Showing posts with label ఆరోగ్యమే మహాభాగ్యం. Show all posts
Showing posts with label ఆరోగ్యమే మహాభాగ్యం. Show all posts

Wednesday, July 4, 2018

భోజనం చేసే విధానము

ఆలూరుకృష్ణప్రసాదు .

భోజనం  చేసే విధానము .

భోజనం బల్ల మీదికి స్పూన్స్, ఫోర్క్ లు వచ్చి చేతితో భోజనం చేసే వాడిని అనాగరికుడిగా చూస్తూ వెక్కిరిస్తున్న తరుణమిది. 

తిండేదైనా ఫోర్క్ ఖచ్చితం అయి కూర్చుంది ఈ వేళ..?

భోజనశాల లో ఎవరైనా పద్దతిగా చేతితో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతడిని వింత గా చూసే పరిస్థితి ఏర్పడింది. 

ఇక మన ఇంట్లో చిన్న పిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నారు ఈ తరం తల్లీదండ్రులు.

దానికి వాళ్లు చూపిస్తున్న ప్రధాన కారణం.. చేతులు శుభ్రంగా ఉండవు కదా..! అని. 

అయితే ఓ సారి చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే శాస్త్రీయ లాభాలను ఓ సారి చూద్దాం.

ఇది చదివాక ఎక్కడున్నా…?
మీరు పద్దతిగా చేతిని ఉపయోగించి భోజనం చేస్తారని ఆశిస్తున్నాను

చేతితో ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు:

1.చేతిస్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది.

🍴🍴🍴🍴🍴🍴🍴

2.చేతితో ఆహారం తీసుకోవడం వలన కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకు సిగ్నల్స్ ని పంపిస్తాయి.

🍴🍴🍴🍴🍴🍴🍴

3.అహారాన్ని చేతితో  ముట్టుకో గానే, ఆహారం తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతమిస్తుంది. అలా కడుపులో జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణశక్తి బాగా జరుగుతుంది.

🍴🍴🍴🍴🍴🍴🍴

4.చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం.

🍴🍴🍴🍴🍴🍴🍴

6.మన ఆహారం లో నూనె  ఎక్కువగా ఉపయోగిస్తాం.ఇలా తయారుచేసుకున్న ఆహారాన్ని స్పూన్స్, ఫోర్క్స్ తో తీసుకోవడం వలన ప్రతిచర్య ఏర్పడి రుచిపోతుంది.

🍴🍴🍴🍴🍴🍴🍴

7.వ్రేళ్ళతో ఆహారం కలుపుకొని, ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవడం వలన రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

🍴🍴🍴🍴🍴🍴🍴

8.చేతి వ్రేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల,వ్రేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది.

🍴🍴🍴🍴🍴🍴🍴

9.ఇంకా చేతివ్రేళ్ళతో మనం ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం పాలుకాకుండా,ఆరోగ్యవంతంగా ఉంటారు. జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. ఇలా చేయడం ఒక వ్యాయామంలా ఉంటుంది. పురణాల ప్రకారంగా ....

*చేతిలో ఉండే ఒక్కో వ్రేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుంది.
🍽🍽🍽🍽🍽🍽🍽

*బొటన వ్రేలు: అగ్నితత్వం
--------------

*చూపుడు వ్రేలు: వాయుతత్వం
--------------

*మధ్యవ్రేలు: ఆకాశం
--------------
*ఉంగరపు వ్రేలు: భూమి
--------------
*చిటికిన వ్రేలు: జలతత్వం..
--------------
ఈ అయిదు వ్రేళ్ళ స్పర్శ ఆహారానికి తగిలినపుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది.
🍃🍍🍎🌿🍐🍊🍑🍒🌽🍆🍌🍃

ఇది  నిజం .....

రాసిన వారికి కృతజ్ఞతలు.

Saturday, April 14, 2018

షడ్రుచులు

ఆలూరుకృష్ణప్రసాదు .

షడ్రుచులు అంటారు.
అవి ఏమిటి  ?

తీపి
పులుపు
ఉప్పు
కారము
చేదు
వగరు

మనం  ప్రతి  రోజూ చేసుకునే వంటలు  షడ్రుచుల  సమ్మేళనంగా  ఉండాలి .

ముఖ్యంగా  వంటకాలలో చేదు రుచి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది .

ఆ చేదు  మెంతులు , మెంతికూర , మునగాకు , కాకరకాయ ఇలాంటి  పదార్ధముల ద్వారా  మనకు లభిస్తుంది .

ఈ విధముగా  చేదు  భోజన పదార్ధములు  తింటే   షుగర్  కంట్రోల్  అవుతుంది .

అలా అని  ఒక్కొక్క సారి  కూరగాయలలో చేదు దోసకాయలు , చేదు బీరకాయలు , చేదు దొండకాయలు  తగులుతుంటాయి .

అలాటివి వాడటం వలన ఆరోగ్యం కన్నా అనారోగ్య  సమస్యలు  కల్గుతాయి .

అటువంటి కూరలు వండకుండా పారవేయడం మంచిది .

ఇలా  చేదు ఎక్కువగా  లభించే  పదార్థములలో  ముఖ్యంగా  లభించేది  వేప పువ్వు.

ఈ వేప పువ్వు  ఉదరములోని  క్రిములను  నాశనము  చేస్తుంది .

కొంతమంది  ఈ సీజన్ లో లభించే  క్రింద రాలిన , లేదా చెట్టు కొమ్మలపై  పూసే  వేప పువ్వులను  ఏరుకుని , లేదా కోసుకొని  బాగా ఎండబెట్టుకుని పచ్చి పులుసు గా  చేసుకుంటారు .

ఇలా  చేసుకుని తినడం వలన ఉదర సంబంధమైన సమస్యలు  దూరమవుతాయి .

మరి కొంతమంది  షుగర్  కంట్రోల్  కావడానికి  ప్రతి  రోజు  లేత  వేప చిగురు నూరి   చిన్న ఉండలుగా  చేసుకుని  పరకడుపున  తింటారు .

కాబట్టి  భోజనము లోకి  చేదు పదార్ధములు కూడా అప్పుడప్పుడు  చేర్చుకోవడం  మంచిది .

వేప పువ్వు పచ్చి పులుసు.

వేప పువ్వు  ఈ రెండు నెలలలోనే  దొరుకుతుంది .

అలా దొరికిన  పువ్వులను  సేకరించి  ఎండపెట్టుకుని , ఒక సీసాలో భద్రపరచు కోవాలి .

పైన తెలిపినట్లు  వేప పువ్వు ఆరోగ్యానికి  చాలా మంచిది .

అలా ఎండబెట్టిన వేపపువ్వును  ఓ పావు కప్పు లేదా ఓ నాలుగు  చెంచాలు  తీసుకోవాలి .

స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు  నెయ్యి వేసుకుని , నెయ్యి బాగా  కాగగానే  ఈ ఎండిన  వేపపువ్వును  వేసుకుని   కమ్మని వాసన వచ్చేవరకు  వేయించుకోవాలి .

వేయించిన  వేపపువ్వును  విడిగా  ఓ పళ్ళెం  లోకి  తీసుకోవాలి .

నిమ్మకాయంత  చింతపండు  తీసుకుని  అందులో  ఓ  ముప్పావు  గ్లాసు నీళ్ళు పోసుకుని  ఓ  పావు గంట సేపు  నానబెట్టాలి .

ఆ తర్వాత  నానబెట్టిన  చింతపండును  బాగా చేతితో  పిసికి   రసము తీసుకుని ఒక గిన్నెలో పోసుకోవాలి .

ఆ రసములో  ఓ చిన్న బెల్లం  ముక్క పొడి చేసి వేసుకోవాలి .

అందులో  సరిపడా  ఉప్పు , కొద్దిగా  పసుపు , అర స్పూను  కారము  అందులో వేసుకోవాలి .

ఇప్పుడు  వేయించి ఉంచుకున్న వేప పువ్వు ను , కొద్దిగా  కరివేపాకు చింతపండు  రసము గిన్నెలో వేసుకుని బాగా కలిపి   స్టౌ మీద పెట్టి  ఓ పది నిముషాల పాటు  బాగా తెర్ల నివ్వాలి .

తర్వాత దింపుకుని  స్టౌ  మీద  పోపు గరిటె పెట్టుకుని , రెండు స్పూన్లు  నెయ్యి వేసి  నెయ్యి బాగా కాగగానే  రెండు ఎండుమిరపకాయలు  ముక్కలుగా  చేసి , స్పూను  మినపప్పు , అర స్పూను  ఆవాలు , కొద్దిగా  ఇంగువ , కొద్దిగా  కరివేపాకు , రెండుపచ్చిమిర్చి  ముక్కలుగా  చేసి వేసి పోపు  బాగా వేగగానే  పచ్చి పులుసులో వేసి  కొద్దిగా  తరిగిన  కొత్తిమీరను  వేసి  బాగా గరిటెతో కలుపుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా , చిరు చేదుగా  ఉండే  వేప పువ్వుతో పచ్చి పులుసు భోజనము లోకి  మరియు చపాతీలలోకి  సర్వింగ్ కు సిద్ధం.

హామీ పత్రం.

సంబంధిత  ఫోటో  మరియు  రెసిపీ  నా  స్వంతం.

Thursday, March 1, 2018

నెయ్యి వల్ల లాభాలు

మల్లిఖార్జున్ బోడ్లా .

నెయ్యి వాడకం వలన ప్రయోజనములు .

హాయిగా నెయ్యి తినండి ఆయుష్షు పెంచుకోండి..

“నెయ్యా! అమ్మో! వద్దు.. బరువు పెరుగుతాం, ఒళ్ళొచ్చేస్తుంది”.. నూటికి 90 శాతం ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది. ఎందుకంటే జనం కూడా నెయ్యిని కొలెస్ట్రాల్ కి ప్రతిరూపంలా ఫీలవుతున్నారు. చాలామంది టీవీల్లో చెప్పేవి.. పుస్తకాల్లో, పేపర్లలో రాసేవి చూసి, సగం సగం నాలెడ్జ్ తో నమ్మేసి అదే నిజం అనుకుని, గుండెజబ్బులనేవి నెయ్యి తినడం వల్లే వస్తాయని ఫిక్స్ అయిపోతున్నారు. ఇవేమీ నిజం కాదు. ఆయుర్వేదం ‘నెయ్యి’ అమృతంతో సమానం అని చెప్పింది. అంతేకాదు మోడ్రన్ సైన్స్ కూడా నెయ్యి వల్ల చాలా ఉపయోగాలున్నాయని రీసెర్చ్ చేసి మరీ చెప్పింది..

నెయ్యిలో ఉండే ఈ రెండూ K2 , CLA (Conjugated Linoleic Acid) యాంటి యాక్సిడెంట్స్ గా పనిచేస్తాయి అని ఎంతమందికి తెలుసు.

నెయ్యి తింటే జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు త‌గ్గిపోవడమే కాదు ఆహారం కూడా స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. నెయ్యి వల్ల గ్యాస్ స‌మ‌స్య‌లు ఉండ‌వు. దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న వాళ్ళు, నెయ్యిని త‌మ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల విట‌మిన్ “ఎ” పుష్క‌లంగా ల‌భించి నేత్ర స‌మ‌స్య‌లు తగ్గుముఖం పడతాయి.

నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంద‌నే అపోహ ఉంది. అయితే నిజానికి నెయ్యి వల్ల చెడు కొలెస్ట్రాల్‌ పెరగదు.. నెయ్యి మంచి కొలెస్ట్రాల్‌ నే పెంచుతుంది. అందువల్ల నెయ్యివల్ల గుండజబ్బులు రావు. గుండెజబ్బులకి వేరే కారణాలు కీలకం కావచ్చు. గ‌ర్భిణీ మ‌హిళ‌లైతే నెయ్యిని క‌చ్చితంగా తీసుకోవాల్సిందేన‌ని వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే నెయ్యిని రోజూ తింటే ఎన్నో పోషకాలు గ‌ర్భిణీ స్త్రీలకు, పుట్టబోయే పిల్లలకి ల‌భిస్తాయి.

నెయ్యిని రోజూ తింటుంటే ముఖం కూడా కాంతివంతంగా మారుతుంద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు నిర్ధారించాయి. ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, ముడ‌త‌లు, మొటిమ‌లు కూడా పోతాయి. ముఖం మీద వచ్చే ప్రతివాటికీ నెయ్యి కారణం అని మాత్రం అనుకోవద్దు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు కూడా నిర్భ‌యంగా నెయ్యిని తిన‌వ‌చ్చు. అయితే అతి అనర్ధదాయకం.

నెయ్యిలో ఉండే యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ వల్ల నెయ్యిని తింటుంటే శ‌రీరంపై అయిన గాయాలు, పుండ్లు తగ్గడమే కాదు రకర‌కాల ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ కూడా ల‌భిస్తుంది. రోజూ ఆహారంలో తప్పనిసరిగా నెయ్యిని తీసుకుంటే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

ఆయుర్వేదం “నెయ్యి” పాజిటివ్ ఫుడ్‌ అని చెప్తోంది. అంతేకాదు ఇది మిగ‌తా కొవ్వులు, నూనెల్లా కాదు శ‌రీరానికి ఎంతో మంచిది అని వివరణ కూడా ఇచ్చింది. అంతెందుకూ శ‌రీరంపై కాలిన గాయాలు ఉంటే, కొద్దిగా నెయ్యిని ఆ ప్రాంతంలో రాసి చూడండి.. దీంతో ఆ గాయం ఇట్టే తగ్గిపోవడం గమనించవచ్చు.

ఎంతో ఉపయోగకరమైన రుచిగా ఉండే మన నెయ్యిని.. మనం ఇష్టపడటం మానేసి, ఇతరదేశాలవాళ్ళు, వాళ్ళ ఆయిల్స్ గురించి పాజిటివ్ గా ప్రచారం చేస్తుంటే, వాళ్ల అమ్మకాలని పెంచుకుంటుంటే వాటిని మనం ఆహా ఓహో అని మెచ్చేసుకుంటున్నాం.. అధిక బరువుకి, కొలెస్ట్రాల్ పెరగడానికి, గుండె జబ్బులు రావడానికి నెయ్యి కారణం కాదు. స్ట్రెస్, సరైన వ్యాయామం లేకపోవడం ఇతర సమస్యలు కారణం.. కనుక హాయిగా నెయ్యి తినండి ఆయుష్షు పెంచుకోండి..

Monday, February 5, 2018

ఆరోగ్యానికి మెంతికూర

ఆలూరుకృష్ణప్రసాదు .

మెంతికూర .

ఆరోగ్యానికి   మెంతికూర.

మధు మేహా  వ్యాధి  నియంత్రణకు , శ్వాస కోశ  ,  మరియు  కిడ్నీ  సంబంధిత  వ్యాధులకు  మెంతికూర  ఆహారంలో  తీసుకోవడం చాలా  ఉపయోగకరం.

మాములుగా  ఆకులుగా పెద్ద కట్టాలుగా  దొరికే  మెంతికూర,  బాపట్ల  మరియు  కొన్ని  ప్రాంతాలలో   దొరికే   చిన్న  చిన్న  కట్టలుగా  దొరికే   మెంతికూర . 

రోజూ  బాపట్ల  నుండి    తెనాలి కి  ప్రతిరోజూ  మధ్యాహ్నము  రైలులో   ఈ  చిన్న కట్టల  మెంతికూర   తెచ్చి  అమ్ముతారు .

సంవత్సరంలో  బాగా  ఎండలున్న  మూడు  నెలలు  తప్ప  ఈ  చిన్న కట్టల  మెంతికూర  మాకు  మిగిలిన  తొమ్మిది  నెలలు  దొరుకుతుంది .

ఆహార  పోషక  విలువల లో  రెండు  ఒకటే  అయినా  మేము  చిన్న చిన్న  కట్టల  మెంతికూరనే  వాడతాము .

చాలా  చాలా  రుచిగా  ఉంటుంది .

మెంతికూరతో  ఏమి  చెయ్యవచ్చు ?

1.  మెంతి కూర  పప్పు  కందిపప్పుతో.

2.  మెంతికూర  పప్పు కూర  పచ్చిశనగపప్పు  తో.

3.  మెంతికూర  పొడి కూర  కందిపప్పు  తో.

ఇవి  కాక  మేతి  చపాతీలు ,  మేతి  పరోటాలు  చాలా  రకాలు  చేస్తారు .

కొందరు మెంతికూరతో  పచ్చడి కూడా  చేసుకుంటారు.

ఇప్పుడు  నేను  చెప్తున్నది
మెంతికూర  కందిపప్పు  తో  పొడికూర .

మెంతికూర  కందిపప్పు  తో  పొడికూర  తయారు  చేయు  విధానము.

ముందుగా  ఒక  గ్లాసు కందిపప్పు
ఒక  గిన్నెలో  పోసుకుని  ఒకసారి కడిగి , ఒకటిన్నర  గ్లాసు నీళ్ళు  పోసి స్టౌ  వెలిగించి  మరీ  మెత్తగా  కాకుండా  బద్దలుగా  (  చేతితో  నొక్కి  చూస్తే బద్ద  మెత్త పడితే  చాలు )  ఉడికించండి .

ఉడికిన  నీళ్ళు  మిగిలితే  ఒక గిన్నెలో  వార్చుకోండి .పార  బోయవద్దు .

బద్దలుగా  ఉడికిన  పప్పు  ఒక  పళ్ళెంలో  పక్కన   పెట్టుకోండి .

మెంతి  కూర  చిన్న కట్టలయితే  వేళ్ళు  చాకుతో  కట్  చేసి  కాడలు కూడా  లేతగా  ఉంటే  ఉంచండి .

ఆకు మరియు కాడలు  చిన్న చిన్నగా  కట్  చేసిన తర్వాత  రెండు  సార్లు  శుభ్రంగా  కడగండి .

మా  బాపట్ల  ఇసుక నేల  కాబట్టి  ఏ  ఆకు కూర లో  నైనా  ఇసుక  తగులుతుంది .

బాగా  కడగపోతే  కూరలో  ఇసుక  తగిలి  గర గర మంటుంది. రుచి పాడవుతుంది.

అదే  పెద్ద మొక్కల  మెంతికూర  అయితే  ఆకులు  వలుచుకుని  కట్ చేసుకుని  ముదురు కాడలు  పారేసి  ఆకును  శుభ్రంగా  కడుక్కోండి.

ఇప్పుడు  స్టౌ  వెలిగించి   బాండీ  పెట్టి  నాలుగు  టీ  స్పూన్ల   నూనె  వేయండి .

నూనె బాగా  కాగాక  నాలుగు  ఎండుమిరపకాయలు   ముక్కలు చేసినవి , రెండుస్పూన్ల  చాయమినపప్పు , అర స్పూన్  జీలకర్ర  , అర స్పూన్  ఆవాలు , తగినంత  ఇంగువ ,  రెండు  రెమ్మల కరివేపాకు   వేసి  పోపు  బాగా  వేగాక ,  తరిగి  ఉంచుకున్న  మెంతికూర   ఆ పోపులో  వేయండి .

అందులో  పావు  స్పూన్  పసుపు  కూడ  వెయ్యండి.

మెంతికూర  తొందరగానే  మగ్గుతుంది.

మెంతికూర  మగ్గిన  తర్వాత   ఇప్పుడు  బద్దలుగా  ఉడికించిన  కందిపప్పు  కూడా  అందులో  వేసి  ఇప్పుడు  తగినంత   ఉప్పు కారం  వేసుకుని   మూడు నిముషాల పాటు  మగ్గనిచ్చి  దింపేసి  వేరే  Bowl  లోకి  తీసుకోండి .

అంతే  ఆరోగ్య కరమైన  మరియు  రుచికర మైన  మెంతికూర  పొడికూర  భోజనం  లోకి   సిద్ధం.

ఇదే  పద్దతి లో  కందిపప్పు   బదులు  శనగపప్పు   వేసి కూడా   మెంతికూరతో పొడికూర  చేసుకోవచ్చు .

కొంతమంది   పోపులో  మెంతికూర  వేయిస్తే  విటమిన్  లు  పోతాయని  ఉడుకుతున్న  కందిపప్పు   లోనే  తరిగి  ఉంచుకున్న  మెంతికూర  వేసి  రెండూ  ఉడికాక ,  పైన  నే  చెప్పిన  పద్ధతిలో  పోపు , ఉప్పు , కారం  వేసుకుంటారు .

మెంతికూర  పప్పు .
--------------------
గ్లాసు కందిపప్పు  తగినంత  నీళ్ళుపోసి  స్టౌ మీద పెట్టాలి .

పప్పు మెత్తగా  ఉడకగానే పప్పులో  మెంతికూర , తరిగి ఉంచుకున్న  అయిదు పచ్చి మిరపకాయలు  ముక్కలుగా చేసుకుని ,   కొంచెం పసుపు, రెండు రెమ్మలు కరివేపాకు   వేసి  మెంతికూర ఆకు     ఉడికాక  చిన్న నిమ్మకాయంత  చింతపండు  చిక్కగా రసం తీసుకుని పప్పు లో వేయాలి .

తర్వాత తగినంత ఉప్పు , స్పూనున్నర కారం వేసి  పైన  చెప్పిన విధంగానే   పోపు  పెట్టుకోవచ్చు.

ఇంక  ఇందాక  పప్పు  నీళ్ళు మిగిలితే  ఏం చెయ్యాలి  ?

పప్పు  కట్టు  చేసుకోవచ్చు.

ఆ  నీళ్ళలో   అర గరిటెడు  ఉడికిన  పప్పు కలిపి  కొద్దిగా  ఉప్పు కలిపి ,
కొద్దిగా  పసుపు వేసి  ఎండు  మిరపకాయలు , ఆవాలు , జీలకర్ర ,
ఇంగువ  , కరివేపాకు   వేసి  పోపు  పెట్టుకుంటే  బలవర్ధక మైన  పప్పు కట్టు  రెడీ.

మీకు  పప్పు కట్టు  చప్పగా  అన్పిస్తే
కొద్దిగా   నిమ్మరసం  పిండుకోండి .

ఫోటోలు .

కందిపప్పు తో మెంతికూర  పొడికూర మరియు మెంతికూర పప్పు .

బాపట్ల మెంతికూర .

పచ్చిశనగపప్పు తో మెంతికూర పొడి కూర .

Saturday, January 6, 2018

భోజనం ప్రాధాన్యత

శతం విహాయ భోక్తవ్యం!
సహస్రం స్నానమాచరేత్!!
లక్షం తత్వాతు దాతవ్యం!
కోటిం త్వక్త్వ హరిం స్మరేత్!!

తాత్పర్యం:
వంద పనులున్నపటికి వదిలిపెట్టి భోజనం చేయవలెను. వేయి పనులున్నను మాని స్నానం చేయవలెను. లక్ష పనులున్ననూ వాటిని పరిత్య జించి దానము చేయవలెను. కోటి పనులున్నప్పటికి వాటిని త్యజించి భగవంతుని స్మరించవలెను.

Sunday, December 10, 2017

ఆరోగ్యానికి చిట్కాలు

ఆలూరుకృష్ణప్రసాదు .

ఉదయం 9 గంటల లోపు తప్పని సరిగా అల్పాహారము తీసుకోవాలి .

ఆరోగ్యంగా ఉండాలంటే మూడు పూటలా పోషకాహారం తీసుకోవాలి. అల్పాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవడం మానకూడదు. అల్పాహారం ఆరోగ్యానికి, మెదడుకు బూస్ట్ లాంటిది. ఇది శరీరానికి కావలసిన పోషకాలను అందించడంతో పాటు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. అలసట, నీరసాన్ని దూరం చేస్తుంది.

అల్పాహారం తీసుకోకపోతే.. ఆకలి పెరగడంతో చికాకు తప్పదు. మధ్యాహ్న భోజనంను తృప్తిగా తీసుకోలేకపోవడం జరుగుతుంది. అల్పాహారాన్ని మితంగా తీసుకోకపోవడం.. శుభ్రంగా మానేయడం ద్వారా ఒబిసిటీ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

అల్పాహారాన్ని తప్పకుండా తీసుకోవడం ద్వారా శరీర బరువును నియంత్రించవచ్చును. అల్పాహారంలో  పీచుపదార్థాలుండేలా చూసుకోవాలి. అందుచేత కొవ్వు లేని ఆహారాన్ని తీసుకోవాలి. కోడిగుడ్డు, బీన్స్, పాల ఉత్పత్తులను బ్రేక్ ఫాస్ట్‌లో చేర్చుకోవడం ఉత్తమం. ఇంకా కూరగాయలు, పండ్లు కూడా తీసుకోవచ్చు.

మధ్యాహ్నం :
మధ్యాహ్న భోజనం 12.30 గంటల నుంచి 1.30 గంటల లోపు తీసుకోవాలి. వ్యాధులకు కారణం ఏదిపడితే తినడం, అల్పాహారం తీసుకోకపోవడమే. సరైన సమయంలో ఆహారం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు

ముఖ్యంగా అల్పాహారం తీసుకున్న తర్వాత కొందరు చిరుతిళ్ళు తీసుకుంటారు. టీ, జ్యూస్ వంటివి తీసుకుంటారు. ఇవి మధ్యాహ్న భోజనంపై ప్రభావం చూపిస్తుంది. తద్వారా ఆకలేయకపోవడం.. భోజనాన్ని లేటుగా తీసుకోవడం వంటివి జరుగుతాయి. రోజంతా కష్టపడాల్సి వుండటంతో మధ్యాహ్న భోజనంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. భోజనం మానేయడం కూడదు. మధ్యాహ్న భోజనానికి తర్వాత పండ్ల రసం తీసుకోవచ్చు. నిమ్మ, ఆపిల్, ద్రాక్ష రసాలు తీసుకోవచ్చు. 

రాత్రి:
రాత్రిపూట భోజనం మంచి నిద్రకు ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులతో కలిసి డిన్నర్ తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. నెలలో అధిక రోజులు తల్లిదండ్రులతో కలిసి తీసుకునే చిన్నారులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఒబిసిటీ సమస్య దూరమైనట్లు సర్వేలు చెబుతున్నాయి. 

మరో సర్వేలో తల్లిదండ్రులతో రాత్రిపూట కలిసి భోజనం చేసే టీనేజ్ పిల్లలు మద్యం, మత్తు పదార్థాలకు బానిస కావట్లేదనే విషయం తేలింది. ఇంకా బరువు తగ్గాలనుకునే వారు రాత్రి పూట భోజనాన్ని నిద్రపోయేందుకు మూడు గంటలకు ముందే తీసుకోవడం బెటరని పరిశోధనలు తేలుస్తున్నాయి.

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి