ఆలూరుకృష్ణప్రసాదు .
పెద్ద చిక్కుడు కాయ ఉల్లి కారం కూర.
కావలసినవి .
పెద్ద చిక్కుడు కాయలు -- 350 గ్రాములు.
ఉల్లిపాయలు -- రెండు . ( చిన్న ముక్కలుగా తరుగుకోవాలి .)
ఎండుమిరపకాయలు -- 8
నూనె -- ఆరు స్పూన్లు
పచ్చిశనగపప్పు -- మూడు స్పూన్లు
చాయమినపప్పు -- స్పూనున్నర
పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
తయారీ విధానము .
ముందుగా పెద్ద చిక్కుడు కాయలకు ఇరువైపులా ఉన్న ఈనెలు తీసివేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను కుక్కర్ లోవేసుకుని ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసి కొద్దిగా ఉప్పు వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించు కోవాలి.
తర్వాత నీటిని వడకట్టుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు వేసి పోపు కమ్మని వాసన వచ్చే వరకు వేయించు కోవాలి .
తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలను మరియు పసుపు వేసి పోపులో ఉల్లిపాయ ముక్కలను మగ్గ నివ్వాలి .
తర్వాత మగ్గిన ముక్కలు పప్పులు మరియు తగినంత ఉప్పును మిక్సీ లో వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
తిరిగి స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసుకుని నూనె బాగా కాగగానే ఉడికించిన చిక్కుడు కాయ ముక్కలను వేసి మూత పెట్టి ఓ అయిదు నిముషాలు మీడియం సెగన మగ్గనివ్వాలి .
తర్వాత ఉల్లికారం ముద్దను కూడా వేసి ఓ పావు గ్లాసు నీళ్ళు పోసి గరిటెతో బాగా కలిపి మూతపెట్టి ముక్కలకు ఉల్లికారం ముద్ద పట్టే విధముగా మరో పది నిముషాలు మగ్గనిచ్చి దింపుకుని వేరే డిష్ లోకి తీసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే చిక్కుడు కాయ ఉల్లికారం కూర రోటీలు , చపాతీలు మరియు భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం .
హామీ పత్రం .
సంబంధిత రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.
0 comments:
Post a Comment