Monday, May 29, 2017

ఇడ్లీ దోస చట్నీలు

ఇడ్లీ దోస చట్నీలు 
ఆలూరి కృష్ణ ప్రసాద్



ఈ రోజు స్పెషల్... ఇడ్లీలు మరియు దోశెల లోకి వివిధ రకము లైన చట్నీలు.
అన్ని చట్నీలకు మొదటి రకం లో చెప్పిన విధముగా నెయ్యితో పోపు వేసుకోవాలి .
మొదటి రకం .
అచ్చంగా కొబ్బరి చట్నీ .
ఒక చిప్ప పచ్చి కొబ్బరి తురుము , ఆరు పచ్చి మిరపకాయలు కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ వేసుకోవాలి .
దీనిలో నీళ్ళు పోయనవసరం లేదు.
కొబ్బరి లో తడి సరిపోతుంది .
తర్వాత పోపు గరిట స్టౌ మీద పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసి ఎండుమిర్చి , మినపప్పు , ఆవాలు , కరివేపాకు వేసి పోపు వేయాలి .
ఇది పెద్ద హోటళ్ళ లో చేసే పచ్చడి.
రెండవ రకం .
పచ్చి కొబ్బరి తురుము మరియు పుట్నాల పప్పుతో చట్నీ .
పచ్చి కొబ్బరి తురుము ఒక చిప్ప ,
ఎనిమిది పచ్చిమిరపకాయలు , పావు కప్పు పుట్నాల పప్పు ( వేయించిన శనగపప్పు ) కొద్దిగా చింతపండు మరియు తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీలో మెత్తగా వేసుకుని పైన చెప్పిన విధంగానే నెయ్యి తో పోపు పెట్టుకోవాలి .

మూడవ రకం .
వేయించిన పల్లీలు మరియు పచ్చి శనగపప్పు తో.
పల్లీలు ఒక కప్పు ఒట్టి బాండీలో బాగా వేయించు కోవాలి .
చల్లారగానే పై పొట్టు తీసేసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండి పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి పావు కప్పు పచ్చి శనగపప్పు కమ్మని వాసన వచ్చేవరకు వేయించి దింపబోయే మూడు నిముషాల ముందు పచ్చిమిరపకాయలు కూడా వేసే యాలి . తర్వాత పొట్టు వలుచుకున్న పల్లీల పప్పు కూడా అందులో వేసి ఒక నిముష మాగి స్టౌ ఆపేయాలి .
చల్లారగానే మిక్సీలో ఈ వేయించిన మిశ్రమం , కొద్దిగా చింతపండు , తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పైన చెప్పిన నెయ్యి పోపు పెట్టు కోవాలి .
నాలుగవ రకం.
  
  

పచ్చి పల్లీలు పొట్టు తీయకుండా మరియు పచ్చి శనగపప్పు తో .
ఒక కప్పు పల్లీలు , పావుకప్పు పచ్చి శనగపప్పు తో .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి అందులో మూడు ఎండుమిరపకాయలు వేయించుకొని వేరే ప్లేటు లోకి తీసుకోవాలి .
తర్వాత అదే నూనెలో పచ్చి శనగపప్పు వేసి సగం వేగాక పల్లీలు కూడా వేసి రెండూ బాగా వేగ నివ్వాలి. దింపబోయే మూడు నిముషముల ముందు ఆరు పచ్చి మిరపకాయలు కూడా వేసి మగ్గ నివ్వాలి .

చల్లారగానే మిక్సీలో ముందు ఎండుమిరపకాయలు , కొద్దిగా చింతపండు మరియు తగినంత ఉప్పు వేసి అవి మెత్తగా అవ్వగానే వేయించిన మిశ్రమమంతా వేసి కొద్దిగా నీళ్ళు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .
ఆ తర్వాత పైన చెప్పిన విధముగా నెయ్యి తో పోపు పెట్టు కోవాలి .
1. పూర్తిగా కొబ్బరి చట్నీ .
2. పచ్చి కొబ్బరి మరియు పుట్నాల పప్పుతో చట్నీ.
3 . వేయించిన పల్లీల పప్పు మరియు పచ్చి శనగపప్పు తో చట్నీ .
4 . పల్లీలు , ఎండుమిరపకాయలు , పచ్చి శనగపప్పు తో చట్నీ .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి