Monday, September 3, 2018

ఆకాకరకాయ ఉల్లికారం

ఆలూరుకృష్ణప్రసాదు. 

ఆకాకరకాయలు  ఉల్లికారం.

కావలసినవి.

ఆకాకరకాయలు  -- 350 గ్రాములు.
నూనె  ---  50 గ్రాములు.
ఉల్లిపాయలు --  రెండు
ఉప్పు  -- తగినంత

పోపునకు .

ఎండుమిరపకాయలు  --  పది.
పచ్చిశనగపప్పు  --  మూడు స్పూన్లు .
చాయమినపప్పు -- స్పూను
ఆవాలు --పావుస్పూనులోసగం 
జీలకర్ర   --  పావు స్పూనులో సగం.

తయారీ విధానము .

ముందుగా ఆకాకరకాయలను గింజలతోనే  చక్రాలుగా  తరుగు కోవాలి.

ఉల్లిపాయలను చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి.

స్టౌ వెలిగించి బాండి పెట్టుకుని  మూడు స్పూన్లు  నూనె వేసి  నూనె బాగా కాగగానే వరుసగా  ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు , చాయమినపప్పు, జీలకర్ర , ఆవాలు వేసి కమ్మనివాసన వచ్చే విధముగా పోపు  వేయించుకోవాలి.

ఆ తర్వాత  అందులోనే  తరిగిన  ఉల్లిపాయల  ముక్కలు  కూడా వేసి  ఉల్లిపాయలు పచ్చివాసన లేకుండా  వేయించుకోవాలి .

పోపు కొంచెం  చల్లారగానే ఈ పోపును మిక్సీలో వేసుకొని , తగినంత  ఉప్పును  కూడా వేసుకుని  మరీ మెత్తగా  కాకుండా మిక్సీ వేసుకోవాలి.

తర్వాత  ఈ ముద్దను  వేరే  ప్లేటులోకి  తీసుకోవాలి .

ఆ తర్వాత  మళ్ళీ  స్టౌ మీద బాండీ  పెట్టుకుని  మిగిలిన  నూనె మొత్తము వేసి నూనె కాగగానే  చక్రాలుగా  తరిగి ఉంచుకున్న  ఆకాకరకాయలను  నూనె లో వేసి  స్టౌ  మీడియం  సెగన పెట్టి    మూత పెట్టి  మధ్య మధ్యలో కదుపుతూ పది నిముషాల పాటు   చక్రాలుగా  తరిగిన  ముక్కలను  మెత్తగా  మగ్గ నివ్వాలి .

ఆతర్వాత  మిక్సీ  వేసి సిద్ధంగా  ఉంచుకున్న ఉల్లికారం  ముద్దను కూడా అందులో వేసి  మూత పెట్టి  మరో  ఎనిమిది నిముషాల పాటు  కూరను  మగ్గ నివ్వాలి.

ఆ తర్వాత  దింపుకుని  వేరే డిష్ లోకి తీసుకోవాలి .

కూర వేగినట్లు  fry గా కావాలనుకునే వారు

ఆకాకరకాయలను  చక్రాలుగా  కాకుండా  నిలువుగా  దొండకాయముక్కలు మాదిరిగా గింజలతో సహా  తరుగు కోవాలి.

తర్వాత బాగా కాగిన నూనెలో ముక్కలు  వేయగానే  స్టౌ ను  మీడియం సెగలో  పెట్టి మూత పెట్టకుండా మధ్య మధ్యలో అట్లకాడతో ముక్కలను  కదుపుతూ  ఎర్రగా  వేగనివ్వాలి.

ఆ తర్వాత  సిద్ధంగా  ఉంచుకున్న  ఉల్లికారం ముద్దను కూడా వేసి  మూత పెట్టకుండా  మరో ఎనిమిది నిముషాలు ఉల్లికారం  బాగావేగి  ముక్కలకు పట్టే విధముగా వేయించుకుంటే  కూర ఉల్లికారం కలిసి బాగా వేగి  fry  లాగా  చాలా రుచిగా  ఉంటుంది.

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  ఆకాకరకాయలు  ఉల్లికారం కూర  భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం.

ఫోటో  --  మొదటి పద్ధతిలో  ఆకాకరకాయలను  చక్రాలుగా  తరిగి ఉల్లికారం వేసి  చేసిన పద్ధతిలో  చేసినది.

సంబంధించిన  రెసిపీ  మరియు  ఫోటో  నా స్వంతం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి