మిత్రులందరికీ ఓ ప్రత్యేకమైన ప్రసాదము.
తిరుమల స్వామి వారి వడలు.
ఆలూరుకృష్ణప్రసాదు .
తిరుమల స్వామి దర్శనానికి వెడుతున్నామనగానే , మిత్రులందరూ " చాలా సంతోషమండీ . మీరు తిరిగి వచ్చేటప్పుడు మాకు రెండు లడ్డూలు తెచ్చి పెట్టండి . మీరు రాగానే మీకు నేను డబ్బులు ఇస్తాను " . అంటారు.
అక్కడ మనకే మనం చేయించుకునే సేవలు లేక దర్శనం టిక్కెట్ ధరలను బట్టి మనకు ఒకటి లేదా రెండు లడ్డూలు ఇస్తారు. అవి మనకు మన బంధువులకు ప్రసాదం పంచడానికే సరిపోతాయి. అదీ దర్శనం చేసుకున్నాక గంట సేపు లడ్డూల ప్రత్యేక క్యూలో నిలబడితే ఆ రెండూ లడ్డూలయినా మనకు దక్కుతాయి.
ఇక మోహమాటస్తులకు ఎక్కడినుండి తెస్తాము ?
విచిత్రం ఏమిటంటే అన్య మతస్ధుడైన నా స్నేహితునితో " రేపు మా దంపతులిరువురమూ తిరుపతి స్వామి వారి దర్శనానికి వెడుతున్నామని " చెబితే తన పర్సులో నుండి రూ. 200 / తీసి " బాసూ ! మా పిల్లలిద్దరికీ మీ తిరుపతి లడ్డూలంటే చాలా ఇష్టం . నాకో నాలుగు లడ్డూలు తెచ్చి పెట్టవా ? " అంటూ నోటు ఇవ్వబోయాడు.
తిరుమలేమైనా స్వీట్స్ షాపా ?ప్రసాదంగా కాకుండా ఫలహారంగా తినడానికి అని మనసులోనే నేను అనుకుని " డబ్బులు తీసుకు వచ్చాక తీసుకుంటాను. ఇప్పుడు వద్దులే " అని తిరస్కరించాను. అతను అలా అడగడం నాకు మనస్కరించక అతనికి లడ్డూలు తేలేదు. తిరిగి వచ్చాక ఏదో సర్ధి చెప్పాను.
మనం తేకపోతే తెమ్మన్న వారు మొహం మాడ్చుకుంటారు. పాపం వారికే తెచ్చుకోవడం కష్టం కదా అని కూడా ఆలోచించరు. మీకు తెచ్చి పెట్టడం మాకు కష్టమని వారి మొహాన మనం చెప్పలేము.
అందుకని పాపమో పుణ్యమో ఎవ్వరికీ చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా తిరుమల వెళ్ళి తలనీలాలు ఇచ్చి ( తిరుమల వెళ్ళిన ప్రతి సారీ తల నీలాలు సమర్పించే ఆ జన్మ మొక్కు నాకు ఉంది ) స్వామి దర్శనం చేసుకుని , మా టిక్కెట్ కు వచ్చిన లడ్డూ ప్రసాదాలు తీసుకుని , తిరిగి వచ్చాక మా అపార్ట్ మెంట్ లో వారికి , లోకల్ గా ఉన్న బంధుమిత్రులకు స్వామి ప్రసాదం పంచడం అలవాటు చేసుకున్నాం.
ఇంక వెనుకటి రోజుల్లో లడ్డూలతో పాటుగా స్వామి వారి వడల ప్రసాదం కూడా విక్రయించేవారు.
స్వామి వారి లడ్డూల కెంత డిమాండ్ ఉండేదో , స్వామి వారి వడలకు కూడా ఆ రోజుల్లో అంతే డిమాండ్ ఉండేది. ఆ మాటకొస్తే వడలు ఇష్ట పడే వారు ఇప్పటికీ వేల సంఖ్యలో ఉన్నారు . లడ్డూలతో పాటు వడలు కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో చేస్తారు కనుక అదియును గాక స్వామి వారి ప్రసాదమే మధురాతి మధురం కనుక ఈ వడలు కూడా అద్భుతమైన రుచిగా ఉండేవి.
కాలక్రమేణా తిరుమలలో వడలు విక్రయం తీసేసారు. స్వామి వారికి కళ్యాణోత్సవము మరియు ఇతర సేవలు చేయించుకునే వారికి ఒకటి లేదా రెండు వడలు ఇస్తున్నారు.
అయితే స్వామి వారి వడలు మనం స్వయముగా మన ఇంట్లోనే తయారు చేసుకొనవచ్చును .
ఆ వేంకటేశ్వర స్వామి వారికి నివేదించిన తర్వాత వడలను మనము ప్రసాదముగా స్వీకరించవచ్చును.
తిరుమల వడల తయారీ విధానము.
***************************
ఓ పావు కిలో మినుములు తగినన్ని నీళ్ళు పోసుకుని ముందు రోజు రాత్రి బాగా నాన బెట్టుకోవాలి.
మరుసటి రోజు నీళ్ళు వడకట్టుకుని గ్రైండర్ లో నానబెట్టిన మినుములు పొట్టుతోనే వేసుకుని నీళ్ళు పొయ్యకుండా చేతితో కొద్దిగా చిలకరించుకుని పిండిని మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి.
గ్రైండ్ చేసిన పిండిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
ఇప్పుడు మిక్సీలో స్పూనున్నర మిరియాలు , స్పూను జీలకర్ర , చిన్న అల్లం ముక్క , పావు స్పూనులో సగం ఇంగువను మరియు తగినంత ఉప్పును వేసుకుని పొడిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి.
ఈ పొడిని గిన్నెలో సిద్ధంగా ఉంచుకున్న పిండిలో వేసుకుని చేతితో బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టుకుని పావు కిలో నూనె లేదా నెయ్యి పోసుకుని బాగా కాగనివ్వాలి.
ఈ లోపుగా ఓ మైనపు షీట్ ను తీసుకుని , గట్టుపైన పరచుకుని పిండిని చేతితో పెద్ద ఉండలుగా చేసుకుని షీట్ పైన పెట్టి బొబ్బట్లు మాదిరిగా పెద్ద సైజులో చేతితో పల్చగా వత్తుకోవాలి. ఇలా నూనెలో వేసేటప్పుడు మిగిలినవి కూడా ఒక్కొక్కటి వత్తుకోవాలి.
బాగా కాగిన నూనె లేదా నెయ్యిలో ఒక్కొక్క వడను వేసుకుని రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి. ఇదే పద్ధతిలో మిగిలిన వడలు కూడా వేయించుకోవాలి.
స్వామి వారికి నివేదించిన తర్వాత వడల ప్రసాదము స్వీకరించవచ్చును.
మినుములు నానబోసి పొట్టుతోనే తయారు చేస్తాము కనుక పోషక విలువలు కలిగిన , మంచి బలవర్ధకమైన వంటకము ఈ వడలు.
ఎప్పుడైనా అల్పాహారముగా అప్పటికప్పుడు వేడి వేడిగా వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.
మరుసటి రోజుకు శ్రీ వారి వడల లానే కొద్దిగా పళ్ళకు పని చెబుతాయి.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన రెసిపీ మేము తయారు చేసిన విధానము మరియు ఫోటో మేము వడలు తయారు చేసిన సమయమున తీసినది.
0 comments:
Post a Comment