ఆలూరుకృష్ణప్రసాదు .
ప్రియమిత్రులందరికీ శుభోదయనమస్కారములు .
ప్రియమైన మిత్రులారా !
ఈ రోజు మీ అందరికీ అతి ప్రాచీన వంటకం అనగా ఏనాటినుండో మన తాతమ్మల తరం నుంచి వచ్చిన కరివేపాకు కారప్పొడి గురించి వివరిస్తాను .
ఈ కరివేపాకు కారప్పొడి బాలింతలకు పథ్యంగా పెడతారు.
జ్వరపడిన వారికి పథ్యం పెట్టే సమయంలో కూడా పెడతారు .
నోరు అరుచిగా ఉన్నప్పుడు , బాగా జలుబు చేసినప్పుడు , కడుపులో ఇబ్బందిగా ఉన్నప్పుడు మేము తరచుగా ఈ కారప్పొడి కొట్టుకుంటాము .
ఈ కరివేపాకు కారప్పొడి కొట్టగానే వాసన పోకుండా ఒక సీసాలో పోసుకుంటే ఘమ ఘమ లాడే సువాసనతో నెల రోజుల పైనే నిల్వ ఉంటుంది .
ఈ కారప్పొడి తయారు చేయడంలో మీ టాలెంట్ అంతా వేయించడం లోనే ఉంటుంది.
వేపు అటూ ఇటు అయితే మనం అనుకున్న రుచి రాదు .
ఈ కరివేపాకు కారప్పొడి లో వెల్లుల్లి పాయలు తప్పని సరిగా వేయాలి .
వెల్లుల్లి పాయలు తగిన మోతాదులో వేస్తేనే ఆరోగ్య పరంగా ప్రయోజనం ఉంటుంది .
ఇక వెల్లుల్లి మా ఇళ్ళల్లో వాడం అనుకునే వాళ్ళు వెల్లుల్లి వేయకుండా చేసుకోండి .
ఈ కరివేపాకు కారప్పొడి కి అసలైన రుచి వెల్లుల్లి పాయలు వేసుకుంటేనే వస్తుంది.
కరివేపాకు కారప్పొడి.
కావలసిన పదార్థములు .
కరివేపాకు ఒక 20 రెమ్మల ఆకు దూసుకోవాలి .
మరి కాస్త కరివేపాకు వేసుకున్నా మంచిదే.
ఎండు మిరపకాయలు -- 15 నుండి 18 వరకు .
చాయ మినపప్పు --- మూడు స్పూన్లు .
ధనియాలు --- 50 గ్రాములు
జీలకర్ర --- పావు స్పూన్
ఆవాలు -- పావు స్పూన్
వెల్లుల్లి రెబ్బలు -- పై పొట్టు తీయకుండా ఒక 20 .
పొడిలో పచ్చివే వేయాలి . నూనె లో వేయించనవసరం లేదు.
పైన ఫోటోలో చూపిన మాదిరిగానే ఒలిచి పెట్టుకోండి .
వెల్లుల్లి పొట్టు తీసి వేస్తే కారప్పొడి పేస్టు అవుతుంది.
కారప్పొడి కూడా అదో రకమైన ఘాటు వాసన వస్తుంది .
ఉప్పు --- తగినంత
చింతపండు -- ఒక నిమ్మ కాయ సైజు . విడదీసి పెట్టుకోవాలి .
నూనె -- 5 లేక 6 స్పూన్లు .
అంతే .
కరివేపాకు కారప్పొడి .
తయారు చేయు విధానము .
ముందుగా కరివేపాకు కడిగి నీడన ఒక అరగంట ఆరబోసుకోండి .
తడి ఉండకూడదు . పొడిగా ఉండాలి .
స్టౌ వెలిగించి బాండి పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి , నూనె బాగా కాగాక కరివేపాకు మెత్తదనం పోయేదాకా వేయించి పక్కన వేరే ప్లేటులో పెట్టుకోండి .
కరివేపాకు మెత్తగా వేయిస్తే పొడి పొడిపొడిగా రాదు.
తర్వాత స్టౌ మీద మళ్ళీ బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగాక ఎండు మిరపకాయలు , చాయమినపప్పు , ధనియాలు వేసి కమ్మని వేపు వాసన వచ్చే దాకా వేయించండి . ఇప్పుడు జీలకర్ర , ఆవాలు కూడా వేసి అట్లకాడతో కలుపుతుండండి .
ఆవాలు చిటపటలాడాక దింపి ఒక అయిదు నిముషాలు చల్లార నివ్వండి.
చింతపండు ఈనెలు , గింజలు లేకుండా శుభ్రం చేసుకోండి .
ముందుగా మిక్సీలో వేయించిన ఎండుమిరపకాయలు , చాయమినపప్పు , ధనియాలు , ఆవాలు , జీలకర్ర మిశ్రమము మరియు తగినంత ఉప్పు వేసి రెండుసార్లు తిప్పండి.
ఇప్పుడు చింతపండు , వేయించిన కరివేపాకు వేసి మరో రెండుసార్లు తిప్పండి
ఆ తర్వాత వెల్లుల్లి పాయలు వేసి ఒకసారి తిప్పండి .
ఇప్పటికే మీ వంట గదంతా చక్కని కరివేపాకు , వెల్లుల్లి వాసనల సువాసనలతో ఘుమ ఘమ లాడి పోతుంది .
ఇప్పుడు ఈ మిశ్రమమంతా ఒక పళ్ళెంలోకి తీసుకొని, చేత్తో బాగా కలుపుకొని నలగని చింతపండు చేతికి తగిలితే తీసేయండి .
చేత్తో బాగా నలిపాక ముద్దగా ఉన్న కారప్పొడి ఇప్పుడు పొడి పొడి లాడుతుంది .
ఉప్పు సరిపోయిందో లేదో నోట్లో వేసుకుని చూసుకొని , చాలక పోతే తగినంత కలుపుకోండి .
వాసన పోకుండా శుభ్రంగా తుడిచిన గాజు సీసాలో పెట్టుకుంటే నెల రోజుల పైన నిల్వ ఉంటుంది .
వేడి వేడి అన్నంలో మూడు స్పూన్లు నెయ్యి వేసుకుని , అందులో ఈ కరివేపాకు కారప్పొడి వేసుకొని తింటే
ఆ రుచి అహా అద్భుతః .
ఇందులో పచ్చి శనగపప్పు , మెంతులు , పసుపు, ఎక్కువ జీలకర్ర , ఎక్కువ ఆవాలు , ఇంగువ వాడకూడదు .
ఆరోగ్య ఫలితాలు పొందాలంటే నేను చెప్పిన విధంగానే తయారు చేసుకోవాలి.
ఎంతో రుచిగా ఉండే ఈ కరివేపాకు కారప్పొడి భోజనము లోకే కాకుండా ఇడ్లీలు , దోశెలు , గారెలు మరియు చపాతీలలోకి కూడా చాలా బాగుంటుంది .
సంబంథిత రెసిపీ మరియు ఫోటోలు నా స్వంతం .
0 comments:
Post a Comment