Tuesday, May 30, 2017

చింతకాయ పులిహోర .

చింతకాయ పులిహోర .
ఆలూరి కృష్ణ ప్రసాద్

కావలసినవి .
కొత్త చింతకాయ గింజలు తీసి వేసిన పచ్చడి -- ఒక చిన్న కప్పు
పచ్చిమిరపకాయలు -- పది 
కరివేపాకు -- నాలుగు రెమ్మలు
బియ్యము -- ఒక గ్లాసు
పసుపు -- ఒక స్పూను 
ఉప్పు -- తగినంత

పోపుకు .
ఎండుమిరపకాయలు --- 8
పచ్చిశనగపప్పు --- రెండు స్పూన్లు .
మినపప్పు -- రెండు స్పూన్లు 
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- మరి కాస్త
వేరు శనగ గుళ్ళు -- ఒక ఐదు స్పూన్లు 
జీడిపప్పు -- ఒక ఆరు పలుకులు .
నూనె --- 125 గ్రా.

తయారీ విధానము .
ఒక గ్లాసు బియ్యంలో తగినన్ని నీళ్ళు పోసి కొంచెం పొడి పొడి లాడే విధముగా అన్నం వండుకోవాలి.
తర్వాత మిక్సీలో ఒక రెండు పచ్చి మిరపకాయలు , కొత్త చింతకాయ పచ్చడి వేసి కొద్దిగా నీళ్ళు పోసి చింతకాయ పచ్చడి పూర్తిగా మెత్తగా అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోవాలి .
ఇప్పుడు ఒక బేసిన్ లో ఉడికిన అన్నాన్ని వేసి, అందులో స్పూను పసుపు , కరివేపాకు , కొద్దిగా ఉప్పు మరియు ఒక అర గరిటెడు నూనె పోసుకుని గరిటతో వేడి మీదనే బాగా కలపాలి.
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మిగిలిన నూనె పోసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు ( తుంచకుండా ) , పచ్చి శనగపప్పు , మినపప్పు , వేరుశనగ గుళ్ళు , జీడిపప్పు , మరి కాస్త ఇంగువ, పచ్చి మిరపకాయలు మరియు కరివేపాకు వేసి పోపు వేగగానే , మిక్సీ వేసుకున్న చింతకాయ ముద్దను పోపులో వేసి కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించి ఆ పోపును బేసిన్ లో సిద్ధముగా ఉంచుకున్న అన్నంలో వేసి గరిటతో బాగా కలుపుకోవాలి.
చింతకాయ లో ఉప్పు ఉంటుంది కనుక రుచి చూసుకుని ఉప్పు కలుపు కోవచ్చు.
అంతే ఇంగువ సువాసనతో ఘమ ఘమ లాడే చింతకాయ పులిహోర సర్వింగ్ కు సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి