Thursday, October 12, 2017

దొండకాయ టమోటో పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

దొండకాయ టమోటో  పచ్చడి.

కావలసినవి .

దొండకాయలు  --  200 గ్రాములు .
టమోటోలు  --  మూడు .
పచ్చిమిరపకాయలు  --  పది
చింతపండు  --  చిన్న నిమ్మకాయంత
పసుపు  --  కొద్దిగా
ఉప్పు  --  తగినంత
కరివేపాకు  --  మూడు రెమ్మలు
కొత్తిమీర  --  చిన్న కట్ట .

పోపునకు .

నూనె --  అయిదు స్పూన్లు
ఎండుమిరపకాయలు  --  8
మినపప్పు  ---  స్పూను
మెంతులు  --  పావు స్పూను.
ఆవాలు  --  అర స్పూను
జీలకర్ర  --  పావుస్పూను
ఇంగువ  --  కొద్దిగా

తయారీ  విధానము.

ముందుగా  చింతపండు  విడదీసి , చాలా  కొద్ది నీళ్ళలో  పది నిముషాలు  తడిపి  ఉంచుకోవాలి .

దొండకాయలు   ముక్కలుగా  తరుగు కోవాలి .

టమోటో లు కాస్త  పెద్దవిగా  తీసుకుని  వాటి  పై నూనె రాసి స్టౌ  సిమ్ లో  పెట్టి  కాల్చుకుని  చల్లారిన తర్వాత  తడి చేతితో  పై  తొక్క తీసివేసి  , విడిగా  పళ్ళెంలో   పెట్టుకోవాలి .

టమోటో లు  గట్టిగా  ఉన్నవి  తీసుకోవాలి .

తర్వాత  స్టౌ  వెలిగించి  బాండీ పెట్టి  మూడు స్పూన్లు  నూనె వేసి ,  నూనె బాగా కాగగానే  దొండకాయముక్కలు , పచ్చిమిర్చి మరియు కొద్దిగా  పసుపు  బాండిలో  వేసి  మూతపెట్టి మీడియం సెగన  మగ్గనివ్వాలి .

తర్వాత   వీటిని వేరే పళ్ళెంలో  తీసుకుని  ఉంచుకోవాలి .

తిరిగి  బాండి పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసి  నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిర్చి , మెంతులు, మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు  కరివేపాకు  వేసి  పోపు  పెట్టుకోవాలి .

తర్వాత  ముందుగా  మిక్సీ లో  ఎండుమిరపకాయలు , చింతపండు ,  దొండకాయ ముక్కలు , పచ్చిమిర్చి తగినంత  ఉప్పు  మరియు చింతపండు  వేసి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత మిగిలిన పోపు , వొలిచి ఉంచిన టమోటోలు మరియు  కొత్తిమీర  కూడా  వేసి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

అంతే  ఎంతొ రుచిగా  ఉండే దొండకాయ టమోటో  పచ్చడి  ఇడ్లీ , దోశెలు , చపాతీలు మరియు భోజనము  లోకి సర్వింగ్  కు సిద్ధం.

కందిపప్పు కొబ్బరిముక్కల పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

కందిపప్పు కొబ్బరిముక్కల  పచ్చడి .

కావలసినవి .

కందిపప్పు  --  ఒక కప్పు
పచ్చికొబ్బరి  ముక్కలు --  ఒక కప్పు.
ఎండుమిరపకాయలు  --  పది
జీలకర్ర  --  స్పూను
చింతపండు  --  చిన్న ఉసిరి కాయంత.
ఉప్పు  --  తగినంత
ఇంగువ -- కొద్దిగా

పోపునకు .

ఎండుమిర్చి  --  మూడు  ముక్కలుగా  చేసుకోవాలి
మినపప్పు  --  స్పూను
ఆవాలు  --  అర  స్పూను
కరివేపాకు  --  రెండు  రెమ్మలు
నెయ్యి  --  నాలుగు  స్పూన్లు

తయారీ విధానము .

ముందుగా  స్టౌ  మీద బాండీ   పెట్టి  రెండు స్పూన్లు  నెయ్యి వేసి  నెయ్యి  బాగా  కాగగానే  కందిపప్పు , ఎండుమిర్చి , జీలకర్ర మరియు ఇంగువ వేసి  కందిపప్పు  కమ్మని  వేగిన వాసన వచ్చే వరకు  వేయించుకోండి.

తర్వాత  అందులోనే  చిన్న ముక్కలుగా  తరిగిన  కొబ్బరి ముక్కలు  వేసి  పచ్చి వాసన పోయేవరకు  ఉంచి  దింపి  వేరేగా  పళ్ళెంలో  తీసుకోండి .

పోపు  చల్లారగానే   ముందుగా  మిక్సీ లో  ఎండుమిరపకాయలు , వేగిన  కొబ్బరి  ముక్కలు , తడిపిన చింతపండు మరియు తగినంత ఉప్పు వేసి  మెత్తగా  మిక్సీ  వేసుకోండి.

తర్వాత  వేగిన కందిపప్పు కూడా వేసి , కొద్దిగా  నీళ్ళు పోసి  మెత్తగా మిక్సీ   వేసుకోండి .

తర్వాత వేరే గిన్నెలో కి తీసుకోండి.

ఇప్పుడు  స్టౌ మీద బాండీ పెట్టి  మిగిలిన రెండు స్పూన్లు  నెయ్యి వేసి  నెయ్యి బాగా కాగగానే  ఎండుమిర్చి  ముక్కలు , మినపప్పు , ఆవాలు మరియు కరివేపాకు  వేసి  పైన పోపు  పెట్టుకోండి .

అంతే   ఇడ్లీ , దోశెలు , గారెలు , చపాతీలు  మరియు భోజనము  లోకి  ఎంతో రుచిగా  ఉండే  కందిపప్పు  కొబ్బరి పచ్చడి సర్వింగ్  కు సిద్ధం.

అలచందలు పచ్చి కొబ్బరి కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

అలచందలు  పచ్చి కొబ్బరి  కూర.

లేత అలచందలు  --  అర కిలో
పచ్చి కొబ్బరి తురుము --  ఒకటిన్నర  కప్పు
పచ్చిమిరపకాయలు  --  పది
అల్లం  --  10 గ్రాముల ముక్క
పసుపు --  కొద్దిగా
ఉప్పు  --  తగినంత
కరివేపాకు  --  మూడు రెమ్మలు
కొత్తిమీర  --  ఒక కట్ట.

పోపునకు .

నూనె  --  నాలుగు  స్పూన్లు
ఎండుమిరపకాయలు  -- 4   చిన్న  ముక్కలుగా  చేసుకోవాలి .
మినపప్పు  --  స్పూనున్నర
జీలకర్ర  --  పావు స్పూను
ఆవాలు --  అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా .

మొన్న  పుష్కరాలకు  శ్రీరంగపట్నం లో  Wood  Lands Hotel  లో  మధ్యాహ్నము భోజనము  చేసాము .

ఆ హోటల్లో  ఈ అలచందలు  కూర  చేసారు.

చాలా రుచిగా ఉంది .

అప్పటినుండి  ఈ కూర  చేయాలని  గుబులు  పుట్టింది .

తెనాలి  మార్కెట్ లో  నిన్న లేత అలచందలు  వచ్చాయి .

వెంటనే  కొని  ఈ రోజు  అలచందల  కూర  చేసాము .

చాలా  చాలా  రుచిగా  ఉంది .

అందువలన  తయారీ  విధానము   మీకు  కూడా  తెలియ చేస్తున్నాను .

తయారీ  విధానము .

ముందుగా  అలచందలు శుభ్రముగా  కడిగి  చాకుతో  చాలా  చిన్న చిన్న ముక్కలుగా  కట్  చేసుకోవాలి .

పచ్చిమిరపకాయలు  కూడా అదే  సైజులో  చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి .

అల్లం కూడా  పై చెక్కు తీసుకొని  చిన్న చిన్న  ముక్కలుగా  కట్ చేసుకోవాలి .

కొత్తిమీర  కూడా  శుభ్రం  చేసుకుని  కట్  చేసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండీ  పెట్టి  మొత్తము  నూనె  వేసి  నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిర్చి  ముక్కలు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు ,  ఇంగువ మరియు కరివేపాకు  వేసి  పోపు పెట్టు కోవాలి .

పోపు బాగా  వేగగానే  సన్నగా  తరిగిన  పచ్చిమిర్చి  ముక్కలు , సన్నగా  తరిగిన  అల్లం  ముక్కలు కూడా  పోపులో  వేసి  వాటిని  మూతపెట్టి   మూడు నిముషాలు మగ్గ నివ్వాలి .

తర్వాత  స్టౌ  మీడియం  సెగలో పెట్టి   వేగిన  పోపులో సన్నగా  తరిగిన  అలచంద ముక్కలు , తగినంత  ఉప్పు  మరియు  కొద్దిగా  పసుపు  వేసి మూతపెట్టి  పది నిముషాలు  అలచందల ముక్కలను  మెత్తగా  మగ్గ నివ్వాలి .

తర్వాత  పచ్చి కొబ్బరి  తురుమును  కూడా వేసి  మరో  మూడు నిముషాలు  ఉంచి , కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసి దింపుకుని  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .

ఈ కూరలో  పచ్చిమిరపకాయలు  కారం మరియు అల్లం ముక్కల కారం వేసాము కనుక  కారం సరిపోతుంది .

ఎండుకారం  వేరుగా  వేయనవసరం లేదు .

అలచందలు  విడిగా  ఉడక పెట్ట నవసరం  లేదు .

చిన్న ముక్కలుగా  తరిగాము  కనుక  పోపులో  మగ్గి  పోతాయి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే అలచందలు కొబ్బరి కూర  సర్వింగ్  కు  సిద్ధం.

ఈ కూర  భోజనము  లోకి, రోటిలు  మరియు  చపాతీల లోకి  కూడా  చాలా  రుచిగా  ఉంటుంది .

నిమ్మకాయ చారు

ఆలూరుకృష్ణప్రసాదు .

నిమ్మకాయ  చారు .

ఒక  గిన్నెలో  రెండు  గ్లాసుల  నీళ్ళు  పోసుకోండి .

అందులో  పావు  స్పూను  పసుపు  వేయండి .

రెండు  పచ్చిమిర్చి   ముక్కలుగా   చేసి  వేయండి .

రెండు  రెమ్మల  కరివేపాకు   వేయండి .

తగినంత   ఉప్పు వేయండి .

రెండు  నిమ్మకాయలు  కోసి  వేరే  కప్పులో  రసం  పిండుకోండి.

రెండు ఎండు మిరపకాయలు , స్పూను  ధనియాలు , పావు  స్పూను  జీలకర్ర  , నాలుగు   మిరియాలు  రోట్లో  దంచుకోండి .

లేదా  మిక్సీ   లో  పొడి  వేసుకోండి .

చారుపొడి  ఇంట్లో  రెడీగా  ఉంటే  ఆ  పొడి  స్పూనున్నర   వేసుకోవచ్చు .

అప్పుడు రసం  పొడి  కొట్టు కోనక్కర లేదు ,

ఇప్పుడు  స్టౌ  మీద  చారు  గిన్నె  పెట్టి  బాగా  మరగ నివ్వండి .

అందులో  నే చెప్పిన  కొట్టిన  పొడి  గాని   లేదా చారు  పొడి  గాని  వేయండి .

బాగా  కాగనిచ్చి  దింపి  పిండిన  నిమ్మరసం  అందులో  పోసి  గరిటతో  బాగా  కలపండి .

స్టౌ  మీద  కాగుతూ  ఉండగా  నిమ్మరసం   పోస్తే  చారు  చేదు  వస్తుంది .

కొత్తిమీర   తరిగి   అందులో  వేయండి .

ఇప్పుడు  స్టౌ  మీద  పోపు  గరిటె  పెట్టి  రెండు స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే   రెండు  ఎండుమిర్చి   ముక్కలు , కొద్దిగా   మెంతులు , కొద్దిగా   జీలకర్ర , పావు  స్పూను  ఆవాలు  ,  కొద్దిగా   ఇంగువ   వేసి  పోపు  పెట్టుకోండి .

అంతే  వేడి  వేడి   నిమ్మరసం తో  చారు  సిద్ధం . 

మీకు  హోటల్  చారు  రుచి   రావాలంటే   పొడిలో  రెండు  వెల్లుల్లి   రెబ్బలు  దంపుకుని  తెర్లేటప్పుడు వేసుకోండి  .

అప్పుడు  పోపులో  ఇంగువ  వేయవద్దు .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  నిమ్మ కాయ  చారు  సర్వింగ్  కు  సిద్ధం .

ధనియాల పొడి

ఆలూరుకృష్ణప్రసాదు .

ధనియాల పొడి .

నోరు  అరుచిగా  ఉన్నా , జ్వరపడిన వారికి  పత్యం పెట్టాలన్నా , బాలింతలకు  పథ్యానికి  ఈ  ధనియాల పొడి  ఎక్కువగా  పెడతారు .

జలుబు  కఫం వంటివి  కూడా  హరిస్తుంది .

వేడి  వేడి అన్నంలో నెయ్యి బాగా వేసుకుని  ఈ పొడిని  మొదటి  ఐటమ్  గా  వేసుకుని  తింటే  ఆరోగ్య  రిత్యా  చాలా మంచిది .

కడుపులో  ఇబ్బందిగా  ఉన్నవారికి  , గ్యాస్  ప్రాబ్లమ్స్  ఉన్న వారికి  కూడా ఈ ధనియాల పొడి  వాడటం వలన  ఆ ఇబ్బందులు  తొలగి  పోతాయి .

ధనియాల పొడి  తయారీ  విధానము .

కావలసినవి .

ఎండుమిరపకాయలు  --   15
ధనియాలు  --  75  గ్రాములు
మినపప్పు  --  మూడు  స్పూన్లు
చింతపండు  --  చిన్న నిమ్మకాయంత
కరివేపాకు  --  రెండు రెమ్మలు .
ఉప్పు  --  తగినంత
నూనె  --  మూడు స్పూన్లు .

తయారీ  విధానము .

ముందుగా   చింతపండు   విడదీసి  గింజలు  లేకుండా  శుభ్రం  చేసుకోవాలి .

ధనియాలు  పుల్లలు  లేకుండా  శుభ్ర పరుచు కోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండీ  పెట్టి  మొత్తము  నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు , మినపప్పు  , ధనియాలు , వేసి  వేయించుకుని , తర్వాత కరివేపాకు  కూడా  వేసి  కమ్మని  వేపు  వచ్చే వరకు  వేయించుకోవాలి .

చల్లారగానే  మిక్సీ లో   వేయించిన  దినుసులు  , చింతపండు  మరియు  తగినంత  ఉప్పు వేసి మెత్తగా   పొడిగా  వేసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  ధనియాల పొడి  సర్వింగ్  కు  సిద్ధం .

ఇందులో  మెంతులు , ఆవాలు , జీలకర్ర  , శనగపప్పు , ఇంగువ  వంటివి  వెయ్యరు .

వెల్లుల్లి  తినే  వారు  కూడా  ఇది  కేవలం  ధనియాల పొడి  కావున  వేసుకోపోవడం  మంచిది .

ఈ  పొడి  భోజనము  లోకే  కాకుండా  ఇడ్లీ , దోశెలలోకి కూడా  బాగుంటుంది .

శాకాన్నం

ఆలూరుకృష్ణప్రసాదు .

శాకాన్నం .

దేవీ నవరాత్రులలో  అమ్మ వారి   ఆరవ రోజు  అలంకారం   శ్రీ సరస్వతీ  దేవి .

సరస్వతీ  దేవి  నైవేద్యానికి  శాకాన్నం ను  తొమ్మిది  రకముల  కూరగాయలు  మరియు  ఐదు  రకముల  సుగంధ  దినుసులతో  కలిపి  తయారు  చేస్తారు .

ఈ శాకాన్నం తయారీకి  కావలసిన కూరగాయలు .

దొండకాయలు  -- 150    గ్రాములు
బీన్స్  --  100  గ్రాములు
క్యారెట్  --  రెండు
బంగాళాదుంపలు  --  రెండు
పచ్చి బఠాణి   --  50  గ్రాములు
పెద్ద  చిక్కుడు  కాయలు --  100  గ్రాములు
కాప్సికం  --  రెండు
చామదుంపలు  --  150 గ్రాములు
పచ్చిమిరపకాయలు  --  పది

కావలసిన  సుగంథ  ద్రవ్యములు.

యాలకులు  --  8
జాజికాయ  -- కొద్దిగా
జాపత్రి  --  కొద్దిగా
దాల్చిన  చెక్క --  చిన్న ముక్క
లవంగాలు  --  12

నెయ్యి  --  75  గ్రాములు.
జీడిపప్పు  --  30  గ్రాములు .
బియ్యము   --  300  గ్రాములు .

తయారు  చేయు  విధానము .

ముందుగా  పైన తెలిపిన  కూరలు అన్నీ  శుభ్రముగా  కడిగి  బంగాళాదుంప  , చామ దుంప  పై  చెక్కును  తీసుకుని , అన్ని కూరలు  చిన్న ముక్కలుగా  తరుగు కోవాలి .

బియ్యము  ఒక  గిన్నెలో  పోసి తగినన్ని  నీరు  పోసి  ఒక అరగంట  సేపు  నానబెట్టుకోవాలి.

స్టౌ  మీద  బాండీ  పెట్టుకుని  మూడు స్పూన్లు  నెయ్యి వేసి  ముందుగా  జీడిపప్పు  వేయించుకుని  పక్కన  పెట్టుకోవాలి.

అదే నెయ్యిలో  సుగంథ ద్రవ్య  దినుసులన్నీ  వేయించుకుని  చల్లారగానే  రోటిలో కాని , అమాన్ దస్తాలో  కాని   మెత్తగా  పొడి  చేసుకుని  విడిగా  ఉంచుకోవాలి .

కడిగి  గిన్నెలో  సిద్ధంగా  ఉన్న బియ్యము  లో  నీళ్ళు  సరి  చూసుకుని , తరిగిన  కూరలన్నీ గిన్నెలో   వేసి , కుక్కర్  మూత  మరియు విజిల్  పెట్టి , స్టౌ  మీద  మూడు  విజిల్స్  వచ్చే వరకు ఉడికించి  స్టౌ ను ఆపేయాలి .

విజిల్  ఊడి  రాగానే  వేడి  వేడి  కూరగాయల అన్నాన్ని  బేసిన్  లోకి  వంపుకొని అందులో  సరిపడ  ఉప్పు , సుగంధ  ద్రవ్య దినుసుల పొడి , వేయించి సిద్ధంగా  ఉంచుకున్న  జీడిపప్పు  మరియు  మిగిలిన  నెయ్యి  వేసి  గరిటతో  బాగా  కలుపుకోవాలి ,

అంతే  శరవన్నవరాత్రులలో  ఆరవ రోజైన  శ్రీ సరస్వతీ  దేవి   నైవేద్యానికి  శాకాన్నం  సిద్ధం.

కొబ్బరిపాలతో కొబ్బరన్నం

అమ్మ వారి ప్రసాదం .

కొబ్బరి  పాలతో  కొబ్బరి  అన్నం.

తయారీ విధానము .

ముందుగా   గిన్నెలో  ఒక గ్లాసు  బియ్యం  పోసుకుని రెండు గ్లాసుల  నీళ్ళు  పోసుకుని  ఒక పది హేను నిముషములు  నానబెట్టుకుని నీళ్ళు వార్చుకోవాలి .

కొబ్బరి  కాయను  పగుల కొట్టి    రెండు చిప్పలూ  పచ్చి కొబ్బరి కోరాముతో  తురుముకుని  మిక్సీ లో  వేసుకుని   రెండు కప్పులు  కొబ్బరి  పాలు  తీసుకోవాలి .

దాల్చిన  చెక్క , బిర్యాని  ఆకు , జీడిపప్పు  , యాలకులు , లవంగాలు  సిద్ధం చేసుకోవాలి .

మూడు  పచ్చి మిర్చి  సన్నగా  తరుగు కోవాలి .

అల్లం  సన్నగా  తరుగు కోవాలి .

క్యారెట్  తీసుకుని  ఎండు కొబ్బరి  కోరాముతో  తురుము కోవాలి .

ఇప్పుడు   స్టౌ  మీద  కుక్కర్ పెట్టి  మూడు   స్పూన్లు   నెయ్యి  వేసి  నెయ్యి బాగా కాగగానే   ముందుగా   బిర్యాని ఆకు , లవంగాలు , మిరియాలు , జీడిపప్పు , యాలకులు ,  క్యారెట్  తురుము , పచ్చి మిర్చి  ముక్కలు , అల్లం  ముక్కలు  వేయించుకుని  తర్వాత  నాన బెట్టిన  బియ్యం వేసి , అందులో  కొబ్బరి  పాలు , మరియు అర గ్లాసు  నీళ్ళు పోసి  కుక్కర్  మూత  పెట్టి  మూడు  విజిల్స్  రానివ్వాలి .

విజిల్  రాగానా  పొదీనా  ఆకు  ,  సరిపడా  ఉప్పు  వేసి మరియు  మూడు  స్పూన్లు   నెయ్యి  వేసి  గరిటతో  బాగా  కలుపుకోవాలి .

తర్వాత  అమ్మ  వారికి  నివేదన  చేసి  అందరికీ  సర్వ్  చేయాలి .

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి