Sunday, May 28, 2017

మెంతికూరతో వంటకాలు


మెంతికూరతో వంటకాలు 
ఆలూరి కృష్ణ ప్రసాద్

ఆరోగ్యానికి మెంతికూర.
మధు మేహా వ్యాధి నియంత్రణకు , శ్వాస కోశ , మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు మెంతికూర ఆహారంలో తీసుకోవడం చాలా ఉపయోగం.
మాములుగా ఆకులుగా దొరికే మెంతికూర, బాపట్ల మరియు కొన్ని ప్రాంతాలలో దొరికే చిన్న చిన్న కట్టలుగా దొరికే మెంతికూర .
రోజూ బాపట్ల నుండి సాయంత్రం వేళలలో తెనాలి ఈ చిన్న కట్టల మెంతికూర తెచ్చి అమ్ముతారు .
సంవత్సరంలో బాగా ఎండలున్న మూడు నెలలు తప్ప ఈ చిన్న కట్టల మెంతికూర మాకు మిగిలిన తొమ్మిది నెలలు దొరుకుతుంది .
ఆహార పోషక విలువల లో రెండు ఒకటే అయినా మేము చిన్న చిన్న కట్టల మెంతికూరనే వాడతాము .
చాలా చాలా రుచిగా ఉంటుంది .
మెంతికూరతో ఏమి చెయ్యవచ్చు ?
1. మెంతి కూర పప్పు కందిపప్పుతో.
2. మెంతికూర పప్పు కూర శనగపప్పు తో.
3. మెంతికూర పొడి కూర కందిపప్పు తో.
ఇవి కాక మేతి చపాతీలు , మేతి పరోటాలు చాలా రకాలు చేస్తారు .

ఇప్పుడు నేను చెప్తున్నది
మెంతికూర కందిపప్పు తో పొడికూర .


మెంతికూర కందిపప్పు తో పొడికూర తయారు చేయు విధానము.
ముందుగా ఒక గ్లాసు కందిపప్పు 
ఒక గిన్నెలో పోసుకుని ఒకసారి కడిగి , ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసి స్టౌ వెలిగించి మరీ మెత్తగా కాకుండా బద్దలుగా ( చేతితో నొక్కి చూస్తే బద్ద మెత్త పడితే చాలు ) ఉడికించండి .

ఉడికిన నీళ్ళు మిగిలితే ఒక గిన్నెలో వార్చుకోండి .పార బోయవద్దు .
బద్దలుగా ఉడికిన పప్పు ఒక పళ్ళెంలో పక్కన పెట్టుకోండి .
మెంతి కూర చిన్న కట్టలయితే వేళ్ళు చాకుతో కట్ చేసి కాడలు కూడా లేతగా ఉంటే ఉంచండి .
ఆకు మరియు కాడలు చిన్న చిన్నగా కట్ చేసిన తర్వాత రెండు సార్లు శుభ్రంగా కడగండి .

మా బాపట్ల ఇసుక నేల కాబట్టి ఏ ఆకు కూర లో నైనా ఇసుక తగులుతుంది .
బాగా కడగపోతే కూరలో ఇసుక తగిలి గర గర మంటుంది. రుచి పాడవుతుంది.
అదే పెద్ద మొక్కల మెంతికూర అయితే ఆకులు వలుచుకుని కట్ చేసుకుని ముదురు కాడలు పారేసి ఆకును శుభ్రంగా కడుక్కోండి.
ఇప్పుడు స్టౌ వెలిగించి బాండీ పెట్టి నాలుగు టీ స్పూన్ల నూనె వేయండి .
నూనె బాగా కాగాక నాలుగు ఎండుమిరపకాయలు ముక్కలు చేసినవి , రెండుస్పూన్ల చాయమినపప్పు , అర స్పూన్ జీలకర్ర , అర స్పూన్ ఆవాలు , తగినంత ఇంగువ , రెండు రెమ్మల కరివేపాకు వేసి పోపు బాగా వేగాక , తరిగి ఉంచుకున్న మెంతికూర ఆ పోపులో వేయండి . అందులో పావు స్పూన్ పసుపు కూడ వెయ్యండి.
మెంతికూర తొందరగానే మగ్గుతుంది.

మెంతికూర మగ్గిన తర్వాత ఇప్పుడు బద్దలుగా ఉడికించిన కందిపప్పు కూడా అందులో వేసి ఇప్పుడు తగినంత ఉప్పు కారం వేసుకుని మూడు నిముషాల పాటు మగ్గనిచ్చి దింపేసి వేరే Bowl లోకి తీసుకోండి .
అంతే ఆరోగ్య కరమైన మరియు రుచికర మైన మెంతికూర పొడికూర భోజనం లోకి సిద్ధం.
ఇదే పద్దతి లో కందిపప్పు బదులు శనగపప్పు వేసి కూడా పొడికూర చేసుకోవచ్చు .


Same Procedure.
కొంతమంది పోపులో మెంతికూర వేయిస్తే విటమిన్ లు పోతాయని ఉడుకుతున్న కందిపప్పు లోనే తరిగి ఉంచుకున్న మెంతికూర వేసి రెండూ ఉడికాక , పైన నే చెప్పిన పద్ధతిలో పోపు , ఉప్పు , కారం వేసుకుంటారు .
ఇక మెంతికూర పప్పు అయితే ఉడుకుతున్న పప్పులో మెంతికూర , ఇష్టమున్న వారు రెండు తరిగి ఉంచుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు , తరిగి ఉంచుకున్న మూడు పచ్చి మిరపకాయ ముక్కలు , పసుపు, కరివేపాకు వేసి మెంతికూర , ఉల్లిపాయలు ఉడికాక కాస్త చింతపండు , రసం , ఉప్పు , కారం , వేసి చాయ పైన చెప్పిన విధంగానే పోపు పెట్టుకోవచ్చు.
ఇంక ఇందాక పప్పు నీళ్ళు మిగిలితే ఏం చెయ్యాలి ?
పప్పు కట్టు చేసుకోవచ్చు.
ఆ నీళ్ళలో అర గరిటెడు ఉడికిన పప్పు కలిపి కొద్దిగా ఉప్పు కలిపి ,
కొద్దిగా పసుపు వేసి ఎండు మిరపకాయలు , ఆవాలు , జీలకర్ర ,
ఇంగువ , కరివేపాకు వేసి పోపు పెట్టుకుంటే బలవర్ధక మైన పప్పు కట్టు రెడీ.
మీ కిష్టమైతే పోపులో రెండు వెల్లుల్లి రెబ్బలు ఇంగువ బదులుగా వేసుకోండి .

మేము వెల్లుల్లి వాడకం చాలా చాలా తక్కువ.
మీకు పప్పు కట్టు చప్పగా అన్పిస్తే
కొద్దిగా నిమ్మరసం పిండుకోండి .


0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి