Showing posts with label బ్రహ్మ చారి వంటకములు. Show all posts
Showing posts with label బ్రహ్మ చారి వంటకములు. Show all posts

Thursday, June 1, 2017

చారు . ( రసము )

బ్రహ్మచారి వంటకాలు . ( 2 )
చారు . ( రసము )
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

నాకు భోజనము లోకి ప్రతి రోజు ఉదయము మరియు సాయంత్రం చారు పోసుకోవడం తప్పని సరి .
అప్పుడు ఫ్రిజ్ లు లేవు కాబట్టి రెండు పూటలా తప్పనిసరిగా చారు పెట్టుకోవాల్సి వచ్చేది .

నేను రెండేళ్ళు వివాహం కాకమునుపు స్వయం పాకం చేసుకున్నాను.
ఈ రసం తయారు చేయడానికి 
మా అమ్మ గారు నాకు ఈ విధంగా చేసి ఇచ్చేవారు .

ఓ 150 గ్రాముల చింతపండు , తగినంత ఉప్పు , స్పూను పసుపు , కొద్దిగా బెల్లం , ఓ అయిదు స్పూన్లు కొట్టి ఉంచుకున్న చారు పొడి అరకప్పు కరివేపాకు వేసి రోటిలో పచ్చడి బండతో బాగా దంపి నిమ్మ కాయంత ఉండలు చేసి ఇచ్చే వారు .
తను వేసిన పాళ్ళకు ఒక్కొక్క ఉండకు ఎన్ని నీళ్ళు పడతాయో ఆ గిన్నెడు నీళ్ళు కిరోసిన్ స్టౌ మీద పెట్టుకొని నీళ్ళు తెర్లుతూ ఉండగా ఈ ఉండ మరియు రెండు పచ్చిమిర్చి ఆ నీటిలో వేసి మరో పది నిముషాలు తెర్ల నిచ్చి పోపు పెట్టు కునే వాడిని .
తర్వాత కొత్తిమీర సన్నగా తరిగి అందులో వేసేవాడిని
అంతే బ్రహ్మచారి వంటకం వేడి వేడి చారు రెడి .
నా బ్రహ్మ చారి వంట నాటికి 1972 to 1974 నాటికి కిరోసిన్ స్టౌ ల వంటే .

Wednesday, May 31, 2017

బెండకాయ నువ్వుల పొడి కూర.

బ్రహ్మచారి వంటకములు. ( 7 )
బెండకాయ నువ్వుల పొడి కూర.
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

ఓ 50 గ్రాముల నువ్వు పప్పులో రెండే రెండు ఎండు మిరపకాయలు వేసి నూనె లైకుండా బాండీలో దోరగా వేయించి చల్లారాక మిక్సీలో వేయించిన నువ్వులు , ఎండుమిర్చి మరియు కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా పొడిగా వేసుకుని వేరే పళ్ళెంలోకి తీసుకోండి.
పావు కిలో బెండకాయలు కాస్త పెద్ద ముక్కలు తరిగి పావు గ్లాసు నీళ్ళు పోసి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి స్టౌ మీద గిన్నెలో పెట్టి ఒక్క ఉడుకు రానివ్వండి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి 
 మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే రెండు ఎండు మిరపకాయల ముక్కలు , స్పూను మినపప్పు , పావు స్పూను జీలకర్ర , అర స్పూను ఆవాలు మరియు రెండు రెమ్మలు కరివేపాకు వేసి పోపు వేగగానే ఉడికించిన బెండకాయ ముక్కలు అడుగున కొంచెం నీళ్ళు ఉన్నా నీళ్ళతో బాండి లో పోసి ఓ స్పూను చింతపండు రసం అవసరమయితే కొద్దిగా ఉప్పు వేసి అయిదు నిముషాలు మగ్గ నివ్వండి .

స్టౌ ఆపి నువ్వుల పొడి వేసి గరిటతో బాగా కలిపి వేరే bowl లోకి తీసుకోండి.
అంతే కొంచెం పుల్లదనంతో ఘమ ఘమ లాడే నువ్వుల సువాసనతో బెండకాయ నువ్వుల పొడి కూర సర్వింగ్ కు సిద్ధం.
ఈ కూర అన్నం లోకి మరియు రోటీల లోకి కూడా బాగుంటుంది .

Tuesday, May 30, 2017

సింపుల్ గా స్వీట్ పొంగలి .

బ్రహ్మచారి వంటకములు -- ( 6 )
సింపుల్ గా స్వీట్ పొంగలి .
ఆలూరి కృష్ణ ప్రసాద్

ఒక గిన్నెలో గ్లాసు బియ్యం కడిగి తగినన్ని నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టుకోండి .
అన్నం పూర్తిగా ఉడకగానే అర లీటరు కాచిన పాలు అందులో పోయండి .
షుమారు ఓ 150 గ్రాముల బెల్లం పొడిగా చేసి ఉడుకుతున్న పాలు బెల్లం లో వేయండి.
మరో స్టౌ మీద బాండీ పెట్టి నాలుగు స్పూన్లు నెయ్యి వేసి 
 ముందు పది జీడిపప్పు లు వేయించి పక్కన పెట్టుకోండి .

నాలుగు యాలకులు పొడిగా చేసి ఉడుకుతున్న పొంగలి లో వేయండి.
పావు చిప్ప ఎండు కొబ్బరి చిన్న ముక్కలు గా Cut చేసుకుని బాండీలో ఉన్న నేతిలో బాగా వేయించుకుని నేతితో సహా ఉడుకుతున్న పాయసంలో వేసి బాగా అంతా కలిసేలా ఉడకనివ్వండి.
మూడు స్పూన్లు నెయ్యి వేసి దింపుకుని పైన వేయించిన జీడిపప్పు తో అలంకరించుకోండి .
అంతే స్వీట్ పొంగలి సిద్ధం.

Sunday, May 28, 2017

టమోటోలతో బ్రహ్మచారి వంటలు

టమోటోలతో బ్రహ్మచారి వంటలు  
ఆలూరి కృష్ణ ప్రసాద్

ఒకే విధానములో మూడు రకముల వంటకములు.
ముందు ఒకే విధానము ఏమిటో మీకు తెలియచేస్తాను .
అంటే ఒకే రెసిపీ తయారు చేసుకుని దానితో మూడు రకముల వెరైటీలు అంటే మూడు ఒక రోజు అని కాదు ఒకే పద్ధతిలో లో చేసుకోవచ్చును.
దేనితో టమోటో లతో .
ఏ విధంగా ?
****************************
(1 ) . ముందు స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి , ( మెత్త పడకుండా ) రంగు వచ్చిన మూడు టమోటో లను ముక్కలుగా తరిగి బాగా కాగిన నూనె లో వేయాలి .
అందులోనే కాస్త పసుపు మరియు నాలుగు పచ్చిమిర్చి వేసి మూత పెట్టి బాగా మగ్గాక దింపి వేరే ప్లేటు లోకి తీసుకోవాలి .
( 2 ) . నిమ్మకాయంత చింతపండు రెబ్బలుగా విడదీసి 
 పది నిముషాలు కొద్ది నీళ్ళలో నానబెట్టి చిక్కగా రసం తీసి ఉంచుకోవాలి .

( 3 ) . మళ్ళీ స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా మూడు ఎండుమిర్చి , స్పూనున్నర మినపప్పు ,పావు స్పూను జీలకర్ర , కాస్త ఇంగువ మరియు మూడు రెమ్మలు కరివేపాకు వేసి పోపు వేయించుకోవాలి .
ఆ బాండీలో పోపు అలాగే ఉంచుకోండి .
***************************
మొదటి రకం .
టమోటో చట్నీ.
బాండిలో ఉన్న వేగిన ఎండు మిరపకాయలు చేత్తో బాగా నలపండి . పోపులో కలిపేయండి .
అర స్పూను కారం , తగినంత ఉప్పు మరియు తరిగిన కొత్తిమీర బాండీలో వేయండి .
మగ్గిన , వేరే ప్లేటులో ఉంచుకున్న టమోటో లను , పచ్చి మిర్చి బాండిలో వేయండి .
చింతపండు రసం చిక్కగా తీసి ఉంచుకున్నారు కదా .
రెండు స్పూన్లు చింతపండు రసం బాండిలో వేయండి .
ఇప్పుడు అంతా చేత్తో బాగా కలపండి .
వేరే Bowl లోకి తీసుకోండి .
రోలు పచ్చడి బండ లేదా మిక్సీ అవసరం లేకుండా టమోటో చట్నీ సిద్ధం .
ఈ చట్నీ ఇడ్లీ , దోశె , చపాతీలు మరియు అన్నం లోకి బాగుంటుంది .
***************************
మరో రోజు .
టమోటో పచ్చి పులుసు పచ్చడి .
రెండు పెద్ద ఉల్లిపాయలు బజ్జీల లోకి తరిగినట్లు సన్నగా తరగండి .
ఇందాక చిక్కగా చింతపండు రసం తీయమన్నాను కదా .
ఓ అరగ్లాసు నీళ్ళు పోసి పలచగా రసం తీసుకోండి.
బాండిలో పోపు వేసి ఉంది కదా ముందు తరిగిన పచ్చి ఉల్లిపాయల ముక్కలు బాండిలో వేయండి .
అర స్పూను కారం , తగినంత ఉప్పు వేసి ఉల్లిపాయల ముక్కలు , వేగిన ఎండు మిర్చి మరియు పోపు బాగా కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకోండి .
ఇప్పుడు పచ్చిమిర్చి , టమోటో లు మగ్గ బెట్టిన మిశ్రమం , చింతపండు రసం మరియు తరిగిన కొత్తిమీర బాండిలో వేసి బాగా చేత్తో కలిపి వేరే గిన్నెలోకి తీసుకోండి .
టమోటో పచ్చి పులుసు చపాతీలలోకి , అన్నంలోకి సిద్ధం .
****************************
టమోటో పెరుగు పచ్చడి .
పావు లీటరు పెరుగు తీసుకుని ఒక గిన్నెలో వేసుకోండి .
టమోటో ముక్కలు ఒక్కటే మగ్గబెట్టుకోండి .

అందులో పసుపు , పచ్చిమిర్చి వేయకండి .

పచ్చిమిర్చి విడిగా సన్నగా తరుగు కోండి .
అందులో కొత్తిమీర , తరిగిన పచ్చిమిర్చి మరియు తగినంత ఉప్పు వేయండి.
మగ్గ బెట్టిన టమోటో లు అందులో వేయండి .
వేయించిన పోపు కూడా అందులో వేసుకోండి.
ఇప్పుడు చేత్తో బాగా కలుపుకోండి.
ఎంతో రుచిగా ఉండే టమోటో పెరుగు పచ్చడి అన్నం లోకి సిద్ధం .
****************************
బ్రహ్మచారుల వంటలు .

నచ్చితే చేసుకోండి .

Friday, May 26, 2017

అమ్మ నేర్పిన ఇన్ స్టెంట్ సాంబార్

బ్రహ్మ చారి వంటకములు ( 5)
ఆలూరి కృష్ణ ప్రసాద్
అమ్మ నేర్పిన ఇన్ స్టెంట్ సాంబార్. అంటే ఓ ఇరవై నిముషాలు పడుతుంది లెండి .
కావలసినవి
పెద్ద ఉల్లిపాయలు -- 2
బెండకాయలు -- 6
టమోటో లు -- 2
పచ్చిమిర్చి --- 3
కరివేపాకు -- రెండు రెమ్మలు .
చింతపండు -- నిమ్మకాయంత లేదా 50 గ్రాములు .
ఉప్పు -- తగినంత .
తయారీ విధానము .

ఇందులో కందిపప్పు ఉడికించే Process లేదు. ముందుగా కూరలన్నీ ముక్కలుగా తరుగుకోవాలి . పచ్చి మిర్చి నిలువుగా తరుగుకోవాలి . స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేయాలి .
నూనె బాగా కాగగానే రెండు ఎండుమిర్చి ముక్కలు , పావు స్పూను మెంతులు , అర స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ , కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి .
పోపు వేగగానే ఉల్లిపాయ ముక్కలు , బెండకాయ ముక్కలు , టమోటో ముక్కలు , తరిగిన పచ్చి మిర్చి ముక్కలు , కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి ముక్కలను మగ్గ నివ్వాలి .

చింతపండు పదిహేను నిముషాలు నాన బెట్టి రసం పల్చగా రెండు గ్లాసుల రసం తీసుకోవాలి .
ఆ రసం మగ్గుతున్న ముక్కలలో పోసి , కొద్దిగా బెల్లం వేసి బాగా తెర్ల నివ్వాలి .
****************************
అమ్మ చెప్పిన సాంబారు పొడి.
కందిపప్పు -- అర కప్పు
ఎండుమిరపకాయలు - 4
పచ్చి శనగపప్పు -- మూడు స్పూన్లు .
ధనియాలు -- మూడు స్పూన్లు
జీలకర్ర -- పావు స్పూను
బియ్యం -- రెండు స్పూన్లు
మిరియాలు -- పది
పై దినుసులన్నీ నూనె వేయకుండా బాండిలో ఒక్కసారే వేసి బాగా వేయించుకోవాలి .
చల్లారగానే మిక్సిలో వేసి అందులో పావు స్పూను లో సగం ఇంగువ వేసి మెత్తగా పొడి కొట్టుకోవాలి. లేదా మిక్సీ లో పౌడరుగా చేసుకోవాలి .
దాన్ని ఒక సీసాలో భద్ర పరుచుకుంటే ఓ పదిసార్లు సాంబారు పెట్టు కోవడానికి వస్తుంది .

****************************
ఇప్పుడు నేను చెప్పిన సాంబారు పొడి మూడు స్పూన్లు వేసి మరో పదినిముషాలు మరగ నిచ్చి దింపుకోవాలి .
అంతే ఘమ ఘమ లాడే ఇంగువ సువాసన సాంబారు ఇడ్లీ , వడ మరియు అన్నం లోకి సిద్ధం.

Thursday, May 25, 2017

సులువుగా వంకాయ కూర

సులువుగా వంకాయ కూర
బ్రహ్మచారి వంటకములు ( 4 )
ఆలూరి కృష్ణ ప్రసాద్
image courtesy: google

ముఖ్యంగా రుచి మిస్ అవకుండా సమయం తక్కువ పట్టేవి బ్రహ్మచారి వంటలు .
మరో రకం వంకాయ కూర .
మా స్నేహితుడు అక్కయ్య నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నేర్పింది .
దీనికి నూనె లేదు. పెద్ద Process కూడా లేదు.
వాళ్ళింటికి నేను భోజనానికి వెళ్ళినప్పుడు తను నాకు చేసి పెట్టింది .
అన్నం ఉడుకు పట్టంగానే నిగ నిగ లాడే మూడు సన్నని పొడుగు వంకాయలు గాటు పెట్టకుండా తొడిమతో అన్నంలో గుచ్చింది .
పది నిముషాల లోపే అన్నం పూర్తిగా ఉడకక ముందే ఆ మూడు కాయలు బయటికి తీసి
ఆ కాయలను చాకుతో చిన్నగా విడదీసి కాయల మీద ఒక చెంచా కారం , రెండు చెంచాల నెయ్యి వేసి భోజనము లోకి వంకాయ కూర అని చెప్పి వడ్డించింది .
మరి అది కూడా అన్నం లోకి కూరగా బాగానే ఉంది .

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి