ఆలూరుకృష్ణప్రసాదు .
టమోటో పచ్చి పులుసు .
కావలసినవి .
మంచి రంగు వచ్చి గట్టిగా ఉన్న టమోటోలు -- పావు కిలో లేదా 4
ఉల్లిపాయలు --- 3
పచ్చిమిరపకాయలు -- 5
చింతపండు -- టమోటో లో కొంచెం పులుపు ఉంటుంది కనుక చిన్న నిమ్మకాయంత చింతపండు సరిపోతుంది .
పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
కరివేపాకు -- మూడు రెమ్మలు
కొత్తిమీర -- ఒక చిన్న కట్ట
నూనె -- నాలుగు స్పూన్లు
పోపుకు .
ఎండుమిరపకాయలు -- 3
చాయమినపప్పు -- ఒక స్పూను
జీలకర్ర -- పావు స్పూను
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
తయారీ విధానము .
ముందుగా టమోటో లు ముక్కలుగా తరుగు కోవాలి .
నిమ్మకాయంత చింతపండు గ్లాసు నీళ్ళలో పదిహేను నిముషాలు నాన బెట్టుకుని , పల్చగా గ్లాసు రసం తీసి వేరే గిన్నెలో ఉంచుకోవాలి .
గ్లాసు రసం సిద్ధం చేసుకోవాలి .
ఉల్లిపాయలు సన్నని ముక్కలుగా తరుగు కోవాలి .
పచ్చి మిరపకాయలు చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే తరిగిన టమోటో ముక్కలను మరియు కొద్దిగా పసుపును వేసి , మూత పెట్టి ఏడెనిమిది నిముషాలు ముక్కలను మగ్గనివ్వాలి.
తర్వాత చింతపండు రసం వేరే గిన్నెలో వేసుకుని మగ్గిన టమోటో ముక్కలు అందులో వేసుకుని చేతితో బాగా నలుపు కోవాలి.
తర్వాత తరిగిన పచ్చిమిర్చి ముక్కలు , సరిపడా ఉప్పు , కరివేపాకు , తరిగిన కొత్తిమీర వేసి
చెత్తో మగ్గిన టమోటో లు చింతపండు రసం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మిగిలిన మొత్తము నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిర్చి ముక్కలు , చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ , కరివేపాకు వేసి పోపు వేగగానే తరిగిన ఉల్లిపాయ ముక్కలు పోపులో వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చే వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి .
తర్వాత మగ్గపెట్టిన ఉల్లిపాయలు టమోటో పచ్చిపులుసు మిశ్రమం లో వేసి గరిటతో బాగా కలుపు కోవాలి .
కొంతమంది సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయల ముక్కలు వేయించకుండా పచ్చివే పులుసులో కలుపుతారు.
ఆ విధంగా చేసినా చాలా రుచిగా ఉంటుంది .
కొంతమంది టమోటోలు నూనెలో మగ్గ పెట్టకుండా సిమ్ సెగన స్టౌ పైన కాయలు చిట్లకుండా కాల్చి , కాలిన పై పొర తీసి వేసి పులుసు పచ్చడిలో వంకాయలు పులుసు పచ్చడి చేసే విధముగా కలుపుతారు .
ఆ విధముగా కూడా రుచిగా ఉంటుంది.
అంతే అన్నం లోకి మరియు చపాతీలలోకి ఎంతో రుచిగా ఉండే టమోటో పచ్చిపులుసు
సర్వింగ్ కు సిద్ధం .
కాంబినేషన్ గా కంది పచ్చడి , పచ్చిశనగపప్పు పచ్చడి మరియు కందిపొడి బాగుంటాయి .
0 comments:
Post a Comment