దోశెలలోకి మరియు ఇడ్లీల లోకి మరో వెరైటీ కారప్పొడి .
ఆలూరుకృష్ణప్రసాదు .
కావలసినవి.
ఎండుమిరపకాయలు - 20
పచ్చిశనగపప్పు - 100 గ్రాములు.
చాయమినపప్పు - 50 గ్రాములు.
కరివేపాకు - ఒక కప్పున్నర.
నూనె - నాలుగు స్పూన్లు
ఇంగువ - పావు స్పూను
ఉప్పు - తగినంత .
తయారీ విధానము.
స్టౌ మీద బాండీ పెట్టి నూనె వేయకుండా ముందుగా పచ్చిశనగపప్పు ఎర్రగా కమ్మని వాసన వచ్చే వరకు వేయించు కోవాలి. వేగిన పచ్చిశనగపప్పు వేరే ప్లేటులోకి తీసుకోవాలి .
తర్వాత చాయమినపప్పు కూడా బాండిలో నూనె వేయకుండా కమ్మగా వేగిన వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత వేగిన చాయమినపప్పు విడిగా మరో ప్లేటులోకి తీసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద తిరిగి బాండీ పెట్టి మొత్తము నాలుగు స్పూన్లు నూనెను వేసుకుని నూనె బాగా కాగగానే ఎండుమిరపకాయలు , కరివేపాకు మరియు ఇంగువను వేసి మిరపకాయలు మరియు కరివేపాకు వేగే వరకు వేయించుకోవాలి.
ఇవ్వన్నీ చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ లో వేయించిన ఎండుమిరపకాయలు , కరివేపాకు , ఇంగువ మిశ్రమము మరియు తగినంత ఉప్పును వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి.
ఆ తర్వాత అందులోనే నూనె వేయకుండా వేయించిన పచ్చిశనగపప్పు మరియు చాయమినపప్పు కూడా వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం పప్పులు నోటికి తగిలే విధముగా మిక్సీ వేసుకోవాలి.
తర్వాత ఈ మిశ్రమమును ఒక పళ్ళెంలో వేసుకుని చేతితో బాగా కలుపుకుని ఒక సీసాలోకి తీసుకోవాలి .
అంతే ఇడ్లీ , దోశెలు , గారెలు మరియు చపాతీల లోకి కారప్పొడి సర్వింగ్ కు సిద్ధం.
ఇదే విధముగా పొడి కొట్టుకుని వంకాయ మరియు దొండకాయ వంటి కాయల పళంగా చేసుకునే కూరలలో పెట్టుకోవచ్చును .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన రెసిపీ మేము తయారుచేయు విధానము మరియు ఫోటో తయారుచేయు సమయమున తీసినది.
0 comments:
Post a Comment