Wednesday, May 31, 2017

వంకాయ ఉల్లిపాయల కూర .

వంకాయ ఉల్లిపాయల కూర .
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

కావలసినవి.
గుండ్రని నీలం రంగు వంకాయలు లేతవి --- అర కిలో
ఉల్లిపాయలు -- అయిదు .
నూనె -- 100 గ్రాములు .
పసుపు -- పావు స్పూను
ఉప్పు -- తగినంత
కారం -- ఒకటిన్నర స్పూను
పచ్చిమిర్చి -- నాలుగు
పోపుకు .
ఎండుమిరపకాయలు -- అయిదు తుంపి ముక్కలుగా చేసుకోవాలి
పచ్చి శనగపప్పు -- రెండు స్పూన్లు .
మినపప్పు -- రెండు స్పూన్లు
జీలకర్ర -- పావు స్పూను
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
కరివేపాకు -- మూడు రెమ్మలు .
ఈ కూరలో ప్రత్యేకంగా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాము .
అప్పుడే కూర రుచిగా ఉంటుంది .
ముందుగా ఉల్లిపాయలు కాస్త పెద్ద ముక్కలుగా తరుగు కోవాలి .
వేరే ప్లేటు లో ఉంచుకోవాలి .

వంకాయలు కూడా నీళ్ళలో ఉప్పువేసి ముక్కలుగా తరుగుకొని వేసుకోవాలి.
నాలుగు పచ్చిమిర్చి -- ముక్కలుగా తరుగు కోవాలి .
తయారీ విధానము .
ఈ కూర ప్రత్యేకంగా మేము అడుగున మందంగా ఉండే ఇత్తడి గిన్నెలో చేసుకుంటాము .
మీరు మామూలు గిన్నెలో చేసుకోవచ్చు .
ముందుగా స్టౌ వెలిగించి గిన్నె పెట్టి గిన్నె బాగా వేడెక్కగానే , 
మొత్తం నూనె పోసి నూనె బాగా కాగనివ్వాలి .

నూనె బాగా కాగగానే అందులో వరుసగా ఎండుమిర్చి ముక్కలు , పచ్చి శనగపప్పు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , పచ్చిమిర్చి ముక్కలు , కరివేపాకు వేసి పోపు పెట్టుకుని అందులో ముందుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు , కొద్దిగా పసుపు , కొద్దిగా ఉప్పు వేసి పైన ఒక పళ్ళెంలో నీళ్ళు పోసి మూత పెట్టి ఉల్లి పాయలు సగానికి పైగా మగ్గ నివ్వాలి .
తర్వాత నీళ్ళలో తరిగి ఉంచుకున్న వంకాయ ముక్కలు కూడా అందులో వేసి కొద్దిగా ఉప్పు వేసి తిరిగి నీళ్ళ మూత పెట్టి మధ్యలో కదుపుతూ మరో పది నిముషాలు కూర అంతా పూర్తిగా మగ్గ నివ్వాలి .
దింప బోయే మూడు నిముషాల ముందు స్పూనున్నర కారం వేసి దింపుకుని వేరే గిన్నె లోకి తీసుకోవాలి .
పైన నీళ్ళ ప్లేటు మూత పెడతాం కాబట్టి కూరను మీడియం సెగన మగ్గ నివ్వాలి .
ఈ వంకాయ ఉల్లిపాయ కూర కలర్ ఫుల్ గా చాలా రుచిగా ఉంటుంది .
ప్రత్యేకించి ఈ కూరలో ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది .
నిజమైన ప్రాచీన వంటకం 100% గా చేసుకోవాలంటే ఉల్లిపాయ వేయకుండా చేసుకోవాలి .
అన్నం లోకి , చపాతీలలోకి , దోశెల లోకి కూడా బాగుంటుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి