Saturday, April 14, 2018

మునక్కాడ ఉల్లిపాయల కూర

మునక్కాడ ఉల్లిపాయల  కూర.

మనం కాకరకాయలను  ఉడకపెట్టి  చింతపండు  రసము బెల్లం పెట్టి  కాకరకాయ  ముక్కల కూర చేసుకుంటాము.

అదేవిధంగా  మనం  మునక్కాడ ఉల్లిపాయల  కూర కూడా  చేసుకోవచ్చును.

ఈ కూరను  గట్టిగా  చేసుకొనవచ్చును .
లేదా కూర పులుసులా మధ్యస్థంగా  చేసుకొనవచ్చును .

అలా  కొంచెం  పల్చగా  చేసుకున్నప్పుడు కాంబినేషన్ గా  కందిపచ్చడి  చేసుకుంటే చాలా  రుచిగా  ఉంటుంది .

ఇంక ములక్కాడ ఉల్లిపాయల  కూర తయారీ విధానము  గురించి తెలుసుకుందాం.

మునక్కాడ ఉల్లిపాయ కూర .

కావలసినవి.

ములక్కాడలు  -- 3 
ఉల్లిపాయలు  --  4
పచ్చిమిరపకాయలు -- 8
కరివేపాకు  --  మూడు రెమ్మలు 
చింతపండు  --  నిమ్మకాయంత  లేదా  షుమారు 30  గ్రాములు
బెల్లం  --  చిన్న ముక్క
ఉప్పు --  తగినంత
పసుపు  --  పావు స్పూను

పోపుకు .

ఎండుమిరపకాయలు  -- 5  (  ముక్కలుగా  చేసుకోవాలి )
చాయమినపప్పు  --  స్పూను
మెంతులు  --  పావు స్పూను
జీలకర్ర  -- అర స్పూను
ఆవాలు  -- అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా
నూనె  --  నాలుగు  స్పూన్లు

తయారీ విధానము .

ముందుగా  చింతపండు  విడదీసి  ఒక గ్లాసు నీళ్ళలో పావు గంట సేపు నానబెట్టి   ఒక గ్లాసు రసము  తీసుకోవాలి .

ములక్కాడలు పై చెక్కు  తీయనవసరము లేదు.
ముక్కలుగా  తరుగుకోవాలి .

ఉల్లిపాయలు  చిన్న ముక్కలుగా  తరుగుకోవాలి.

పచ్చిమిర్చి  నిలువుగా  చీలికలుగా తరుగుకోవాలి.

ముందుగా   స్టౌ మీద బాండీ పెట్టి  మొత్తము  నూనె వేసి నూనె బాగా కాగగానే  ముందుగా  మెంతులు వేసి  కొద్దిసేపు వేగనివ్వాలి .

తర్వాత  ఎండుమిర్చి  ముక్కలు , చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు, ఇంగువ వేసి  పోపు వేయించుకోవాలి.

తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు మరియు కరివేపాకు  వేసి  కాసేపు మగ్గనివ్వాలి.

తర్వాత అందులో ఉల్లిపాయల ముక్కలు, మునక్కాడ ముక్కలు  , పసుపు , మరియు  కొద్దిగా  ఉప్పు వేసి మూతపెట్టి  పదినిముషాల పాటు ఉల్లిపాయలు ,  మునక్కాడ ముక్కలు మూడొంతులు మగ్గనివ్వాలి .

తర్వాత చింతపండు  రసము , బెల్లం  మరియు  సరిపడా  ఉప్పు వేసి  మరో పదినిముషములు  పాటు  ఉల్లిపాయలు , ములక్కాడ ముక్కలు  పూర్తిగా  ఉడకనివ్వాలి .

తర్వాత  వేరే గిన్నెలోకి  తీసుకోవాలి .

ఈ కూర / పులుసు చిక్కగానే ఉంటుంది .

బియ్యపు పిండి  పెట్టనవసరము లేదు.

బెల్లం  అస్సలు  ఇష్టం  లేని వారు బెల్లం  వేయకుండా  చేసుకొనవచ్చును .

పులుసుగా పల్చగా  చేసుకుంటే  బెల్లం  వేసుకుంటేనే  రుచిగా  ఉంటుంది .

దీనికి  కాంబినేషన్ గా  కందిపచ్చడి  చాలా రుచిగా ఉంటుంది .

ఈ పులుసు  మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే మునక్కాడ ఉల్లిపాయల  కూర / పులుసు సర్వింగ్  కు సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి