పచ్చ పెసలు రోటి పచ్చడి.
మామూలుగా పెసర పచ్చడి చేసుకోవడానికి మేము చాయ పెసర పప్పు నానబోసుకుని చేసుకుంటాము .
ఇటీవల మా బంధువుల ఇంట్లో భోజనములో పెసర పచ్చడి వడ్డించారు .
పచ్చడి చాలా రుచిగా ఉందని మేము అంటే మేము పచ్చ పెసలు నానబోసుకుని చేసుకుంటామని వారు చెప్పారు .
అందువలన మేము ఈసారి పచ్చ పెసలు నానబోసి పెసర పచ్చడి చేసుకున్నాము .
చాయపెసరపప్పు తో కన్నా పచ్చ పెసలు తో చేసిన పచ్చడి చాలా రుచిగా ఉంది .
పై పొట్టు తీయకుండా ఈ పచ్చడి చేసుకుంటాము కనుక మనకు ఆరోగ్యరిత్యా కూడా మంచిది .
అందువలన తయారీ విధానము మనందరికీ తెలియ చేస్తున్నాను .
పచ్చ పెసలు తో పచ్చడి .
కావలసినవి .
పచ్చ పెసలు -- 100 గ్రాములు .
ఎండుమిరపకాయలు -- 10 ( వేయించనవసరం లేదు. ముక్కలుగా చేసుకోవాలి )
జీలకర్ర -- స్పూనున్నర
ఇంగువ -- మరి కాస్త ఎక్కువ .
ఉప్పు -- తగినంత
సాధారణంగా మేము పచ్చడి పైన పోపు వేసుకోము .
మొన్న పచ్చడి పైన మా బంధువులు నేతితో పోపు పెట్టారు .
అందువలన మేము కూడా ఈసారి పచ్చడి పైన నేతితో పోపు పెట్టాము .
పులుపు ఇష్టమైన వారు ఒక కాయ నిమ్మరసం కూడా పచ్చడిలో పిండు కుని పైన పోపు పెట్టుకోవచ్చును.
పోపునకు.
ఎండుమిరపకాయలు -- 4 ( ముక్కలుగా చేసుకోవాలి )
చాయమినపప్పు -- స్పూను
ఆవాలు -- అర స్పూను
కరివేపాకు -- మూడు రెమ్మలు
నెయ్యి -- మూడు స్పూన్లు
తయారీ విధానము .
ముందుగా పచ్చ పెసలు ఒకసారి కడిగి మునిగే వరకు నీళ్ళు పోసి నాలుగు గంటల పాటు నాన బెట్టు కోవాలి .
ఆ తర్వాత పెసలు విడిగా వడకట్టు కోవాలి .
ఇప్పుడు రోటిలో నానబెట్టిన పచ్చ పెసలు , ఎండుమిరపకాయల ముక్కలు ( వేయించనవసరం లేదు ) , జీలకర్ర , పచ్చి ఇంగువ మరియు సరిపడా ఉప్పు వేసి వేసి కొద్దిగా నీళ్ళు పోసుకుని , మధ్య మధ్య నీళ్ళు చిలకరించుకుంటూ పొత్రముతో మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి .
తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని ఇష్టమైన వారు ఒక కాయ నిమ్మరసం పిండుకోవచ్చును .
మేము అప్పడాల పిండి రుచిలా అన్నం లోకి బాగుంటుందని నిమ్మరసం పిండుకోము .
తర్వాత స్టౌ మీద బాండీ పెట్టుకుని మూడు స్పూన్లు నెయ్యి వేసుకుని నెయ్యి బాగా కాగగానే ఎండుమిర్చి ముక్కలుగా చేసి , చాయమినపప్పు , ఆవాలు మరియు కరివేపాకు వేసి పోపు వేసుకుని పచ్చడిలో కలుపుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే పచ్చ పెసలు తో నానబెట్టిన పచ్చడి సర్వింగ్ కు సిద్ధం.
మార్కెట్లో పచ్చ పెసలు , నల్ల పెసలు రెండూ దొరుకుతాయి .
పచ్చ పెసలు నాన పోసి చేసుకుంటే పచ్చడి రుచిగా ఉంటుంది .
రోటిలో పచ్చడి చేసుకునే సౌకర్యము లేని వారు పైన తెలిపిన విధముగా మిక్సీ లో చేసుకొనవచ్చును .
0 comments:
Post a Comment