బియ్యపు పిండితో వడియాలు.
ఆలూరుకృష్ణప్రసాదు .
బియ్యపు పిండితో వడియాలు.
ఏప్రిల్ మూడవ వారంలో ఉన్నాము. ఎండలు కూడా బాగా మండుతున్నాయి.
బియ్యపు పిండితో వడియాలు పెట్టుకోవడానికి ఇదే మంచి తరుణం.
పరిస్థితులు ఎలా ఉన్నా ఈ సీజన్ లో వడియాలు , ఊరగాయలు
పెట్టుకోకపోతే ఏడాది అంతా ఇవి లేక ఇబ్బంది పడాలి.
ఇక బియ్యపు పిండితో వడియాలు తయారీ విధానము గురించి తెలుసుకుందాం .
బియ్యపు పిండితో వడియాలు.
******************
కావలసినవి.
రెండు గ్లాసుల బియ్యము రాత్రి నాన పోసుకుని ఉదయాన్నే కడిగి వడకట్టు కోవాలి.
బియ్యపు పిండి వడియాలు తయారీకి ఒక గ్లాసు కొలత పెట్టుకోండి.
ఉదయాన్నే తడి బియ్యము పిండి మెత్తగా మర పట్టించు కోండి.
బియ్యము తడపకుండా పొడి బియ్యము మర పట్టించి పోయిన సంవత్సరం మా శ్రీమతి వడియాలు పెట్టింది.
ఎందుకో సరిగ్గా రాలేదు. వడియము ఎండాక ముక్కలుగా విరిగి పోయింది.
మా ఇంటి ఎదురుగా ఉన్నవారు వడియాలు , అప్పడాలు అవి పెడుతుంటారు. వారిని అడిగితే తడి బియ్యపు పిండితో పెడితే వడియాలు బాగా వస్తాయని వారే చెప్పారు.
వారు చెప్పినట్లుగా ఈ ఏడాది తడి బియ్యము మర పట్టించి చేసింది.
వడియాలు అన్నీ విరగకుండా బాగా వచ్చాయి.
తడి బియ్యము పిండి పట్టించాక పిండి జల్లెడతో పిండి జల్లించుకోండి. పిండి ఎంత వచ్చిందీ ఒక గ్లాసుతో కొలుచుకోండి.
గ్లాసుతో కొలుచుకోవడం ఎందుకంటే ఒక గ్లాసు బియ్యపు పిండికి ఆరుగ్లాసుల నీళ్ళు పడతాయి .
అందువలన పిండి గ్లాసుతో కొలుచుకోవడం తప్పనిసరి.
పచ్చి మిరపకాయలు - 12
జీలకర్ర - ముప్పావు స్పూను.
ఉప్పు - తగినంత. ఉప్పు షుమారుగా జాగ్రత్తగా వేసుకోవాలి . ఉప్పు కొద్దిగా తగ్గినా పర్వాలేదు . కాని ఎక్కువైతే వడియాలలో ఉప్పు ఎక్కువై రుచి పాడవుతుంది.
తయారీ విధానము .
బియ్యపు పిండి పట్టించిన రోజు ఉదయం ఒక గిన్నెలో పిండి కొలత ప్రకారము ఒక గ్లాసు బియ్యపు పిండికి ఆరు గ్లాసుల చొప్పున నీళ్ళు పోసుకోవాలి.
స్టౌ మీద కొలుచుకున్న నీళ్ళ గిన్నెను పెట్టి నీళ్ళను బాగా తెర్ల నివ్వాలి.
ఒక గిన్నెలో గ్లాసు బియ్యపు పిండి వేసుకుని అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసుకుని చేతితో బాగా కలుపుకోవాలి.
పచ్చి మిరపకాయలు , జీలకర్ర మరియు తగినంత ఉప్పు మిక్సీలో మెత్తగా వేసుకుని విడిగా ఉంచుకోవాలి.
నీళ్ళు కళా పెళా తెర్లుతున్నప్పుడు జీలకర్ర , పచ్చిమిర్చి పేస్ట్ ను వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి.
వెంటనే విడిగా నానబెట్టిన బియ్యపు పిండిని కూడా వేసుకుని స్టౌ మీడియం సెగలో పెట్టుకుని దగ్గరే ఉండి పిండి ఉండకట్టకుండా మరియు అడుగంటకుండా బాగా ఉడికి చిక్కగా దగ్గర పడే వరకు గరిటెతో బాగా కలుపుతుండాలి.
ఒక పది నిముషాలు ఉడికిన పిండిని చల్లారనివ్వాలి.
ఎందుకంటే వేడి మీద వడియాలు పెడితే వడియాలు మైనపు కాగితానికి అంటుకుని ఒక పట్టాన ఊడి రావు. ఎండాక ముక్కలుగా విరిగి పోతాయి.
కొద్దిగా చల్లారిన తర్వాత ఎండలో ఒక మైనపు పట్టాను పర్చుకుని , ఒక గరిటెతో కాచిన బియ్యపు పిండిని గుండ్రముగా వడియాలు వీలయినంత పల్చగా పెట్టుకోవాలి.
ఉదయం ఎంత తొందరగా పని పూర్తి చేసుకుంటే ఒక గంటలో వడియాలు పెట్టుకునే పని పూర్తవుతుంది.
కాకపోతే ఇక్కడ తడి బియ్యాన్ని మరలో పిండి పట్టించుకోవడం త్వరగా చేసుకుంటే వడియాల పెట్టే పని ఎండలో అలసి పోకుండా త్వరగా అవుతుంది.
ముందు రోజు మధ్యాహ్నమే బియ్యము నాన పోసుకుని సాయంత్రానికి పిండి పట్టించుకుని , ఒక గిన్నెలో ఆ పిండి నొక్కి పెట్టి ఉంచి ఉదయాన్నే పిండితో వడియాలు పెట్టుకుంటే పని త్వరగా పూర్తవుతుంది,
సాయంత్రానికి పట్టాను మడత పెట్టి మరుసటి రోజు ఉదయాన మళ్ళీ ఎండబెట్టు కోవాలి.
మరుసటి రోజు మధ్యాహ్నానికల్లా వడియాలు పట్టా నుండి వాటంతట అవే ఊడివస్తాయి.
మూడో రోజు కూడా వడియాలను ఎండబెట్టుకుని ఒక టిఫిన్లో పోసుకుని మూత పెట్టుకోవాలి.
ఈ బియ్యపు పిండి వడియాలు నిక్షేపంగా పూర్తిగా ఏడాది పాటు నిల్వ ఉంటాయి.
అవసరమైనప్పుడు కాసిని కాసిని వడియాలు తీసుకుని వేయించుకోవచ్చును.
సగ్గు బియ్యము వడియాలు లాగా ఈ బియ్యపు పిండి వడియాలు కూడా చాలా రుచిగా ఉంటాయి.
అంతే . ఎంతో రుచిగా ఉండే బియ్యపు పిండి వడియాలు భోజనములోకి పక్కన ఆదరువుగా మరియు మధ్యాహ్నము అల్పాహారమునకు సిద్ధం.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన రెసిపీ మేము తయారుచేయు విధానము మరియు ఫోటో తయారుచేయు సమయమున తీసినది.
0 comments:
Post a Comment