ఆలూరుకృష్ణప్రసాదు .
దొండకాయ మసాలాకూరపొడి కూర.
కావలసినవి .
దొండకాయలు -- అర కిలో
నూనె -- నాలుగు స్పూన్లు
కూర పొడికి.
ఎండుమిరపకాయలు -- 15
పచ్చిశనగపప్పు -- మూడు స్పూన్లు
చాయమినపప్పు -- స్పూనున్నర
వేరుశనగ గుళ్ళు -- రెండు స్పూన్లు
నువ్వుపప్పు -- స్పూనున్నర
ఎండుకొబ్బరి -- పావు చిప్ప. ( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి .)
జీలకర్ర -- అర స్పూను
ఉప్పు -- తగినంత
నూనె -- మూడు స్పూన్లు
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి మూడు
స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు ,
పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , వేరుశనగ గుళ్ళు , నువ్వుపప్పు , ఎండు కొబ్బరి ముక్కలు మరియు జీలకర్ర వేసి కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి.
చల్లారగానే మిక్సీలో ఈ మిశ్రమమును మరియు సరిపడ ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా పొడి వేసుకోవాలి .
తర్వాత దొండకాయలు చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
ఇప్పుడు స్టౌ మీద మందపాటి గిన్నె కాని , ఇత్తడి గిన్నె కాని పెట్టి మొత్తము నాలుగు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే దొండకాయ ముక్కలు మరియు కొచెం ఉప్పు వేసి అట్లకాడతో బాగా కలిపి , స్టౌ మీడియం సెగన పెట్టి , ఒక గిన్నెలో పావు వంతు నీళ్ళు పోసి , ఆ నీళ్ళ గిన్నె మూత పెట్టాలి .
ఇలా ముందుగా కొంచెం ఉప్పు వేయడం వలన మరియు నీళ్ళ గిన్నె మూత పెట్టడం వలన ముక్కలు బాగా మగ్గుతాయి .
మధ్య మధ్యలో కదుపుతూ ఒక పది నిముషాలు పైగా ముక్కలను మగ్గనివ్వాలి .
తర్వాత నీళ్ళ మూత తీసివేసి ముందుగా సిద్ధం చేసుకున్న కూర పొడి వేసుకుని ఓ అయిదు నిముషాల పాటు ఉంచి, పొడి కమ్మగా వేగిన వాసన రాగానే దింపుకుని , వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే దొండకాయ మసాలా కూరపొడి కూర భోజనము లోకి సిద్ధం.
0 comments:
Post a Comment