ఆలూరుకృష్ణప్రసాదు .
అప్పడాల ఉండలు .
***************
అప్పడాల ఉండలు మీలో ఎంతమందికి ఇష్టం ?
పెసర అప్పడాలు.
************
తయారీ విధానము .
ఒక అరకేజీ చాయ పెసర పప్పును ఒక రోజు ఎండలో ఉంచండి.
వేయించవద్దు .
ఇలా ఎండిన చాయపెసరపప్పును మిక్సీలో వేసుకోవచ్చు కానీ పిండి మరీ మెత్తగా ఉండదు.
అందువలన పిండిమర లో మెత్తగా పిండి పట్టించుకోండి.
ఆ పిండిని ఒక సీసాలో కాని ప్లాస్టిక్ డబ్బాలో కాని పోసుకుని నిల్వ ఉంచుకోండి .
మనకు కావలసిన మోతాదులో అప్పటికప్పుడు తీసుకుని అప్పడాల పిండి కలుపు కోవచ్చు.
అప్పడాల పిండిని కలుపుకునే విధానము.
************************
ముందుగా ఇంగువ పొడిని చాలా కొంచెం నీళ్ళల్లో కలుపుకోండి .
అ విధంగా కలుపుకోవడం వలన అప్పడాల పిండికి ఇంగువ వాసన బాగా పడ్తుంది .
కొంతమంది పాల ఇంగువ వాడతారు .
అది కూడా బాగుంటుంది .
ఇప్పుడు ఇంగువ కలిపిన నీళ్ళు , మెత్తని పొడి కారం , తగినంత ఉప్పు పెసరపిండి లో వేసుకుని కొద్ది కొద్దిగా నూనె వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోండి.
ఇలా మెత్తగా కలిపిన పిండిని రోటిలో వేసి పచ్చడి బండతో దంపుకోవాలి .
అప్పుడు కలిపిన పిండి లో నూనె బాగా కలిసి పిండి బాగా మృదువుగా అవుతుంది .
అంతే వేడి వేడి అన్నం లోకి పెసర అప్పడాల పిండి సిద్ధం .
మీకు అప్పడాలు కావాలంటే .
********************
పైన తెలిపిన పద్ధతిలో పిండి ఎక్కువగా కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
తర్వాత ఈ ఉండలను చపాతీ పీటపై పెట్టుకుని , అప్పడాల కర్రతో పూరీల మాదిరిగానే గుండ్రంగా అప్పడాలు వత్తుకోవాలి .
తర్వాత అలా వత్తిన అప్పడాలను ఇంట్లోనే నీడలో ఒక రోజు ఆర బెట్టుకుంటే చాలు .
ఎండలో ఎండబెడితే అప్పడాలు పెళుసుగా అయ్యి విరిగిపోతాయి.
తర్వాత మనకు కావలసినప్పుడు అప్పడాలు నూనెలో వేయించుకొనవచ్చును .
ఇదే విధంగా మినపగుళ్ళు కూడా ఎండబెట్టి మరలో పిండి పట్టించుకుని మినప పిండితో తయారు చేసుకోవచ్చు .
కొంతమంది అప్పడాలు బాగా వస్తాయని మూడొంతులు పెసరపిండి ఒక వంతు మినపపిండిని కలిపి చేసుకుంటారు .
ఆ విధముగా కూడా అప్పడాలు చేసుకుంటే రుచిగా ఉంటాయి.
ఈ మధ్య ఒకచోట ఎండుమిరపకాయలు నీళ్ళల్లో నానబెట్టి చాలా కొంచెం నీళ్ళతో రోటిలో రుబ్బి , పెసరపిండిలో కలిపి తయారు చేయడం కూడా గమనించాను .
ఆ విధముగా కూడా రుచిగా ఉంటాయి.
కొంతమంది బాగా కారముగా అప్పడాలు ఉండాలని అనుకునే వారు సీమ మిరపకాయలు అని చిట్టి మిరపకాయలు బజారులో అమ్ముతారు. అవి తీసుకుని వచ్చి ఆ కారమును వేసి కాని , లేదా నానబెట్టి రుబ్బి కాని అప్పడాల పిండిలో కలిపి తయారు చేస్తారు .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధిత రెసిపీ మేము తయారుచేయు విధానము మరియు ఫోటో తయారుచేయు సమయమున తీసినది.
0 comments:
Post a Comment