నిమ్మకాయ ఊరగాయ.
ఆలూరుకృష్ణప్రసాదు .
కావలసినవి.
గుండ్రని పసుపు పచ్చని , పై తొక్క పలుచగా ఉన్న నిమ్మకాయలు - 20
పసుపు - స్పూనున్నర
మెత్తని ఉప్పు - షుమారుగా 150 గ్రాములు.
కారం - షుమారుగా 125 గ్రాములు.
మెంతి పిండి - రెండున్నర స్పూన్లు .
( 30 గ్రాముల మెంతులను బాండీలో నూనె వేయకుండా బాగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ లో మెత్తని పొడిగా వేసుకుని ఒక సీసాలో వేసుకోవాలి. ) ఈ పొడి మరో రెండు మూడుసార్లకు వస్తుంది.
తయారీ విధానము.
ముందుగా నిమ్మ కాయలు తడి గుడ్డతో శుభ్రంగా తుడుచుకుని ఓ పది నిముషాలు నీడన ఆర నివ్వాలి.
అందులో 15 నిమ్మ కాయలు ముక్కలుగా తరుగు కోవాలి.
ఒక అయిదు నిమ్మ కాయలు రసం ఒక గిన్నెలో వేరుగా తీసుకోవాలి .
ఒక బేసిన్ లో తరిగిన నిమ్మకాయ ముక్కలు మరియు విడిగా గిన్నెలోకి తీసిన నిమ్మరసం ముక్కలలో పోసుకోవాలి.
అందులో పసుపు మరియు మొత్తము ఉప్పును వేసుకుని చేతితో బాగా కలుపు కోవాలి.
దీనిని ఒక జాడిలోకి తీసుకోవాలి . మూడు రోజులు కదపకుండా ఉంచాలి.
నాలుగవ రోజు ఉదయం ఒకసారి జాడీ లోని ముక్కలను చేతితో బాగా కలుపుకుని , ఒక్కొక్క ముక్కలోని రసము జాడిలోనే చేతితో పిండు కోవాలి.
ఆ విధముగా పిండిన ముక్కల లోని గింజలను మరియు జాడీ లోని రసము లోని గింజలను పూర్తిగా చేతితో తీసి వేసుకుని గింజలను పడెయ్యాలి.
రసము పిండిన ముక్కలను ఒక పళ్ళెము లో వేసుకుని ఎర్రని ఎండలో రెండు రోజులు ఎండబెట్టుకోవాలి. రసమును ఎండ బెట్టవలసిన అవసరము లేదు.
ఆ విధముగా ముక్కలను ఎండబెట్టడం వలన ముక్కల పై తొక్క లోని చేదు పోతుంది .
రెండు రోజులు ముక్కలు ఎండిన తర్వాత ఒక బెసిన్ లో జాడీ లోని రసము మొత్తమును పోసుకోవాలి.
ఆ తర్వాత ఎండబెట్టిన ముక్కలను కూడా రసములో పోయాలి.
ఇప్పుడు రెండు పద్ధతులలో ఈ నిమ్మకాయ ఊరగాయ వాడుకొనవచ్చును .
మొదటి పద్ధతి.
మొత్తము పచ్చడిలో కారము మరియు రెండున్నర స్పూన్లు మెంతి పిండి వేసుకుని చేతితో బాగా కలుపుకోవాలి.
ఆ తర్వాత మొత్తము పచ్చడిని ఒక జాడీ లోకి తీసుకోవాలి .
కావలసినప్పుడు ఒక ముప్పావు కప్పు పచ్చడి తీసుకుని అందులో పోపు పెట్టుకుని వాడుకొనవచ్చును .
పోపు వేయు విధానము .
స్టౌ మీద పోపు గరిటె పెట్టుకుని మూడు స్పూన్లు నూనె వేసుకుని , నూనె బాగా కాగగానే నాలుగు ఎండుమిరపకాయలు , పావు స్పూన్లులో సగం మెంతులు , అర స్పూను ఆవాలు మరియు కొద్దిగా ఇంగువ వేసుకుని వాడుకొనవచ్చును .
రెండవ పద్ధతి.
అసలు కారము మెంతి పిండి కలపకుండా ఎండిన ముక్కలు రసము కలిపిన తర్వాత జాడీ లోకి తీసుకోవాలి.
కావలసినప్పుడు ఒక ముప్పావు కప్పు పచ్చడి విడిగా తీసుకుని అందులో రెండు స్పూన్లు కారము మరియు అర స్పూను మెంతి పిండిని వేసుకుని స్పూనుతో బాగా కలుపుకోవాలి.
ఇందులో పోపు మొదట చెప్పిన పద్ధతిలో ప్రకారము వేసుకొనవచ్చును .
ఈ నిమ్మకాయ ఊరగాయ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ముద్ద పప్పు కలుపుకుని ఈ నిమ్మకాయ ఊరగాయ నంచుకుని తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది.
అంతే. ఇడ్లీలు , దోశెలు , గారెలు , చపాతీలు మరియు భోజనము లోకి ఎంతో రుచిగా ఉండే నిమ్మకాయ ఊరగాయ సర్వింగ్ కు సిద్ధం.
ఈ ఊరగాయ ఖచ్చితంగా నాలుగు నెలలు తాజాగా రుచిగా ఉంటుంది .
నిమ్మకాయ ఊరగాయ ముక్కలు మరియు రసములో కొంతమంది పచ్చిమిర్చి మరియు అల్లం ముక్కలు వేసుకుంటారు.
కారం కలిపి పోపు పెట్టిన తర్వాత ఈ అల్లం ముక్కలు మరియు పచ్చిమిర్చి పెరుగు అన్నంలో నంచుకోవడానికి చాలా రుచిగా ఉంటాయని అంటారు.
మీకు ఇష్టమైన యెడల ఆ విధముగా వేసుకొనవచ్చును .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన రెసిపీ మేము తయారు చేయు విధానము మరియు ఫోటో తయారుచేయు సమయమున తీసినది.
0 comments:
Post a Comment