు కోవడం  ఎందుకు  అంటే  రెండూ  కలిపి  వేయిస్తే  ఒకటి వేగి  మరొకటి  వేగనట్లు అయితే  పొడి  రుచి పాడవుతుంది.

రెండూ చల్లారిన తర్వాత ఇప్పుడూ  మిక్సీలో  మొదట వేయించినవి మరియు రెండవ సారి వేయించినవి రెండూ వేసుకుని  తగినంత  ఉప్పు  మరియు  ఇంగువ వేసుకుని   మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత  మొత్తము పొడి  ఒక ప్లేటులో వేసుకుని  చేతితో బాగా  కలుపుకోవాలి .

తర్వాత వేరే సీసా లో కి తీసుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే కందిపొడి  సర్వింగ్ కు సిద్ధం.

గోదావరి ప్రాంతం వారు ఈ పొడి వేడి వేడి అన్నంలో కలుపుకుని , గానుగ దగ్గర  పట్టించుకున్న కమ్మని  నువ్వుపప్పు నూనె వేసుకుని  తింటారు.

అద్భుతమైన  రుచిగా ఉంటుంది .

ఈ పొడి  భోజనము లోకే  కాకుండా  ఇడ్లీ  మరియు  దోశెల లోకి కూడా చాలా రుచిగా  ఉంటుంది .

సంబంధించిన  రెసిపీ  మరియు ఫోటో నా స్వంతం.

Wednesday, July 4, 2018

చారు పొడి

ఆలూరుకృష్ణప్రసాదు .

రసము  పొడి /  చారు పొడి .

మా ఇంట్లో   రసము /చారు పొడి  నెలకు  సరి పడా  ఒక్కసారే  మిక్సీ  వేసుకుంటాము .

రసము /చారు పొడి  చేసుకునే  విధానము .

ఎండు  మిరపకాయలు  ---  షుమారు  20  గ్రాములు.
ధనియాలు   ----  50  గ్రాములు
జీలకర్ర        -----  20  గ్రాములు
మిరియాలు  ----  15  గ్రాములు
పచ్చి శనగపప్పు  ---  25  గ్రాములు
కందిపప్పు        ----   20 గ్రాములు

షుమారుగా  కొలతలు  చెప్పాను.

ఇవి  అన్నీ  పచ్చివే  ఒక  చాటలో  పోసి  ఎర్రటి  ఎండలో  మూడు  రోజులు  ఎండ  నివ్వండి . 

మూడో  రోజు  ఈ పదార్ధాలన్నీ  మెత్తగా   మిక్సీ  వేసుకోండి .

మేము  ఇందులో  కొంచెం  పచ్చి  ఇంగువ  వేసుకుంటాం .

మీకు  ఇష్ట మైతే  పొడి  మిక్సీ  వేయబోయే ముందు  ఇంగువ  తగినంత  వేసుకోండి.

మిరియాలు  మరి కాస్త  వేసుకుంటే  ముక్కులు  అదిరిపోయే  ఘూటుతో  చారుపొడి  రెడీ  అవుతుంది .

ఈ  మిశ్రమాన్ని  ఒక  సీసాలో  పోసి  నిల్వ  ఉంచుకోండి .

రసము /చారు తయారు చేసుకునే  విధానము .

నిమ్మకాయంత చింతపండు , మూడు పచ్చిమిరపకాయలు , తగినంత ఉప్పు , ఇష్టమైతే చాలా కొద్దిగా  బెల్లం , కరివేపాకు , పసుపు వేసి  రెండున్నర గ్లాసుల నీళ్ళు  పోసి  స్టౌ మీద పెట్టాలి .

రసము బాగా  తెర్లుతున్నప్పుడు  ఈ  చారుపొడి  రెండు  స్పూన్లు  వేసి  పొంగ కుండా  చూసుకోవాలి .

దింపే ముందు  కొద్దిగా  కొత్తిమీర వేసుకోవాలి .

తర్వాత స్టౌ మీద పోపు గరిటె పెట్టి రెండు స్పూన్లు  నూనె వేసి  రెండు ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి , అర స్పూను ఆవాలు , కొద్దిగా జీలకర్ర  , కొద్దిగా మెంతులు ,  కొంచెం ఇంగువ  వేసి    పోపు  పెట్టుకొని  రసము లో కలుపుకోవాలి .

అంతే  రుచికరమైన  చారు  / రసము భోజనం  లోకి సిద్ధం.

ఈ రసము / చారులో  టమోటోలు లేదా  మునక్కాయలు  వేసుకోవచ్చును .

సంబంధిత  రెసిపీ  మరియు ఫోటోలు  నా  స్వంతం .

సాంబారు పొడి

ఆలూరుకృష్ణప్రసాదు .

సాంబారు  పొడి .

సాంబారు  రుచికరంగా  తయారవ్వాలంటే  సాంబారు  పొడి  కాని  లేక సాంబారు  ముద్ద  కాని  వేసుకోవాలి .

దక్షిణాదిన  తమిళనాడు వారే  రక రకాల  సాంబారులు  ప్రతి రోజు  పెట్టుకుంటారు .

ప్రతిరోజు  భోజనములో వారు సాంబారుతో పాటుగా  రసము కూడా  పెట్టుకుంటారు .

దక్షిణాది వారు  సాంబారులో  అన్ని రకములైన కాయగూరలు మరియు ఎక్కువ  మోతాదులో  పప్పు వేసి  బాగా  చిక్కగా  సాంబారు  పెట్టుకుంటారు.

ఉదయం ఇడ్లీ , వడలు  మొదలైన  టిఫిన్ల లో  సాంబారు  ఒక రకంగా , మధ్యాహ్నము  భోజనము  లోకి  సాంబారు  మరో రకంగా  పెట్టుకుంటారు .

మన ఆంధ్రాలో  దొరికే  సాంబారు  పొడులు  అంత రుచిగా  ఉండవు .

తమిళనాడులో  అంబిక , శక్తి  ఇంకా  ఇతర కంపెనీ వారి సాంబారు పొడులు  ప్రతి షాపులోను  విరివిగా  దొరుకుతాయి .

వాటిలో  With మసాలా , Without  మసాలా అని  కూడా  ఉంటాయి .

మసాలా  అంటే  దాల్చిన  చెక్క మరియు లవంగాలు వాసన వేస్తూ  పొడి చాలా ఘూటుగా  ఉంటుంది .

మసాలా వేయనిది  అంటే  పై వస్తువులు  వేయకుండా  చేసినది కూడా దొరుకుతుంది .

మామూలుగా  సాంబారు లోకి  మసాలా  వేయనిదే  రుచిగా  ఉంటుంది .

ఈ సాంబారు పొడి  నెలకు సరిపడా  ఇంట్లోనే  తయారు చేసుకోవచ్చు .

సాంబారు పొడి .

తయారీ  విధానము .

కావలసినవి.

ఎండుమిరపకాయలు  -- 15
చాయమినపప్పు  -- 75 గ్రాములు
పచ్చి శనగపప్పు  -- 50 గ్రాములు.
కందిపప్పు  --  25 గ్రాములు
బియ్యము  --  రెండు స్పూన్లు 
మెంతులు  --  స్పూను
జీలకర్ర  --  స్పూను
ఆవాలు --  అర స్పూను.
ధనియాలు  --  100 గ్రాములు.
మిరియాలు  --  షుమారు  25
ఇంగువ  --  పొడి  కాకుండా  పలుకులు 5 ముక్కలు
కరివేపాకు  --  తడి లేకుండా  పొడిది  ఒకటిన్నర  కప్పు.
పసుపు  --  ఒక స్పూను.

తయారీ  విధానము .

ముందుగా  చాయ మినపప్పు , పచ్చి శనగపప్పు , కందిపప్పు , బియ్యము , ధనియాలు  నూనె  అసలు  వేయకుండా  ఒక బాండిలో  కమ్మని  వాసన వచ్చేదాకా  వేయించుకుని  విడిగా  వేరే పళ్ళెంలోకి  తీసుకోండి .

దానిపైన  స్పూను  పసుపు  వేసుకోండి .

ఆ తర్వాత స్టౌ మీద  బాండీ  పెట్టి  కరివేపాకు  నూనె  వేయకుండా  ఎర్రగా వేయించుకుని  వేరేగా ఉంచుకోండి .

ఆ తర్వాత  తిరిగి  బాండిలో  నూనె లేకుండా  ఎండుమిరపకాయలు ,  మెంతులు , జీలకర్ర , ఆవాలు , మిరియాలు , ఇంగువ పలుకులు కూడా  వేసి  వేయించుకోండి .

ముందుగా  మిక్సీ లో  మొదట వేయించుకున్న ధనియాలు , శనగపప్పు , కందిపప్పు , మినపప్పు  తదితర మిశ్రమాన్ని  వేసి  మెత్తగా  పొడి వేసుకుని  ఒక బేసిన్  లో  తీసుకోండి .

తర్వాత  రెండవసారి  వేసుకున్న  ఎండుమిరపకాయలు , జీలకర్ర , మెంతులు , ఇంగువ మిశ్రమాన్ని ,  వేయించిన  కరివేపాకు  కూడా  వేసి   మిక్సీ లో మెత్తగా  వేసుకుని  ముందు తీసుకున్న  బేసిన్  లో  వేసుకుని  రెండూ చేతితో బాగా  కలుపుకుని  ఒక  సీసాలో  పోసుకుని  ఫ్రిజ్ లో పెట్టుకుని  అవసరమైనప్పుడు మూడు  స్పూన్లు  చొప్పున  సాంబారు లో  వేసుకుని , తిరిగి  సీసాను  ఫ్రిజ్ లో పెట్టుకుంటే  నాలుగు  నెలలు పైన  ఈ సాంబారు  పొడి  ఘమ ఘమ లాడుతూ  సాంబారుకు  మంచి రుచి  వస్తుంది.

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .

చింత చిగురు పొడి

ఆలూరుకృష్ణప్రసాదు .

చింత చిగురు  పొడి .

కావలసినవి .

చింతచిగురు  ---  200  గ్రాములు
ఎండుమిరపకాయలు  --  15
ధనియాలు  ---  అరకప్పు
మినపప్పు  --   పావు కప్పు
ఉప్పు   ---   తగినంత
నూనె  --   అయిదు  స్పూన్లు
ఆవాలు  జీలకర్ర   చాలా  కొంచెం

తయారీ  విధానము.

ముందుగా  చింతచిగురు  చెత్తో  బాగా  నలిపి  శుభ్రం  చేసుకుని  చిన్న  పుల్లలు  ఈనెలు  తీసి వేయాలి .

స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తం   నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే   ముందుగా  ఎండుమిరపకాయలు , ధనియాలు , మినపప్పు ఆవాలు జీలకర్ర   వేసి  వేయించుకోవాలి .
తర్వాత  నలిపి  ఉంచిన  చింత చిగురు  కూడా  వేసి  వేయించుకోవాలి .

చల్లారగానే  ఈ  మిశ్రమాన్ని   మిక్సీ   లో  వేసి  తగినంత   ఉప్పు వేసి   మెత్తగా  మిక్సీ వేసుకోవాలి .

కారప్పొడి   కాబట్టి  ఇష్టమైనవారు  పొట్టు  తీయని  ఓ  ఎనిమిది  రేకలు  వేసి  మిక్సీ   వేసుకోండి .

వెల్లుల్లి   ఇష్ట పడని  వారు  వెల్లుల్లి   లేకుండా  చేసుకోవచ్చు .

ఈ  చింత  చిగురు  పొడి లో  చింతపండు   వేయనక్కరలేదు.

ఇడ్లీ  , దోశె  మరియు  అన్నం లోకి  బాగుంటుంది .

ఈ  రోజు  ఉదయం  భోజనము   లోకి  వెల్లుల్లి   వేయకుండా  మేము  కొట్టుకున్న  చింత చిగురు  పొడి కి
సంబంధించిన   ఫోటో .

పుల్ల  పుల్ల గా  నోటికి   హితవుగా  చాలా  రుచిగా   కుదిరింది .

సంబంధించిన  రెసిపీ  మరియు ఫోటో నా స్వంతం.

పుట్నాల పప్పుతో పొడి

ఆలూరుకృష్ణప్రసాదు .

పుట్నాల (  వేయించిన  శనగపప్పు  ) పప్పుతో   పొడి .

చాలా మంది కంది పొడి , నువ్వుల పొడి, పల్లీల పొడి ఇత్యాది  పొడులతో పాటుగా  ఈ వేయించిన  శనగపప్పుతో  పొడి  కొట్టుకుంటారు .

కొంతమంది  ఈ పొడిని  ఇడ్లీ  మరియు  దోశెలతో  ఇడ్లీ కారప్పొడి  బదులుగా , ఈ పొడిలో  కాచిన నెయ్యి వేసుకుని   తింటారు .

చాలా మంది   వేపుడు కూరలలో  చివరలో దింపే ముందు  ఒక స్పూను  ఈ పుట్నాల పొడి  వేసుకుని  , కమ్మని వాసన రాగానే  కూర దింపుకుంటారు .

దాని వలన వేపుడు కూరలకు అదనంగా రుచి పెరుగుతుంది .

ఈ పొడి సీసాలో  పోసుకుని , కావలసినప్పుడు  తీసుకుని  వాడుకుంటే  షుమారు రెండు నెలలు తాజాగా  ఉంటుంది .

అయితే  ఈ పొడి కొట్టుకునే వారు, వెల్లుల్లి  ఇష్టమైన వారు  వెల్లుల్లి  వేసుకుని , వెల్లుల్లి  ఇష్టం  లేని వారు జీలకర్ర  వేసుకుని  కొట్టుకుంటారు .

వేపుడు కూరల్లో ఈ పొడి వేసుకునే వారు , వెల్లుల్లి  లేకుండానే  ఈ పొడి కొట్టుకుంటే  బాగుంటుంది .

ఈ పొడిలో  మేము  ఎండుకొబ్బరి  వేసుకుని  కొట్టుకుంటాము .

దాని వలన  పొడి  రుచి మరింత పెరుగుతుంది .

ఎండుకొబ్బరి  ఇష్ట పడని వారు  ఎండుకొబ్బరి వేయకుండా  కొట్టుకోవచ్చు .

పుట్నాల పొడి  తయారీ విధానము .

కావలసినవి .

వేయించిన శనగపప్పు  ( పుట్నాల పప్పు ) --  పావు కిలో .

ఎండుకొబ్బరి  --  ఒక  చిప్ప. ( చిన్న చిన్న ముక్కలుగా  చాకుతో  కట్ చేసుకోవాలి .)

ఎండుమిరపకాయలు   --  15  (బాగా ఎండ బెట్టి  తొడిమలు  తీసుకోవాలి . )

జీలకర్ర  --  స్పూనున్నర .

వెల్లుల్లి  --  ( ఇష్టమైన వారు )  రెబ్బలు  15  పొట్టుతోనే  ఉంచుకోవాలి .

పొట్టు తీసి వేస్తే  పొడి  పేస్ట్  అయి , ఘాటు వాసన వస్తుంది .

ఉప్పు  --  తగినంత .

తయారీ  విధానము .

స్టౌ  వెలిగించి  బాండీ  పెట్టి నూనె వేయకుండా  ఎండుమిరపకాయలు , ఎండుకొబ్బరి  ముక్కలు  మరియు జీలకర్ర   వేగిన కమ్మని వాసన వచ్చేవరకు  వేయించుకోవాలి .

చల్లారగానే  మిక్సీ లో వేసి , తగినంత  ఉప్పు వేసి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత  పుట్నాల పప్పు కూడా  వేసి  మరీ మెత్తగా  కాకుండా  మిక్సీ  వేసుకోవాలి .

వెల్లుల్లి  ఇష్టమైన వారు  సిద్ధంగా  ఉంచుకున్న  వెల్లుల్లి  రెబ్బలు వేసుకుని  మరోసారి పైపైన మిక్సీ  వేసుకోవాలి .

ఈ పొడి అంతా  ఒక పళ్ళెంలో పోసుకుని  చేతితో బాగా కలుపుకుని  ఒక సీసాలోకి  తీసుకోవాలి .

ఈ పొడి  భోజనము లోకే  కాకుండా  వేపుడు కూరల లోకి , ఇడ్లీ  మరియు  దోశెల లోకి  బాగుంటుంది .

సంబంధిత  రెసిపీ మరియు ఫోటో  నా స్వంతం.

Saturday, April 14, 2018

బాలింతల కోసం కరివేపాకు కారప్పొడి

ఆలూరుకృష్ణప్రసాదు .

ప్రియమిత్రులందరికీ   శుభోదయనమస్కారములు .

ప్రియమైన   మిత్రులారా  !

ఈ  రోజు  మీ  అందరికీ   అతి ప్రాచీన వంటకం  అనగా ఏనాటినుండో మన  తాతమ్మల  తరం  నుంచి  వచ్చిన  కరివేపాకు   కారప్పొడి  గురించి  వివరిస్తాను .

ఈ  కరివేపాకు   కారప్పొడి  బాలింతలకు  పథ్యంగా  పెడతారు.

జ్వరపడిన వారికి   పథ్యం  పెట్టే  సమయంలో    కూడా  పెడతారు .

నోరు అరుచిగా  ఉన్నప్పుడు , బాగా  జలుబు  చేసినప్పుడు , కడుపులో  ఇబ్బందిగా  ఉన్నప్పుడు మేము తరచుగా  ఈ  కారప్పొడి  కొట్టుకుంటాము .

ఈ  కరివేపాకు   కారప్పొడి  కొట్టగానే  వాసన  పోకుండా  ఒక  సీసాలో  పోసుకుంటే  ఘమ  ఘమ లాడే సువాసనతో  నెల రోజుల  పైనే  నిల్వ  ఉంటుంది .

ఈ  కారప్పొడి  తయారు చేయడంలో  మీ  టాలెంట్  అంతా  వేయించడం లోనే  ఉంటుంది.

వేపు  అటూ ఇటు  అయితే  మనం అనుకున్న  రుచి  రాదు .

ఈ  కరివేపాకు   కారప్పొడి లో  వెల్లుల్లి  పాయలు  తప్పని సరిగా   వేయాలి .

వెల్లుల్లి  పాయలు   తగిన మోతాదులో వేస్తేనే  ఆరోగ్య  పరంగా ప్రయోజనం  ఉంటుంది .

ఇక  వెల్లుల్లి  మా ఇళ్ళల్లో  వాడం  అనుకునే  వాళ్ళు  వెల్లుల్లి  వేయకుండా  చేసుకోండి .

ఈ కరివేపాకు  కారప్పొడి కి అసలైన రుచి  వెల్లుల్లి  పాయలు  వేసుకుంటేనే  వస్తుంది.

కరివేపాకు  కారప్పొడి.

కావలసిన పదార్థములు .

కరివేపాకు   ఒక  20  రెమ్మల  ఆకు  దూసుకోవాలి .

మరి కాస్త  కరివేపాకు  వేసుకున్నా  మంచిదే.

ఎండు మిరపకాయలు  -- 15 నుండి  18  వరకు .

చాయ మినపప్పు   ---  మూడు  స్పూన్లు .

ధనియాలు   ---  50 గ్రాములు

జీలకర్ర   ---  పావు  స్పూన్

ఆవాలు  --  పావు  స్పూన్

వెల్లుల్లి  రెబ్బలు  --  పై  పొట్టు  తీయకుండా  ఒక  20 .

పొడిలో పచ్చివే  వేయాలి . నూనె లో వేయించనవసరం లేదు.

పైన  ఫోటోలో  చూపిన  మాదిరిగానే   ఒలిచి  పెట్టుకోండి .

వెల్లుల్లి పొట్టు  తీసి వేస్తే   కారప్పొడి  పేస్టు అవుతుంది.

కారప్పొడి  కూడా అదో రకమైన ఘాటు  వాసన వస్తుంది .

ఉప్పు   ---  తగినంత

చింతపండు  --  ఒక  నిమ్మ కాయ సైజు . విడదీసి పెట్టుకోవాలి .

నూనె  --  5  లేక  6  స్పూన్లు  .

అంతే .

కరివేపాకు  కారప్పొడి .

తయారు  చేయు విధానము .

ముందుగా   కరివేపాకు   కడిగి  నీడన ఒక అరగంట ఆరబోసుకోండి .

తడి  ఉండకూడదు . పొడిగా ఉండాలి .

స్టౌ  వెలిగించి  బాండి పెట్టి  మూడు  స్పూన్లు   నూనె  వేసి , నూనె  బాగా  కాగాక  కరివేపాకు  మెత్తదనం  పోయేదాకా  వేయించి  పక్కన  వేరే ప్లేటులో  పెట్టుకోండి .

కరివేపాకు  మెత్తగా  వేయిస్తే పొడి  పొడిపొడిగా రాదు.

తర్వాత  స్టౌ  మీద  మళ్ళీ  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు  నూనె  వేసి  నూనె  బాగా  కాగాక  ఎండు మిరపకాయలు , చాయమినపప్పు , ధనియాలు  వేసి కమ్మని వేపు  వాసన  వచ్చే  దాకా  వేయించండి . ఇప్పుడు  జీలకర్ర , ఆవాలు కూడా వేసి  అట్లకాడతో  కలుపుతుండండి .

ఆవాలు  చిటపటలాడాక  దింపి  ఒక  అయిదు  నిముషాలు   చల్లార నివ్వండి.

చింతపండు  ఈనెలు ,  గింజలు  లేకుండా  శుభ్రం  చేసుకోండి .

ముందుగా మిక్సీలో  వేయించిన  ఎండుమిరపకాయలు , చాయమినపప్పు , ధనియాలు ,  ఆవాలు , జీలకర్ర  మిశ్రమము మరియు  తగినంత ఉప్పు వేసి  రెండుసార్లు  తిప్పండి.

ఇప్పుడు   చింతపండు  , వేయించిన  కరివేపాకు  వేసి మరో  రెండుసార్లు  తిప్పండి

ఆ తర్వాత  వెల్లుల్లి  పాయలు వేసి  ఒకసారి  తిప్పండి .

ఇప్పటికే  మీ వంట గదంతా  చక్కని  కరివేపాకు , వెల్లుల్లి  వాసనల సువాసనలతో  ఘుమ  ఘమ  లాడి  పోతుంది .

ఇప్పుడు   ఈ  మిశ్రమమంతా  ఒక  పళ్ళెంలోకి  తీసుకొని,      చేత్తో  బాగా  కలుపుకొని  నలగని  చింతపండు  చేతికి తగిలితే  తీసేయండి .

చేత్తో  బాగా నలిపాక ముద్దగా  ఉన్న కారప్పొడి ఇప్పుడు పొడి పొడి లాడుతుంది .

ఉప్పు  సరిపోయిందో  లేదో  నోట్లో  వేసుకుని   చూసుకొని , చాలక పోతే  తగినంత  కలుపుకోండి .

వాసన పోకుండా  శుభ్రంగా  తుడిచిన  గాజు  సీసాలో  పెట్టుకుంటే  నెల  రోజుల  పైన  నిల్వ ఉంటుంది .

వేడి  వేడి  అన్నంలో  మూడు  స్పూన్లు  నెయ్యి  వేసుకుని , అందులో  ఈ  కరివేపాకు   కారప్పొడి  వేసుకొని తింటే
ఆ రుచి  అహా  అద్భుతః .

ఇందులో  పచ్చి శనగపప్పు , మెంతులు , పసుపు, ఎక్కువ  జీలకర్ర , ఎక్కువ  ఆవాలు , ఇంగువ  వాడకూడదు .

ఆరోగ్య  ఫలితాలు  పొందాలంటే  నేను  చెప్పిన  విధంగానే   తయారు  చేసుకోవాలి.

ఎంతో రుచిగా  ఉండే ఈ కరివేపాకు  కారప్పొడి భోజనము  లోకే  కాకుండా  ఇడ్లీలు , దోశెలు , గారెలు మరియు చపాతీలలోకి కూడా చాలా బాగుంటుంది .

సంబంథిత రెసిపీ మరియు ఫోటోలు నా స్వంతం .

రసము పొడి / చారు పొడి

ఆలూరుకృష్ణప్రసాదు .

రసము  పొడి /  చారు పొడి .

మా ఇంట్లో   రసము /చారు పొడి  నెలకు  సరి పడా  ఒక్కసారే  మిక్సీ  వేసుకుంటాము .

రసము /చారు పొడి  చేసుకునే  విధానము .

ఎండు  మిరపకాయలు  ---  షుమారు  20  గ్రాములు.
ధనియాలు   ----  50  గ్రాములు
జీలకర్ర        -----  20  గ్రాములు
మిరియాలు  ----  15  గ్రాములు
పచ్చి శనగపప్పు  ---  25  గ్రాములు
కందిపప్పు        ----   20 గ్రాములు

షుమారుగా  కొలతలు  చెప్పాను.

ఇవి  అన్నీ  పచ్చివే  ఒక  చాటలో  పోసి  ఎర్రటి  ఎండలో  మూడు  రోజులు  ఎండ  నివ్వండి . 

మూడో  రోజు  ఈ పదార్ధాలన్నీ  మెత్తగా   మిక్సీ  వేసుకోండి .

మేము  ఇందులో  కొంచెం  పచ్చి  ఇంగువ  వేసుకుంటాం .

మీకు  ఇష్ట మైతే  పొడి  మిక్సీ  వేయబోయే ముందు  ఇంగువ  తగినంత  వేసుకోండి.

మిరియాలు  మరి కాస్త  వేసుకుంటే  ముక్కులు  అదిరిపోయే  ఘూటుతో  చారుపొడి  రెడీ  అవుతుంది .

ఈ  మిశ్రమాన్ని  ఒక  సీసాలో  పోసి  నిల్వ  ఉంచుకోండి .

రసము /చారు తయారు చేసుకునే  విధానము .

నిమ్మకాయంత చింతపండు , మూడు పచ్చిమిరపకాయలు , తగినంత ఉప్పు , ఇష్టమైతే చాలా కొద్దిగా  బెల్లం , కరివేపాకు , పసుపు వేసి  రెండున్నర గ్లాసుల నీళ్ళు  పోసి  స్టౌ మీద పెట్టాలి .

రసము బాగా  తెర్లుతున్నప్పుడు  ఈ  చారుపొడి  రెండు  స్పూన్లు  వేసి  పొంగ కుండా  చూసుకోవాలి .

దింపే ముందు  కొద్దిగా  కొత్తిమీర వేసుకోవాలి .

తర్వాత స్టౌ మీద పోపు గరిటె పెట్టి రెండు స్పూన్లు  నూనె వేసి  రెండు ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి , అర స్పూను ఆవాలు , కొద్దిగా జీలకర్ర  , కొద్దిగా మెంతులు ,  కొంచెం ఇంగువ  వేసి    పోపు  పెట్టుకొని  రసము లో కలుపుకోవాలి .

అంతే  రుచికరమైన  చారు  / రసము భోజనం  లోకి సిద్ధం.

ఈ రసము / చారులో  టమోటోలు లేదా  మునక్కాయలు  వేసుకోవచ్చును .

సంబంధిత  రెసిపీ  మరియు ఫోటోలు  నా  స్వంతం .

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి