Showing posts with label కూరలు. Show all posts
Showing posts with label కూరలు. Show all posts

Sunday, April 19, 2020

క్యాప్సికమ్ ఉల్లి కారం కూర ( కాయల పళంగా )

క్యాప్సికమ్  ఉల్లి కారం కూర ( కాయల పళంగా )

ఆలూరుకృష్ణప్రసాదు .


క్యాప్సికమ్  ఉల్లికారం కూర . ( కాయల పళంగా కూర )

కావలసిన  పదార్థములు.

క్యాప్సికమ్   ---  అర కిలో.

పచ్చి శనగపప్పు  --  25  గ్రాములు

చాయ  మినపప్పు  -  20  గ్రాములు .

ఆవాలు  --   పావు స్పూను .

ఎండు మిరపకాయలు  --  10

ఉల్లిపాయలు  -  మూడు.

ఉప్పు  ---  తగినంత 

నూనె  --   100  గ్రాములు .

తయారు  చేయు విధానము .

ఉల్లిపాయలు  పొట్టు తీసి ముక్కలుగా తరుగు కోవాలి.

క్యాప్సికమ్  నాలుగు పక్షాలుగా చేస్తే  కారం కాయనుండి విడిపోయి నూనెలో పడి మాడిపోతుందేమోనని  మేము క్యాప్సికమ్ పై తొడిమ తీసేసి చిన్న రంధ్రం చేసాము.

మీరు మీ వీలుని బట్టి  మాలా చేసిన సరే  లేదా కాయను నాలుగు  పక్షాలుగా చేసినా సరే.

ముందుగా  స్టౌ  వెలిగించి  బాండి  పెట్టి  నాలుగు  స్పూన్లు  నూనె వేసి నూనె బాగాకాగగానే ముందుగా  ఎండు మిరపకాయలు , పచ్చి శనగపప్పు  , చాయ మినపప్పు , ఆవాలు  వేసి పోపు  కమ్మని  వాసన  వచ్చేదాకా  వేయించు కోవాలి.

ఆ తర్వాత అందులోనే ఉల్లిపాయ  ముక్కలను వేసి  ఉల్లిపాయ ముక్కలు పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి .

పోపు  చల్లారిన  తర్వాత  మిక్సీలో  ఈ  పోపు  మొత్తము మరియు తగినంత  ఉప్పును  వేసి మరీ మెత్తగా  కాకుండా  అంటే  కొంచెము  పప్పులు  పంటికి  తగిలే  విధముగా  మిక్సీ  వేసుకోవాలి .

దీనినే  ఉల్లి కారం అని అంటారు.

ముందుగా   సిద్ధం  చేసుకున్న ఈ ఉల్లికారం  కాయల్లో పై రంధ్రము నుండి కూరు కోవాలి .

చివరలో కూర   దించబోయే  ఐదు నిముషాలు  ముందు కూర  పైన వేసుకోవడానికి  కాస్త  ఉల్లికారం  విడిగా  తీసుకుని ఉంచుకోవాలి .

మళ్ళీ  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మిగిలిన  నూనె  అంతా పోసి  నూనె  బాగా  కాగాక  ఉల్లి కారం కూరిన   క్యాప్సికమ్ కాయలను  వేసి  మీడియం  సెగన  కాయలు  మగ్గి  కారం  వేగే  దాకా  మధ్య మధ్యలో  అట్లకాడతో  తిరగవేస్తూ
కలుపుతూ  ఉండాలి .

దింప  బోయే   అయిదు  నిముషాల ముందు  మిగిలిన ఉల్లికారం కూడా  వేసి  కూర బాగా కమ్మని వాసన వచ్చి వేగాక   దించుకుని , వేరే  డిష్ లోకి  తీసుకోవాలి .

అంతే  ఘమ ఘమ లాడే క్యాప్సికమ్ ఉల్లి కారంకాయల పళంగా కూర  సర్వింగ్  కు  సిద్ధం.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారు చేయు విధానము  మరియు ఫోటో తయారు చేయు సమయమున తీసినది.

Monday, September 3, 2018

ఆకాకరకాయ ఉల్లికారం

ఆలూరుకృష్ణప్రసాదు. 

ఆకాకరకాయలు  ఉల్లికారం.

కావలసినవి.

ఆకాకరకాయలు  -- 350 గ్రాములు.
నూనె  ---  50 గ్రాములు.
ఉల్లిపాయలు --  రెండు
ఉప్పు  -- తగినంత

పోపునకు .

ఎండుమిరపకాయలు  --  పది.
పచ్చిశనగపప్పు  --  మూడు స్పూన్లు .
చాయమినపప్పు -- స్పూను
ఆవాలు --పావుస్పూనులోసగం 
జీలకర్ర   --  పావు స్పూనులో సగం.

తయారీ విధానము .

ముందుగా ఆకాకరకాయలను గింజలతోనే  చక్రాలుగా  తరుగు కోవాలి.

ఉల్లిపాయలను చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి.

స్టౌ వెలిగించి బాండి పెట్టుకుని  మూడు స్పూన్లు  నూనె వేసి  నూనె బాగా కాగగానే వరుసగా  ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు , చాయమినపప్పు, జీలకర్ర , ఆవాలు వేసి కమ్మనివాసన వచ్చే విధముగా పోపు  వేయించుకోవాలి.

ఆ తర్వాత  అందులోనే  తరిగిన  ఉల్లిపాయల  ముక్కలు  కూడా వేసి  ఉల్లిపాయలు పచ్చివాసన లేకుండా  వేయించుకోవాలి .

పోపు కొంచెం  చల్లారగానే ఈ పోపును మిక్సీలో వేసుకొని , తగినంత  ఉప్పును  కూడా వేసుకుని  మరీ మెత్తగా  కాకుండా మిక్సీ వేసుకోవాలి.

తర్వాత  ఈ ముద్దను  వేరే  ప్లేటులోకి  తీసుకోవాలి .

ఆ తర్వాత  మళ్ళీ  స్టౌ మీద బాండీ  పెట్టుకుని  మిగిలిన  నూనె మొత్తము వేసి నూనె కాగగానే  చక్రాలుగా  తరిగి ఉంచుకున్న  ఆకాకరకాయలను  నూనె లో వేసి  స్టౌ  మీడియం  సెగన పెట్టి    మూత పెట్టి  మధ్య మధ్యలో కదుపుతూ పది నిముషాల పాటు   చక్రాలుగా  తరిగిన  ముక్కలను  మెత్తగా  మగ్గ నివ్వాలి .

ఆతర్వాత  మిక్సీ  వేసి సిద్ధంగా  ఉంచుకున్న ఉల్లికారం  ముద్దను కూడా అందులో వేసి  మూత పెట్టి  మరో  ఎనిమిది నిముషాల పాటు  కూరను  మగ్గ నివ్వాలి.

ఆ తర్వాత  దింపుకుని  వేరే డిష్ లోకి తీసుకోవాలి .

కూర వేగినట్లు  fry గా కావాలనుకునే వారు

ఆకాకరకాయలను  చక్రాలుగా  కాకుండా  నిలువుగా  దొండకాయముక్కలు మాదిరిగా గింజలతో సహా  తరుగు కోవాలి.

తర్వాత బాగా కాగిన నూనెలో ముక్కలు  వేయగానే  స్టౌ ను  మీడియం సెగలో  పెట్టి మూత పెట్టకుండా మధ్య మధ్యలో అట్లకాడతో ముక్కలను  కదుపుతూ  ఎర్రగా  వేగనివ్వాలి.

ఆ తర్వాత  సిద్ధంగా  ఉంచుకున్న  ఉల్లికారం ముద్దను కూడా వేసి  మూత పెట్టకుండా  మరో ఎనిమిది నిముషాలు ఉల్లికారం  బాగావేగి  ముక్కలకు పట్టే విధముగా వేయించుకుంటే  కూర ఉల్లికారం కలిసి బాగా వేగి  fry  లాగా  చాలా రుచిగా  ఉంటుంది.

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  ఆకాకరకాయలు  ఉల్లికారం కూర  భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం.

ఫోటో  --  మొదటి పద్ధతిలో  ఆకాకరకాయలను  చక్రాలుగా  తరిగి ఉల్లికారం వేసి  చేసిన పద్ధతిలో  చేసినది.

సంబంధించిన  రెసిపీ  మరియు  ఫోటో  నా స్వంతం .

కాప్సికమ్ స్టఫ్డ్ కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

కాప్సికమ్   కాయలపళంగా కూర పొడి కూరిన Stuffed  Curry.

కావలసినవి.

కాప్సికమ్ చిన్న సైజు కాయలు -  350 గ్రాములు.
ఎండుమిరపకాయలు  --  12
పచ్చిశనగపప్పు  --  మూడు స్పూన్లు
చాయమినపప్పు  --  రెండు స్పూన్లు
జీలకర్ర  -- ముప్పావు  స్పూను
ఆవాలు - కొద్దిగా
నూనె --  ఆరు స్పూన్లు
పెద్ద ఉల్లిపాయలు  --  రెండు.
ఉప్పు  --  తగినంత

తయారీ విధానము .

ముందుగా  స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు  నూనె వేసుకుని  నూనె  బాగా కాగగానే  వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , జీలకర్ర మరియు పావు స్పూను  ఆవాలు వేసుకుని  కమ్మని వాసన వచ్చేదాకా  వేయించుకోవాలి .

చల్లారగానే  వేయించిన పోపు మరియు  తగినంత  ఉప్పును  వేసుకుని  మిక్సీ లో వేసుకుని  కొంచెం  పప్పులు  తగిలే విధముగా  మిక్సీ  వేసుకోవాలి.

ఉల్లిపాయలు  చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.

ఈ పొడి  వేరే పళ్ళెము లోకి  తీసుకోవాలి .

చిన్న ముక్కలుగా తరిగిన  ఉల్లిపాయలను  ఈ పొడిలో వేసుకుని చేతితో  బాగా నలుపుకోవాలి.

పొడి అంతా కొంచెం  ముద్దగా అవుతుంది .

కాప్సికమ్  కాయలకు చాకుతో   నాలుగు  మధ్యలో గాటు పెట్టుకోవాలి .

సిద్ధంగా  ఉంచుకున్న  కూరపొడిని  ఈ కాయలలో కూరుకోవాలి .

కొద్దిగా  పొడి  మిగుల్చుకుంటే  చివరలో దింపబోయే ముందు కూరలో కలుపకోవచ్చును.

స్టౌ మీద మళ్ళీ బాండీ పెట్టుకుని  మిగిలిన  నూనె  మొత్తము వేసి నూనె బాగా కాగగానే  పొడి కూరిన  కాప్సికమ్  కాయలను   నూనెలో  వేసి , స్టౌ ను మీడియం సెగలో పెట్టి   మూతపెట్టి  మధ్య మధ్యలో  అట్లకాడతో    కదుతూ పదిహేను నిముషాల పాటు బాగా కాయలను  బాగా మగ్గనివ్వాలి .

దింపబోయే  అయిదు నిముషాల  ముందు  మిగిలిన పొడి  కూరలో  వేసి  మూత  తీసి కాయలు మరియు పొడి  వేగినట్లుగా  చేసుకుంటే  కూర  చాలా రుచిగా  ఉంటుంది .

కూరను వేరే డిష్ లోకి  తీసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా ఉండే  కాప్సికమ్  కూర పొడి  కూరిన కూర భోజనము లోకి సర్వింగ్  కు సిద్ధం.

వేడి వేడి అన్నంలో నెయ్యి  వేసుకుని  ఈ కూర నంచుకుని  తింటే అద్భుతంగా ఉంటుంది .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.

పచ్చిశనగపప్పు కొబ్బరి కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

పచ్చిశనగపప్పు తో కొబ్బరి  కూర .
************************

పచ్చిశనగపప్పు  ఒక కప్పుడు తీసుకుని  సరిపడా నీరు పోసి చేత్తో పట్టుకుంటే బద్ద చితికే వరకు  ఉడకనివ్వాలి .

ఆ తర్వాత నీరు వార్చు కోవాలి .

పచ్చి కొబ్బరి  ఒక చిప్ప కొబ్బరి  తురుముతో తురుము కోవాలి .

స్టౌ మీద బాండీ పెట్టి  మూడు స్పూన్లు  నూనె వేసి  మూడు ఎండు మిరపకాయలు  ముక్కలుగా  తుంపి , స్పూను చాయమినపప్పు , అర స్పూను  ఆవాలు , పావు స్పూను  జీలకర్ర , కొద్దిగా  ఇంగువ , రెండు రెమ్మలు కరివేపాకు  మరియు  పచ్చిమిర్చి  మూడు ముక్కలుగా చేసి వేసుకుని  పోపు వేసుకోవాలి .

అందులో ఉడక పెట్టిన పచ్చిశనగపప్పు , కొద్దిగా  పసుపు ,  తగినంత  ఉప్పు , స్పూను కారం వేసుకుని ఓ అయిదు నిముషాలు మూతపెట్టి మీడియం సెగన మగ్గ నివ్వాలి .

చివరలో తురిమి ఉంచుకున్న  పచ్చి కొబ్బరి  తురుము వేసుకుని  మరో మూడు నిముషాలు ఉంచి  దింపుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే పచ్చిశనగపప్పు తో కొబ్బరి కూర సర్వింగ్  కు సిద్ధం.

ఈ కూరకు కాంబినేషన్ గా చింతపండు  పచ్చడి కాని అల్లం పచ్చడి కాని చాలా రుచిగా  ఉంటుంది .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.

ఆనపకాయ పల్లీ పొడి కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

ఆనపకాయ పల్లీ పొడి కూర .

కావలసినవి .

లేత ఆనపకాయ ముక్క --
షుమారు  400  గ్రాములు

పల్లీలు  --  100 గ్రాములు .

షాపుల్లో  వేయించిన  పల్లీ  గింజలు  విడిగా  అమ్ముతారు .

ఆ పల్లీలు  తెచ్చుకుని  పై పొట్టు తీసేసుకోవాలి .

ఎండుమిరపకాయలు  - 8 

జీలకర్ర  -- స్పూను

ఉప్పు  -- తగినంత

పోపునకు .

నూనె   -- నాలుగు  స్పూన్లు

ఎండుమిరపకాయలు  - 3 
ముక్కలుగా  చేసుకోవాలి .

చాయమినపప్పు  -  స్పూను

ఆవాలు -- స్పూను

కరివేపాకు  -  మూడు రెమ్మలు .

తయారీ విధానము .

ముందుగా  సొరకాయ పై చెక్కు  తీసి దోసకాయ పచ్చడికి  ముక్కలు  తరిగినట్లుగా  తరుగు కోవాలి .

ముక్కలను  ఒక గిన్నెలో  వేసి  మునిగే వరకు నీరు పోసి  కొద్దిగా ఉప్పువేసి స్టౌ మీద  పెట్టి  ముక్కలను మెత్తగా  ఉడికించి   నీరు వడకట్టు కోవాలి .

వేరే  ప్లేటులోకి  తీసుకోవాలి .

స్టౌ మీద బాండీ పెట్టి నూనె వేయకుండా  పొట్టు  తీసిన పల్లీలు , ఎండుమిరపకాయలు , జీలకర్ర  మీడియం  సెగన వేయించుకోవాలి .

చల్లారగానే మిక్సీ లో వేసుకుని  అందులో  తగినంత  ఉప్పువేసి  మెత్తని  పొడిగా  చేసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద బాండీ పెట్టి  మొత్తము  నూనె వేసుకుని  నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిర్చి  ముక్కలు , చాయమినపప్పు ,  ఆవాలు  మరియు కరివేపాకు  వేసి పోపు వేయించుకోవాలి .

పోపు వేగగానే ఉడికించి సిద్ధంగా  ఉంచుకున్న  సొరకాయ ముక్కలను పోపులో వేసి  మూత పెట్టి మీడియం సెగలో అయిదు నిముషాలు  మగ్గపెట్టాలి .

కూర దింపబోయే  మూడు నిముషాల ముందు  పల్లీ పొడి వేసి అట్లకాడతో  బాగా కలుపుకుని , విడిగా  ఒక గిన్నెలోకి తీసుకోవాలి .

అంతే . ఎంతో రుచిగా  ఉండే  ఆనపకాయ పల్లీ పొడితో కూర  చపాతీల లోకి మరియు భోజనము లోకి సిద్ధం.

సంబంధించిన  రెసిపీ  మరియు ఫోటో  నాస్వంతం.

Tuesday, July 24, 2018

పెద్ద చిక్కుడుకాయ ఉల్లిపాయ కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

పెద్ద చిక్కుడు కాయ ఉల్లిపాయ  కూర.

సాధారణంగా అందరూ  పెద్ద చిక్కుడు  కాయలు ఉడక పెట్టిన కూర మరియు వంకాయతో కలిపి కూరగా చేస్తారు.

చిక్కుడు  కాయలు మరియు ఉల్లిపాయలు కలిపి చేసే కూర కూడా చాలా బాగుంటుంది .

కావలసినవి .

చిక్కుడు  కాయలు -  200 గ్రాములు .
పెద్ద ఉల్లిపాయలు  -  మూడు  లేదా  150  గ్రాములు.
నూనె -  నాలుగు  స్పూన్లు .
జీలకర్ర  కారం  --  స్పూనున్నర .

జీలకర్ర  కారం  అంటే  స్పూను  జీలకర్ర , స్పూనున్నర  కారం మరియు కొద్దిగా  ఉప్పు కలిపి  మిక్సీ లో లేదా రోటిలో  మెత్తగా  దంపు కోవాలి .

ఉప్పు  --  తగినంత .
పసుపు --  కొద్దిగా .

తయారీ విధానము .

ముందుగా పెద్ద చిక్కుడు  కాయలు ఒకసారి కడిగి  శుభ్రం చేసుకుని  కొద్దిగా  ఆరనిచ్చి  కాయకు  రెండు వైపులా ఉన్న ఈ నెలు  తీసి వేసి  చిన్న  ముక్కలుగా కట్ చేసుకోవాలి .

ఉల్లిపాయలు  మరీ చిన్నవిగా  కాకుండా  ఒక మాదిరి ముక్కలుగా  తరుగు కోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద బాండీ పెట్టి  మొత్తము  నూనె వేసి  నూనె బాగా కాగగానే  ముందుగా  సిద్ధంగా  ఉంచుకున్న  చిక్కుడు  కాయలు , కొంచెం  పసుపు మరియు కొద్దిగా  ఉప్పు వేసి  మూత పెట్టి మీడియం  సెగన ఓ ఎనిమిది  నిముషాలు  ముక్కలను బాగా మగ్గ నివ్వాలి.

తర్వాత  అందులోనే ఉల్లిపాయల  ముక్కలు కూడా వేసి మధ్య  మధ్యలో అట్లకాడతో  కదుపుతూ మరో ఎనిమిది నిముషాలు  చిక్కుడు  ముక్కలు మరియు ఉల్లిపాయల  ముక్కలను పూర్తిగా  మగ్గనివ్వాలి .

తర్వాత  స్పూనున్నర  కారం వేసి మూత తీసి  మరో మూడు నిముషాలు  మగ్గనిచ్చి  దింపి  వేరే ప్లేటు లోకి తీసుకోవాలి .

అంతే  చపాతీలు మరియు భోజనము  లోకి ఎంతో రుచిగా  ఉండే  చిక్కుడు  కాయ ఉల్లిపాయల  కూర సర్వింగ్  కు సిద్థం .

సంబంధించిన  రెసిపీ  మరియు ఫోటో నా స్వంతం .

వెరైటీ వంకాయ కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

మరో వెరైటీ వంకాయ కూర.

పండుమిరపకాయలు లేదా పండు మిరపకాయల పచ్చడితో వంకాయలు కాయల పళంగా కూర .

కావలసినవి .

వంకాయలు -- అర కిలో.
నన్నగా పొడుగు గా ఉన్న లేత నీలం రంగు వంకాయలైనా లేదా లావుగా  గుండ్రంగా  ఉన్న  లేత నీలం రంగు  చిన్న వంకాయలైనా  బాగుంటాయి.

పండు మిరపకాయలు  -  15.

( పండు మిరపకాయలు  అన్ని వేళలా దొరకవు కనుక పెద్ద నిమ్మకాయంత పచ్చడి తీసుకోండి . పచ్చడితో చేసుకునే పక్షంలో పచ్చడిలో చింతపండు  ఉంటుంది  కనుక  చూసుకుని కొద్దిగా  వేసుకోండి ) 

చింతపండు  --  చిన్న నిమ్మకాయంత.  చాలా కొద్ది నీటిలో తడిపి ఉంచుకోవాలి .

పసుపు  --  కొద్దిగా
ఇంగువ --  కొద్దిగా
ఉప్పు  --  తగినంత
నూనె  --  75 గ్రాములు .

తయారీ  విధానము .

ముందుగా  పండు మిరపకాయలు , తడిపిన చింతపండు , కొద్దిగా  పచ్చి ఇంగువ , కొద్దిగా  పసుపు , తగినంత ఉప్పు వేసి  మిక్సీ లో మరీ మెత్తగా  కాకుండా వేసుకోవాలి .

తర్వాత ఆ మిశ్రమాన్ని వేరే ప్లేటులోకి  తీసుకుని ఉంచుకోవాలి.

వంకాయలు  నీళ్ళలో వేసి  పుచ్చులు లేకుండా చూసుకుని  కాయల పళంగా  నాలుగు  పక్షాలుగా  చేసుకోవాలి.

తర్వాత ఇంతకు ముందు మిక్సీ  వేసుకుని  ఉంచుకున్న  మిశ్రమాన్ని  ఈ కాయలలో పట్టినంతవరకు  కూరుకోవాలి.

ఇప్పుడు  స్టౌ మీద బాండి పెట్టి మొత్తం  నూనె వేసి  నూనె బాగా కాగగానే  ఈ కాయలను  అందులో  వేసి , స్టౌ సెగ మీడియంలో ఉంచి , బాండి పైన మూతపెట్టి కాయలు పూర్తిగా  మగ్గ నివ్వాలి .

మధ్య మధ్యలో అట్లకాడతో  కాయలు  విడి పొకుండా  కదుపుతూ  ఉండాలి .

కాయలు  వేగి  నూనె బయటకు వస్తుంది.

ఆ సమయంలో  పై  మూత తీసి మరో అయిదు నిముషాలు  ఉంచి కారం వేగినట్లుగా రాగానే  దింపి వేరే ప్లేటులోకి  తీసుకోవాలి .

ఈ విధముగా  పండుమిరపకాయలతో చేసిన వంకాయ కాయల పళంగా  కూర  వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని  తింటే అద్భుతమైన  రుచిగా ఉంటుంది .

ఈ రోజు చేసిన వంకాయ కూర తాలూకు చిత్రం.

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.

Monday, July 9, 2018

బెండకాయలు కాయల పళంగా

ఆలూరుకృష్ణప్రసాదు .

బెండకాయలు  కాయల పళంగా .

అయిదు నిముషాలలో తయారయ్యే కూర .

తయారీ విధానము .

మూడు స్పూన్లు  మామూలు కారంలో  ముప్పావు స్పూను  జీలకర్ర  మరియు తగినంత  ఉప్పు వేసి  వేరే ప్లేటులోకి తీసుకోండి .

ఓ పది లేత చిన్న బెండకాయలు శుభ్రంగా కడిగి  చాకుతో మధ్యలో గాటు పెట్టుకోండి .

మీరు  గిన్నెలో అన్నం వండుతున్నప్పుడు , అన్నం ఉడికి దగ్గర  పడగానే  సిద్ధంగా  ఉంచిన బెండకాయలు ముచికలు  బయటకు  కనిపించేలా  ఉడుకుతున్న అన్నంలో గుచ్చి మూత పెట్టండి .

అన్నం పూర్తిగా ఉడికి  దింపగానే  ఆవిరి మీద ఉడికిన బెండకాయలను ఒక పళ్ళెం లోకి తీసుకుని , కాయలలో సిద్ధంగా  ఉంచుకున్న  కారం కూరుకోండి .

స్టౌ  మీద బాండీ పెట్టి  అయిదు స్పూన్లు  నూనె వేసి నూనె పొగలు వచ్చే విధముగా  కాగ నివ్వండి .

ఈ కాగే నూనె  స్పూనుతో కారం కూరిన కాయలలో  పోయండి .

అంతే వేడి వేడిగా తయారైన అన్నం లోకి బెండకాయ కాయల  పళంగా అయిదు నిముషాల్లో తయారైన Instant  కూర సిద్ధం.

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటొ నా స్వంతం .

బంగాళదుంప నిమ్మరసం కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

బంగాళాదుంప  అల్లం పచ్చి మిర్చి తో ముద్ద కూర . ( నిమ్మ రసం పిండి  )
****************************

పెళ్ళిళ్ళలో చేసే కూర.

ఈ రోజు   మిత్రులందరికీ బంగాళా దుంపలు  అల్లం పచ్చి మిర్చి  వేసి  చివరలో  నిమ్మరసం  పిండిన  ముద్ద కూర.

దాదాపుగా  చాలా మంది ఇళ్ళల్లో  చేసుకునే ముద్ద కూర ఇది.

ఏ విధంగా  చేయాలో  రెసిపి  పెడుతున్నాను .

కావలసినవి .

బంగాళాదుంపలు  --  అరకిలో
పచ్చిమిరపకాయలు  --  8
అల్లం  --  రెండు అంగుళాల -- ముక్క
కరివేపాకు  --  మూడు రెమ్మలు
కొత్తిమీర  --  ఒక కట్ట
పసుపు  --  కొద్దిగా
నిమ్మకాయ --   బాగా రసం ఉన్న పెద్ద కాయ ఒకటి
ఉప్పు  --  తగినంత

పోపునకు .

నూనె  --  అయిదు స్పూన్లు
ఎండుమిరపకాయలు  --  5
పచ్చి శనగపప్పు  --  రెండు స్పూన్లు
మినపప్పు  --  స్పూనున్నర
జీలకర్ర  --  పావు స్పూను
ఆవాలు  --  అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా

తయారీ విధానము .

బంగాళాదుంపలు  కడిగి  పెద్ద  ముక్కలుగా కట్ చేసుకుని  కుక్కర్ లో పెట్టుకుని  మూడు విజిల్స్ వచ్చాక దింపుకోవాలి .

చల్లారగానే  పై   చెక్కు వలచి  ఉడికిన ముక్కలను  విడిగా పళ్ళెంలో పెట్టుకోవాలి .  ముక్కల పై కొద్దిగా  పసుపు వేసుకోవాలి .

పచ్చిమిర్చి  చిన్న ముక్కలుగా  కట్ చేసుకోవాలి .

అల్లం పై చెక్కు తీసి చిన్న ముక్కలు గా కట్ చేసుకోవాలి .

నిమ్మకాయ మధ్యలోకి కట్ చేసుకుని  రసం వేరే చిన్న Bowl లోకి  పిండుకుని  రసం లోని గింజలను  తీసేసుకోవాలి .

కొత్తిమీర  శుభ్రం చేసుకుని  కట్  చేసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండీ  పెట్టి  మొత్తము  నూనె వేసి నూనె ను  బాగా కాగనిచ్చి  వరుసగా  ఎండుమిరపకాయల ముక్కలు , పచ్చి శనగపప్పు ,
మినపప్పు , జీలకర్ర , ఆవాలు ,  ఇంగువ , అల్లం  ముక్కలు , పచ్చిమిర్చి  ముక్కలు మరియు కరివేపాకు  వేసి  పోపును  బాగా వేగ నివ్వాలి.

పచ్చి మిరపకాయ  ముక్కలు కూడా పోపులో మగ్గితే  కూరకి కారం పడుతుంది .

తర్వాత  ఉడికిన  బంగాళాదుంప  ముక్కలు  పోపులో వేసి అందులోసరిపడా  ఉప్పు  వేసి  ఒక  అయిదు నిముషాలు  మూత పెట్టి  మగ్గనిచ్చి  తర్వాత తరిగిన  కొత్తిమీర  వేసుకుని  దింపుకుని  నిమ్మరసం  అందులో వేసి  బాగా కలుపుకుని  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .

వేడి మీద  నిమ్మరసం  పిండితే  కూర చేదు వస్తుంది.

ఈ ముద్దకూర లో  విడిగా  మేము కారం వేయము .  అల్లం పచ్చి మిర్చి తోనే కూర రుచిగా  ఉంటుంది .

పోపులోని  ఎండుమిర్చి , పచ్చిమిర్చి , అల్లం  ముక్కల కారం సరి పోతుంది .

అంతే  పుల్ల పుల్లగా నిమ్మ , అల్లం  పచ్చి మిర్చి  రుచితో ఎంతో రుచిగా  ఉండే  బంగాళాదుంప  ముద్ద కూర  దోశెలు , చపాతీలు మరియు  భోజనము  లోకి  సర్వింగ్  కు సిద్ధం .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.

Wednesday, July 4, 2018

కాకరకాయ కాయల పళంగా కొబ్బరి కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

కాకరకాయ  కాయల పళంగా  కొబ్బరి  కారం  వేపుడు కూర.

కావలసినవి .

ముందు కొబ్బరి  కారానికి .

ఎండుమిరపకాయలు  -- 10 
పచ్చి  శనగపప్పు  --  మూడు స్పూన్లు .
జీలకర్ర  --  స్పూను .
ఎండుకొబ్బరి  --  పావు చిప్ప . చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
కరివేపాకు  --  నాలుగు రెమ్మలు.

ఇవ్వన్నీ  నూనె  వేయకుండా  బాండిలో  కమ్మని వేపు  వచ్చేదాకా వేయించుకోవాలి .

చల్లారగానే  మిక్సీలో  వేసుకుని  తగినంత  ఉప్పు వేసుకుని  మెత్తగా  పొడి  చేసుకోవాలి.

కాకరకాయలు  అరకిలో తీసుకుని  కాయ  మధ్యలో చాకుతో గాటు పెట్టుకోవాలి ,

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ పెట్టి   150  గ్రాముల  నూనె వేసి  నూనె బాగా కాగగానే ముందుగా  కాకరకాయ లను  నూనెలో వేసి  బాగా  ఎర్రగా వేగ నివ్వాలి .

తరువాత  సిద్ధంగా  ఉంచుకున్న  కొబ్బరి కారం పొడి  కాయలలో  కూరి , కాగుతున్న వేడి వేడి నూనె స్పూనున్నర  చొప్పున కాయలలో పోయాలి .

వెల్లుల్లి  ఇష్టమైన వారు  ఆరు  వెల్లుల్లి  రెబ్బలు  పొడిలో వేసుకుని మిక్సీ  వేసుకుంటే  ఈ కాకరకాయ వేపుడు కూర చాలా రుచిగా  ఉంటుంది .

అంతే  ఎంతో రుచిగా  ఉండే  కాకరకాయ కాయల పళంగా  కొబ్బరి  కారం వేపుడు కూర సర్వింగ్  కు సిద్ధం.

ఈ వేపుడు  కూర వేడి వేడి  అన్నంలో నెయ్యి  వేసుకుని  తింటే  చాలా రుచిగా  ఉంటుంది .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.

Saturday, April 14, 2018

మెంతి వంకాయ కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

మెంతి  వంకాయ కూర.

కావలసిన  పదార్థములు.

చిన్నవి  గుండ్రని  వంకాయలు  ---
అర కిలో

పచ్చి శనగపప్పు  --  30  గ్రాములు

చాయ  మినపప్పు  -  20  గ్రాములు .

మెంతులు  ---  మూడు  టీ  స్పూన్లు .

జీలకర్ర  --  అర  స్పూను

ఆవాలు  --  పావు  స్పూను

ఇంగువ  --  కొద్దిగా

ఎండు మిరపకాయలు  --  15

ఉప్పు  ---  తగినంత

పసుపు  --  కొద్దిగా

నూనె  --   150  గ్రాములు .

తయారు  చేయు విధానము .

ముందుగా  స్టౌ  వెలిగించి  బాండి  పెట్టి  నాలుగు  స్పూన్లు  నూనె వేసి
ముందుగా  మెంతులు , ఎండు మిరపకాయలు , పచ్చి శనగపప్పు  , చాయ మినపప్పు , జీలకర్ర  , ఆవాలు ,  ఇంగువ  వేసి  మెంతులు  పచ్చి వాసన  పోయి  ,
పోపు  కమ్మని  వాసన  వచ్చేదాకా  వేయించు కోవాలి.

పోపు  చల్లారిన  తర్వాత  మిక్సీలో  ఈ  పోపు , కాస్త పసుపు , తగినంత  ఉప్పు వేసి  కొంచెము  పప్పులు  పంటికి  తగిలే  విధముగా  మిక్సీ  వేసుకోవాలి .

వంకాయలు  కాయలు  పుచ్చులు  లేకుండా  చూసుకుని  , శుభ్రంగా  కడిగి  నాలుగు  పక్షాలుగా  చేసుకోవాలి .

ముందుగా   సిద్ధం  చేసుకున్న  కూర  పొడి   కాయల్లో  కూరు కోవాలి .

చివరలో కూర   దించబోయే  ఐదు నిముషాలు  ముందు  పైన  జల్లు కోవడానికి  కాస్త  పొడి  విడిగా  ఉంచుకోవాలి .

మళ్ళీ  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మిగిలిన  నూనె  అంతా పోసి  నూనె  బాగా  కాగాక  పొడి   కూరిన  వంకాయలు  వేసి  మీడియం  సెగన  వంకాయలు  మగ్గి  పొడి  వేగే  దాకా  మధ్య మధ్యలో  అట్లకాడతో  తిరగవేస్తూ
కలుపుతూ  ఉండాలి .

దింప  బోయే   అయిదు  నిముషాల ముందు  మిగిలిన పొడి  వేసి  వేగాక   దించుకుని , వేరే  డిష్ లోకి  తీసుకోవాలి .

అంతే  ఘమ ఘమ లాడే  మెంతి  వంకాయ కూర  సర్వింగ్  కు  సిద్ధం.

సంబంధిత  రెసిపీ  మరియు  ఫోటో  నా స్వంతం .

పెద్ద చిక్కుడు  కాయ ఉల్లి కారం కూర.

ఆలూరుకృష్ణప్రసాదు .

పెద్ద చిక్కుడు  కాయ ఉల్లి కారం కూర.

కావలసినవి .

పెద్ద చిక్కుడు  కాయలు --  350  గ్రాములు.

ఉల్లిపాయలు  --  రెండు . ( చిన్న  ముక్కలుగా తరుగుకోవాలి .)

ఎండుమిరపకాయలు  --  8 

నూనె  --  ఆరు  స్పూన్లు

పచ్చిశనగపప్పు  --  మూడు  స్పూన్లు

చాయమినపప్పు  --  స్పూనున్నర

పసుపు  --  కొద్దిగా

ఉప్పు  --  తగినంత

తయారీ విధానము .

ముందుగా  పెద్ద చిక్కుడు  కాయలకు ఇరువైపులా  ఉన్న ఈనెలు  తీసివేసి  చిన్న ముక్కలుగా  కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను  కుక్కర్ లోవేసుకుని  ముక్కలు మునిగే వరకు  నీళ్ళు పోసి  కొద్దిగా  ఉప్పు వేసి  మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించు కోవాలి.

తర్వాత  నీటిని  వడకట్టుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు  నూనె వేసి  నూనె బాగా కాగగానే  వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు  వేసి పోపు కమ్మని వాసన వచ్చే వరకు వేయించు కోవాలి .

తర్వాత  తరిగిన ఉల్లిపాయ  ముక్కలను మరియు పసుపు వేసి   పోపులో ఉల్లిపాయ  ముక్కలను  మగ్గ నివ్వాలి .

తర్వాత  మగ్గిన  ముక్కలు  పప్పులు  మరియు తగినంత  ఉప్పును మిక్సీ లో  వేసుకుని  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

తిరిగి  స్టౌ మీద  బాండీ పెట్టి  మూడు స్పూన్లు  నూనె వేసుకుని  నూనె బాగా కాగగానే  ఉడికించిన  చిక్కుడు  కాయ ముక్కలను  వేసి  మూత పెట్టి  ఓ అయిదు నిముషాలు  మీడియం సెగన  మగ్గనివ్వాలి .

తర్వాత  ఉల్లికారం  ముద్దను కూడా వేసి  ఓ పావు గ్లాసు  నీళ్ళు పోసి  గరిటెతో  బాగా కలిపి మూతపెట్టి  ముక్కలకు  ఉల్లికారం  ముద్ద పట్టే విధముగా  మరో పది నిముషాలు  మగ్గనిచ్చి  దింపుకుని  వేరే డిష్  లోకి  తీసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  చిక్కుడు  కాయ ఉల్లికారం కూర  రోటీలు , చపాతీలు  మరియు భోజనము లోకి  సర్వింగ్  కు  సిద్ధం .

హామీ పత్రం .

సంబంధిత  రెసిపీ  మరియు ఫోటో  నా  స్వంతం.

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి