ఆలూరుకృష్ణప్రసాదు .
దాదాపుగా మార్చి నెల చివరికి వచ్చేసాము .
ఎండలు బాగానే కాస్తున్నాయి .
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి తెలుగు వారి ఇంట్లోనూ హడావుడిగా ఉంటుంది .
పెద్దవారికి చేతి నిండా పనే .
పండు మిరపకాయల పచ్చడి ( కొరివి కారం / పళ్ళ కారం ),
చింతకాయ పచ్చడి , గోంగూర పచ్చడి , ఉసిరి కాయ పచ్చడి ,
వివిధ రకము లైన మామిడి కాయతో పచ్చళ్ళు , ఆవకాయ , మాగాయ.
ఇలా రెండు నెలల పాటు అందరి ఇళ్ళల్లోనూ ఒకటే హడావుడిగా ఉంటుంది .
ఇవి కాక ఈ రెండు నెలలూ సగ్గు బియ్యం వడియాలు , బియ్యపు పిండి తో వడియాలు , బియ్యపు రవ్వతో వడియాలు , మినపప్పు తో చిన్న వడియాలు , మినపప్పు తోనే బూడిద గుమ్మడి కాయతో వడియాలు ఇలా ఈ వేసవి కాలం రెండూ నెలలు ఎండలను కూడా లక్ష్యపెట్టక మన స్త్రీ మూర్తులందరూ ఎర్రని ఎండలో ఎంతో కష్ట పడతారు .
ఇప్పుడు నేను ప్రస్తావించబోయే అంశం బూడిద గుమ్మడి కాయతో పచ్చి వడియాలు .
బూడిద గుమ్మడి కాయతో ఏడాదికి సరిపడా వడియాలు పెట్టుకునే సమయంలోనే ఆ రోజు భోజనము లోకి ఆదరువుగా గుమ్మడికాయ ముక్కలను కలిపిన కొంత పిండిని విడిగా తీసుకుని నూనెలో గారెల మాదిరిగా వేసుకుంటారు .
మరి రెసిపీ ఎలాగో తెలుసుకోండి .
**************************
ఆలూరుకృష్ణప్రసాదు .
గుమ్మడికాయ పచ్చి వడియాలు .
ఏడాదికి ఒకసారి గుమ్మడికాయ వడియాలు అందరూ పెట్టుకుంటారు కదా !
అలా వడియాలు పెట్టుకునేముందు చాలా మంది ఆ రోజుకు అన్నంలోకి కొంత ముక్కలు కలిపిన పిండి విడిగా తీసుకుని నూనెలో వడియాలు వేయించు కుంటారు .
ఆ వడియాలనే గుమ్మడికాయ పచ్చి వడియాలు అని అంటారు.
గోదావరి జిల్లాలలో చాలా కుటుంబాల వారు ఈ పచ్చి వడియాలను వేసుకుంటారు .
మా ఇంట్లో అయితే చిన్న చిన్న లేత గుమ్మడికాయలు ప్రత్యేకంగా తెచ్చుకొని మూడు నెలలకు ఒకసారి అయినా అన్నంలోకి ఈ పచ్చి వడియాలు వేసుకుంటాము.
మా ఇంట్లో అందరికీ ఈ వడియాలు చాలా చాలా ఇష్టం.
ఈ వడియాలు వేసుకున్న రోజున భోజనము లోకి వేరే ఐటమ్స్ ఉండవు కాంబినేషన్ గా చారు తప్ప .
గారెల రూపంలో వేసుకుంటాము .
ఎంతో రుచిగా ఉండే ఈ గుమ్మడి కాయ పచ్చి వడియాలు
తయారీ విధానము మీ కోసం .
మినపగుళ్ళు -- 250 గ్రాములు
గుమ్మడికాయ
లేత దైనా , లేదా
ముదురు దైనా
షుమారు --- 1 K.G కాయ
పచ్చి మిరపకాయలు ---
200 గ్రాములు
ఇంగువ ---- మరి కాస్త ఎక్కువగా .
పసుపు --- తగినంత
ఉప్పు -- తగినంత
నూనె --- 350 గ్రాములు
తయారీ విధానము ---
రేపు ఉదయము భోజనాల లోకి పచ్చి వడియాలు వేసుకుందామనుకుంటే ముందు రోజు గుమ్మడి కాయను పగుల కొట్టి పై చెక్కు తీయకుండా సొరకాయ ముక్కలు తరిగి నట్లుగా తరుగుకొని ముక్కలకు ఉప్పు , పసుపు వేసి ఒక గుడ్డలో మూట కట్టి అందులో నీళ్ళు కారి పోయే విధంగా పైన చిన్న రోలు కాని , లేదా బరువు కానీ పెట్టుకోవాలి .
మురుసటి రోజు ఉదయానికల్లా నీరు కారిపోతుంది.
మరుసటి రోజు పిండిలో ముక్కలనువేయబోయే ముందు
ఒకసారి ముక్కలను చేతితో పిండుకోవాలి.
లేదా పిండి పలుచన అయి గారెలు వేయడానికి రావు .
మినపగుళ్ళు కూడా ముందు రోజు నాన బోసుకోవాలి .
మరుసటి రోజు నానిన పప్పు శుభ్రంగా కడిగి మిక్సీ లేదా గ్రైండర్లో పప్పు , తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోస్తూ గారెల పిండిలా గట్టిగా రుబ్బు కోవాలి .
ఇప్పుడు చాలా కొంచెం నీళ్ళల్లో ఇంగువ వేసి బాగా కలిపి ఆ నీళ్ళు గట్టి పిండిలో వేయాలి .
ఇప్పుడు గట్టిగా పిండిన గుమ్మడికాయ ముక్కలు అందులో వేసి రెండు సార్లు తిప్పితే చాలు .
పిండి ముక్కలకు పడుతుంది . ఇంగువ వాసనతో.
ముక్కలు కలిపిన తర్వాత కూడా పిండి గారెల పిండిలా గట్టిగానే ఉండాలి .
పచ్చి మిరపకాయలు తొడిమలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి .
పిండిలో ఉప్పు తగ్గినట్లు అన్పిస్తే
ఈ పచ్చి మిర్చి లో వేసుకుని కలుపుకోండి .
ఇప్పుడు ముక్కలు కలిపిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని
అందులో మిక్సీలో వేసిన పచ్చి మిరపకాయల మిశ్రమం కలుపు కోవాలి .
భోజనానికి ముందు
స్టౌ మీద బాండి పెట్టి మొత్తము నూనె పోసి నూనె బాగా కాగిన తర్వాత గారెల మాదిరిగా వేసుకోవాలి.
ఘమ ఘమ లాడే ఇంగువ వాసన తో పచ్చి గుమ్మడికాయ వడియాలు ( గారెలు ) భోజనము లోకి సిద్ధం .
హామీ పత్రం.
సంబంధిత రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .
0 comments:
Post a Comment