టమోటోలతో బ్రహ్మచారి వంటలు
ఆలూరి కృష్ణ ప్రసాద్
ఒకే విధానములో మూడు రకముల వంటకములు.
ముందు ఒకే విధానము ఏమిటో మీకు తెలియచేస్తాను .
అంటే ఒకే రెసిపీ తయారు చేసుకుని దానితో మూడు రకముల వెరైటీలు అంటే మూడు ఒక రోజు అని కాదు ఒకే పద్ధతిలో లో చేసుకోవచ్చును.
దేనితో టమోటో లతో .
ఏ విధంగా ?
****************************
(1 ) . ముందు స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి , ( మెత్త పడకుండా ) రంగు వచ్చిన మూడు టమోటో లను ముక్కలుగా తరిగి బాగా కాగిన నూనె లో వేయాలి .
అందులోనే కాస్త పసుపు మరియు నాలుగు పచ్చిమిర్చి వేసి మూత పెట్టి బాగా మగ్గాక దింపి వేరే ప్లేటు లోకి తీసుకోవాలి .
( 2 ) . నిమ్మకాయంత చింతపండు రెబ్బలుగా విడదీసి
పది నిముషాలు కొద్ది నీళ్ళలో నానబెట్టి చిక్కగా రసం తీసి ఉంచుకోవాలి .
( 3 ) . మళ్ళీ స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా మూడు ఎండుమిర్చి , స్పూనున్నర మినపప్పు ,పావు స్పూను జీలకర్ర , కాస్త ఇంగువ మరియు మూడు రెమ్మలు కరివేపాకు వేసి పోపు వేయించుకోవాలి .
ఆ బాండీలో పోపు అలాగే ఉంచుకోండి .
***************************
మొదటి రకం .
టమోటో చట్నీ.
బాండిలో ఉన్న వేగిన ఎండు మిరపకాయలు చేత్తో బాగా నలపండి . పోపులో కలిపేయండి .
అర స్పూను కారం , తగినంత ఉప్పు మరియు తరిగిన కొత్తిమీర బాండీలో వేయండి .
మగ్గిన , వేరే ప్లేటులో ఉంచుకున్న టమోటో లను , పచ్చి మిర్చి బాండిలో వేయండి .
చింతపండు రసం చిక్కగా తీసి ఉంచుకున్నారు కదా .
రెండు స్పూన్లు చింతపండు రసం బాండిలో వేయండి .
ఇప్పుడు అంతా చేత్తో బాగా కలపండి .
వేరే Bowl లోకి తీసుకోండి .
రోలు పచ్చడి బండ లేదా మిక్సీ అవసరం లేకుండా టమోటో చట్నీ సిద్ధం .
ఈ చట్నీ ఇడ్లీ , దోశె , చపాతీలు మరియు అన్నం లోకి బాగుంటుంది .
***************************
మరో రోజు .
టమోటో పచ్చి పులుసు పచ్చడి .
రెండు పెద్ద ఉల్లిపాయలు బజ్జీల లోకి తరిగినట్లు సన్నగా తరగండి .
ఇందాక చిక్కగా చింతపండు రసం తీయమన్నాను కదా .
ఓ అరగ్లాసు నీళ్ళు పోసి పలచగా రసం తీసుకోండి.
బాండిలో పోపు వేసి ఉంది కదా ముందు తరిగిన పచ్చి ఉల్లిపాయల ముక్కలు బాండిలో వేయండి .
అర స్పూను కారం , తగినంత ఉప్పు వేసి ఉల్లిపాయల ముక్కలు , వేగిన ఎండు మిర్చి మరియు పోపు బాగా కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకోండి .
ఇప్పుడు పచ్చిమిర్చి , టమోటో లు మగ్గ బెట్టిన మిశ్రమం , చింతపండు రసం మరియు తరిగిన కొత్తిమీర బాండిలో వేసి బాగా చేత్తో కలిపి వేరే గిన్నెలోకి తీసుకోండి .
టమోటో పచ్చి పులుసు చపాతీలలోకి , అన్నంలోకి సిద్ధం .
****************************
టమోటో పెరుగు పచ్చడి .
పావు లీటరు పెరుగు తీసుకుని ఒక గిన్నెలో వేసుకోండి .
టమోటో ముక్కలు ఒక్కటే మగ్గబెట్టుకోండి .
అందులో పసుపు , పచ్చిమిర్చి వేయకండి .
పచ్చిమిర్చి విడిగా సన్నగా తరుగు కోండి .
అందులో కొత్తిమీర , తరిగిన పచ్చిమిర్చి మరియు తగినంత ఉప్పు వేయండి.
మగ్గ బెట్టిన టమోటో లు అందులో వేయండి .
వేయించిన పోపు కూడా అందులో వేసుకోండి.
ఇప్పుడు చేత్తో బాగా కలుపుకోండి.
ఎంతో రుచిగా ఉండే టమోటో పెరుగు పచ్చడి అన్నం లోకి సిద్ధం .
****************************
బ్రహ్మచారుల వంటలు .
నచ్చితే చేసుకోండి .
0 comments:
Post a Comment