ఆలూరుకృష్ణప్రసాదు .
పుట్నాల ( వేయించిన శనగపప్పు ) పప్పుతో పొడి .
చాలా మంది కంది పొడి , నువ్వుల పొడి, పల్లీల పొడి ఇత్యాది పొడులతో పాటుగా ఈ వేయించిన శనగపప్పుతో పొడి కొట్టుకుంటారు .
కొంతమంది ఈ పొడిని ఇడ్లీ మరియు దోశెలతో ఇడ్లీ కారప్పొడి బదులుగా , ఈ పొడిలో కాచిన నెయ్యి వేసుకుని తింటారు .
చాలా మంది వేపుడు కూరలలో చివరలో దింపే ముందు ఒక స్పూను ఈ పుట్నాల పొడి వేసుకుని , కమ్మని వాసన రాగానే కూర దింపుకుంటారు .
దాని వలన వేపుడు కూరలకు అదనంగా రుచి పెరుగుతుంది .
ఈ పొడి సీసాలో పోసుకుని , కావలసినప్పుడు తీసుకుని వాడుకుంటే షుమారు రెండు నెలలు తాజాగా ఉంటుంది .
అయితే ఈ పొడి కొట్టుకునే వారు, వెల్లుల్లి ఇష్టమైన వారు వెల్లుల్లి వేసుకుని , వెల్లుల్లి ఇష్టం లేని వారు జీలకర్ర వేసుకుని కొట్టుకుంటారు .
వేపుడు కూరల్లో ఈ పొడి వేసుకునే వారు , వెల్లుల్లి లేకుండానే ఈ పొడి కొట్టుకుంటే బాగుంటుంది .
ఈ పొడిలో మేము ఎండుకొబ్బరి వేసుకుని కొట్టుకుంటాము .
దాని వలన పొడి రుచి మరింత పెరుగుతుంది .
ఎండుకొబ్బరి ఇష్ట పడని వారు ఎండుకొబ్బరి వేయకుండా కొట్టుకోవచ్చు .
పుట్నాల పొడి తయారీ విధానము .
కావలసినవి .
వేయించిన శనగపప్పు ( పుట్నాల పప్పు ) -- పావు కిలో .
ఎండుకొబ్బరి -- ఒక చిప్ప. ( చిన్న చిన్న ముక్కలుగా చాకుతో కట్ చేసుకోవాలి .)
ఎండుమిరపకాయలు -- 15 (బాగా ఎండ బెట్టి తొడిమలు తీసుకోవాలి . )
జీలకర్ర -- స్పూనున్నర .
వెల్లుల్లి -- ( ఇష్టమైన వారు ) రెబ్బలు 15 పొట్టుతోనే ఉంచుకోవాలి .
పొట్టు తీసి వేస్తే పొడి పేస్ట్ అయి , ఘాటు వాసన వస్తుంది .
ఉప్పు -- తగినంత .
తయారీ విధానము .
స్టౌ వెలిగించి బాండీ పెట్టి నూనె వేయకుండా ఎండుమిరపకాయలు , ఎండుకొబ్బరి ముక్కలు మరియు జీలకర్ర వేగిన కమ్మని వాసన వచ్చేవరకు వేయించుకోవాలి .
చల్లారగానే మిక్సీ లో వేసి , తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత పుట్నాల పప్పు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ వేసుకోవాలి .
వెల్లుల్లి ఇష్టమైన వారు సిద్ధంగా ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మరోసారి పైపైన మిక్సీ వేసుకోవాలి .
ఈ పొడి అంతా ఒక పళ్ళెంలో పోసుకుని చేతితో బాగా కలుపుకుని ఒక సీసాలోకి తీసుకోవాలి .
ఈ పొడి భోజనము లోకే కాకుండా వేపుడు కూరల లోకి , ఇడ్లీ మరియు దోశెల లోకి బాగుంటుంది .
సంబంధిత రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.
0 comments:
Post a Comment